Previous Page Next Page 
సృష్టి పేజి 22


    అంతెత్తున పెరిగిన పోకచెట్ల మధ్య నుంచి ఆ బిల్డింగ్  రుద్రాక్ష రంగులో వింతగా మెరుస్తోంది.

 

    రెండు రోజుల పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ అక్కడెందుకు ఏర్పాటు  చేశారో హరిహరన్ కి, మరికొంతమందికి తప్ప మరెవ్వరికీ తెలీదు.

 

    విశాలమైన కారిడార్ స్తంభాలపైన  మెయిన్  హాల్లో పైభాగంలో ఇనుప చువ్వల మధ్య వీడియో  కెమెరాలు అమర్చిన విషయం హరిహరన్ కి మాత్రమే  తెలుసు.

 

    అక్కడక్కడ ఆడ, మగ మఫ్టీ పోలీసులే వాలంటీర్స్.

 

    దేశంలో ఎక్కడ ఆర్ట్  ఎగ్జిబిషన్  జరిగినా తప్పకుండా స్మగ్లర్  పుష్పరాజ్ వస్తాడన్న విషయం తెల్సిన హరిహరన్ ముందు జాగ్రత్త  చర్యగా ప్రతి  విజిటర్  కదలిక మీద ప్రత్యేకమైన  నిఘా ఏర్పాటు చేశాడు.

 

    ఆ ఆర్ట్  ఎగ్జిబిషన్ గురించి దేశంలోని ప్రముఖ ఇంగ్లీష్ డైలీస్ లో ఎడ్వర్టయిజ్ మెంట్స్ కూడా వచ్చాయి.

 

    ఎక్కడెక్కడినుంచో వస్తున్నా ఆర్ట్  లవర్స్ తో ఆడిటోరియం నెమ్మదిగా నిండిపోతోంది.

 

    లాంఛనంగా ఎగ్జిబిషన్ కి ప్రారంభోత్సవం చేశాడు అభినవ్.

 

    ఆ తర్వాత అతఃన్ని మీటింగ్ హాల్లోకి తీసికెళ్ళాడు హరిహరన్.

 

    హరిహరన్ కుర్తా పైజామాలో చీఫ్ ఆర్గనైజర్ లా మాత్రమే  వున్నాడు.

 

    మీటింగ్ హాల్లో దాదాపు రెండు  వందలమంది కళా ప్రేక్షకులు కూర్చునున్నారు.

 

    మీటింగుకి అంతమంది ప్రేక్షకులు వస్తారని వూహించని  అభినవ్ మొదట ఆశ్చర్యపోయి, తర్వాత ఆనందించాడు.

 

    అందరూ నలభై ఏళ్ళు పైబడినవాళ్ళే. అందులో పదిహేనుమంది స్త్రీలు వుండడం కూడా విశేషం.

 

    సాంప్రదాయం ప్రకారం సభాధ్యక్షులవారు ముఖ్య వక్తను పరిచయము చేసి "కృత్రిమమైన ఈ రాజకీయ వాతావరణం  నుంచి, మెటీరియలిస్టిక్  ప్రపంచం నుంచి జగతిని రక్షించేది ఆర్ట్. అందుకే ప్రత్యేకంగా ఆర్ట్ ని  రక్షించడం  కోసం, ప్రత్యేకమైన వనరులు ఏర్పాటు చేయడం కోసం  కేంద్ర  ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను" అని తమిళంలో ఉపన్యాసం ఇచ్చి  కూర్చున్నాక-

 

    ముఖ్యవక్త అభినవ్ మాట్లాడటం ప్రారంభించాడు-

 

    "Colour is a sign of joy and vitality, of health and vitue. it is the garment of beauty, the sign of youth, The symbol of spring time and the impetus, to  all fresh enthusiasm and vegining. it is of the nature of fore and of flowers, of the fire of thought and the flower of thought. And it is all this because it is an emanation of light....

 

    రంగు అనేది  ఆనందానికి, ప్రాణశక్తికి, ఆరోగ్యానికి, సుగుణానికి గుర్తు. సౌందర్యానికి అది వస్త్రం  లాంటిది. యౌవ్వనానికి అది చిహ్నం. వసంతానికి అది ప్రతీక. కొత్త ఉత్సాహానికి, శుభ ప్రారంభానికి రంగు ఒక ఉత్తేజకారి. అది అగ్ని స్వభావాన్ని, పూల  సహజత్వాన్ని కలిగి వుంటుంది. ఆలోచనకి చెందిన నిప్పు. ఆలోచనకు చెందిన పూలు- ఇదంతా ఎందుకంటే రంగు అనేది కాంతి నుంచి వెలువడేది కనుక."

 

    లేత గులాబీ రంగు కుర్తా, పైజామాలో ఎర్ర్ కాలువలా మెరిసి పోతున్నాడు అభినవ్.

 

    అతని గొంతులో ధ్వనిస్తున్న సాత్వికత, మృదుత్వాలకు  మంత్ర  ముగ్తులయిపోయారు శ్రోతలు.

 

    "కనిపించే జగత్తులో గోచరించే రూపం కళ కాదు. మనిషి లేదా కళాకారుడు తన రసానుభూతిలో రంగరించి తన హస్త కౌశల్యంతో అదృశ్య రూపానికి రంగులోనో, రాతిలోనో, మరే ఇతర పదార్థంలోనో ప్రసాదించే స్వతంత్ర రూపం మాత్రమే కళ.

 

    రూపానికి, రంగుకు అవినాభావ సంబంధం వుంది. రూపం లేని రంగు కానీ, రంగు లేని రూపం కానీ దృశ్యం జగత్తులో కనిపించదు. ప్రతి రూపానికీ ఒక నిర్ధిష్టమైన రంగు వుంటుంది.

 

    దృశ్య జగత్తులో మూడు ప్రాథమిక రూపాలు, మూడు ప్రాథమిక వర్ణాలు కనిపిస్తాయి. ఈ ప్రాథమిక రూపాలకు పాల్ సజాన్ అనే ఫ్రాన్స్  చిత్రకారుడు ఘనాకృతి, స్తంభాకృతి, గోళాకృతి అనే పేర్లు పెట్టాడు. మోడ్రన్ ఆర్ట్ కి ఒక రకంగా సజాన్ జన్మదాత.

 

    కొన్ని చిత్రాల్లో రూప ప్రాధాన్యత కనిపిస్తే మరికొన్ని చిత్రాల్లో రంగు ప్రాధాన్యత కన్పిస్తుంది. రాజపుత్ర  చిత్రాల్లో రంగు ప్రధానం కాగా  సజాన్ చిత్రాల్లో రూపం ప్రధానంగా కన్పిస్తుంది. గాగిన్ చిత్రాల్లో రంగు  విశిష్టత, నందలాల్ బోసు చిత్రాల్లో రూప విశిష్టత, అవనీంద్ర ఠాకూర్ చిత్రాల్లో రంగు, దేవీ ప్రసాదరాయ చౌదరి చిత్రాల్లో అటు రూప మాధుర్యము, ఇటు  వర్ణసౌరభం రెండూ సమానంగా వుంటాయి. లియోనార్డో డావిన్సీ రెండింటికీసమాన ప్రాధాన్యతనిచ్చి చిత్రకల్పన చేశారు."

 

    ఆధునిక చిత్రకళకు సంబంధించిన వర్ణ వ్యవస్థ విశ్లేషణ అందరకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాడు అభినవ్.

 

    హరిహరన్ తన పనిలో తానున్నాడు మెయిన్ ఎంట్రన్స్  దగ్గర  గోడపక్కన నుంచున్నాడాయన.

 

    బయట పోర్టికోలో దాదాపు వంద కార్లు పార్క్ చేసున్నాయి.

 

    ఎక్కడనుంచి వచ్చారో తెలీదు. కళాభిమానులతో హాలు నిండిపోవడమే కాదు బయట కారిడార్స్ దగ్గర, కిటికీల దగ్గర జనం...... ఖరీదయిన జనం......

 

    సరిగ్గా-

 

    అదే సమయంలో-

 

    మెయిన్ గేటు దగ్గర ఓ ఆటో ఆగింది. ఆ ఆటోలోంచి ఓ వ్యక్తి దిగాడు. అతనికి దాదాపు అరవై ఏళ్ళుంటాయి. తెల్లటి దేహఛాయ, తెల్లగా పండిపోయిన జుట్టు , బ్రౌన్ కలర్ సూటు, బూటు- విలక్షణంగా వున్నాడు ఆయన.

 

    ఆటో ఫెర్ చెల్లించి నేరుగా ముందుకి నడిచాడాయన.

 

    తన వైపే వస్తున్నా ఆ వ్యక్తి వైపు నిశితంగా చూశాడు  హరిహరన్ హరిహరన్ శార్తుకున్న బాడ్జీ వైపు చూసి తల పంకించి తన  జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి అతనికిచ్చి "పెయింటింగ్స్ సేల్స్ కూడా  వున్నాయా?" అడిగాడతను.

 

    "మీకు నచ్చిన పెయింటింగ్ గురించి ఆఫీసులో ఎంక్వయిరీ చేస్తే  అక్కడ మీకు కావల్సిన ఇన్ఫర్మేషన్ యిస్తారు" చెప్పాడు హరిహరన్ పరిసరాల్ని అప్రయత్నంగా గమనిస్తూ.

 

    "థాంక్యూ" ఆ వ్యక్తి గంభీరంగా ముందుకెళ్ళిపోయాడు.

 

 Previous Page Next Page