ఆమె నీళ్ళు పోస్తుండగానే, ప్రక్కకి వాలిపోయారు.
ఆయన 'హంస' ఎగిరిపోయింది పరలోకానికి.
తన గురించి తనకు ఆలోచించుకునే అవసరం, వ్యవధీ ఆయనకు ఎన్నడూ కలగలేదు. మహాత్ముడన్నట్లు. "హీ హూ థింక్స్ ఆఫ్ సఫరింగ్ హ్యూమనిటీ, విల్ నాట్ థింక్ ఆఫ్ హిమ్ సెల్ఫ్."
ఆయన అభిప్రాయం ప్రకారం, బంధాలు ఏర్పరచుకుంటే బాధ్యతలు నెరవేర్చడం కష్టం!
ఆప్యాయతాభిమానాలు, ఆశయాలకెప్పుడూ అడ్దొస్తూనే ఉంటాయి. అందుకే వాటిని దూరంగా వుంచారు. స్వంత కుటుంబంలో ఎప్పుడూ అతిధి పాత్రే వహించారు.
ఆశయానికి తప్ప ఎవరికీ కట్టుబడి వుండలేదు! ఒకరి చేతికింద ఉద్యోగం చేసి బ్రతకలేదు. ఒఅక్రు ధర్మంగా ఇచ్చిన పదవిని చేపట్టలేదు.
అయినా, ఆయన నాయకుడే! తనమీద తను నమ్మకం పోగొట్టుకొని వాడే నిజమైన నాయకుడు! అంతిమ క్షణందాకా ఆయనకి తనమీద తనకి అపారమైన నమ్మకం!
బలహీనత అనేమాట కర్ధంచెప్తూ, "అది మనసుకు సంబంధించినది కానీ శరీరానికి కాహ్డు బలహీనమైన శరీరంలో బలమైన గుండె దాగివుండవచ్చు" అనేవారు.
ఆయన తన స్వంతవాళ్ళకి పెద్దగా పనికిరాలేదు!
ప్రపంచానికి కూడా అంతగా నచ్చినట్లు లేరు. పరమ నిర్మొహమాటి!" "ఎడాస్ట్ సైలెన్స్ ఆర్ స్పీక్ ఫ్రాంక్ లీ" అనే పంధాలో నడిచి ఎందరికో శత్రువూ, కొందరికి మిత్రుడూ అయ్యారు.
"మూర్ఖుడ్ని పొగడడం, మంచివాడ్ని తిట్టడం కన్నా ప్రమాదం" కదా!
అయినా, ప్రపంచం వెలివేసినప్పుడు భగవంతుడు ఆదరిస్తాడన్నది మహాత్ముని సూక్తి!
శ్రీహరిరావుగారి మరణంవార్త, చుట్టుపక్కల వెంటనే గుప్పుమంది. కాంగ్రెసు ప్రాణులన్నీ పరుగుపెట్టాయి. ఉదయమే నూజెళ్ళనుండి గుడివాడ తీసుకెళ్ళి కాంగ్రెసాఫీసులో పెట్టారు. వెంటనే 'ప్రెస్' కిచ్చారీ వార్తని. రేడియోలో కూడా ప్రకటించారు. స్టేషన్ లో మనుషుల్ని పెట్టారు. వారి కుటుంబాన్ని దింపుకుని తీసుకురావడానికి!
కానీ, వారి కుటుంబం రేడియో వినలేదు! వార్తాపత్రికలు చదవలేదు. ఆయనకోసం ఎదురుచూస్తూనే వున్నారు.
ఈలోగా ఢిల్లీ నుండి వారికి వెయ్యిరూపాయలూ, కాశ్మీరు తిరిగి రావడానికి ప్లైన్ టిక్కెట్లూ పంపారు అనంతశయనం అయ్యంగారు.
"అమ్మా! విమానంలో ఎత్తుగా ఎగుర్తుంటే భయంగా వుండదూ!" అడిగింది రమణమ్మని ఆఖరి కూతురు.
"ఆయనకేం భయం! అంతకంటే ఎత్తుకి కూడా అవలీలగా వెళ్ళగలరు!" అని అనాలోచితంగా ఆమె జవాబిచ్చింది భర్త మొండితనం తల్చుకుంటూ ఉక్రోషంగా, నిజానికి ఆయన ఆత్మ అప్పటికే అందనంత సుదూర తీరాలకి ఎగిరిపోయిందని వారికింకా అప్పటికి వార్త చేరలేదు.
ఆమె సిద్దంగా వుంది. ఆయన మామిడికాయ తెస్తే ఆవకాయ పెట్టడానికి.
గుడివాడ కాంగ్రెసాఫీసులో ఆయన శవాన్ని, చుట్టుపక్కల ఊర్ల నించొచ్చి మరీ ప్రజలు తండోపతండాలుగా దర్శించారు. రాత్రి 12.00 గంటల వరకూ చూసి, ఎవరూ రాకపోవడంతోటి మర్నాడుదయమే దహనాని కేర్పాటు చేసారు. 1911లో జననం.....1958లో మరణం. మధ్యలో 47 ఏళ్ల జీవితం! శవయాత్రలో ఆయన పేరు తెలిసిన ప్రతి వాళ్ళూ పాల్గొన్నారు. కట్టుకున్న భార్యా పిల్లలు తప్ప! ఘనంగా ఊరేగించి చందనపు కట్టెలమీద దహనం చేసేశారు.
నుసర్ల సూర్యప్రకాశరావనే మిత్రుడికి టెలిగ్రాం పంపారు. "శ్రీహరిరావు కాలం చేశాడని" ఆయన దిగ్భ్రాంతి చెంది, ఈ విషయం వారి కుటుంబానికి తెల్పడానికి, విద్యానగర్ నుండి జటాభవన్ వెళ్ళారు.
ఆఖరి కూతురు చంటిపిల్లాడ్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని వుంది.
"అమ్మగారెక్కడమ్మా!" అనడిగారు.
"శ్రీరామనవమి పందిట్లో వుంది. కూర్చోండి, పిలుచుకొస్తాను" అని ఆమె వెళ్ళింది.
"సిరికిం జెప్పడు శ్రీహరీ..."
అంటూ హరిదాసుగారు రాగయుక్తంగా గానం చేస్తున్నారు. రమణమ్మ ఉస్సూరుమని నిట్టూర్చింది.
"ఆ హరిలాగే ఈ శ్రీహరికూడా అంతే. ఎక్కడికెళ్తున్నదీ, ఎప్పుడొచ్చేదీ ఎప్పుడు చెప్పారనీ, ఇదిగో వస్తా అంటే ఆర్నెల్లూ, అదిగో వస్తా అంటే ఏడాదీనూ!" అనుకుంది.
"అమ్మా! సూర్యప్రకాశంగారొచ్చారు. ఎందుకో నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు" అని చెప్పింది కూతురు హడావుడిగా వచ్చి-
ఆమె మనసు కీడు శంకించింది. వడివడిగా అడుగులేస్తూ యిల్లు చేరింది, ఆయన ఎదురొచ్చి-
"ఘోరం జరిగిపోయిందమ్మా, మన శ్రీహరి మనకింక లేడు!" అన్నారు.
ఆమె మ్రాన్పడిపోయింది. ఆయన చెప్పేది ఏమిటో అర్ధం కానట్టు చూస్తూండిపోయింది. "శ్రీహరిరావుని అరెస్టు చేశారమ్మా! ఫలానా జైల్లో పెట్టారు" అంటూ కబుర్లు రావడం అలవాటే కానీ, ఇలా.....
అప్పటికే రెండో కూతురూ, ఆఖరి కూతురూ ఘొల్లుమనిపోయారు. తల్లిని వాటేసుకుని కుదిపి, కుదిపి ఏడవసాగారు. ఆమెలో చలనంలేదు. పాషాణంలా నిలబడింది.
"రమణా!" అంటూ ఏడాదికో, ఆర్నెల్లకో నవ్వుతూ వచ్చే మనిషి ఇక కనబడడా? ఇంత మోసం చేస్తాడా? వస్తానన్నాడే!
సూర్యప్రకాశరావుగారు చిన్న అల్లుడి కోసం కబురు పెట్టారు. నరసింహారావు రాజేశ్వర్ టాకీస్ లో సినిమాకెళ్ళాడు. థియేటర్ లో స్లైడేయించి, పిలిపించారు.
అతను మర్నాడు తెల్లవార్తూనే అత్తగారిని తీసుకుని గుడివాడ వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ మిగలలేదు. చలపతి మేష్టారు అనే వారి స్నేహితుడు ముందుగా రెండు గ్లాసులతో మజ్జిగ తెప్పించి యిచ్చాడు. ఆ తరువాత స్మశానానికి తీసుకెళ్ళారు.