Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 20

 

    బ్రిటీష్ వారి దృష్టిలో ఇండియన్స్ కి బానిసత్వమే సూటబుల్! ఇండియన్స్ కి తమని తాము పరిపాలించుకునే ప్రజ్ఞ లేదు.


    సో!


    స్వాతంత్ర్యం వచ్చిన నలబై ఏళ్ళకే ఇవాళ మళ్ళీ మన దేశం దాన్యంలోకి వెళ్ళిపోవడానికి సిద్దపడిపోతుంది.


    మన దేశాన్ని ముక్కచెక్కలు చేసేసుకోవడానికి మనమే అతి ఉత్సాహం చూపిస్తున్నాం. అటు ఖలిస్తాన్, టెర్రరిస్టులు, ఇటు కాశ్మీర్ టెర్రరిస్టులు , నాగా ఎక్స్ ట్ర్రిమిస్టులు , బోడోలు ప్రజల కోసం అంటూనే ప్రజావ్యతిరేక పంధాలోపోయే ఉగ్రవాదులు, ప్రాంతీయ విభేదాలు, మతమౌడ్యం, కులగజ్జి, కులాల పేరుతొ ఉద్యామాలు, కరుడుగట్టిన స్వార్ధం.........


    యస్ రాజా..........


    ఇవాళ దేశం మళ్ళీ ముక్కలు చెక్కలయిపోవడానికి సర్వసన్నద్దంగా వుంది.


    అదే అగ్రదేశాలకు చాలా ఇష్టమైన పరిణామం!


    అందుకని.........


    ఆ ప్రాసెస్ ని ఇంకా త్వరితం చేసేటందుకుగాను...........


    ఇండియా అంటే అసలు పడని కొన్ని రాజ్యాలు ఒక సిండికేట్ గా ఏర్పడి, అగ్నిలో ఆజ్యం పొయ్యడానికి నిశ్చయించుకున్నాయి. ఫాలో అవుతున్నావా రాజా?" అని ఉపిరిపీల్చుకోవడానికి ఆగాడు జస్వంతరావు.


    రాజా మాత్రం , ఉపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లు నిశ్చలంగా కూర్చుని వింటున్నారు.


    మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు జస్వంతరావు.


    "రాజా! ప్రపంచ భౌగోళిక , రాజాకియ పరిస్థితులని ఒక్కసారి పరిశీలించి చూడు. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రరాజ్యాల డిక్టేటర్షిప్ లొంగకుండా, బెదిరిపోకుండా ఉండగలుగుతున్న అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. ఆసియా ఖండానికి సంబంధించినంత వరకూ తిరుగులేని శక్తిగా ఉంటున్న దేశం బహుశా ఒక్క ఇందియానేనేమో! ఎందుకంటె ఇవాళ జపాన్ కూడా అగ్రరాజ్యాలకి దాసోహం అనే పరిస్థితి వచ్చింది.


    అందుకనే ఇండియా అంటే చాలా దేశాలకి కన్నేర్రగా వుంది.


    సో........శత్రుదేశాల సిండికేట్ ఇండియాని ముక్కలు చెక్కలుగా చీల్చేయ్యదలుచుకుంది. కాశ్మీర్, పంజాబ్, తూర్పు రాష్ట్రాలు......అలాగ!


    అది సంభవమా అని అడక్కు.

 

    ఇక్కడా - ఈ ఇండియాకు సంబంధించినంతవరకు -


    ఏదైనా సంభవమే!


    జస్వంతరావు అలా చెబుతుంటే , క్రమంగా రాజా కళ్ళలో ఎర్రజీర కనబడడం మొదలెటింది.


    జస్వంతరావు ఒక నిముషం ఆగి, మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు.


    "రాజా! ఇవాళ ఇండియాలో రౌడీ రాజ్యం నడుస్తోంది. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే, రౌడీలకు ఆశ్రయం ఇవ్వడంగాని, రౌడీలని ఆశ్రయించడం గానీ చెయ్యకపోతే పబ్బం గడవటం లేదు.


    ఇది ఇలా ఉండగా -

 

    ఒక మహామేధావి ఒక మహాసత్యాన్ని కనిపెట్టాడు. వింటున్నావా?"


    తనకి తెలియకుండానే , అప్రయత్నంగా కాస్త ముందుకి వంగాడు రాజా.


    జస్వంతరావు చెప్పాడు.


    "ఈ మహామేధావి కనిపెట్టిన మహాసత్యం ఎంత గొప్పదంటే అలనాడు ఫ్రెంచివాళ్ళు కనిపెట్టారే - ఇండియాని యుద్ధంలేకుండానే గెలవడం ఇండియన్సు ద్వారానే సాధ్యం!" అని - దానికంటే లక్ష కోటి రెట్లు గోప్పదన్నమాట! దీపావళి టపాకాయలతో పోలిస్తే అటంబాంబు ఎంత గొప్పదో అంత గొప్పదన్నమాట!"


    "ఇంతకీ ఆ మహత్తరసత్యం ఏమిటంటే రాజా -


    ఇండియాలోని రౌదీలందరినీ మన చెప్పుచేతల్లో ఉంచుకుంటే చాలు! ఇండియాని ఏలేయ్యోచ్చు. దట్ సింపుల్! నిజంగానే!"


    ఇక్కడొక విషయం గమనించాలి నువ్వు."


    ఒక చిన్న నోటి లెక్క వేసి చూద్దాం.


    ఇండియా జనాభా మొత్తం ఎనభై కోట్లని అనుకుందాం -


    అందులో మహా ధనవంతులు ఎంతమంది ఉంటారు! బిర్లాలు, టాటాలు, అంబానీలు -


    అలాంటి వాళ్ళకంటే , ఇంకొంచెం తక్కువవాళ్ళు -


    వీళ్ళందరూ కలిసి దేశ జనాభాలో ఎంత శాతం వుంటారూ?


    మహా అయితే ఒక్క శాతం! మహా అయితే - వీళ్ళోక ఎనభై వేల మంది అనుకుందాం.


    అలాగే -


    తిండికి లేక మలమల మాడి చనిపోయే నికృష్ట జీవులెందరు! గుర్తుంచుకో - మాములు బీద వాళ్ళ సంగతి కాదు. నేను చెబుతోంది - కటిక దరిద్రుల సంగతి -


    వీళ్ళు ఒక శాతం !


    మహామేదావులు ఎంతమంది వుంటారు?


    ఒక శాతం!


    మహా మంచివాళ్ళు ఎంతమంది వుంటారు?


    ఒక శాతం!


    పరమ దుష్టులు ఎంతమంది వుంటారు?


    ఒక శాతం!


    రౌడీలు ఎంతమంది వుంటారు?

    
    ఒక శాతం!


    ఇలా అతికొద్ది శాతం మాత్రమే ఉండే స్పెషల్ కేటగిరిలను వదిలేస్తే మిగతా దేశ ప్రజలంతా ఎలాంటి వాళ్ళు? అటు చావలేక ఇటు బతకలేక బతుకుతున్న సాదాసాదా జనం! వీళ్ళకి ఒక ఐడెంటిటీ వుండదు. వీళ్ళు మైనం ముద్దలాంటి వాళ్ళు, ఎవడో ఒక రాజకీయవేత్త ఏదో ఒక కొత్త స్లోగన్ దొరకబుచ్చుకుని రంగంలోకి దిగితే అతనివెంట నడిచే గొర్రెల మందలు, నోరువాయి లేని జనాలు. అందుకనే వీళ్ళని సైలెంట్ మెజారిటీ అంటారు. దేశంలోని నాయకులందరూ తమ స్వార్ధం కోసం తాము చేస్తున్న పనులన్నీ వీళ్ళకోసమే వీళ్ళకోసమే చేస్తున్నట్లు ప్రకటిస్తారు. నటిస్తారు.


    వీళ్ళ ప్రమేయం లేకుండానే , వీళ్ళ పేరుతొ ఉద్యమాలు వస్తుంటాయి. ఉద్యమాలు చల్లబడ్డాక నాయకులూ బాగుపడతారు. ఈ సైలెంట్ మెజారిటీ మాత్రం బావుకునేది ఏమి వుండదు - ఎప్పుడూ కూడా -


     వీళ్ళే ఉద్యమాలని జయప్రదం చేస్తారంటారు నాయకులూ - వీళ్ళే బండులని జయప్రదం చేస్తారంటారు - వీళ్ళే రైళ్ళు పడగొట్టడానికి స్పూర్తి ఇచ్చారంటారు - వీళ్ళే వేర్పాటువాదానికి బలం ఇస్తున్నారంటరు -


    అంతా ఉత్తదే !


    పాపం వాళ్ళకు కావలసింది ఏమిటి?


    తినడానికి కాస్త తిండి, కట్టుకోవడానికి గుడ్డ , తలదాచుకోవడానికి గూడు, కాస్త భద్రత , కాస్త కాలక్షేపం , కాస్త ఆప్యాయత. కాస్త అభిమానం -


    వీటిని సాధారణ ప్రజలకు ఇంతవరకు ఏ నాయకుడు , ఏ ఉద్యమం కూడా ఇవ్వలేదు -


    ఒకవేళ ఏ దేశంలోనైనా , ఎక్కడైనా, ఎప్పుడైనా, ప్రజలకు తిండీ , బట్టా, నీడా పుష్కలంగా దొరికాయంటే , అది చీమల్లా శ్రమించే ఆ ప్రజల రెక్కల కష్టం వల్లా , వాళ్ళకి ఉన్న కొద్దో గొప్పో తెలివితేటల్లానే అయి ఉంటుంది గాని నాయకుల వల్లా ఉద్యమాల వల్లా మాత్రం కాదు.


    వాళ్ళు ఎలక్షన్లలో ఓట్లు వేసి తమ అభిప్రాయాలకి కార్యరూపం ఇస్తారు గదా అనకు -


    అది తప్పుడు అభిప్రాయం!

 

    చాలా తప్పుడు అభిప్రాయం! ఎలక్షన్లు ఒక ఫోర్సు!


    ఉదాహరణకి ఒక వందమంది జనాభా ఉన్నారనుకుందాం.


    వాళ్ళలో సగం మంది పేర్లు అసలు ఓటర్సు లిస్టులో ఉండనే ఉండవు.


    పొతే, మిగిలిన వాళ్ళు యాభైమంది!


    ఆ యభైమందిలో మళ్ళీ మధ్యతరగతి మేధావులు ఉంటారు - వాళ్ళకి పడక్కుర్చిలో పడుకుని అందరిని విమర్శించడమే తప్ప పోలింగు బూత్ కి వెళ్ళి ఓటు వేసి ఓపికా, ఉత్సాహమూ ఉండవు.


    అందుకనే -


    ఏ ఎలక్షన్ లో అయినాసరే , యాభైశాతం ఓట్లు పోల్ అవుతే అదే గొప్ప కింద లెక్క!


    ఇకపోతే పాతికమంది!


    ఈ పాతికమందిలో ముప్పాతిక మూడొంతుల మంది అభ్యర్ధి తమ కులం వాడా - తమ మతస్తుడా కాడా అన్న పాయింటు మీదే ఓటు వేస్తారు. దేశ సమస్యలు వీళ్ళకి పట్టవు.


    సరే - నిజంగా మొత్తం మీద వంద మంది ప్రజలు ఉంటే పోలింగు బూతు కొచ్చి ఓట్లు వేసేది పాతికమందే అని తేలింది!


    ఇందులో ఒక పార్టీకి పదకొండు, రెండో పార్టీకి పదీ, తక్కిన పార్టిలన్నిటికీ కలిసి మూడు ఓట్లు వచ్చాయనుకుందాం. పదకొండు ఓట్లు వచ్చిన పార్టీ - అంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన పార్టీ గెలుస్తుంది! గెలిచి ఊరుకుంటుందా , మొత్తం జనాభా వందమంది తన వెనకే ఉన్నారని ఊరు వాడా ఏకం చేస్తుంది.


    ఈ తమాషానంతా చూస్తూనే స్తబ్దంగా ఉంటారు. మెజారిటీ జనం! అందుకనే గదా అన్నారు - సైలెంట్ మెజారిటీ అని!

 Previous Page Next Page