Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 19

 

    అయేషా మొహం అవమానంతో కందిపోయింది.


    లోపలికి నడిచాడు రాజా.


    అతను కోటగుమ్మం దాటి లోపలికి వస్తూ ఉంటే, వందిమాగధులూ స్త్రోత్రాలు చెయ్యడం మొదలెట్టారు. పురోహితులు వేదపఠానం చెయ్యడం మొదలెట్టారు.


    అడుగడుగునా అతనికి ఎవరో ఒకరు వంగి సలాములు చేస్తూనే ఉన్నారు - నీరాజనాలు అర్పిస్తున్నారు!


    వాళ్ళలో ఎవరు ఎవరో, వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటారో వివరించి చెబుతున్నాడు జస్వంతరావు.


    వంటవాడు భీంసెయిన్ వినయంగా వంగి నమస్కరించాడు.

    
1    "ఇతగాడు భీంసెయిన్! నిజంగా అలనాటి ఆ భీమసేనుడిని మించిన వంటగాడే! ఇదివరకు నేపాల్ రాజుగారి దగ్గర పని చేశాడు. డబ్బాశ చూపించి అతన్ని దొంగలించుకు వచ్చేశారు విక్రమదేవరావుగారు." అన్నాడు జస్వంతరావు.


    ఒకచోట చటుక్కున ఆగిపోయాడు రాజా. "అరెరే! అదేమిటి? అతనెవరు?" అన్నాడు. అందరూ అటూ చూశారు.


    అక్కడ-


    ఒక చెట్టుకి తలకిందులుగా వెళ్ళాడుతున్నాడు ఒక మనిషి. నోట్లో గుడ్డలు కుక్కి చెట్టుకి వేళ్ళాడదీశారు అతన్ని.


    "ఓ అతనా!" అన్నాడు జస్వంతరావు తేలిగ్గా నవ్వుతూ. "అతని పేరు తాన్ సెయిన్! అది అతని అసలు పేరు గాదు. పెట్టుకున్న పెరనుకోండి! అతని అసలు పేరు సుబ్బిరాజ్! ఆస్థానగాయకుడు!


    "అతన్ని అలా తలకిందులుగా వేళ్ళాడదీశారేం?"


    "అతని పాట పరమ కర్ణకఠోరంగా వుంటుంది. మీకు స్వాగత గీతం పాడాలనే ఉహతో వున్నాడు తాన్ సెయిన్. అందుకనే అందరూ కలిసి అలా కట్టేశారే."


    "అరె పాపం!"


    "ఫర్లేదు! అతనికిలా జరగడం ఇదే మొదటిసారి కాదులే!"

 

    "మరి అంత ఘోరంగా పాడేవాడిని ఆస్థానగాయకుడిగా ఎందుకు పెట్టుకున్నారు?"


    "అతను ఓ సెంట్రల్ మినిస్టర్ గారి రికమెండేషన్ కాండిడేట్!"


    "భలే! అయితే ఈ లెక్కన ఇక్కడ ఆస్థాన విదూషకుడు ఒకడు ఉండి ఉండాలే!"


    "ఇక్కడున్న ప్రతివాడూ ఒక విదూషకుడిలాంటి వాడే అందుకనే సెపరేట్ గా ఆ పోస్టు పెట్టలేదు" అన్నాడు జస్వంతరావు నవ్వుతూ.


    సింహాద్వారాన్ని సమీపించాడు రాజా, జస్వంతరావు, మెట్లెక్కి పాలెస్ లోకి వెళ్ళిపోయారు.


    అక్కడ సింహద్వారం మాత్రమే పెద్దదిగా ఉంది గాని, మిగతా ద్వారాలు ఇబ్బందికరమైనంత చిన్నవిగా ఉన్నాయి. అసలు కొన్ని ద్వారాలయితే , కేవలం ఒక్క మనిషి - అది కూడా పక్కకి తిరిగి వెళ్ళాల్సినంత ఇరుగ్గా వున్నాయి. తలవంచి మరీ వెళ్ళాల్సినంత తక్కువ ఎత్తులో ఉన్నాయి!


    అదే అడిగాడు రాజా!


    "అదా! అది పూర్వకాలంలో శతృవులబారినుంచి రక్షించుకోవడానికి పెట్టుకున్న పద్దతి!" అన్నాడు జస్వంతరావు.


    "అంటే!"

 

    "సింపుల్! ఒకవేళ శతృవులు రాజ భవనంలోకి ప్రవేశించగలిగినా కూడా, ద్వారాలు ఇంత ఇరుగ్గా ఉన్నాయి కాబట్టి గుంపులు గుంపులు గా జోరబడలేరు. ఒక్కొక్కరే రావలసి వస్తుంది. అరావడం కూడా, ద్వారాలు ఎత్తు తక్కువ కావడం వల్ల తల వంచి మరీ రావలసి వస్తుంది. వచ్చేరాగానే , తక్షణం లోపల కాచుకుని ఉన్నవాళ్ళు కత్తులతో వాళ్ళ తల నరికేస్తారు" అన్నాడు జస్వంతరావు.


    అర్ధమయిందన్నట్లు తల పంకించాడు డైమండ్ రాజా.


    రాజాకి పాలెస్ లోని ఒక్కొక్క విభాగం చూపించాడు జస్వంతరావు.


    పైన -


    మూడో అంతస్తులో రాజా ఆఫీసు రూం వుంది. ఈజిప్టియన్ స్టయిల్లో డెకరేట్ చేసి వుంది అది.


    ఆ పక్కనే - ఎయిర్ కండిషన్ చేసిన కంప్యుటర్ రూం వుంది. "మీ ఎస్టేట్ తాలూకు సమాచారం అంతా ఇక్కడే వుంటుంది" అన్నాడు జస్వంతరావు.


    ఆ తర్వాత - బొదురు కప్పంత తాళం వేసి వున్న ఒక గది ముందు ఆగాడు జస్వంతరావు . తాళం తెరిచాడు.


    పాతకాలపు రాతిగది అది.


    వాడకంలో లేకపోవడం వల్ల బాగా దుమ్ము కొట్టుకుని వుంది. సాలెగూళ్ళు వేళ్ళాడుతున్నాయి.


    "ఇదేం గది?" అన్నాడు రాజా.


    "ఇదే రహస్య సమాలోచనా మందిరం!"


    "ఐసీ!" అన్నాడు రాజా.


    "మీరు గోల్కొండ కోట చూశారా?" అన్నాడు జస్వంతరావు.


    "చాలా సార్లు!"


    "అందులో మంచి అక్కోస్తిక్ ప్రిన్సిపుల్స్ ఉపయోగించారు.


    "అవును"


    "ఆ సిస్టం నే ఈ గదిలో రివర్స్ చెయ్యగలిగాడు ఆకాలపు అర్కిటేక్టు."


    "అంటే?"


    "ఈ గదిలో కూర్చుని మాట్లాడే మాటలు బయటికి వినబడవు! తలుపులు తెరచి ఉన్నా సరే!"


    "ఫాంటాస్టిక్!"


    ఆగదిలో పాతకాలపు కుర్చీలు కొన్ని ఉన్నాయి.


    రెండు కుర్చీలని దులిపాడు జస్వంతరావు. "ఇక్కడ కూర్చుందాం!" అన్నాడు.


    ఇద్దరూ కూర్చున్నారు.


    ఉన్నట్లుండి జస్వంతరావు మోహంలో భావాలు మారిపోవడం గుర్తించాడు రాజా.


    నిశితంగా రాజాని చూస్తూ త్వరత్వరగా అన్నాడు జస్వంతరావు.


    "ఇంత కష్టపడి నిన్ను పాలెస్ కి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? కేవలం నీ పదివేల కోట్ల రూపాయల ఆస్తి నీకు అప్పగించేయ్యాలనే కోరికతో మాత్రమే కాదు.......ఆప్టరాల్! నేను చెయ్యబోయే విషయంతో పోలిస్తే అది చాలా చిన్న సంగతి! నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన కారణం వేరే ఉంది! వేరీ వెరి ఇంపార్టెంట్!"


    జస్వంతరావు చెప్పడం మొదలెట్టిన ఉహాతీతమైన విషయాలు వింటుంటే, రాజాకి మెదడు మొద్దు బారిపోయినట్లుంది.


    అలా షాకయిపోయి వింటున్న రాజాతో చెబుతూ అన్నాడు జస్వంతరావు.


    మిస్టర్ రాజా! ఇప్పుడు నేను చెబుతుంది ఇంటర్నేషనల్ టాప్ సీక్రెట్! కొన్ని అగ్రరాజ్యాలకి సంబంధం ఉన్న రహస్యం!"


    నిశ్చలంగా చూస్తున్నాడు డైమండ్ రాజా.


    ఒకే ఒక్క క్షణంలో జస్వంతరావు రూపురేఖలు పూర్తిగా, నూటికి నూరు శాతం మారిపోయినట్లనిపిస్తుంది రాజాకి. ఎందువల్ల?


    మరింత నిశితంగా మళ్ళీ చూశాడు.


    అతనికి అర్ధం అయింది.


    జస్వంతరావు రూపురేఖలు మారలేదు. కానీ అతని కళ్ళలో కనబడుతున్న భావం మాత్రం పూర్తిగా మారిపోయింది! ఆకాశం పట్టనంత అవకాశవాదం ఆ కళ్ళలో కనబడుతోంది!!


    గ్రీడ్!


    ఆ గ్రీడ్ వల్ల జస్వంతరావు పర్సనాలిటి టోటల్ గా మారిపోయినట్లనిపిస్తోంది తనకి!


    దురాశని, దురలోచనని దాచుకోలేక పోతున్న జస్వంతరావు కళ్ళు బల్లి కళ్ళలా అయిపోయాయి. అతను ఉద్వేగంగా చెబుతూనే ఉన్నాడు.......


    "మిస్టర్ రాజా! ఇండియాకి "రత్నగర్భ" అనే ప్రఖ్యాతి ఇప్పటిది కాదు. కానీ.........అంగట్లో అన్ని వున్నాయి గాని అల్లుడినోట్లో శని అన్న చందాన ఈ దేశాన్ని దురదృష్టం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంది. ఒకానోక్కప్పుడు సమస్త ప్రపంచానికి వెలుగు చూపించిన భారత్ వెయ్యి సంవత్సరాల నుంచి దాన్య శ్రుంఖలాలలో చిక్కుకుని బానిసత్వం అనుభవించింది. భారత్ ని బాగు చెయ్యడానికి మహానుభావులూ, హేమాహేమీలు అనదగ్గ వాళ్ళేందరెందరో ప్రయత్నించారు , కానీ, కుదరలేదు. ఎందుకని అడుగు?"


    ఎందుకన్నట్లు చూశాడు రాజా.


    "ఎందుకంటె అసలు ఈ కర్మభూమి ఉనికే వాస్తు విరుద్దంగా ఉంది రాజా! వాస్తు మీద నీకు నమ్మకం ఉందా? నీకూ నాకూ నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా జరిగేది జరగక తప్పదు. ఉదాహరణకి ఒక్క విషయం చెబుతాను. వాస్తు ప్రకారం దక్షిణం ఎత్తుగా ఉత్తరం పల్లంగా ఉండాలి. కానీ ఇండియాకి ఉత్తరాన ప్రపంచంలోకెల్లా అతి ఎత్తయిన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దురదృష్టం చూడు! ఇంక ఈ దేశం ఏం బాగుపడుతుంది? అందుకే ఇన్ని ఇక్కట్లు! రాజా! ఆ కారణం వల్లనే ఎంత తెలివిగల మనిషి అయినా కూడా ఇక్కడ బాగుపడడు. బయటి దేశాలకి వెళ్తే తప్ప షైన్ కాలేడు.


    మన వాస్తుకి తగినట్లే ఉంటుంది ఇక్కడి ప్రజల మనస్తత్వం కూడా! ప్రతివాడికి పక్కవాడికి బొక్క పెట్టడమే ముఖ్య వ్యాపకం! ఇక్కడ ఒక మతం కాదు.......ఒక కులం కాదు.....ఒక భాషకాదు........ఒక సంస్కృతీ కాదు.....నిజానికి ఇది ఒక దేశం కూడా కాదు. దీన్ని ఉపఖండం అని ఊరికే అనలేదు కూడా!


    మన దేశ చరిత్రని ఒక్కసారి తిరగేసి చూస్తే.......


    ఈ భరతఖండం ఎప్పుడూ ఒక దేశంగా లేనేలేదు. అంగ వంగ కళింగ ........అంటూ చప్పన్న దేశాలుగా ఉండింది. చిన్న చిన్న రాజులు..........కొన్నేసి ఉళ్లు మాత్రమే కలిసిన చిన్నచిన్న రాజ్యాలు........ఆ రోజుల్లో ఒక్కళ్ళంటే ఒకళ్ళకి పడకపోవడాలు ......పంతాలు......పట్టింపులు........శత్రుత్వాలు......యుద్దాలు!


    అందుకనే........


    హుణులు మొదలుకొని మొగలులదాకా అనేకమంది ఇండియా మీద దండయాత్రలు సాగించారు. ఇండియాని అతి తేలికగా లొంగదీసుకున్నారు. వందల సంవత్సరాలుగా రాజ్యాలు చేశారు.


    కానీ........


    అసలు ఇలా దండెత్తి యుద్దాలు చేయనవసరం లేకుండానే ఇండియాని అతి తేలికగా లొంగదీసుకోవచ్చనే అపూర్వమైన అపురూపమైన రహస్యాన్ని మొదటిసారిగా కనిపెట్టింది ..కాదు కాదు ........ఇంగ్లీషువాళ్ళు అనుకోకు! ఇంగ్లీషువాళ్ళు కాదు ఫ్రెంచివాళ్ళు! ఫ్రెంచి వాళ్ళు కనిపెట్టారు ఆ విశేషాన్ని!


    పెద్దగా సైన్యాలు, దండయాత్రలు, యుద్దాలు, జననష్టం, డబ్బు, ఖర్చు లేకుండా అతి సులభంగా ఇండియాని లొంగదీసుకోవాలంటే అది ఇండియన్స్ సాయంతోనే సాధ్యం అని ఫ్రెంచి వాళ్ళు గ్రహించారు. ఇండియాలో ఏ ఒక్కడికి పక్కవాడంటే పడదు......ఆ పడకపోవడానికి కులం కారణం కావచ్చు........ప్[ప్రాంతం కావచ్చు.........బాష కావచ్చు........మతం కావచ్చు.........మదం కావచ్చు......మత్సరం కావచ్చు.


    ఆ సిద్దాంతం ప్రకారం , ఫ్రెంచివాళ్ళు, హైదరాబాద్ , నైజాం దగ్గిరా అక్కడా చేరి , ఇక్కడి రాజుల కొట్లాటలో ఒకరి పక్షం వహిస్తూ తలకేసి, మెడకేసి, కాలికేసి మొత్తంమీద తమకి అంటూ కొంత అధికారం సాధించుకోగాలిగారు.


    కానీ అంతలోనే.........


    బ్రిటీషు వాళ్ళు కూడా ఇదే మహా రహస్యాన్ని కనిపెట్టి, దాన్ని మరింత పక్కాగా అమలులో పెట్టి హోల్ మొత్తం ఇండియాని దాదాపు రెండొందల ఏళ్ళ పాటు ఏకచక్రాధిపత్యంగా , ఏకధాటిగా పరిపాలించగలిగారు.


    వాళ్ళ పాలసీ చాలా సింపుల్,


    డివైడ్ అండ్ రూల్!


    విభజించి పాలించు!


    అంతే!!


    సరే......


    రెండొందల ఏళ్ళ తర్వాత ఒక యుగపురుషుడు మహాత్మాగాంధి రూపంలో పుట్టి మనకి స్వాతంత్రం సంపాదించగలిగాడు.


    మనకి స్వతంత్రం వచ్చి నిండా నలభై ఏళ్ళు కూడా గడవక ముందే మళ్ళీ మనం మన పాత పద్దతుల్లోకి వెళ్ళిపోతున్నాం! మనలో ఇవాళ ఉన్నంత కులగుల, మతోన్మాదం మధ్యయుగాల్లో కూడా ఉండి ఉండదు.


    రాజా!


    అప్పట్లో బ్రీటీషు ప్రధాని అయిన సర్ విన్ స్టన్ చర్చిల్ ఇండియా స్వాతంత్ర్య పోరాటం గురించి ఏం చెప్పాడో తెలుసా?


    "మనం భారతదేశానికి గనక స్వాతంత్ర్యం ఇచ్చేస్తే ఆ అపరాధాన్ని దేవుడు కూడా క్షమించడు! మనం ఇండియాకి ఇండిపెండెన్సు ఇచ్చేస్తే ఆ తర్వాత అధికారం పరమ లుచ్చాగాళ్ళ చేతుల్లోకి పోతుంది. ఎలాంటి రోగ్సు, స్కౌండ్రల్స్, పరిపాలన చేస్తారంటే, చివరికి ప్రజలు తాగే నీటిమీద, పీల్చే గాలిమీద పన్నులు వేసి పీడించుకు తింటారన్న మాట! అలాంటి ప్రజా వ్యతిరేకులు ప్రభుత్వం చేస్తారు" అన్నాడు చర్చిల్.

 Previous Page Next Page