Previous Page Next Page 
రీవెంజ్ పేజి 2

    కాని అప్పుడే నా అభిప్రాయం వెలిబుచ్చలేదు. ఒక నెల తరువాత నిరంజన్ కి చెప్పాను- నువ్వు కోరినట్లుగానే మన టి.వి. ని ప్రోత్సహించాలని ఉంది. ఎలా చేద్దామన్నాను. ఏదైనా పత్రికకు రికమండ్ చేస్తే సరిపోతుందన్నాడు నిరంజన్.

    నా రికమండేషన్స్ మీద ఆధారపడి టీ. వీ. రచయిత అనిపించుకోగలడేమో కాని తన రచన చూసే ఫలానా పత్రిక వేసిందన్న తృప్తిని కోల్పోతాడనిపించింది. పైగా లక్షలతో వ్యాపారం చేసే పత్రికలు, వాటిని సమర్ధవంతంగా నిర్వహిస్తూ వచ్చే గౌరవనీయులైన సంపాదకులు సూర్యదేవర బలవంతముగా మామీద ఒక కొత్త రచయితను రుద్దాడే అన్న అపప్రద నాకు రాకూడదని కూడా అనిపించింది.

     అప్పుడన్నాను నిరంజన్ తో - నేనుగా టీ.వీ. ని పాఠకలోకానికి పరిచయం చేస్తాను - పాఠకులతో పర్వాలేదని అనిపించుకోగలిగితే అప్పుడిక టీ. వీ. రచనలకు ఎవరి రికమండేషన్స్ అఖ్ఖర్లేదు అని.

    మేమిద్దరం ఓ నిర్ణయానికొచ్చాక టీ. వీ. కి చెప్పాను.

    ముందుగా భయపడ్డాడు...

    తరువాత గాబరాపడ్డాడు...

    ఆ తరువాత కంగారుపడి చిట్టచివరకు తలూపాడు. అయితే కధ కూడా అనుకొని రాసే ధైర్యం లేదు నాకు - కధ నువ్వు చెబితే దాన్ని నవలగా రాస్తానన్నాడు.

    మొత్తానికి ఓరోజు కధ చెప్పాను. కధంతా విని బ్యాగ్రవుండు వుందేమిటి అన్నాడు - అంటే అతని ఉద్దేశం - ఏదో ఒక రంగం గురించి ణా తరహాలో శోధించి పరిశోధించి రాయాలని. అదే వద్దు - ణా స్టయిల్ ని యిప్పటికే కొందరు అనుకరిస్తున్నారు - మరలా నువ్వు ఆ కోవలోకి వెళ్తే నీకంటూ గుర్తింపు రాదు. నీకుగా రాయమన్నాను.

    మొత్తానికి నెలరోజులకి ఓ యాబై పేజీలు రాసి నాకు చూపించటానికి మరో నెల తీసుకున్నాడు - నిరంజన్ దాన్ని చదివి చాలా బాగుందని అనగా అప్పుడు నాకు చూపించాడు.

    చదివి నేనూ ఆశ్చర్యపోయాను. ఒక చిత్రకారుడు, అందునా గతంలో చిన్న కధైనా రాయని టి. వి. ఇంత బాగా ఎలా రాయగాలిగాడా అని....

    ఏమైతేనేం మొత్తానికి నేను చెప్పిన కధను నాకు పూర్తి సంతృప్తి కలిగే స్థాయిలో రాయగలిగాడు.

    నవల మొత్తం చదివి నువ్వు బాగా వ్రాసావని సర్టిఫికెట్ ఇవ్వవలసింది నేను కాదు - విజ్ఞులైన పాఠకులు, గౌరవనీయులైన సంపాదకులు, కనుక నిన్ను వారి ముందుకే పంపిస్తున్నాను - అని ఈ నవలను విడుదల చేయించటం జరిగింది.


    ఇప్పుడింక ఆశీర్వదించవలసిందీ, నిర్ణయించవలసిందీ, తేల్చి చెప్పి ప్రోత్సహించవలసిందీ విజ్ఞులైన మీరే.

    టీ. వీ. కి మీ ఆశీస్సులు లభిస్తాయని ఆశించటమే నేను చేయగలిగింది.


                                                                                                                         వినమ్రతతో
                                                                                                                                మీ
                                                                                         సూర్యదేవర రామ్ మోహన్ రావు 
                                                                                                                          మద్రాసు

 

 Previous Page Next Page