మనీషా ఆశ్చర్యంగా చూస్తూ 'ఎగ్జాక్ట్లీ....యిదే దృశ్యం చూసి నేను భయంతో, అసహ్యంతో తినడం మానేశాను. మా యింట్లో అంతా తింటారు. ఏడెనిమిదేళ్ళవరకు తిన్నాను. తరువాత ముట్టుకోలేదు.....మనిద్దరి అలవాట్లే కాదు, సంఘటనలూ ఒకేలా జరగడం వింతగా వుంది' అంది. దివాకర్ మొహం ఆ మాటలతో విప్పారింది 'అంటే, నీ స్నేహితుని గురించి చెప్పు నీ గురించి నే చెబుతా అన్న సామెత మన గురించి ఎవరన్నా తెలుసుకోదలిస్తే కరెక్ట్ గా చెప్పగలరన్న మాట. ఓ, మనీషా, ఐయామ్ వెరీ హేపీ, మీ పరిచయం కలగడం నా అదృష్టంగా భావిస్తా'
మనీషా చిన్నగా నవ్వింది.
'ఈ పరిచయం స్నేహంగా మారాలని నేను కోరుకుంటే మీకేమన్నా అభ్యంతరం వుంటుందా' అన్నాడు మళ్ళీ.
మనీషా జవాబు ఏం యివ్వాలో తెలియక కాస్త తడబడి ఆఖరికి ఏదో జవాబు తట్టినట్టు 'స్నేహం కోరుకున్నంత మాత్రాన బలపడదు అనుకుంటాను. రెండు వైపుల నుంచి పెద్ద ప్రయత్నం లేకుండా దానంతటదే ఏర్పడే అనుబంధం స్నేహం. ఒకరిగురించి ఒకరికి అర్ధం అయి మాట, అభిప్రాయాలు కలిస్తే స్నేహం దానంతటదే ఏర్పడుతుంది' అంది.
'వెల్ సెడ్. బాగా చెప్పారు కానీ, స్నేహం వృద్ది చెందాలంటే తరచు కలుసుకోడం వరకు మనం చెయ్యాల్సిన పని. అప్పుడప్పుడు ఇలా పిలిస్తే మీరేం అనుకోరుగదా'
మనీషా ఇబ్బందిగా కదిలింది 'చూద్దాం. యింట్లో పెద్దవాళ్ళున్నారు గదా-వాళ్ళు వప్పుకోవాలి గదా' అంది ముభావంగా.
ఆమె మొహం చూసి తను మరీ తొందరగా ప్రొసీడ్ అయిపోతున్నాడనుకుంటుంది అన్నభావం తట్టింది దివాకర్ కి. మాటమార్చి 'ఐస్ క్రీం తీసుకుంటారా' అనడిగాడు.
'కసాటా తెమ్మనండి' అంది మనీషా.
లంచ్ అయి సరిగా రెండు గంటలకి యింటిదగ్గర డ్రాప్ చేశాడు మనీషాని. 'అంకుల్ మీరు చెప్పిన టైమ్ కి మీ అమ్మాయిని డ్రాప్ చేశాను' అన్నాడు.
ఆయన నవ్వి 'ఓ.కే. బేటా' అన్నాడు షేక్ హేండ్ ఇచ్చి.
'థాంక్స్ ఫర్ ది లంచ్' మనీషా థాంక్స్ చెప్పి లోపలికి నడిచింది.
వెనక్కి ఇంటికి వెడుతుంటే దివాకర్ మనసు గాలిలో తేలిపోతున్నట్లనిపించింది.
* * *
ఆ రోజు వాసంతి కొడుకు యిరవైఒకటోరోజు. 'ఉదయం బారసాల, సాయంత్రం ఉయ్యాలలో వేయడం ఫంక్షన్ వుంది నీవు తప్పకుండా రావాలి' అంది వాసంతి ఆఫీసుకి ఫోన్ చేసి జయంతి సందిగ్ధంలో పడి తటపటాయిస్తూ 'వద్దులే అక్కా అమ్మ నాన్న కిష్టం వుండదు నేను రావడం'
'ఏడిశావులే....వాళ్ళేం నిన్ను రావద్దని ఎప్పుడన్నా అన్నారా-అమ్మ నన్ను ఫోన్ చేయమంటూనే చేస్తున్నాను. మేం అందరం పిలుస్తున్నాం. యిదిగో బావగారు పక్కనే వున్నారు మాట్లాడు. చూడు జయ మా అత్తగారు. మామగారు వూర్లో బంధువులు అంతా వస్తారు. నీవు రాకపోతే నలుగురూ నానా విధాలుగా మాట్లాడుతారు...'
'ఏం అమ్మే మాట్లాడి చెప్పచ్చుగా నీ చేత చెప్పించడం ఎందుకు'
'ఆ, వియ్యపు రాలివిగా, అమ్మే చెయ్యాలన్నమాట. సరే అమ్మే మాట్లాడుతుంది వుండు' అంది వాసంతి నవ్వి.
'ఏమిటే నీ యింటికి రావటానికి నీకు పిలుపుకావాలా. రేపు అందరూ వస్తారు. నీవు ఆఫీసుకి శలవు పెట్టిరా. అట్టే పిచ్చి వేషాలు వేయకు' మందలిస్తూ అంది పద్మావతి. యింకా బెట్టుచేసి అందరి మధ్య ఆరోజు సరదాగా గడిపే అవకాశం వదులుకోదలుచుకోలేదు జయంతి. 'సరే' అంది ముభావంగా. ఉషారాణి వెళ్ళాక యింటికొస్తే వంటరిగా వుంటే ఎంతో బోరుగా ఉంటుంది. వండుకుని తినాలంటే ఎంతో బద్దకంగా వుంటుంది. ఉషారాణి సగం పని అంతా తనే చక్కపెట్టేదేమో ఒక్కర్తి అంతా చేసుకోవాలంటే. ఉదయం లేవాలంటే ఏడుపు వస్తోంది. అమ్మచేతి వంట తిని ఎన్నాళ్ళయిందో ఏదో కుక్కర్లో పప్పు, అన్నం పడేసుకుని తిన్నాననిపించుకోవడం తప్ప, చక్కగా పచ్చళ్ళు, కూరలు అవి తినక నోరు చచ్చిపోయింది. అందరికి దూరమై తను బావుకుంటున్నదేమిటి' జయంతి గొంతులో దుఃఖం అడ్డుపడింది. రేపు యింటికి వెడతానన్న ఉత్సాహంతో సాయంత్రం బజారుకి వెళ్ళి బాబుకి మంచి డ్రెస్సు, ఓ వెండిగ్లాసు కొని ప్యాక్ చేయించింది. రేపు శనివారం హాఫ్ డే అట్టే పనివుండదు ఎలాగూ. పర్మిషన్ కోరుతూ లెటర్ రాసి దివాకర్ టేబిల్ మీద పెట్టింది ఆఫీసునుండి బయలుదేరే ముందు.
* * *
మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకి యింటికి వెళ్ళింది జయంతి. లోపలికి అడుగుపెడ్తుంటే ఏదో గెస్టులా కొత్తవారింటికి వచ్చినట్లనిపించింది. యిల్లంతా హడావుడిగా వెళ్ళింది. దమయంతి హాలులో పూజకి ఏర్పాట్లు చేస్తోంది. జయంతిని చూసి 'రా, రా, అమ్మా జయ వచ్చిందే' అని కేకేసింది.