Previous Page Next Page 
లీడర్ పేజి 25

    1947లోని స్వాతంత్ర్య సంబరాలు, ఆయన ఎంతోకాలం అనుభవించలేదు. స్వార్ధపరులై కుటిల రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్న రాజకీయ నాయకులపై విరుచుకుపడసాగారు. ఏప్రిల్ 8న, 1950వ సంవత్సరంలో పెద్దకూతురు సావిత్రి వివాహం శేషగిరితో జరిపించాడు.    
    1950 సెప్టెంబర్ 13న మహబూబ్ కాలేజీ వ్యవస్థాపకులు పిలువగా హైద్రాబాదు కుటుంబంతో సహా వచ్చి ఆ రాత్రి తుల్జాభవన్ లో దిగారు.    
    తరువాత మిత్రులు భీమశంకరం గారింట్లో, కాచిగూడాలో కాపురం పెట్టారు. అక్కడే అక్టోబర్ 13న రెండో కుమార్తె శ్రీదేవి వివాహం నరసింహరావుతో జరిపించారు.    
    హైద్రాబాదులో డాక్టర్ మేల్కోటేతోటీ, డాక్టర్ జయసూర్య (సరోజినీ నాయుడు కుమారుడి) తోటీ చాలా స్నేహం ఏర్పడింది.    
    జయసూర్య ఫ్యామిలీ డాక్టర్ గా వ్యవహరిస్తూండేవాడు.    
    డాక్టర్ మేల్కోటేతో కలిసి "సప్రెస్స్డ్ డ్ గవర్నమెంట్ కంప్లైంట్స్" అనే ఆఫీసు పెట్టారు. అందులో గవర్నమెంటుచేత అణగత్రొక్కబడిన కంప్లైంట్సు తిరగతోడించి, వాదించి, న్యాయం చేకూర్చడమే తమ పనిగా పెట్టుకున్నారు.    
    గవర్నమెంటు ఆయన్ని 'కమ్యూనిస్టు'గా అభియోగీస్తూ అరెస్టు చేసింది. చంచలగూడా జైలులో పెట్టారు. డా|| మేల్కోటే, శ్రీహరిరావుని విడుదల చేయించాల్సిందంటూ, నెహ్రూగారికి ఓ లేఖ ద్వారా తెలియబర్చారు.    
    నెహ్రూగారు, "శ్రీహరిరావు నాకు చిరకాలంనుండీ తెలుసు! అతను కమ్యూనిస్టుకాడు. మంచి దేశభక్తుడు కావున వెంటనే విడుదల చేయవల్సింది" అంటూ ఆర్డరు పంపారు. రిలీజయిన వెంటనే ఆంధ్రాలో ఏదో కేసు అటెండవలేదని ఆంధ్రాకి తీసుకెళ్ళారు.    
    1956, ఏప్రిల్ 16న సత్యవతి పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నారు. అంకరాజు ఆనందభూషణరావుతో ఆమెకి వివాహం నిశ్చయించారు.    
    అశ్వారావు పేట జమీందారు, పెళ్ళికి సరిపడా సరుకులిచ్చి పంపుతూవుండగా, నల్లగోండలో ఏదో పాతకేసు తవ్వి, అరెస్టు చేసారు. లాఠీ డ్రైవర్ చేతికి ఓ చీటీ రాసిచ్చి, సామాన్లు ఇంట్లో అందచెయ్యమని చెప్పి అరెస్టయి వెళ్ళిపోయారు.    
    పెళ్ళివారు తరలి వచ్చారు. పెళ్ళికూతురి తండ్రి జాడలేదు. రమణమ్మ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ భర్త కోసం ఎదురుచూడసాగింది.    
    భర్త రాలేదు! కానీ అతని అరెస్టు వార్త అదింది. ఆమెకిది మామూలే! కానీ, ఆమె తల్లీ, చెల్లీ ఊర్కోలేదు! "మగపెళ్ళివారికి ఏమి చెప్తావు? వెళ్ళి విడిపించి తీసుకొద్దాము" అన్నారు. చెల్లెలి భర్త శేషగిరి వెంటనే భార్య మెడలోని చంద్రహారం తీసి ఇస్తూ, "వదినా బయల్దేరు, ఆలశ్యం చెయ్యకు" అన్నాడు.    
    "గవర్నరుగారు ఆయనకి ప్రాణస్నేహితులు. ఏ పుట్టలో ఏ పాముందో వెళ్ళి, ఒక్కసారి ప్రయత్నిస్తాను" అంటూ తల్లిని తీసుకుని, బూర్గుల రామకృష్ణారావుగారి దగ్గరికి వెళ్ళింది రమణమ్మ.    
    బూర్గుల రామకృష్ణారావుగారు ఎంతో ఆనందంగా ఆమెని ఆహ్వానించి, సానుభూతిగా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. చివరిగా ఇలా అన్నారు. "చూడమ్మా! నీ భర్తని సామాన్య మానవుడికుండాల్సిన ధైర్య సాహసాలు కావు. తప్పులు చేస్తున్న ప్రతి గవర్నమెంటు ఆఫీసర్ని నడిరోడ్డుమీద నిలబెట్టి కాల్చేయాలంటాడు. జంకూ, గొంకూ లేదు. గవర్నమెంటు ఎలా విడుదల చేస్తుంది? ఒకవేళ నేను విడుదల చేయించినా ఎంతకాలం బయట వుంటాడూ" అని జాలిపడ్డారు. ఆ తరువాత విడుదల చేయించారు.    
    కూతురి పెళ్లవగానే మళ్ళీ ఆంధ్రాలో ఏదో కేసుందని తీసుకెళ్ళి పోయారు.    
    శ్రీహరిరావు అలా జీవితంలో చాలాభాగం జైళ్ళలోనూ, తక్కువ భాగం తన వాళ్ళతోనూ గడుపుతూ వచ్చారు.    
                                     *    *    *    *    
    1958వ సంవత్సరంలో.....    
    అవి ఆవకాయ పెట్టుకునే రోజులు.    
    "రమణా! నేను అర్జెంటుగా పర్వతనేని వెంకటరత్నం అనే స్నేహితుడ్ని కలవాలి! గుడివాడెళ్తున్నాను" అన్నారు.    
    "బాగానే వుంది! ఓపక్క కారాలవీ కొట్టించి ఊరగాయలకి సిద్దం చేస్తుంటే, కాయ తీసుకురాకుండా ఈ అర్ధాంతరపు ప్రయాణమేమిటండీ?" అందామె.    
    "మనవైపునుండి మంచి కాయ తెస్తానుగా! చూస్తూ వుండు!" అని చెప్పి, రెండో కూతురి కొడుకూ, మూడో కూతురి కొడుకూ బైట చాపమీద పడుకున్నారు. ఏడాదిలోపు పిల్లలు, వారిని ముద్దాడి వెళ్ళిపోయారు. వాళ్ళపేర్లు హనుమంతు, మురళీ.    
    పెద్దకూతురికి ఒక కొడుకు పుట్టి ఏడాది పెరిగి చనిపోయాడు. వాడు 'దాహోత్రుడని' వాడిమీద అలవికాని మమకారం పెంచుకున్న మనిషి కాస్తా, వాడు పోవడంతో చాలా క్రుంగిపోయారు. అప్పటినుండీ పిల్లల్ని దగ్గరికి తీయాలన్నా, ముద్దుచెయ్యాలన్నా భయపడిపోయేవారు! చాలారోజులకి పిల్లల్ని ముద్దాడి వెళ్ళిపోయారు.    
                                       *    *    *    *    
    మే 25th, 1958.    
    నూజెళ్ళఫ్లాట్ ఫారమ్ మీద కాలుమోపారు. గుండెల్లో కాస్త నొప్పిగా అనిపించింది. పెద్దగా పట్టించుకోలేదు. అతనితో కలిసి అప్పటి దాకా ప్రయాణంచేసిన స్నేహితుడు సీతంరాజు రామారావుగారు గుడివాడలో దిగిపోయారు.
     ఒక మూల బెంచీమీద నడుం వాల్చారు.    
    ఎవరో స్త్రీ పంపులోంచి నీళ్ళు పట్టుకుని వెళ్తోంటే పిలిచారు. "అమ్మా దాహం!" అనడిగారు. అదే ఆయన తనకోసం ఇతరులని అడిగిన సహాయం!    
    ఆయన ఎప్పుడూ చెప్పేవారు. "టూ సీక్ ఏ ఫేవర్ ఈజ్ టూ బార్టర్ ఎవే వన్స్ ఫ్రీడమ్" అని. మనిషి నుండి మనిషి ఆశించే ప్రతిపనికీ పునాది బార్టర్ సిస్టమ్.

 Previous Page Next Page