Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 25


    "అది చాలా ఒండర్ ఫుల్ డిపార్టు మెంటు కామ్రేడ్! ప్రపంచంలో కెల్లా పేరెన్నికగన్నది భారతదేశంలోని పోలీస్ ! భారతదేశంలో కెల్లా పేరెన్నికగన్నది ఆంధ్రప్రదేశ్ పోలీస్! అందులోనూ అద్భుత ప్రావీణ్యత మన రాజధాని నగర శాఖది. దేశంలోని దొంగలూ, హంతకులూ అందరికీ పారడైజ్ బ్రదర్ మన రాజధాని."
    యిల్లు చేరుకోగానే అఖిలభాను స్మితారాణి వాళ్ళ చుట్టూ మూగారు.
    "ఏం జరిగింది?" ఏమయినా వివరాలు తెలిశాయా?" అడిగింది అఖిలభాను.
    "కేస్ యింకా పరిశోధనలోనే వుంది సిస్టరిన్ లా! ముందు మాకు భోజన సత్కారాది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తర్వాత రంగంలోకి దూకటానికి సాధ్యమౌతుంది."
    స్మితారాణి త్వరత్వరగా వారికి భోజనాలు వడ్డించింది.
    "కమాన్ మైడియర్ ఫ్రెండ్స్! అందరం కలిసి భోజనం చేద్దాం! కామ్రేడ్ తులసి ఆకలిగా చూస్తున్నట్లు అనుమానంగా వుంది."
    "మేమేప్పుడో తినేశాం" నవ్వుతూ అంది అఖిలభాను.
    "వ్వాట్? పవిత్ర భారతదేశంలో భర్తాగ్రేసరుడు భోజనం చేయక ముందే భార్య భోజనం చేయటమా? వెరీ స్త్రెంజ్ ఫినౌమినా కామ్రేడ్ అఖిలభానుజీ"
    "అలాంటి పిచ్చి వ్యబహారాలు మనకు నచ్చావ్! ఆ మొగుడుగాడు అడ్డమయిన ఫ్రెండ్స్ తో కాఫీ హోటల్సు లో తిని తిరుగుతుంటే పెళ్ళాం యింటి దగ్గర తులసి చెట్టు ముందు కూర్చుని పాటలు పాడుతూ ఆకలితో చావాలా? రబ్బిష్" అందామె చిరాగ్గా.
    భోజనాలు ముగిశాక భార్గవ్ యింట్లో దొరికిన డయిరీతీసి వరసగా పీజీలు తిరగేయసాగాడు.
    ఇంచుమించుగా మొదట్లో పేజీలన్నీ ఖాళీగానే వున్నాయ్. సగం పేజీలు  తిప్పాక కనిపించింది "సంధ్యారాణి" అనే పేరు అపాయింట్ మెంట్స్ లో రాసి వుంది పేరు గురించి.
    "ఇవాళ సాయంత్రం సంధ్యారాణిని కలుసుకోవాలి?"
    ఆ తర్వాత చాలాసార్లు సంద్యారాణిపేరు అప్పాయింట్ మెంట్స్ కాలంలో రాసివుంది.
    "మనకు ఈ సంధ్యారాణి అడ్రస్ దొరికితే కొంత ఇన్ ఫర్మేషన్ దొరుకుతుందనుకుంటాను" అన్నాడు భవానీశంకర్.
    డైరీలో అడ్రస్ పీజీలు తిప్పడతను. చాలా తక్కువ అడ్రసులున్నాయి. ఆఖరులో కనిపించిందామె పేరు,  పేరు కెదురుగా టెలిఫోన్ నెంబరు.
    "ఈ సంధ్యారాణి ఎవరో, ఆమె చరిత్ర ఏమిటో, అవన్నీ మనం ముందు పరిశోధించాల్సి వుంది. కామ్రేడ్ ఆర్.కె. శ్యామ్ .ఆ వివరాలన్నీ సేకరించుకుని నేను మళ్ళీ రాత్రికి పునర్ధర్శనం యిస్తాను" అన్నాడతను . సంద్యారాణి ఫోన్ నెంబరు తన డైరీలో రాసుకుంటూ.
    "జాగ్రత్త! రిస్క్ తీసుకోవద్దు " అన్నాడు శ్యామ్.
    "మనదేశంలో రిస్కు అనేది పుట్టుకతోనే మొదలౌతుంది కామ్రేడ్! పసికందుని హాస్పిటల్లో కుక్కలేత్తుకుపోవటం, స్కూల్లో సీటు దొరక్కపోవటం, ఎండకు వడగొట్టి పడిపోవటం , వానకు వరదొచ్చి పైకెళ్ళి పోవటం, తాగే నీళ్ళకోసం, సినిమా టిక్కెట్ కోసం, రేషన్ కోసం ఇలా అనుక్షణం రిస్కు బ్రదర్! అలాంటి రిస్కులు లేకపోతే జీవితంలో థ్రిల్ వుండదని మన ప్రభుత్వం యొక్క అచంచల విశ్వాసం! అంచేత డోంట్ వర్రీ అబౌట్ ది రిస్క్! వస్తా"
    అనేసి బయటకు నడిచాడు . తిన్నగా నడిచి ఎదురుగా వున్న హోటల్లో నుంచి ఆ నెంబర్ కి డయల్ చేశాడతను.
    కొద్దిక్షణాలు మోగ్రాక ఓ స్త్రీ గొంతు వినిపించిందతనికి.
    "హలో!" అందా గొంతు తీయగా.
    "హలో - సంధ్యారాణిగారేనా?"
    "అవును! మీరెవరు?"
    "హలో - నన్ను గుర్తు పట్టలేదా ఫ్రెండ్" నేను భవానీశంకర్ ని!"
    ఆమె కొద్ది క్షణాల వరకూ మాట్లాడలేకపోయింది.
    "వుచ్ భవానీశంకర్!" అడిగింది తేరుకుని.
    "అప్పుడే మర్చిపోయారా మిస్! వెరీ బాడ్! మనం ఇంత క్లోజ్ ఫ్రెండ్సయి వుండి కూడా నాల్రోజులు కలుసుకోక పోయేసరికి అలా మర్చిపోవటం చాలా దారుణం ఫ్రెండ్! బైదిబై మిమ్మల్ని కలుసుకుని ఓ అరగంట సరదాగా మాట్లాడుతూ గడపాలని నా కోరిక. మరి మీకెప్పుడు తీరిక వుంటుందో చెపితే."
    ఆమె మళ్ళీ ఆలోచనలో పడింది.
    "ఇవాళ నేను చాలా బిజీగా వున్నాను!"
    "నో ప్రాబ్లెం డియర్! రేపు కల్సుకుందాం! మాణింగ్ ఎయిటో క్లాక్ ఓ.కే.?"
    "ఓ.కే."
    "హలో - వన్ మినిట్ ఫ్రెండ్ మీ ఇంటి అడ్రసు ఎక్కడో పోయింది. చెపితే నోట్ చేసుకుంటాను."
    ఆమె కొద్ది క్షణాలు మౌనం వహింహింది. తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ అయిపొయింది. తను అడ్రస్ అడిగి చాలా తెలివి తక్కువ పని చేశానని భవానీశంకర్ కి అర్ధమైపోయింది.
    వెంటనే మళ్ళీ రింగ్ చేశాడామెకి. "ఎంగేజ్" అయిన శబ్దం వినిపించసాగింది. మరో అరగంట వరకూ అక్కడే నిలబడి ప్రతి అయిదు నిమిషాలకూ ఓసారి రింగు చేస్తూనే ఉన్నాడు. అయినా లాభం లేకపోయేసరికి అక్కడి నుంచి తన రూముకి బయలుదేరాడు.
    బస్ దిగి రూమ్ వేపు నడుస్తుంటే వెనుకనుంచి కేక వినిపించింది.
    "హలో గురూజీ -హలో-"
    వెనక్కు తిరిగి చూశాడు భవానీశంకర్. ఫోటో స్టూడియో లో నుంచి శివనారాయణ చేయి వూపి పిలుస్తున్నాడు తనని.
    అతను స్టూడియోకు చేరుకొని కుర్చీలో కూలబడ్డాడతను.
    "మీ ప్రింట్స్ అన్నీ రడీ చేశాన్సార్ - చాలా బాగా వచ్చాయ్......" అంటూ డ్రాయర్ నుంచి ఓ కవరు తీసి అతని ముందుంచాడు.
    భవానీశంకర్ ఫోటోలు తీసి చూశాడు. తన దగ్గర ట్యూషన్ కొచ్చే పిల్లలందరూ వెలిగిపోతున్నారు ఫోటోల్లో. అందరికంటే బాగా తులసి వుంది.
    "మరి జే. స్మితారాణి ఇచ్చిన రీల్ తాలుకూ ప్రింట్స్ కామ్రేడ్ అవి కూడా బాగా వచ్చాయా?"
    "ఓ! ఫస్టుక్లాసుగా వచ్చాయి సార్!"
    "అవి కూడా నాకిచ్చేయ్ కామ్రేడ్ డబ్బు నేనే ఇస్తాను."
    శివనారాయణ కొంచెం కన్ ఫ్యుజన్ లో పడ్డాడు.
    "కానీ ఆమె వచ్చి అడిగితే-"
    "డోంట్ వర్రీ కామ్రేడ్ - మా ఇద్దరి మధ్యా పాము ముంగిస వైరం ఆగిపోయాయ్. ప్రస్తుతం పాలు నీరులా కలిసిపోయి బ్రతుకుతున్నాం అందుచేత అనుమానాలు పక్కకు నేట్టేసేయ్."
    ఫోటోలు తీసుకుంటుంటే టేబుల్ మీద ఓ పక్కగా కనిపించిందతనికి టెలిఫోన్ డైరెక్టరీ.
    చటుక్కున అది చేతిలోకి తీసుకున్నాడతను.
    "కామ్రేడ్! నేను ఈ పుస్తకంలతో పాటు కొద్ది గంటలు గడపదలుచుకున్నాను. కనుక మధ్యలో నన్ను డిస్టర్బ్ చేయకు. ..." అంటూ సంద్యారాణి ఫోన్ నెంబర్ కోసం వేగంగా వెతకటం ప్రారంభించాడతను."
    "నా పేరు విక్రమార్కారావు సార్! ఇంతకూ నాకో విషయం అర్ధం కావటం లేదు. గురూజీ." కొద్ది క్షణాలాగి అన్నాడు శివనారాయణ .
    "యస్ కామ్రేడ్! ఏమిటది?"
    "మీరు చెప్పినట్లే నిన్న టి.వి . స్టేషను కెళ్ళి నా స్క్రిప్టు అన్నీ ప్రొడ్యూసర్ కి ఇచ్చానండీ! అని ఎంతో బాగున్నాయని భలే మెచ్చుకున్నారు సార్ అయన! కానీ అన్నీ ఇవాళ పోస్టులో తిరిగి వచ్చేశాయ్ ఎందుకుని సార్?"
    "ప్రతి స్క్రిప్టు తో పాటు వందనోటు జతచేసి పంపాలి కామ్రేడ్ అక్కడ దెబ్బతిన్నావు నువ్వు. దూరదర్శన్ అంటే అర్ధం అదే. వాళ్ళ దగ్గర ఏ పని మీద వెళ్ళాలన్నా దూరంగా అలోచించి అప్పుడు దర్శనం చేసుకోవాలి!"   

 Previous Page Next Page