Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 24

 

    "ఇదిగో చూడు మిస్టర్! ఇంకోసారి "కామ్రేడ్" అని అనకు నన్ను అర్ధమయిందా?"
    'అయింది కామ్రేడ్! నేనూ తెలుగు మీడియంలోనే చదివాను.
    ఇన్ స్పెక్టర్ కోపం దిగమింగుకుని రైటర్ ని పిలిచాడు.
    "రామస్వామి నిన్న మనం బుక్ చేసిన ఆ కారు ఒనర్సు డిటెయిల్స్ కావాలిట వీళ్ళకు! ఇచ్చేయ్."
    "అలాగే సార్! అన్నాడతను. "నాతొ రండి" అన్నాడు భవానీ శంకర్ వేపు తిరిగి.
    ఇద్దరూ రామస్వామి వెంబడి నడవసాగారు.
    "ఆ కారు ఓనరు ఎవడో గాని వీళ్ళను బాగా తడిపినట్లున్నాడు అందుకే మనం కంప్లయింట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు" శ్యామ్ తో అన్నాడు భవానీశంకర్.
    "రాసుకోండి" అన్నాడు రైటర్ ఓ రిజిస్టర్ తీసుకొచ్చి.
    భవానీశంకర్ వెంటనే తన డయిరీ, పెన్ను తీసుకున్నాడు చేతిలోకి.
    "భార్గవ్, గోదావరి ఫ్లాట్స్ , ఫ్లాటు నెంబరు 602 బేగం పేట హైదరాబాద్.
    "థాంక్యూ కామ్రేడ్ మీ రుణం ఏదొక రోజు తీర్చేసుకుంటాను అంటూ బయటకు నడిచాడతను.
    "హరియప్ కామ్రేడ్! ఆర్.కె. శ్యామ్ అర్జంటుగా మనం ఈ అడ్రసుకి చేరుకొని దీని వెనుక వున్న మిస్టరీ ఏమిటో తెల్సుకోవాలి కనుక ధర్టి కిలోమీటర్సు ఫర్ అవరు చొప్పున నీ సైకిల్ వేగం మెయింటేన్స్ చేయాల్సివస్తుంది." అన్నాడు అతని సైకిల్ కారియర్ మీద కూర్చుంటూ.
    ఆర్.కె. శ్యామ్ సైకిల్ వేగం పెంచాడు.
    అరగంట తర్వాత వాళ్ళు గోదావరి ఫ్లాట్స్ చేరుకున్నారు. మెయిన్ రోడ్ కి చాలా దూరంగా వుందా బిల్డింగ్.
    లిప్టులో ఆరో అంతస్తు చేరుకున్నారు.
    లిప్టు పక్కనే ఉంది "602" నెంబరు గల ఇల్లు.
    డోర్ బెల్ నొక్కాడు భవానీశంకర్.
    నిమిషం సేపు గడిచిపోయినా ఎవరూ తలుపు తీయలేదు. మరోసారి మీట నొక్కి - శ్యామ్ వేపు చుశాడతను.
    "రడీగా వుండు కామ్రేడ్ శ్యామ్! తలుపు తెరవగానే మనం యాక్షన్ లోకి దిగాల్సిన పరిస్థితులు రావచ్చు" శ్యామ్ ని హెచ్చరించాడు అతను.
    "ఆయామ్ రెడీ!" అన్నాడు శ్యామ్ పిడికిళ్ళు బిగిస్తూ.
    తలుపులు ఇంకా తెరచుకోక పోవటం చూసి ఎకధాటిన నిమిషం పాటు బెల్ మోగించాడాతను. అయినా సమాధానం లేకపోయేసరికి తలుపు మీద గట్టిగా తట్టాడు. తట్టగానే తెరుచుకుంది. తలుపు లోపల గడియ వేసిలేదని అర్ధమయిందతనికి.
    "భార్గవ్" తల లోపలకు పెట్టి గట్టిగా పిలిచాడతను. అయినా ఎలాంటి సందడి కనిపించక పోయేసరికి యిద్దరూ లోపలికి నడిచి హాలు మధ్యలో నిలబడ్డారు.
    "హలో! యింట్లో ఎవరు?" గట్టిగా అరిచాడు శ్యామ్.
    "పరిస్థితులు కొంచెం తమాషాగా యాక్షన్ చేస్తున్నాయ్ కామ్రేడ్! నువ్ ఏ వస్తువులూ ముట్టుకోకుండా నా వెనుకేరా" అంటూ లోపలి గదివేపు నడిచాడు భవానీశంకర్.
    బెడ్ రూములో ఎవరూ కనిపించలేదు. కానీ గదంతా బట్టలు, కాగితాలు, చిందర -వందరగా పడేసి ఉన్నాయ్. ఓ మూలగా వున్నా స్టీల్ అల్మారా కొంచెంగా తెరిచి వుంది. అల్మారా డోర్స్ తెరిచి చూడటానికి ప్రయత్నించాడు భవానీశంకర్. దభీల్ మని అల్మారాలో నుంచి ఓ పెద్ద మూట అతని కాళ్ళ మీదకు జారిపడింది.
    ఇద్దరూ అదిరిపడి వెనక్కు గెంతారు. అది మూట కాదు! మూటలా చుట్టబడిన శవం. బట్టలన్నీ రక్తపు మరకలతో నిండి భయంకరంగా కనబడుతోంది.
    "బహుశా యితనే భార్గవ్ అయుంటాడు" అన్నాడు భవానీశంకర్ వెంటనే కోలుకుని.
    "ఎవరో మర్డర్ చేశారు" అన్నాడు శ్యామ్ కలవరపాటుతో.
    "ఇపుడు కొంపదీసి ఈ తద్దినం మనమీదకు రాదుగదా?"
    "రాకముందే మనం ఈ పరిసరాలను వదిలేయాలి కామ్రేడ్! యిక్కడ ఈ మర్డరు గురించి చర్చించుకునేంత సమయం ఏమాత్రం లేదు" అంటూ బయటకు నడవసాగాడు.
    హటాత్తుగా అతని దృష్టి టేబుల్ మీదున్న డయిరీ మీద పడింది. వెంటనే అది తీసుకుని తన బాగ్ లో వేసుకున్నాడతను. అప్పుడు వినిపించింది - బయట తలుపు ఎవరో విసురుగా మూసేసిన శబ్దం.
    ఇద్దరూ ఉలిక్కిపడి ముఖాలు చూసుకున్నారు. భవానీశంకర్ పరుగుతో హాల్లోకి నడిచి ఆ తలుపు తెరవటానికి ప్రయత్నించాడు. కానీ ఆది లాక్ అయినట్లు తెలిసిపోయింది.
    "మనల్ని ఎవరో ట్రాప్ చేశారు" అన్నాడు శ్యామ్ కలవరపాటుతో.
    "అవును! ఆ పక్షులు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. ఈ శాల్తీని మనమే హత్య చేశామని లోపల పడేస్తారు. చాలా రొటీన్ స్టఫ్ కామ్రేడ్ యిది! మనం చిన్నప్పటి నుంచి సినిమాలలో చూస్తూనే వున్నాము. డిటెక్టివ్ పుస్తకాల్లో చదువుతూనే వున్నాం. ఈ హంతకుల గ్యాంగ్ - పాపం యింకా పాత పద్దతులలోనే ఆపరేట్ చేస్తోంది."
    "ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవటం?"
    "వెరీ సింపుల్ కామ్రేడ్ శ్యామ్ మన భుజబలం ఉపయోగించి తలుపు విరగొట్టటమే ఏకయిక మార్గం" అంటూ వంటిట్లోకి పరిగెత్తి సన్నని పొడవాటి రాడ్ కర్చీఫ్ తో పట్టుకుని బయటకొచ్చాడు. రెండు నిమిషాలలో డోర్ నాబ్ ఊడి వచ్చింది. రాడ్ వంటింట్లోకి విసిరేసి యిద్దరూ త్వరత్వరగా మెట్లు దిగి సైకిల్ మీద బయలుదేరారు. జన ప్రవాహంలోకి జొరబడ్డాక వారికి కనిపించింది పోలీస్ జీప్.

 Previous Page Next Page