Previous Page Next Page 
మనస్విని పేజి 23


    
    "ఏమీలేదు-మీకభ్యంతరం లేకపోతే అతన్ని నేను నా వెంటతీసుకు వెడతాను-నానర్సింగ్ హోమ్ లో చేర్చుకుని వైద్యం ప్రారంభిస్తాను-అనాధుడూ, పైగా సుకుమార హృదయుడూ, కవీ అయిన అతన్ని గాలికి వదలాలంటే మనసొప్పటం లేదు-మీ అడ్రసిచ్చి వెళ్ళండి-అవసరమైతే మళ్ళీ మీకు లెటరువ్రాస్తాను"
    
    వెళ్ళిపోవటానికి లేచారు. వారి అంగీకారం అంతసులభంగా దొరికినందుకు సంతోషించాడు డాక్టర్ అనంతం.
    
    "అతన్ని ఒంటరిగా తీసికెళ్ళటంకష్టం......గీతాంజలి గారు అతన్ని మా హోమ్ లో వదిలి పెడితే చాలా కృతజ్ఞుడిని"
    
    కన్నీరుతుడుచుకుంటూ అంది:
    
    "అంతమాట అనకండి డాక్టర్-నిర్భాగ్యుల్లో నిర్భాగ్యులు పిచ్చివాళ్ళు అలాంటి వాళ్ళకి సహాయం చేయటం, సేవ చేయటం మానవుని కనీస ధర్మం-మీరు చేసే సహాయంముందు నేను చేసింది చేయబోయేది ఏపాటిది?"
    
    "అది నీకు ఇప్పుడు అర్ధం కాదమ్మా......సరేవెళ్ళి అతన్ని పిలుచుకురా"
    
    లేచింది.
    
    డాక్టర్ గారిరూముదాటి గురుదేవ్ గది వైపుగా వెళ్ళింది గది బయటా నిల్చుని ఒక్కక్షణం ఆలోచించింది-    
    
    తర్వాత గదిలోకి వెళ్ళింది.
    
    చూశాడు.
    
    "వచ్చావా? రా"
    
    మంచంమీద అతనికి దగ్గరగా కూచుంటూ అంది.

 

    "మనం వెళ్ళిపోదామన్నారే, వెడదామా"
    
    తల ఊపాడు.
    
    "ఇప్పుడెవెడదామా?"
    
    "వెడదాంరండి"
    
    లేచి ఆమె చేయి పట్టుకుని అన్నాడు.
    
    "మనం ఇద్దరమే వెడదాం. ఇంకెవరూ వద్దు"
    
    "అలాగే"
    
    రెండడుగులు వేశాక అంది.
    
    "ఊహూ అలాకాదు కారు నడపటానికి ఎవరైనా కావాలి కదా?"  

 

    "కారుందా?"
    
    "ఉంది"
    
    "నీదేనా"
    
    "ఊహూ"
    
    "మరి?"
    
    "మనది......."
    
    సంతోషంగా ఆమె చేయి నొక్కాడు.
    
    మెల్లిమెల్లిగా ఒక్కో ఫ్లాట్ దాటుకుంటూ గేటుదాటారు. అక్కడ రెడీగా డాక్టర్ అనంతం కార్లోవున్నారు. మౌనంగా ఏమి అల్లరిచేయకుండా అడ్డం చెప్పకుండా అందులో కూర్చున్నారు మెల్లిగాసాగిపోయింది కారు-
    
    "నిన్ను నమ్ముకోవాలి బాబూ! దేనికైనా?"
    
    సారధిని చూస్తూనే వేసినమొదటి ప్రశ్న అది. వదినగారి అనురాగపూరితమైన మందలింపు ముందుతలవంచకుండా వుండలేకపోయాడు అతను. పళ్ళూ, మల్లెపూలు వదినగారు చేతికి అందిస్తూ అన్నాడు.
    
    "నేను పరీక్ష క్లాసులో పాసయ్యానువదినా"
    
    ఆమెమనస్సులో ఆడిన సంతోషం కానీ వదనంపై ప్రతిబింబించిన సంతోష చిహ్నాలుకానీ వ్రాయటానికి నాకుపదాలు దొరకటం లేదు. వంట ఇంట్లోకి లేచివెళ్ళి తను నిత్యమూ పూజ చేసే పద్మావతీదేవి చరణ రంజితమైన కుంకుమ తెచ్చి అతని నొసట దిద్దింది.
    
    "ఇంకా ఇలాంటి పరీక్షలూ జీవితంలో ఇంతకంటే కష్ట తరమైన పరీక్షలూ ఫస్టు నా పాసు కావాలి సారధీ"
    
    వదినగారి ఆశీస్సులు జగజ్జనని ఆశీస్సులా శిరసున ధరించాడు. మౌనం వహించాడు. ముందేం చెప్తాడు? అని ఆమె మనసులో ఆడుతూవుంది. వదినగారితో ఆ విషయం ప్రస్తావించటం ఎలా అని అతను ఆలోచిస్తున్నాడు.
    
    "బాబూ"
    
    "వదినా"
    
    "......."
    
    "వదినా......ఏమిచెప్పరేం?"    

 

   "ఏం చెప్పాలయ్యా? నీవే చెప్పరాదూ అదేదో!"
    
ఒక్కక్షణం ఆగాడు. మనసులోని కోర్కెలని మాతృమూర్తిముందు బయటపెట్టుకుట్టున్నట్టుగా చెప్పసాగాడు.
    
    "బి.ఎస్సి చదవటం అయిపోయింది వదినా ఇద్దరిదీనూ-ఇకపైకి చదవాలని మాకెవరికీ లేదు కూడా. ఏదో దగ్గర్లో ఉద్యోగం దొరికితే సరి లేదా ఇక్కడే వుండిపొలం వ్యవహారాలు చూసుకుంటాను.....నాన్నగారి అభిప్రాయం కూడా అదే"    

 

    "మంచిది బాబూ! ఉన్నవారూ లేనివారూ అందరూ ఉద్యోగాలకి ఎగబడితే అర్ధం వుండదు అందుకే-నిజమైన అవసరం వున్నవారికే ఉద్యోగాలు దొరకటంలేదు. ప్రపంచంలో స్వార్ధం పెరిగిపోతున్నది సారధీ. అవసరాలతో తృప్తిపడక అంతా తనకేకావాలని అనుకునేవాళ్ళున్న కాలంలో ఎప్పుడూ దేశంవృద్దిలోకి రాదుబాబూ"
    
    "నిజంవదినా?"
    
    "......"
    
    "సరేనయ్యా......ఇంకేమైనా చెప్పు"
    
    "అలాగే వదినా"
    
    "ఊ"
    
    "తర్వాత......తర్వాత.......ఇంట్లోనే వున్నాక ఇక ఇల్లాలిని కూడా తెచ్చుకుందామని వదినా"
    
    "మంచిదిబాబూ"
    
    "ఆవిషయం అన్నగారు ప్రస్తావిస్తే బావుంటుంది"
    
    "అలాగే.....ఆ అమ్మాయి విషయం....."
    
    "అంతా కుదిరిపోయింది వదినా"
    
    "అలా అనొద్దు సారధీ కుదిరింది అను అభంగశ్లేషలో నైనా సభంగ శ్లేషలో నైనా దురద్దం గోచరించకుండదు"
    
    ఆమె మనసులోని సుకుమారభావనలకి-కదిలిపోయాడు సారధి.
    
    "అలాగేవదినగారూ......అవసరమైతే వాళ్ళనాన్న గారు కూడా వస్తారు"
    
    "అవసరంలేదులే బాబూ......ఇంతకీ ఆ అమ్మాయిరాలేదేం ఇక్కడికి?"
    
    "వస్తుంది వదినా.......బాన్ లోకి వెళ్ళింటిమి. నిన్ననే తిరిగి వచ్చాము"
    
    "అవునయ్యా......ఈవారం రోజులూ ఇలారానేలేదు. సుశీల విషయంలో అన్యాయం చేయకు బాబూ"
    
    "అలా ఎన్నటికీ జరగదు వదినా......తప్పక ఆ అమ్మాయిని గట్టెక్కిస్తాను"
    
    "ఆ ఉద్దరణ కార్యక్రమం అంతా నీదే బాబూ! నా దేమీ లేదు"
    
    "వస్తాను వదినా......ఈ రోజు పాఠం చెప్పివస్తాను"
    
    "మంచిది బాబూ"
    
    "లెక్కలు చేద్దాం సుశీలా.......ఇంగ్లీషు ఉదయం చెపుతాను"
    
    "మీఇష్టం"
    
    "రేఖాగణితం లెక్కలు చేద్దాం"
    
    తల ఊపింది. ఒకలెక్క తీసుకుని ముందు ఎలా గీయాలో నోటితో చెప్పాడు. తర్వాత పెన్సిల్ తో ఊరకే కొలతలు లేకుండాగీయ మన్నాడు. పెన్సిల్ తీసుకుని చెక్కుతూ కూర్చుంది.
    
    "సుశీలా" తలెత్తింది. అనుకోకుండా వేలు జరిగిబ్లేడు కొనకి తగిలికోసుకుని పోయింది. రక్తం కారుతుంటే-దగ్గరగా జరిగిచేయి చేతిలోకి తీసుకుని రక్తం తుడిచాడు.

 Previous Page Next Page