Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 22

    రెండు సెకండ్ల పాటు రెప్పలార్చకుండా చూసిన కృషి అడిగింది "ఎద లోపలి యెదలో నెమ్మదిలో జీవిత రహస్యమార్గమ్ములలో వద అని కోరికవై నా బ్రతుకు బరువులెల్ల పాట పాడింతు సఖీ రాసిందెవరు"    
    "కృష్ణశాస్త్రి"    
    "గుడ్" అభినందనగా చూసింది "కొండ తిరిగీ కోన తిరిగీ చీర చెరుగున కూరిచితిరా - గరికెపూవుల కంఠమల - ఆవునడిగీ అడవినడిగి పూల గిన్నెల పొందుపరిచితి-"    
    ఆమె వాక్యాలు యింకా పూర్తికాకముందే చెప్పాడు విస్సు "నండూరి రాసిన జానపదగీతంలోని పంక్తులవి"    
    "ప్రపంచ ప్రముఖురాలైన బ్రిటిష్ నర్స్ ఫ్లారెన్స్ నైటింగేల్ వీలునామా నిర్లక్ష్యం చేయబడింది. ఎలా" ఇక్కడ విస్సు తెల్లమొహం చేస్తాడనుకుంది. కాని వెంటనే చెప్పేయగలిగాడు "1910 లో మరణించిన ఫ్లారెన్స్ నైటింగేల్ వీలునామా ప్రకారం ఆమె శరీరాన్ని సైన్స్ పరిశోధనకి అందించాలని కోరింది. ఆమె తల్లిదండ్రులు ఖననం చేయబడ్డ హేంప్ షేర్ సిమెట్రీలోనే ఆమె శవమూ ఖననం చేయబడింది."    
    "మూడు పెళ్ళిళ్ళు విఫలమైన టెర్ ట్రండ్ రస్సెల్ తన ఎనభయ్యో యేట నాలుగో  పెళ్ళి  చేసుకున్నాడు - ఆమె పేరు".    
    "ఎడిత్ ఫించ్"    
    "రైట్..." ఈ సారి అతడ్ని కవ్విస్తున్నట్టుగా అడిగింది " 'లౌ' అంటే ప్రపంచంలో చాలా చరిత్రగలధైనా టెన్నిస్ లో మాత్రం సున్నాని సూచిస్తుంది - ఎందుచేత."   
    "LOVE" అనే పదానికి మూలం ఫ్రెంచి భాషలోని LOEUF ఈ ఫ్రెంచ్ పదానికి ఆ భాషలో అర్ధం గుడ్డు అని - గుడ్డు రూపం జీరోకి దగ్గరగా వుంటుంది కాబట్టి నన్ స్కోర్ కి LOVE అనే పదం వచ్చింది."    
    "వేడిచేసి చల్లబరిచిన నీళ్ళు కప్ నీళ్ళలో ఏవి తొందరగా గడ్డకట్టే గుణం కలిగి వుంటాయి."    
    "తప్పకుండా వేడిచేసి చల్లబరిచిన నీళ్ళే...ఎందుకంటే అందులో బుడగలు వుండే అవకాశం లేదు కాబట్టి."    
    "ఇద్దరుంటే కంపెనీ ముగ్గురుంటే గుంపు అయితే నలుగురూ అయిదుగురూ వుంటే."    
    "తొమ్మిదిమంది" ఎగతాళిగా అన్నాడు విస్సు.    
    విస్సు ఆలోచించుకునే అవకాశ మివ్వనట్టుగా అడిగింది కృషి. "ఒక మగాడు తన భార్య వితంతువైతే ఆమె చెల్లెల్ని చట్టరీత్యా పెళ్లి చేసుకోవచ్చా"    
    "యస్ - చేసుకోవచ్చు" అన్నాడు టక్కున.
    "రాంగ్" నెమ్మదిగా అంది కృషి...." నువ్వు బ్రతికుండగానే నీ భార్య వితంతువయ్యే అవకాశం లేదుగా"    
    షాక్ తిన్నట్టుగా చూశాడు....చాలా తెలివిగా తప్పుదోవ పట్టించింది.    
    "మూడు ఏపిల్స్ లో మీరు రెండు తీసుకుంటే మీ దగ్గర ఎన్ని మిగిలినట్టు..."    
    "ఒకటి..." కృషి ముఖకవళికల్ని చూస్తూ అన్నాడు. "కాదు కృషీ-రెండు... ఎందుకంటే నేను ఎక్కడో వున్న మూడు ఏపిల్సులో రెండు తీసుకున్నాను కాబట్టి నా దగ్గర వుండేది రెండే...   
    "నాట్ బేడ్" అన్నట్టుగా నవ్వింది కృషి "పది సెకండ్లలో చెప్పాలి...." వున్న గడువు అదే అని ఆమెకీ తెలుసు కాని విస్సుని సైకలాజికల్ గా యిబ్బంది పెట్టాలనుకుంది "కలిపినా లేక గుణించినా ఒకే మొత్తం వచ్చే మూడు అంకెల్ని చెప్పండి"    
    "ఒకటి రెండు మూడు"    
    "ప్రేమ విషయంలో అబ్బాయి అమ్మాయిల ఆలోచనా సరళి గురించి మోడరన్ సైకాలజీ ఏం చెబుతుంది"   
    "తొందరగా ప్రేమలో పడేది మగాడే అంటూంది సైన్స్."    
    ఆడిటోరియంలోని అమ్మాయిలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. "ఆ తర్వాత ప్రేమ విఫలమయినా మరిచిపోలేక బాధ పడేదీ మగాడే అంటుంది...అమ్మాయి విషయానికి వస్తే ఆమె తొందరగా రాజీ పడగలదన్నది సైన్స్ చెబుతున్న సత్యం. అంటే ప్రేమలో ఎక్కువ బాధను అనుభవించేది అబ్బాయిలే పాపం"    
    ఈ సారి విద్యార్ధులు విస్సుకి సపోర్టుగా చప్పట్లు కొట్టారు.    
    "ప్రపంచంలో మొదటిసారిగా ఇంటెల్లిజన్స్ టెస్ట్ ల కోసం ప్రయత్నం జరిగిందెప్పుడు."
    "క్రీస్తు శకం 1900 సంవత్సరంలో మానసిక వైఫల్యంతో బాధపడుతున్న పిల్లల్ని పరీక్షించటానికి ఇంటెల్లిజన్సు టెస్టుల్ని డిజైన్ చేయించింది ఫ్రెంచి ప్రభుత్వం. ఈ టెస్టులకి రూపకల్పన చేసింది సైకాలజిస్ట్ ఆల్ ఫ్రెడ్ బెనెట్..."    
    జవాబు చెబుతూ చూశాడు విస్సు... కృషి మొహంలో క్రమంగా రంగులుమారిపోతున్నాయి....పరిస్థితి చేజారిపోతూందన్న విషయం కృషికీ అర్ధమౌతూనే వుంది...    
    ఇప్పుడామె ఆలోచిస్తున్నది కేవలం ఓటమి గురించి మాత్రమే కాదు. ఓటమి తర్వాత తాను పోగొట్టుకోబోతున్న వెలకట్టలేని జీవితం గురించి...    
    "చెస్ - అదే చదరంగానికి మూలం ఏమిటి" అడిగింది కృషి.    
    "క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుంచీ మొదలైన ఈ చదరంగానికి మూలం భారతదేశంలోని ఓ యుద్ద వ్యూహం 'చతురంగ'-"    
    విస్సు జవాబుకి స్పందించిన విద్యార్దులంతా చప్పట్లు కొట్టారు. ఆడిటోరియం ముందు వరుసలో కూర్చున్న చౌదరి కొడుకు రాజేష్ సైతం విస్సుని సమర్ధిస్తూ తన బృందాన్ని ప్రోత్సహిస్తున్నాడు నిజానికి అది విస్సు మీద అభిమానంతో కాదు తన తండ్రంతటి వాడిపై పోరాడేందుకు సాహసించిన కృషిపై రగిలిన ద్వేషం.    
    "ఆగష్టు నెలకి ముప్పై ఒక్క రోజు లుండడానికి కారణం ఇంపీరియల్ జలసీ అంటారు.....వివరించండి."  
    "క్రీస్తు పూర్వం 38లో రోమన్ చక్రవర్తి ఆగస్టన్ పేరుని బట్టి జులై తర్వాత నెల ఆగస్టు అనే పేరు నిర్ధారించబడింది. అయితే జూలియస్ సీజరు పేరును సూచించే జులైకి ముఫ్ఫై ఒక్కరోజులుండడం, ఆగస్టుకి ముఫ్ఫై రోజులుండడం నచ్చని ఆగస్టన్ చక్రవర్తి ఆగస్టుకీ ముఫ్ఫై ఒక్క రోజులుండేట్టు చేసి ఫిబ్రవరి నెలకి ఓ రోజు తగ్గించాడు. ఈ చర్యని యింపీరియల్ జలసీగా వర్ణిస్తారు"    
    మళ్ళీ కరతాళ ధ్వనులు.....    
    కృషిలో టెన్షన్ ఉధృతం కాసాగింది. "తొలిసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన ఘనత దక్కించుకున్న రష్యన్ ఆస్ట్రోనాట్ యూరీగగారిన్ మరణం ఎలా సంభవించింది"    
    "గగారిన్ అంతరిక్షంలో అడుగు పెట్టిన పదేళ్ళకి ఓ జెట్ ప్లేన్ నడుపుతూ విమాన ప్రమాదంలో చనిపోయింది.    
    కృషి మరో ప్రశ్న అడగబోతుండగా వేదికపైకి ఓ మూలగా వచ్చిన సూరి వేగంగా విస్సుని సమీపించాడు.    
    ఏదో చెప్పి విస్సుకి ఓ స్లిప్పు అందించాడు.    
    "మేం కిడ్నాప్ చేసుకువెళ్ళిన నీ తల్లి బ్రతకాలి అంటే పోటీలో నువ్వు ఓడిపోవాలి -ఓడేక కుతుబ్ షాహి సమాధుల దగ్గరకొచ్చి నీ తల్లిని తీసుకువెళ్ళు....ఒకవేళ నువ్వు ఈ పోటీలో గెలిస్తే నీకు అక్కడ ఎదురయ్యేది నీ తల్లి శవం మాత్రమే"   
    ఆ స్లిప్పు తన దగ్గరికి ఎలా వచ్చిందీ సూరి చెబుతుంటే వినలేదు విస్సు. నుదుటపట్టిన స్వేదాన్ని తుడుచుకుంటూ కృషిని చూశాడు.    
    మొన్న తను ఏది కోల్పోకూడదని తనపై గూండాల్ని పురమాయించిందో ఇప్పుడు మళ్ళీ కృషి అలాంటి పథకానికి సిద్దపడింది.            
    ఓ మనిషిపై మొదలైన అనుమానం ఉధృతం కావటానికి పరిస్థితులు దోహదం చేయడమే నిజమైతే విస్సు  సరిగ్గా అలాంటిస్థితిలో చిక్కుకున్నాడిప్పుడు....కృషి తనను చాలా నిస్సహాయుడ్ని చేసింది.    
    లేనిదాని గురించి వున్నదాన్ని ప్రకటించడం ఉన్నదాన్ని వృధాచేసుకోవడమేనన్న సత్యం తెలిసిన విస్సు ఆ తర్వాత యిక పోటీపై ఏకాగ్రత చూపించలేదు. వివేకంలేని ఆవేశానికి అర్ధం లేదు.    
    బ్రతుకు మరుభూమిలో పిచ్చి చెట్టులా నిలబడి కోల్పోయిన సౌరభం కోసం ఆర్తిగా దిక్కులు చూస్తున్న అమ్మే తనకు ముఖ్యం తప్ప ఈ గెలుపు కాదు...    
    అంతే.    
    ఆ తర్వాత కృషి అడిగిన ఏ ప్రశ్నకీ అతడు జవాబు చెప్పలేదు. వున్నట్టుండి అతడిలో కనిపించిన యీ మార్పుకి ఎవరెంత నిశ్చేష్టులైనా గాని అతడి ఓటమిని అమితంగా ఆనందించింది కృషి.    
    కృషి గెలిచినట్టుగా నిర్ధారించబడింది.    
    ఆమె చూపుల్లోని స్వాతిశయం విస్సుని మరింత ఉద్రేకపరుస్తుంటే నిభాయించుకుని ఓడినవాడిలా ఆడిటోరియం బయటికి నడిచాడు.    
    అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని పత్రికా విలేకర్లు అతడ్ని చేరుకోబోతుండగానే అదృశ్యమైన విస్సు మరో అరగంటలో కుతుబ్ షాహీ సమాధుల్ని చేరుకున్నాడు.    
    నిర్జనంగా వుంది. రాత్రి ఎనిమిది గంటల సమయం...    
    ఓ మూల స్తబ్దంగా నిలబడివున్న తల్లిని కలుసుకునేదాకా స్థిమితంగా వుండలేకపోయాడు. రాచరిక వ్యవస్థలోని రాజసం బ్రతుకులకే కాదు చావులకూ సమాధుల రూపంలో విస్తరిస్తుందన్న సత్యానికి సంకేతంలా నిలిచినా ఆ ప్రదేశంలోని ఓ సమాధి సమీపంలో కూర్చున్న విస్సు నిస్త్రాణంగా కృషి గురించి ఆలోచిస్తున్నాడు. తన పౌరుషాన్ని సమాధి చేయడానికి డబ్బున్న ఓ అమ్మాయి యిలా ప్లే చేసింది మళ్ళీ ఆమె తాతయ్యకు తన తండ్రిని హత్య చేయడానికి ఏ డబ్బు పరపతి సహకరించాయో యిప్పుడు అదే డబ్బుతో గెలుపనే గర్వం కోసం కృషి మరో సారి ఢీకొని మనసుని గాయపరిచింది.    
    అంచెలంచెలుగా ఆమె మనసుదాకా విస్తరించాలని అప్పటికి తోచిన ఓ మార్గంతో ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒకవేళ పరిచయం విడదీయలేనంత స్నేహం దాకా వెళితే దాన్ని తన శతృత్వానికి బారులా వాడుకునేవాడే కాని ఊహించలేని చాలా మలుపులు తిరిగిన స్నేహం యిప్పుడు ముఖాముఖీ పోరాటం వేపు మళ్ళింది.    
    "అమ్మని ఆశ్రమానికి తీసుకువెళ్ళు"   
    సూరికి తల్లిని అప్పచెప్పిన విస్సు ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి కృషికి ఫోన్ చేశాడు.    
    "కంగ్రాట్స్ కృషి"    
    "థాంక్స్" కృషి నవ్వు వినిపించింది.    
    "పాపం నీకు పెట్టుబడి పెట్టిన చౌదరి మరో అయిదు లక్షలు నష్టపోయాడేమో కదూ. అయినా వున్నట్టుండి అలా బ్లేంక్ అయిపోయి ఒక్క ప్రశ్నకీ జవాబు చెప్పలేకపోయావేం-"
    "చేయాల్సింది చేసి యింకా సానుభూతి ప్రకటిస్తున్నావా కృషి"    
    "నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్ధం కావడం లేదు"    
    ఇదీ నటనే అనుకున్న విస్సు గొంతులో కోపాన్ని అదిమిపెడుతూ అడిగాడు. "ఒకవేళ నువ్వోడితే ఈ పాటికి శోభనానికి సిద్దపడేదానివేమో కదూ"    
    నిశ్శబ్దంగా వుండిపోయింది.    
    "ఇష్టం లేనివాడితో ఓ రాత్రి గడపాలి అంటే నీ లాంటి ఆడపిల్ల ఎలా రియాక్టవుతుంది కృషి    
    "తనమీద తనకే జుగుప్స తో జీవితమంతా కుమిలిపోతుంది"    
    "ఇప్పుడు నీ మీద నీకు అలాంటి జుగుప్స కలిగించబోతున్నాను"    
    "కలగంటున్నావా"
    "లేదు కృషీ! నేను అనుకున్నది నిజం చేయబోతున్నాను....శారీరకంగా నాతో కలిసే పరిస్థితే వస్తే ఓ జీవితకాలం నువ్వెంత బాధకు గురవుతావో అనుభవించకుండానే నిన్నలాంటి స్థితికి నెడితే..."    
    "ఎలా" వ్యంగ్యంగా అడిగింది.    
    "వెయిట్ అండ్ సీ"    
    ఫోన్ క్రెడిల్ చేశాడు విస్సు. తనకి సాయం చేసిన రామనాథ చౌదరిని గుర్తుచేసుకుంటూ.....                                                                       *    *    * 

 Previous Page Next Page