"మరీ అర్జంటంటే కష్టం సార్! క్వాలిటీ దెబ్బతింటుంది. త్రీ అవర్స్ పడుతుంది సార్" చెప్పాడు లామినేటర్.
"అయితే ఒంటిగంటకు వస్తాను....." ఆ ఫోటోలిచ్చేసి రూమ్ కెళ్ళాడు.
ఆ రోజు కాలేజీ సెకండ్ పీరియడ్ టైమ్ కి వెళ్ళాడు మధు.
* * *
ప్రిన్సిపల్ రూమ్ లోంచి పదీ ఇరవై నిమిషాలకు బయటికొచ్చింది అన్విత.
ఆరోజు ఆడపిల్లలు తప్ప, మగవాళ్ళు ఎవరూ రాలేదు.
"నిన్నేమైనా గొడవ జరిగిందా?" అడిగింది కల్యాణిని.
"రవిని చూసి ఇన్నాళ్ళూ భయపడ్డాం. రవిని కంగు తినిపించిన పెద్ద రౌడీ మధు. ఆ విషయం ఇప్పుడు తెల్సింది" అంది కల్యాణి.
"రౌడీని ఖంగు తినిపించిన వ్యక్తి రౌడీయే కానక్కర్లేదు" అంది అన్విత అసహనాన్ని దాచుకుంటూ.
"ఏమిటే..... మధుని వెనకేసుకొస్తున్నావ్? ఏంటి విషయం?" వేళాకోళంగా అంది కళ్యాణి. అయినా మౌనంగా వుండిపోయింది అన్విత.
మధుకి థాంక్స్ చెప్పాలనీ, వైజాగ్ వెళ్ళిపోతున్నాననీ చెప్పాలనీ అరగంటసేపు అతనికోసం ఎదురుచూసింది అన్విత.
రాలేదు.
"మైదానం నారాయణ లెక్చరర్ ఇల్లెక్కడ?" అడిగింది కళ్యాణిని. చెప్పింది కళ్యాణి.
"ఆయన క్లాస్ లో వుంటే, ఆయన ఇల్లెందుకు?" ప్రశ్నించింది.
"గుడ్ ఫెలో..... వెళ్ళిపోతున్నానని ఇంటికెళ్ళి చెప్తే గౌరవంగా వుంటుంది" అంది అన్విత.
మైదానం నారాయణ ఇంటికి సాయంత్రం వెళ్ళాలని నిర్ణయించుకుని ఇంటికెళ్ళి పోయింది అన్విత.
ఆమె వెళ్ళిపోయిన పదినిమిషాలకు కాలేజీ కాంపౌండ్ లో కొచ్చాడు మధు.
క్లాసు లో అరడజనుమంది కూడా లేరు.
లెక్చరర్లు ఆవలించుకుంటూ లెసన్స్ చెబుతున్నారు. చికాకు వేసి బయటికొచ్చేసి, క్యాంటీన్ లో జూనియర్స్ తో కబుర్లాడుకుని, ఒంటిగంట ప్రాంతంలో బయటపడ్డాడు.
అన్విత కాలేజీకి ఎందుకు రాలేదో అర్థం కాలేదతనికి.
తన కోసమే కాలేజీ నుంచి మధ్యలో ఇంటికెళ్ళిపోయిందని మధుకి తెలియదు.
రవి ప్రవర్తనకి భయపడిందా? ఆలోచిస్తూ లామినేషన్ షాపుకెళ్ళి ఫోటోల్ని తీసుకుని ఫ్లాట్ కెళ్ళాడు మధు.
* * *
డ్రాయింగ్ రూమ్ లో కేన్ చెయిర్స్ కీ, సోఫాకీ మధ్యలో ఖాళీగా వున్న గోడ మధ్యభాగంలో అన్విత ఫోటోను తగిలించాడు.
అది అన్విత తన ఇంటి కిటికీలోంచి, బయటికి చూస్తున్న క్లోజప్ ఫోటో. ఒకవేపు సాయం సంధ్యా కిరణాలు, ఆమె ముఖమీద పడుతున్నాయి.
రెండో పక్క వత్తయిన నల్లటి జుట్టు.
చాలా అందంగా వుంది ఆ ఫోటో.
తన బెడ్ రూమ్ లో, కుడివైపు గోడ మధ్యలో ప్రేమ ఫోటోని తగిలించాడు. లేవగానే కళ్ళకు కనిపించేటట్టుగా.
ఒక అరగంట ప్రేమ ఫోటో ముందు నుంచుని ఆ ఫోటోను చూస్తూ గడిపాడు.
పిడికిట్లో పూచే పున్నాగ పూవుల బాల్యం...... అరుగుమీద కూర్చున్న చిన్నారి కోపంతో నీళ్ళలో విసిరేసిన బాల్యం..... ఆమె కనిపించకపొతే గోళీకాయల్ని కోపంతో నీళ్ళలో విసిరేసిన బాల్యం..... పిచ్చెత్తిపోయి, జుట్టు పీక్కున్న బాల్యం..... భావాలు గూడుకట్టుకుంటున్న క్షణంలో, పిచ్చిక గూడులోంచి లేత పిచ్చుక తరలివెళ్ళిపోయిన బాల్యం.....
డ్రాయింగ్ రూమ్ లో కొచ్చి సోఫా మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు.
సిగరెట్ పొగలు సుడులు తిరుగుతున్నాయి.
నిన్న రవితో తను తగువుపడటంతో, తన మనసును అన్విత అర్థం చేసుకోలేదా?
రవి విషయంలో తనకి కంగ్రాట్స్ చెబుతుంది అన్విత.
ఆ సమయంలో తను 'ఐ లవ్ యూ' అని చెప్పేస్తాడు. ఆ సమయంలో తను పిరికివాడిగా కనిపించకూడదు, అలాగని అమాయకంగా కూడా కనిపించకూడదు.
'హీమాన్' లా కనిపించాలి.
తను 'ఐ లవ్ యూ' అనగానే అన్విత నుంచి రియాక్షన్ ఎలా వుంటుంది? ఆ ఊహే అద్భుతంగా వుంది మధుకి.
చిన్నగా నవ్వుతుందా?
'నాకు తెలుసు' అంటుందా?
ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాను అంటుందా?
మౌనంగా వెళ్ళిపోతుందా?
ఆమె వ్యక్తం చేసిన భావాన్ని బట్టీ...... తరువాత తనేం చెయ్యాలో నిర్ణయించుకోవాలి.
ముందుగా ఆ విషయం అమ్మకి చెప్పాలి.
అమ్మని పంపి వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడించాలి.
రకరకాలుగా ఆలోచిస్తున్నాడు మధు.
మధ్యాహ్నం తను భోజనం చేయలేదనే విషయం మరిచిపోయాడతను.
అలసటలో అతని కళ్ళమీదకు నిద్ర ముంచుకొచ్చేసింది.
నిద్రలో చిన్న కల.....
ఆకాశంలోంచి అవేవో రంగులు, ధారలు ధారలుగా నేలమీదకు కురుస్తున్నాయి.
అవి సముద్రం మీద తేలియాడుతున్నాయి.
సముద్రం ఆకాశంలా.....
ఆ మధ్యన చిన్న అందమైన మానవాకారం.
ఆమె పేరు అన్విత.
* * *
డోర్ మీద ఎవరిదో మునివేళ్ళ చప్పుడు.....
"ఏయ్ మధు..... మధూ..." ఆ వెనుక పిలుపు.
అకస్మాత్తుగా మెలుకువొచ్చింది మధుకి.
ఆ గొంతు ఎవరిదో పోల్చుకున్నాడు మధు.
మైదానం నారాయణది.
లేచి డోర్ తెరిచాడు.
"కాలేజీకి వచ్చావట.... నా క్లాస్ కి రాలేదు. ఏం చేస్తున్నావ్?.... హాయిగా పడుకున్నావా?" అంటూ లోనికొచ్చి సోఫామీద కూర్చున్నాడు మైదానం నారాయణ. అతనికి వెనక పక్కగా వుండటం వల్ల అన్విత ఫోటోను చూడలేదు ఆయన.
సాయంత్రం ఆరుగంటలైంది.
మసక మసక చీకటి పడుతోంది.
"నేను రెండు విషయాల కోసం నీ ఫ్లాట్ కొచ్చానయ్యా. ఒకటి........ మధ్యాహ్నం అన్విత కాలేజీకి ఫోన్ చేసిందయ్యా. నాతో మాట్లాడింది...... ఏం మాట్లాడిండని అడగవేం..... నీ అడ్రస్ అడిగింది. చెప్పాను. ఏ క్షణంలోనైనా ఆ అమ్మాయి ఇక్కడకు రావచ్చు.
"రెండు..... ఇదిగో తాళంకప్పు..... మూడ్రోజులైంది కొని. నీకిద్డామనుకుని డిక్కీలో పెట్టుకుని తిరుగుతున్నాను. కొత్త ఇంట్లో దిగావు కదా..... నా ప్రజంటేషన్" సీరియస్ గా అన్నాడు నారాయణ.
ఆయా సందర్భాలలో పుస్తకాలలో, పెన్నులో, వాల్ క్లాక్ లో ఏవో ప్రెజెంటేషన్స్ ఇచ్చేవారిని చూశాడు మధు.
"తాళం కప్పు ప్రెజెంటేషన్ ఏంటి సార్?"
"శ్రీ శ్రీ ఏమన్నాడూ..... తలుపు గొళ్ళెం..... హారతి పళ్ళెం.... అంటే దానర్థం ఏంటి? వాటి తాలూకూ ఇంపార్టెన్స్ గురించి చెప్పాడన్న మాట, హారతి పళ్ళెం ఆడవాళ్ళ విషయం. దాన్ని తోముకుని పూజామందిరంలో పెటుకోవడం వాళ్ళ బాధ్యత. మగవాళ్ళ బాధ్యత ఏమిటంటే తలుపు గొళ్ళెం...... బాధ్యత. ఆ తలుపు గొళ్ళేన్ని గట్టిగా, బలమైన తాళం కప్పతో వేసినప్పుడే ఇంటికి భద్రత, మనసుకి హాయిగా..... అందుకేనన్న మాట..... వస్తాను పనుంది" అని లేచాడు నారాయణ.
మధుకి ఇంకా నిద్రమత్తు వదల్లేదు.
"సార్! మొదట చెప్పిన విషయం ఏంటి?" అకస్మాత్తుగా జ్ఞాపకం రావడంతో అడిగాడు.
"అదేనోయ్.... అన్విత నీ ఫ్లాట్ అడ్రస్ అడిగింది. ఏదో క్షణంలో రావచ్చు"
"అన్విత ఇక్కడకు వస్తుందా?"
గబుక్కున అతనికి నిద్రమత్తు వదిలేసింది.
"వన్ మినిట్ సార్....." అంటూ బాత్ రూమ్ లోకి పరుగెత్తి, స్నానం చేసి, పది నిముషాల్లో డ్రెస్ అప్ అయిపోయాడు.
అప్పుడు సరిగ్గా ఆరూ నలభై నిముషాలైంది. డ్రాయింగ్ రూమ్ లోని కుర్చీని, వరండాలో వేసుకుని సినిమా మ్యాగజైన్ ని సీరియస్ గా చదువుతుండడం వల్ల అన్వితను అప్పుడు కూడా మైదానం నారాయణ చూడలేకపోయాడు. తనే టీ చేసి, రెండు కప్పులతో బయటికొచ్చి, ఒక కప్పుని నారాయణకిచ్చి పిట్టగోడ పక్కన నుంచుని రోడ్డువైపు చూస్తున్న మధుకి- తన ఫ్లాట్ ముందు సాంత్రో కారు ఆగడం, గోల్డెన్ కలర్ డ్రెస్ లో అన్విత కారు దిగి మెట్లెక్కడం వెంట వెంటనే జరిగిపోయాయి.
అతని మనసు సంతోషంతో నిండిపోయింది.
ఎదురుగా వెళ్ళాడు మధు.
మధుని చూసిన అన్విత చిన్నగా నవ్వింది.
"రా అమ్మాయ్..... రా..... నీకోసమే ఎదురుచూస్తున్నాను....." అన్నాడు మైదానం నారాయణ.
"నా కోసం మీరు ఎదురుచూడడం ఎందుకో? అందామె మామూలుగా.
"అవును- ఎందుకు?" బయటకే అన్నాడు నారాయణ.
అతని మాటలకు మధు, అన్విత ఇద్దరూ నవ్వుకున్నారు.
చీకటి చిక్కనవుతోంది. వీస్తున్న గాలి చల్లగా వుంది.
డ్రాయింగ్ రూమ్ లోని లైటు కాంతి డాబా మీద పడుతోంది.
"ప్లీజ్ కమిన్....." అన్నాడు మధు డ్రాయింగ్ రూమ్ లోకి నడుస్తూ.
"డాబా మీద బావుందిగా....." అందామె.
తను తీసిన ఆమె ఫోటోను ఆమె చూసేలా చేసి, ఆమెను ఆశ్చర్య చాకితురాలిని చెయ్యాలని అతని ఉద్దేశ్యం.
"ఫస్ట్ టైమ్ వచ్చావు. లోన డ్రాయింగ్ రూమ్ లో కెళ్ళి మాట్లాడుకోండి. నే వెళ్ళిపోతాను" అన్నాడు నారాయణ లేస్తూ.
"మీరెందుకూ వెళ్ళిపోవడం" అంది అన్విత.
"అవును...... నేనెందుకు వెళ్లిపోవడం?" అన్నాడు నారాయణ కన్ ఫ్యూజన్ గా.
హై హీల్స్ జోళ్ళని విప్పింది.
డ్రాయింగ్ రూమ్ లోకి రావటానికి డోర్ వరకూ వచ్చింది.
డోర్ దాటి ఒక్క అడుగు ముందుకు వేసినా-
ఆమెకు స్పష్టంగా కనిపించేది-