"ఎలా మేడమ్...?" అర్ధంకాక అడిగాడాయన.
"ఈ ఆరునెలలకి పిరిడ్ అయిపోయాక ప్రొహిబిషన్ విధించబోతున్నాం అని ముందే తెలియజేద్దాం, అయినా ఇప్పుడది ప్రత్యేకంగా తెలియజేయక్కర్లేదు. మనం వెనక్కి మరలలేదని మన ప్రయత్నాలే అందరికి తెలియజేస్తాయి. అబ్బయ్య నాయుడి అధికారాన్ని- శ్రీరాములు నాయుడు పొగరుని అణగదొక్కే యనప్పుడు మన పదవులకు అర్ధం లేదు- ఉండదు. ఏదో విధంగా స్టేని వెకేట్ చేయించాలి. మనం అనుకున్నవి అనుకున్నట్లుగానే జరిగిపోవాలి. కనుక డి.సి.పి. శతృఘ్నని పిలిపించండి..." అంది సి.ఎమ్. ఆగ్రహావేశాలతో వరద రాజన్ బీహార్ కు ఫోన్ చేసేందుకు తన పేషీ కెళ్ళాడు.
* * * * *
పాట్నా.
సాయంత్రం నాలుగు గంటలైంది.
అతి ప్రధానమైన వీధుల్లో ఒకటైన రాజపుత్ర స్ట్రీట్ ట్రాఫిక్ రద్దీతో కిట కిటలాడుతోంది.
క్రాస్ రోడ్స్ కు మధ్యనున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ కధాకళి నృత్యం చేస్తున్నాడు. అంతలో-
క్రాస్ రోడ్స్ కి కొంచెం దూరంలో, రోడ్డుకు ఎడమ ప్రక్కకు నెమ్మదిగా మారుతీ జిప్సీ జీపొచ్చి ఆగింది.
ఆ జీపు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సుహాస్ పక్కన వెనక కూర్చున్న మిత్రబృందం వేపు చూసాడు. నుదురు మీద పడుతున్న జుత్తును పైకి ఎగద్రోసు కుంటూ నవ్వాడు.
"ఒరేయ్! బేబీల్రా...బెంగాల్ రసగుల్లలాంటి బేబీల్రా!" రోడ్డుకు రెండో వేపునున్న హోటల్ పాటలీపుత్రలో కెళుతున్న కాలేజీ అమ్మాయిల వేపు చూస్తూ అరిచాడు బృందంలోని ఒక మిత్రుడు.
"ఒరేయ్....సుహాస్...రోడ్డు మధ్యలో జీపొదిలేస్తే....పోలీసులు గొడవ పెడతార్రా. అసలే ట్రాఫిక్ చూడు ఎలా ఉందో ఇంకాసేపట్లో సినిమాలు కూడా వదుల్తారు" ఇంకో మిత్రుడన్నాడు.
"మన జీపును ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపుతాడ్రా? సెక్రటేరియట్ గేటు ప్రక్కన ఆపితేనే.... మన్నెవడూ అడగలేదు....పదరా... పిరికి సన్నాసీ... పద..." హోటల్ పాటలీపుత్ర వేపు కదులుతూ అన్నాడు సుహాస్.
అలా రోడ్డు క్రాస్ చేస్తున్న సుహాస్ వేపు, ఆ జీపు వేపు కిక్కిరిసిన ట్రాఫిక్ వేపు చూస్తూ నోరు వెళ్ళబెట్టాడు ట్రాఫిక్ కానిస్టేబుల్.
ఆ జీపుని చూడగానే అందులోని సుహాస్ ని చూడగానే ఏం చెయ్యాలో అర్ధం కాలేదు ట్రాఫిక్ కానిస్టేబుల్ కి.
సుహాస్, ఫేమస్ కోల్ మాఫియా లీడర్ అవనత మిశ్రా కొడుకు. సుహాస్ పనులకు, అడ్డొచ్చిన ఏ ఒక్కడూ బతికి బట్టకట్టలేదు.
ఈ సమయంలో చీఫ్ మినిస్టర్ ఇటుపక్క వస్తే...
ఆ ఆలోచన రాగానే...కానిస్టేబుళ్ గుండె...దడదడమని కొట్టుకుంది.
నిస్సహాయంగా నిలబడిపోయాడు కానిస్టేబుల్.
అంతలో ట్రాఫిక్ ఐలెండ్ దగ్గరకు, ట్రాఫిక్ ఎస్.ఐ. మోటార్ సైకిల్ వచ్చి ఆగింది.
"ఆ జీపెవడిదయ్యా...అక్కడ తీయించెయ్..." కేకలేసాడు కానిస్టేబుల్ మీద.
"ఆ జీపు నెంబరొకసారి చూడండి.... ఎవరిదో మీకే తెలుస్తుంది" చిరాగ్గా అన్నాడు కానిస్టేబుల్.
అప్పుడుగానీ ఆ జీప్ నెంబర్ ప్లేట్ వేపు చూడలేదు ఎస్.ఐ. ఆ జీపు ఎవరిదో తెలియడంతో మరి మాట్లాడలేదు ఎస్.ఐ.
"ఈ జీపు... ఇక్కడపెట్టి ఆ నా కొడుకు ఎటెళ్ళాడు" కోపంగా అడిగాడు ఎస్.ఐ.
"హోటల్లోకి సార్! సినిమాహాళ్ళు వదిలే సమయం ఇదే టైమ్ లో చీఫ్ మినిష్టర్ వచ్చారనుకోండి...." నీళ్ళు నమిలాడు కానిస్టేబుల్.
ఇప్పటికే, నడిరోడ్డుమీద అడ్డంగా ఉన్న జీపు వేపు, పోలీసుల వేపు కోపంగా చూస్తూ-
కార్లలోని వ్యక్తులు దారికడ్డంగా తీయించడయ్యా అంటూ సంజ్ఞలు చేస్తూ వెళుతున్నారు.
ట్రాఫిక్ ఎస్.ఐ. నిస్సహాయంగా నిలబడ్డాడు.
మరో టైమ్ లో అయితే ఆయన వెంటనే కంట్రోల్ రూమ్ కి మెసేజ్ అందజేసి క్రేన్ తెప్పించేవాడు.
కానీ ప్రస్తుతం-
హోటల్లోని సుహాస్ బయటికి ఎప్పుడొస్తాడా అన్నట్టుగా చూస్తూ నిలబడ్డాడు.
* * * * *
ఇరవై నిమిషాలు గడిచాయి.
ట్రాఫిక్ ఐలెండ్ కి ఇరవై అడుగుల దూరంలో వున్న, డిపార్ట్ మెంటల్ స్టోర్ లోంచి ఓ వ్యక్తి బయటికొచ్చాడు.
ఆ వ్యక్తి ఆరడుగుల పొడవున్నాడు. కండలు దీరిన దేహం... నీలం రంగు ఫేంటుమీద తెల్లటి టీ షర్ట్ వత్తైన మీసకట్టు...వెడల్పాటి పెదాలు.....దీక్షకు నిదర్శనంలా పెద్దముక్కు.... పెద్ద కళ్ళు... ఆ కళ్ళకు రేబాన్ గ్లాసెస్....ఉంగరాల జుత్తు.
డిపార్ట్ మెంటల్ స్టోర్ ముందు పార్క్జ్ చేసిన తన జీప్ లోకి ఎక్కి స్టార్ట్ చేసాడు ఆ వ్యక్తి.
స్టోర్ పోర్టికోలోంచి బయటికొచ్చి క్రాస్ రోడ్స్ వేపు దూసుకెళ్తోంది జీప్.
దూరం నుంచే-
ఆ జీపుని, అందులోని వ్యక్తినీ చూసిన ట్రాఫిక్ ఎస్.ఐ. మరింత కంగారు పడ్డాడు కానిస్టేబుల్ వేపు చూసాడు.
"ఒరే రామ్... పులి వస్తోందిరా... ఈయనకు కోపమొస్తే...రౌడీల్నే కాదు.... పోలీసుల్ని కూడా తన్నేస్తాడు. ఈ జీపుని ఈయన చూసాడనుకో..." ఏదో చెప్పబోయాడు ఎస్.ఐ.
"ఆయన మన ట్రాఫిక్ కాదుగదండీ..." కానిస్టేబుల్ అన్నాడు నిర్లక్ష్యంగా.
"అదే బాధ... ఆయన సిన్సియార్టీ అంటే... హోం మినిస్టర్ కే హడల్ రా బాబూ!"
ఐలెండ్ ని సమీపిస్తున్న జీప్ లోని ఆ వ్యక్తిని, విష్ చేసాడు ఎస్.ఐ.
టక్ మని బ్రేక్ వేసాడు ఆ వ్యక్తి.
ఆ వ్యక్తి....
డి.సి.పి. శత్రఘ్న యాన్టీ మాఫియా సెల్....శతృఘ్న డేగచూపు రోడ్డు కడ్డంగా ఉన్న జీప్ మీదే పడింది.
"వాట్ ఇన్ స్పెక్టర్.... రోడ్డుకడ్డంగా జీపుని పెట్టి చూస్తూ నిల్చున్నా రేమిటి?" అన్నాడు శతృఘ్న ఆశ్చర్యంగా, అసహనంగా ఎస్.ఐ.గాని, కానిస్టేబుల్ గాని నిస్సహాయంగా చూసారే తప్ప ఏం సమాధానం ఇవ్వలేక పోయారు..
ఆ జీపెవరిదో-
పోలీసులెందుకలా ఉండిపోయారో శతృఘ్నకు అప్పుడర్ధమైంది.
జవాబు చెప్పలేక, అటూ ఇటూ వెర్రిమొర్రి చూపులు చూస్తున్నాడు ఎస్.ఐ.
"వాట్.... ఎస్.ఐ? మేక్ ది రోడ్ క్లియర్..." రెట్టించాడు శతృఘ్న.
"సార్... ఆ జీపు..." ఏదో చెప్పబోయాడు కానిస్టేబుల్.
"ఎవరిదా జీపు...ఆఁ" తన జీపుని రోడ్డు చివర పార్కింగ్ ప్లేస్ లో పార్కు చేసి ఐలెండ్ దగ్గరకొచ్చాడు శతృఘ్న.