"నువ్వు, అన్విత సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారని అనుకుంటారనా? నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావనే విషయం, ఏదో రకంగా ఆమెకు చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఉపయోగపడుతుంది. ఆలోచించు" మళ్ళీ గుసగుసలాడాడు సుల్తాన్.
సరిగ్గా అదే సమయంలో-
రవి, అన్విత చేయి పట్టుకుని బలవంతంగా క్యాంటీన్ వేపు తీసుకొస్తున్నాడు. అన్విత విడిపించుకోడానికి ప్రయత్నిస్తోంది.
ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు మధు.
చేతిలో వున్న టీ కప్పును గోడకేసి విసిరికొట్టాడు.
చేతిలో వున్న సిగరెట్టును చూపుడు వేలితో పారేసి-
ఒక్క ఉదుటున లేచి, క్యాంటీన్ లోంచి బయటకు దూసుకెళ్ళి రవి, అన్వితలకు ఎదురుగా నిలబడ్డాడు.
"ఇతనేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. మనిద్దరికీ కనెక్షన్ వుందట. నేను నీకు డబ్బిస్తే నువ్వు హీరోహోండా కొనుక్కున్నావట- ఈ డ్రెస్ లకూ, నీ ఖర్చులకీ పెట్టుబడి నేనే పెట్టానని అందరిముందూ చెప్పమంటున్నాడు" చిరాకు పడిపోతూ అంది అన్విత.
ఆమె చేతిని రవి వదల్లేదు.
చుట్టూ దాదాపు యాభైమంది స్టూడెంట్స్ పొగయ్యారు.
"రవీ.... ముందు అన్విత చెయ్యి వదులు....." అన్నాడు మధు.
ఆ గొంతు గంభీరంగా వుంది.
కోపంతో అతడి ముఖం జేవురించింది.
అసహనంతో అతని పిడికిలి బలమైన 'కిక్' కు రెడీగా వుంది.
రెండే రెండు క్షణాలు....
మధు కుడిచేయి పిడికిలి, రవి ముఖాన్ని ఢీకొంది తుఫానులా.
ఇసుకలో కూరుకుపోయాడు అరుస్తూ.
"మీరెళ్ళండి....." అన్నాడు అన్వితతో.
ఆమె కారు డోర్ తెరిచి - డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇగ్నీషన్ కీ తిప్పింది.
కారు సర్రుమని మెయిన్ గేటు వైపుకు దూసుకుపోయింది.
కిందపడిన రవి, కారుకి అడ్డంగా నుంచిబోయాడు.
ముందుకెళ్ళిన మధు అతన్ని పక్కకు లాగాడు.
కారెళ్ళిపోయింది.
రవి ఒక్కసారి మధుమీద పడ్డాడు. మధు ఎడంచేత్తో అతని జుత్తు పట్టుకుని-
"చూడు..... నువ్వే కాదు..... నేను కూడ స్నేహితుడిని శత్రువుగా చూడగలను. కానీ మన బలం, బలమైన శత్రువు ముందు చూపెట్టాలి. అండర్ స్టాండ్! నా జోలికి ఎప్పుడూ రాకు, నీ జోలికి నేను రాను. గొడవ పడటం నాకిష్టం ఉండదని నీకు తెలుసు."
జుట్టు వదిలేసి, తన హీరోహోండావైపు నడిచి, ఎక్కి స్టార్ట్ చేశాడు. మధు.
క్యాంటీన్ లోకి నడిచాడు రవి.
"ఇద్దరు కుమ్మక్కయిపోయారు. వీళ్ళని దొంగదెబ్బ తియ్యాలి" అసహనంగా అన్నాడు రవి.
"అన్విత చేయి పట్టుకుని తీసుకురావాలనుకోవడం నువ్వు చేసిన తప్పు" అన్నాడు బుచ్చిబాబు.
అతని చెంపఫడేల్మని పేలిపోయింది.
"నా దృష్టిలో ఏదీ తప్పుకాదు..... మీరందరూ రెండువైపులా మాట్లాడే నక్కలు. జాకాల్స్! నేనెలా చూస్తానో చూడండి" బల్లమీద గట్టిగా గుద్దుతూ అన్నాడు రవి.
అతనికి తల తీసేసినట్లుగా సిగ్గుగా వుంది. అవమానభారంతో కుంగిపోతున్నాడు.
* * *
కారాపి, లోనికెళ్ళబోతున్న అన్విత గార్డెన్ పక్కన ఆగిన అంబాసిడర్ కారుని చూడగానే ఇంటిలోపలికి పరిగెత్తింది. ఫామిలీ డాక్టర్ యోగి లోన్నించి వస్తున్నాడు.
"నీ గురించే వెయిట్ చేస్తున్నానమ్మా..... ఇప్పుడే ఢిల్లీలో ఉన్న డాడీతో మాట్లాడాను" అన్నాడాయన.
"ఏ విషయం అంకుల్?"
"మీ గ్రాండ్ మా హెల్త్ సడెన్ గా దెబ్బతింటే, ఫోన్ చేస్తే వచ్చాను. హైబీపీ, ఒబేసిటీ ప్రాబ్లమ్. నెలరోజులపాటు నేచర్ క్యూర్ హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటే మంచిది. వైజాగ్ హాస్పిటల్ డాక్టర్ నా ఫ్రెండ్. అక్కడ మీ అంకుల్ కూడ ఉన్నారు కదా- నీ చదువుకు ఇబ్బంది అవుతుందేమోనని అంటున్నారు డాడీ" చెప్పాడు యోగి.
ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది. రిసీవరు అందుకుంది అన్విత. ఢిల్లీ నుంచి డాడీ చేసిన ఫోన్ అది.
పావుగంటసేపు మాట్లాడిందామె.
"ఫర్వాలేదు డాడీ! నానమ్మను తీసుకుని నేను వైజాగ్ వెళ్ళిపోతాను. ప్రైవేట్ గా ఎగ్జామ్ రాస్తాను. నాన్నమ్మ హెల్త్ ముఖ్యం నాకు" చివరగా అందామె.
"నానమ్మ హాస్పిటల్లో చేరాక నేనొస్తాను..... జాగ్రత్త" చెప్పి ఫోన్ పెట్టేశాడాయన.
"ఇంజక్షన్ చేశాను, టాబ్లెట్సు యిచ్చాను. ఇంటికెళ్ళగానే వైజాగ్ ఫోన్ చేసి, ఆ విషయం నీకు చెపుతాను. రెండ్రోజుల్లో తీసుకెళితే మంచిది" చెప్పి యోగి వెళ్ళిపోయాడు.
రాత్రి తొమ్మిదిగంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు.
"నానమ్మ వయసురీత్యా ట్రీట్ మెంటు మూడునెలలు వుండాలటమ్మా! ఎల్లుండి ప్రయాణం, ట్రైన్ టిక్కెట్సు రేపు నీకు అందుతాయి" చెప్పాడు ఆయన.
* * *
మరునాడు డాక్టర్ యోగి స్వయంగా టిక్కెట్సు తెచ్చి అన్విత కిచ్చాడు. సడెన్ గా కాలేజికి దూరం కావడం అన్వితకు వూహించని పరిణామం.
ముఖ్యంగా ఏదో వెలితి.....
తెలియని బాధ.....
ఆ బాధ ఫలానా గురించని తెలియడం లేదు.
మరునాడు పదిన్నర సమయంలో ప్రిన్సిపాల్ తో చెప్పెయ్యడానికి కాలేజికి బయల్దేరింది అన్వితకు వూహించని పరిణామం.
ముఖ్యంగా ఏదో వెలితి....
ఆ బాధ ఫలానా గురించని తెలియడం లేదు.
మరునాడు పదిన్నర సమయంలో ప్రిన్సిపాల్ తో చెప్పెయ్యడానికి కాలేజికి బయల్దేరింది అన్విత.
* * *
క్రితంరోజు సాయంత్రం రవితో గొడవ జరిగాక సుల్తాన్, మధుని తనింటికి తీసుకెళ్ళిపోయాడు.
"వాళ్ళు ఏ అర్థరాత్రో వచ్చారనుకో ఒక్కడివి ఏం చేస్తావ్? ఇవాళ రాత్రి మనింట్లో వుండు" అని సముదాయించి, తాను రెగ్యులర్ గా తాగే త్రిబులెక్స్ రమ్ తెచ్చాడు.
అసలే కోపంలో ఉన్నాడేమో, నాలుగు పెగ్గులు తాగేశాడు మధు.
అన్వితంటే తనకెంత ఇష్టమో చెప్పాడు.
"ఏమైతే అయింది ఇప్పుడు నాకు మొహమాటం లేదు. రేపు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఫీలింగ్స్ ను ఆమెకు చెప్పేస్తాను" సుల్తాన్ తో చెప్పాడు మధు.
ఆ మాటలకు చిన్నగా నవ్వాడు సుల్తాన్.
ఎందుకలా నవ్వుతావన్నట్లు చూశాడు మధు.
"దేనికైనా మనిషికి ఉండవలసింది మూడు.
ఒకరి : ధైర్యం.
రెండు : అనుకున్నది సాధించేవరకూ నిద్ర మొఖమెరుగని మొండితనం.
మూడు: నిజాయితీ.
నీకు తెలుసుగా మా వూరు చంద్రర్లపాడు. మా ఎమ్మెల్యే రమణ గురించి వినే వుంటావుగా.
మన రాష్ట్రంలో 294 నియోజక వర్గాలుంటే- పై మూడు లక్షణాలతో పనిచేసింది అటు చంద్రబాబు అయితే - ఇటు దేవినేని రమణ- ఈ ఇద్దరే.
నాలుగు దశాబ్ధాలుగా అణగారిపోయిన మా నియోజకవర్గాన్ని, నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో రెండో స్థానంలో నించోబెట్టాడు. ఒకటి చంద్రబాబు కుప్పం అయితే- రెండు మా నందిగామ నియోజకవర్గం.
ఎంచుకున్న రంగం ఏదైనాగానీ, ముందున్న లక్ష్యం ఏమన్నాగానీ, పై మూడు లక్షణాలు లేనివాడు జీవితంలో సక్సెస్ కాలేడు. రమణ ఎమ్. ఎల్. ఏ. గా నించున్నప్పుడు అందరూ అతను రౌడీ అని భయపడిపోయాడు.
నందిగామ నియోజకవర్గ పల్లెపల్లె యెదలోన చిలికిన మమతల వెన్న దేవినేని వెంకటరమణ. పల్లెమొగళ్ళలో మొలకెత్తిన పసి మొలక ఉచ్ఛ్వాస వెంకటరమణ. చేలగట్లమీద నుంచున్న నిశ్వాస వెంకటరమణ. మట్టి రోడ్ల మీద ధూళి నడిగినా, డొంకరోడ్లమీద పరుగెత్తే ఎడ్లమెడల్లోని గంటనడిగినా, మిలమిల మెరిసే పల్లెల్లోని విద్యుద్దీపాల్ని అడిగినా, బడి పలకనడిగినా, పేద తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసిపాప కనురెప్పల్ని అడిగినా 'వెంకటరమణ జోహార్ వెంకటరమణ' అనే నినాదాలే వినిపిస్తాయి.
అకాల మృత్యువు రమణని వరించినా, ప్రజల గుండెల్లో దేవుడై కొలువు తీరి వున్నాడు.
ఒక ఎమ్మెల్యే అయినా, విద్యార్థే అయినా, వ్యాపారవేత్త అయినా, పై మూడు లక్షణాలు చాలా ముఖ్యం.
చంద్రబాబు, రమణలాగా మిగతా 292 ఎమ్మెల్యేలు అనవరతం శ్రమించి వుంటే, ఈ రోజు మనరాష్టం అక్షరక్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ దేశం మొత్తంమీదే ముందుండేది.
ఎవరికివారు మనకు ఏం కావాలి?
ఏం సాధించాలి?
ఏం సాధించచాటని బయలుదేరాం- అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే చాలు- వాళ్ళ అంతరాత్మే వాళ్ళకో దారి చూపిస్తుంది. ఇక ఇంతకంటే నేను చెప్పలేను" అని మంచమెక్కాడు సుల్తాన్.
చాలాసేపు ఆలోచనల్లో కూరుకుపోయి ఆ తర్వాత ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు మధు.
* * *
లేచేసరికి ఉదయం తొమ్మిదిగంటలైంది......
వెహికల్ తీసుకుని మొదట ఫోటో స్టూడియోకొచ్చాడు మధు.
లైఫ్ సైజ్ ప్రేమ ఫోటోని చూసి, నిశ్చేష్టుడైపోయి, మంత్రముగ్ధుడిలా నిలబడిపోయాడు.
కళ్ళముందు ప్రవహిస్తున్న గోదావరి, ఆ గోదావరి ఒడ్డున ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు గుర్తుకొచ్చాయి.
అన్విత ఫోటోల శాంపిల్ ప్రింట్స్ల్ లోంచి, మూడు శాంపిల్స్ ని ఎంపిక చేశాడు.
అతను ఫస్ట్ టైమ్ ఫోటోల్ని తీయడం.
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగా వచ్చాయి ఫోటోలు.
ఆ మూడింటినీ, లైఫ్ సైజ్ ప్రింట్స్ దగ్గరుండి వేయించాడు.
ఆ ఫోటోల్లో అన్విత, కళ్ళ ముందు నిలబడ్డట్టుగా వుంది.
ఎమౌంట్ చెల్లించి స్టూడియోలోంచి బయటికొచ్చి లామినేషన్ షాపుకెళ్ళాడు.