"ఆర్టిస్టు పికాసో కదా! ఆయన గురించి తెల్సు. పరిచయం లేదు" అమాయకంగా అన్నాడు అతను.
"నాక్కూడా పరిచయం లేదు. నీకు జవహర్ లాల్ నెహ్రూ తెలుసా అంటే వ్యక్తిగతంగా చెయ్యి చెయ్యి కలుపుకుని తిరిగారా అని అర్థం కాదు. నీకు తెలుసో తెలీదో పికాసో గురించి చిన్న ఇన్ సిడెంటు చెప్తాను విను. గొప్ప వ్యక్తులకి చిన్న విషయాలు గొప్ప ప్రాబ్లమ్స్ లా ఎలా వుంటాయో తెలుస్తుంది" ఆయన వైపు ఆశ్చర్యంగా చూశాడు అభినవ్.
ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆర్టిస్టుల గురించి మాట్లాడడం వింతగా వుంది అతనికి.
ఆయన చెప్పడం ప్రారంభించాడు.
"స్పానిష్ లో అప్పటికే నెంబరు వన్ ఆర్టిస్టుగా ఫాబ్లో పికాసో ఒకరోజు ఒక కుర్చీ, ఒక బల్ల కొనడానికి షాపుకెళ్ళాడట.
అక్కడున్న నమూనాలేవీ ఆయనకు నచ్చలేదు. ఒక చిన్న కాగితం ముక్క మీద పెన్సిల్ తో తనకు కావల్సిన నమూనాను బొమ్మగా గీసి అలాంటి తరహా కుర్చీ, బల్ల చేసి పెట్టమని దుకాణదారుడ్ని అడిగాడు.
ఆ దుకాణదారుడు రెండు రోజుల్లో పికాసో చెప్పిన పద్ధతిలో వస్తువుల్ని రెడీ చేశాడు. వాటిని చూస్తూ పికాసో వీటి ఖరీదెంత అని అడిగాడట.
వీటికి ఖరీదేమీ లేదు. ఈ సామాను మీకు మా దుకాణం బహుమతిగా యిస్తుంది. కాకపొతే మీరు రెండ్రోజుల క్రితం కాగితంమీద నాకు గీసిచ్చిన బొమ్మమీద మీ సంతకం చేసి ఇచ్చెయ్యండి చాలు అని అడిగాడట ఆ దుకాణదారుడు. పికాసో ఆ షాపువాడి కేసి సానుభూతిగా చూసి సంతకం చేసి యిచ్చాడట.
ఆ కాగితం మీద నమూనానే ఆ దుకాణదారుడు ఆ తర్వాత కాలంలో లక్షల రూపాయలకు అమ్ముకున్నాడట" చెప్పటం ముగించాడు హరిహరన్.
"బాగుంది ఈ సంఘటన నేనెప్పుడూ వినలేదు" అన్నాడు అభనవ్ ఆశ్చర్యపోతూ.
"నేనెక్కడో చదివాను, ఇందులో నీతేంటో తెలుసా? ప్రపంచంలో ఏ దేశంలోనైనా కళాకారుడెప్పుడూ అమాయకుడేనని- నీలాగన్నమాట" అని నవ్వాడాయన.
"మీలా కఠినంగా ప్రతివాడిలోనూ, అర్టిస్టులు క్రిమినల్ ని చూడలేరు గదా సార్" అభినవ్ మాటకి చురుగ్గా అతని కళ్ళల్లోకి చూశాడు హరిహరన్.
రెండు నిమిషాల తర్వాత కాఫీలయ్యాక అసలు టాపిక్ లోకి వచ్చేశాడు ఆయన.
"నువ్విక్కడకు వచ్చేశావు కాబట్టి నాకు నీ పూర్తి కోపరేషన్ ను కావాలి. అందులో మొదటిది నేనో ఆర్ట్ ఎగ్జిబిషన్ ని ఏర్పాటుచేస్తున్నాను. నువ్వు దాన్ని ప్రారంభించి ప్రధానోపన్యాసం యివ్వాలి" అసలు విషయం చెప్పాడు ఆయన.
ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేయటం ఎందుకో అర్థంకాలేదు అతనికి.
"ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేసేంత గొప్పవాణ్ని కాదు సార్ నేను. అంత వక్తనూ కాదు" వెంటనే అన్నాడతను.
"నువ్వెలాంటివాడివో నాకు తెలుసు. తప్పించుకోకు. నీకు తెల్సిన విషయాలు చెప్పు అంతే!"
"నేనా?" ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్.
"సిటీలోని శిలప్పదికారం ఆడిటోరియంలో పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఎరేంజ్ చేస్తున్నాను. వర్రీ అయిపోకు. నీ సబ్జెక్టే కదా?" హరిహరన్ చాలాసేపు వప్పించిన మీదట ఆ మీటింగ్ కి ఎటెండ్ అవడానికి వప్పుకున్నాడు అభినవ్.
"మర్నాడు ఉదయం పది గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభమౌతుంది" అన్నాడు ఆయన.
లేచి నిలబడ్డాడు అభినవ్.
"నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను" తనూ సీట్లోంచి లేచి డోరు వరకూ వస్తూ అన్నాడు హరిహరన్.
ఛాంబర్ దాటి బయటికొస్తున్న అభినవ్ భుజంమ్మీద చేయి వేశాడు ఆయన.
తల త్రిప్పి చూశాడు అభినవ్.
"సీ మిస్టర్ అభినవ్!What shall profit a man if he shall gain the whole world and lose his own soul. స్వంత ఆత్మను పోగొట్టుకుని ప్రపంచాన్నంతా జయించినా కూడా మనిషికి కలిగే లాభం ఏముంది చెప్పు?"
చాలా సీరియస్ విషయాన్ని ఆ సమయంలో తనకెందుకు చెపుతున్నాడో అర్థం కాలేదు అతనికి.
"అర్థం కాలేదు కదా" నవ్వారాయన.
"ఆత్మ అంటే ప్రేమ. అనంతమైన సంతృప్తి. ఒక కళాకారుడిగా నీకు కావల్సిన సంతృప్తి నువ్వు ప్రేమించే వాళ్ళ ప్రేమలో, నిన్ను ప్రేమించే వ్యక్తుల ప్రేమలో వుంటుందనే విషయం నీకు తెలియనిదికాదు. కళాకారుడికి ప్రతిక్షణం, ప్రతి అనుభవం ఒక ఇన్స్ పిరేషన్ కదా? అందుచేత నువ్వు కావాలని కోరుకునే వాళ్ళకి నువ్వు దూరంగా వెళ్ళిపోవడం మంచిది కాదు...... ఏమంటావు?"
ఆయన మాటల వెనక భావం, స్పష్టంగా అర్థంకాలేదు అభినవ్ కి.
"అదేనయ్యా బాబూ! అలా తెల్లబోతావేం? కావ్య నిన్ను ప్రేమిస్తున్నట్టుంది. నువ్వంటే ఆమెకు ప్రేమ. ప్రేమ ఒక్కటే కాదనుకుంటాను. ఆరాధన. ఒక్కసారి మాట్లాడు. ఆమె ఆనందిస్తుంది."
కావ్య తనని ప్రేమిస్తోందా?
ఒక నమ్మలేని నిజాన్ని ఎవరో చెప్తున్నట్టుగా వుంది అభినవ్ కి.
ప్రేమంటే ఏమిటి ? అభిమానమా? నదిలో వంటరి నావలా, రోడ్డు పక్కనుంచి నడిచిపోతున్నాడతను. తనని కావ్య ప్రేమిస్తోందా?
అందుకోసమేనా తన పట్ల ప్రత్యేకమైన శ్రద్ద చూపిస్తోంది.
అదే సమయంలో అతనిలో వింత ప్రశ్న తలెత్తింది.
తననెందుకు కావ్య ప్రేమిస్తోంది? ఏమాశించి ప్రేమిస్తోంది? ఆర్టిస్టుల చేత ప్రేమించబడాలనుకునేవాళ్ళు ప్రపంచంలో వుంటారా? తన ప్రశ్నలకు తనే జవాబు చెప్పుకుని నవ్వుకున్నాడతను.
కావ్య రూపం ఒక్కసారి కళ్ళముందు మెదిలింది.
అటూ ఇటూ చూశాడతను.
రోడ్డుకు రెండోపక్కనున్న ఎస్.టి.డి బూత్ వైపు నడిచాడు. మూడు నిమిషాల తర్వాత హైద్రాబాద్ లోని సృజ యాడ్ ఏజెన్సీకి ఫోను చేశాడు.
కావ్య అవుటాప్ స్టేషన్ అనే విషయం తెల్సిన వెంటనే డీలాపడి పోయాడతను.
ఆ క్షణంలో అతని మనసులో కావ్యను చూడాలనే కోరిక కలిగింది.
పదే పదే కావ్య జ్ఞాపకం రాసాగింది.
* * *
అన్నాసలైలోని శిలప్పదికారం ఆడిటోరియం.....
బ్రిటిష్ కాలంనాటి రాక్ బిల్డింగ్ అది.