"ఇవాళ కోర్టు తలుపులు తెరవాలి. దిసీజ్ అబ్బయ్యనాయుడు ఆర్డర్..."
"నో...నో...హౌ... హౌ... ఇట్ కెన్ భి పాజిబుల్?"
ఆ మాటకు నవ్వాడు శ్రీరాములునాయుడు.
"మిస్టర్ జస్టిస్... గ్రీన్ సిగ్నల్ వెలగ్గానే కారు ముందుకెళ్ళిపోతుంది. ఆఖరు'సారిగా మీ భార్యా బిడ్డల్ని చూసుకోండి.... కమాన్... క్విక్... కోర్టు ఓపెన్ చేస్తారా.... లేదా...?"
"దిసీజ్ టూ మచ్ మిస్టర్... ఐ విల్ కంప్లయింట్ టు ద పోలీస్" ఆవేశంగా సీట్లోంచి బయటకొస్తూ అన్నాడాయన.
"డాడీ..." అంబాసిడర్ కారులోంచి చంద్రముఖి కేకలు పెట్టింది.
"ఓకే మిస్టర్ చీఫ్ జస్టిస్... దమ్ముంటే కంప్లయింట్ చెయ్యండి మీ ఇంటికి రెండు శవాలొస్తాయి."
ముందుకు అడుగేయబోయి ఆగిపోయారు జడ్జీ.
"అదే సమయంలో చీఫ్ మినిస్టర్ రాకను సూచిస్తూ, పైలెట్ జీప్ ఎడం వేపునున్న రోడ్ మీంచి స్ట్రయిట్ గా వెళ్ళిపోయింది.
గ్రీన్ సిగ్నల్ వెలిగింది.
కానీ-
చీఫ్ మినిస్టర్ వస్తుండడం వల్ల.... ట్రాఫిక్ ను ముందుకు ఎలౌ చెయ్యలేదు ట్రాఫిక్ పోలీస్-
"మిస్టర్ చీఫ్ జస్టిస్... రెండే రెండు నిమిషాలు టైమిస్తున్నాను. మా లాయర్ పదకొండు గంటలకు కోర్టు కొస్తాడు...జీవో మీద స్టే మాకు కావాలి."
చెప్పేసి, వెనుదిరిగాడు శ్రీరాములునాయుడు. కారు మధ్యలోంచి పరుగు పరుగున ముందుకొచ్చారు జడ్జీ.
"వాళ్ళనెప్పుడు.... రిలీజ్ చేస్తావ్..."
"స్టే వచ్చిన మరుక్షణం....అంతవరకూ....పోలీస్ కి కంప్లయింట్ చేసినా గవర్నమెంట్ కి కంప్లయింట్ చేసినా... మీరు కోల్పోయేది... మీ వాళ్ళనే గుర్తించుకోండి."
"మిస్టర్! బిలీవ్ మీ... ఐ విల్ ఓపెన్ ద కోర్ట్... రిలీజ్ దెమ్ ఇమ్మీడియట్ లీ దిసీజ్ మై వర్డ్..."
ఒక్కసారిగా పోలీస్ విజిల్స్ మిన్ను ముట్టాయి.... బారులు, బారులుగా కార్లు సర్రుమని... ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నాయి...
చీఫ్ మినిస్టర్ కారు కూడా ముందుకు వెళ్ళిపోయింది...
పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఆ హడావుడిలోనే ఉన్నారు.
"నమ్మమంటారా..." సీరియస్ గా అడిగాడు శ్రీరాములునాయుడు.
"దిసీజ్ మై వర్డ్ స్టే ఇవ్వటం అన్నది నా చేతుల్లో లేదు. న్యాయ ప్రకారం అది జరగవలసి ఉంటుంది. నేను చేయగలిగింది కోర్ట్ ని తెరవటమే....తెరుస్తాను- రిలీజ్ దెమ్..." ముందుకొచ్చారు సుఖరామ్ కారంత్.
"ఓకే... మీ మాటను నేను నమ్ముతున్నాను. పని జరిగాకే మీ వాళ్ళ విడుదల" అని అంబాసిడర్ కారు డోర్ ని ఓపెన్ చేసాడు శ్రీరాములు నాయుడు ఎక్కేందుకు. అదే సమయంలో-
చీఫ్ మినిస్టర్ హడావుడిలోంచి బయటపడిన పంజాగుట్ట ఎ.సి.పి. ప్రభాకర్-
ట్రాఫిక్ ఐలెండ్ దగ్గర, కారులోంచి బయటకు దిగి నుంచున్న చీఫ్ జస్టిస్ సుఖరామ్ ను చూసి-
పరుగు, పరుగున అక్కడికొచ్చాడు....అప్పటికే శ్రీరాములు నాయుడు కారు ముందుకు దూసుకుపోయింది.
* * * * *
సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలు...స్టే ఆర్డర్ తీసుకొని కోర్ట్ నుంచి హడావుడిగా సూట్లోకి పరుగెత్తికొచ్చాడు లాయర్ ఆదిమధ్యం.
ఆ డాక్యుమెంట్స్ ను చేతిలోకి తీసుకొని....వాటివేపు నిశితంగా చూస్తూ ఆనందంతో వికటాట్టహాసం చేసాడు శ్రీరాములునాయుడు...
"చీఫ్ మినిస్టర్.... త్రిభువనేశ్వరీ... సారా కాంట్రాక్టర్ల దెబ్బంటే ఇది అర్ధమైందా!"
మనసులోనే అనుకున్నాడు. వెంటనే ఫోన్ వైపు వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.
* * * * *
చీఫ్ మినిస్టర్ ఛాంబర్.
సి.ఎమ్. త్రిభువనేశ్వరి తన ఎదురుగా కూర్చున్న లీగల్ ఎడ్వయిజర్ వైపు పరిశీలనగా చూస్తోంది.
"ఎస్ మేడమ్... సారా కాంట్రాక్టర్లు... స్టే తెచ్చుకున్నారు."
పక్కలో బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడింది త్రిభువనేశ్వరీదేవి.
"చీఫ్ జస్టిస్ సుఖరామ్ గారి భార్యను, కూతుర్ని ఆ శ్రీరాములు నాయుడు కిడ్నాప్ చేసాడట, శవాల్ని ఇంటికి పంపుతానని బెదిరించాడట.... అసలే హార్ట్ ఎటాక్ మనిషి... ఆ చీఫ్ జస్టిస్... బాగా భయపడిపోయారు. కోర్ట్ ని ఓపెన్ చేసారు. వాళ్ళ లాయర్ స్టే తీసుకొచ్చాడు. అన్ని జిల్లాల్లో పాటలయిపోయాయి- మిగతా జిల్లాల్లో ఎలా ప్రొహిబిషన్ పెడతారని వాదించటంతో స్టే తేలిగ్గా వచ్చేసింది. కనుక ప్రొహిబిషన్ అమలుపర్చటం సాధ్యం కాదు మేడమ్. ఈ పిరిడ్ అయిపోయాకే పెట్టటానికి వీలవుతుంది" అన్నారాయన నీరసంగా.
శ్రీరాములు నాయుడు!
ఆ రూపం ఒక్కసారి త్రిభువనేశ్వరి కళ్ళముందు కదలాడింది.
"బాస్టర్డ్..."
తలెత్తి దూరంగా నుంచున్న పి.ఎ. అరవింద్ వేపు కోపంగా చూస్తూ-
"కాల్ ద చీఫ్ సెక్రట్రీ....ఇమ్మీడియట్లీ..." అరిచిందావిడ.
దుస్సహంగా వుంది త్రిభువనేశ్వరికి.
దుర్భరంగా ఉంది!
"ఫెయిల్యూర్.... డామ్ ఫెయిల్యూర్..." దెబ్బతిన్న పులిలా అరిచిందావిడ.
అదే సమయంలో లోనికొచ్చారు చీఫ్ సెక్రట్రీ వరదరాజన్.
"మనం అనుకొన్నదొకటి....జరిగిందొకటి."
"ఎస్ మేడమ్.... ఇప్పుడే తెలిసింది మేడమ్..." ఆ గొంతులో బాధ ధ్వనించింది.
రూమ్ లో అటూ ఇటూ పచార్లు చేస్తోంది సి.ఎమ్. త్రిభువనేశ్వరి.
అంతటా నిశ్శబ్దం...
ఆ నిశ్శబ్దంలో త్రిభువనేశ్వరి ఉచ్చ్వాస, నిశ్వాసలు.... స్పష్టంగా అతి స్పష్టంగా విన్పిస్తున్నాయి.
* * * * *
జీవో మీద స్టే వచ్చిన షాక్ నుంచి నిమిషాల్లో తేరుకుంది సి.ఎమ్.
"ఈ పిరిడ్ అయ్యేవరకు మనం ఆ స్తేని వెకేట్ చేయించలేకపోవచ్చు మేడమ్... అయినా మన అడ్వకేట్ జనరల్ ప్రయత్నిస్తారనుకోండి... ఇప్పుడేం చేద్దాం మేడమ్...? ప్రస్తుతానికి మనం ఆగిపోవటమేనా...?" వరదరాజన్ అన్నాడు మెల్లగా.
త్రిభువనేశ్వరి పచార్లు చేస్తోంది- తప్ప సమాధానం ఇవ్వలేదు. ఆమె అప్పుడు గాయపడిన ఆడపులిలా ఉంది.
"ఇప్పుడిక బీహార్ నుంచి డి.సి.పి. శత్రుఘ్నని పిలిపించి ప్రయోజనము ఏముంటుంది?" సాలోచనగా అన్నాడు వరదరాజన్.
ఆమె సడన్ గా ఆగిపోయింది. ఆయనకేసి తీక్షణంగా చూసింది.
"అయినా పిలిపిమ్చాలి. స్టేని వెకేట్ చేయించే ప్రయత్నాన్ని తీవ్రతరం చేయాలి. ఒక స్టేతో వెనక్కి మారలే ప్రసక్తి లేదు. అయినా కోర్ట్ స్టే ఇచ్చింది ఈ పిరిడ్ కేగా? ప్రొహిబిషన్ గవర్నమెంట్ పెట్టటం తప్పని కోర్ట్ చెప్పలేదుగా..... రాష్ట్రంలో సగం ప్రాంతానికి పెట్టటం కూడా తప్పని చెప్పలేదు. కాకపోతే మనం జిల్లావారీ పాటలకి కాంట్రాక్టర్స్ ని కాల్ ఫర్ చేసాక ప్రొహిబిషన్ పెట్టాం కనుక స్టే ఇచ్చింది. కాల్ ఫర్ చేసింది రాజయ్యగారుల్. దీనికి పై ఎత్తు వేయాలి తప్పదు...." ఆవేశంగా అంది సి.ఎమ్.