Previous Page Next Page 
వసుంధర కధలు -9 పేజి 2

 

    "నిజమే. దానికే ఖర్చవుతుందంటున్నాను" అన్నాను.
    "మీకు తోచిందివ్వండి. ప్రస్తుతం బొత్తిగా సంపాదన లేకుండా ఉన్నాను" అన్నాను.
    "పదండి. మంచి హోటల్ కి పోదాం" అని జవాబు కోసం ఆగకుండా ముందడుగు వేసిందామే. నేనామె ననుసరించాను. ఇద్దరం ఒక మంచి హోటల్లో ప్రవేశించాం.
    నేనా పూట నేనెంతో కాలంగా కోరుకుంటున్న తినిబందారాలన్నీ ఆర్డర్ చేశాను. చాలా ఆబగా తిన్నానని చెప్పాలి. ఆమె నా అంత ఎక్కువగా తినలేదు. లైట్ గా ఆర్డరిచ్చి తిన్నది. సర్వర్ బిల్ ఒక ప్లేట్లో తెచ్చి టేబిల్ మీద పెట్టాడు. నేను దాన్ని ఓరకంట గమనించాను. తొమ్మిది రూపాయల ముప్పై పైసలయింది.
    ఆమె ఓ పది రూపాయల నోటు తీసి ప్లేట్లో పెట్టింది. చిల్లర కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచింది. నేను వెనుకనే బయటకు నడిచాను.
    "ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు" అంది చిలిపిగా నవ్వుతూ.
    "యేమని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మీరు నాకేమి ఇవ్వలేదు."
    'అయితే మీరు ఇంకా చొక్కా జేబులో చూసు కోలేదన్న మాట."
    అప్రయత్నంగా నా చేయి చొక్కా జేబులోకి పోయింది. అందులో కొన్ని నోట్లున్నాయి. బయటకు లాగాను. కొన్ని పదులు!
    "మీకు తెలియకుండా మీ జేబులోకి నోట్లు వస్తున్నాయి. ఇలా వ్యవహరిస్తే , నాగుపాము మిమ్మల్ని సులభంగా కాటు వేయగలదు" అన్నదామె.
    "మేడమ్ - మీ పేరు?" అన్నాను అప్రయత్నంగా.
    "నాగుపాము కాదు, చిత్ర. మీ పేరు చెప్పనవసరం లేదు లెండి. నేను తెలుసుకోగలను" అనేసి ఆమె వెళ్ళిపోయింది.
    నేనలా ఆశ్చర్యంగా ఆమె వంకనే చూస్తూ ఉండిపోయాను.
    అలా జరిగింది చిత్రతో నా పరిచయం. కానీ అంతటితో అగలేదది. మరుసటి రొజామే నన్ను ఓపార్కులో పలకరించింది. "హలో , గోపాల్!" అంటూ. ఆశ్చర్యపోయాను.
    "నాపేరు మీకెలా తెలిసింది?" అన్నాను.
    "అది వృత్తి రహస్యం. చెప్పకూడదు" అందామె.
    "ఏమిటి మీ వృత్తి?" అడిగాను కుతూహలంగా.
    "నిజంగా మీకు తెలియదూ?" అంది.
    "ఊహిస్తున్నాను, కానీ ఊహ అన్ని వేళలా నిజం కాకపోవచ్చు."
    "కానీ, ఈ ఊహ నిజమే గోపాల్!"
    "ఏమిటి నా ఊహ!"
    "చెప్పడం నా వృత్తి ధర్మ మనిపించుకొదు."
    "నన్ను మళ్ళీ ఈరోజు కలుసుకోవడం మీ వృత్తి  ధర్మమా?' అన్నాను.
    "కాదు అది నా వ్యక్తిగత విషయం" అంది చిత్ర.
    'అంటే?"
    "మరికొన్నాళ్ళు పోయాక అర్ధం కావచ్చు."
    మరికొన్నాళ్ళు పోయాక నా కర్ధమయిందేమిటంటే " చిత్ర నన్ను ప్రేమిస్తోంది. ఆ ప్రేమతోనే నాకు డబ్బిస్తోందని. అయితే ఆమెకు డబ్బెక్కడ్నించి వస్తోంది. అసలామే ఎవరు? అన్న ప్రశ్నలకు నాకు సమాధానం లభించలేదు.

                                   2
    ఆలోచనల్లోంచి బయటపడి టైము చూసుకున్నాను. అక్కడికి చేరుకోడానికి కింకా రెండు గంటలకు పైగా వ్యవధి ఉంది. హోటల్లోంచి ఇవతలకు వచ్చాను. రిక్షా బేరమాడదామనుకున్నాను. ఇందాకా సుందర్రావు పేట కైదు రూపాయలఅడిగిన రిక్షా వాడికింకా అక్కడే ఉన్నాడు. వెధవకి బేరం దొరికినట్లు లేదు. నన్ను చూస్తూనే వెకిలి నవ్వు నవ్వాడు. ఆ  నవ్వులో హేళన ఉందనిపించింది. ఇంకెన్నాళ్ళులే -- కొన్ని గంటలు. అసలీ రిక్షా వాళ్ళకేసి చూడడాని కైనా టైముండదు. నా స్థితి, పరిస్థితి పూర్తిగా మారిపోతాయి.
    జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని నేనూహించ లేదు.
    సరిగ్గా రెండ్రోజుల క్రితం చిత్ర చెప్పింది ఈరోజు గురించే.
    "గోపాల్! నీకు లక్షాధికారి అవాలనుందా?" అనడిగిందామె.
    "ఎందుకుండదు?" నాకేం కర్మ ప్రతివాడికి ఉంటుంది!" అన్నాను.
    "అందరికీ ఉండడం వేరు. నీకుండడం వేరు. నీకు కావాలనుకుంటే, ఎల్లుండే లక్షాధికారివి కావచ్చు."
    "ఎలా?' అడిగాను ఆత్రంగా.
    "ఎల్లుండి మధ్యాహ్నం ఒంటిగంటకు సుందర్రావు పేటలో నూటపదమూడో నంబరు ఇంటికి రా. ఒంటిగంట అంటే సరిగ్గా ఒంటిగంటకు రావాలి. రేడియో టైము ఫాలో ఆవు. మరీ ముందుగా సుందర్రావు పేటకు వెళ్ళి పోకు. ఒక్క అయిదు నిముషాలు ముందుగా రావాలి. ఆ ఇంటి ముందు అగు. సరిగ్గా ఒంటిగంట కు ఆ ఇంటి తలుపులు తెరచుకుంటాయి. అవి ఆటోమేటిక్ తలుపులు. ఒక్క నిముషం పాటు తెరచుకుని ఉంటాయి. తర్వాత అవి మూసుకుపోతాయి. ఇంక మరి తెరుచుకోవు. ఆ ఒక్క నిముషం వ్యవధి లోనూ నువ్వక్కడుండి ఆ ఇంట్లో ప్రవేశించు. తర్వాత లక్షాదికారి వి ఆటోమాటిక్ గా అయిపోతావు" అంది చిత్ర.
    నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతా ఏదో మాయా అనిపించింది. "నేను లక్షాధికారిని కావడంతో సరిపోదు. లక్షలతో పాటు నాకు నువ్వు కూడా కావాలి" అన్నాను.
    చిత్ర ముఖం వికసించింది. 'నాకూ నువ్వు కావాలి. అందుకే కదా నిన్ను లక్షాధికారిని చేస్తుంట' అంది.
    'అది సరే, అంత సింపుల్ గా లక్షాధికారి నెలా అవుతానోచేప్పలేవా?' అన్నాను.
    "చెప్పడం నా వృత్తి ధర్మం కాదు" అంది చిత్ర.
    అప్పట్నించి ఈరోజు కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చింది. ఇప్పుడు ఒంటిగంట ఎంత తొందరగా ఆవుతుందా అని ఎదురు చూస్తున్నాను. టయమింకా పదకొండుం పావే అయింది. నెమ్మదిగా నడవసాగాను. సుందర్రావు పేట వైపు.
    చిత్ర పేరుకు తగ్గట్టే చిత్రమైన మనిషి. ఆమెకు డబ్బుకు లోటు లేదు. కానీ స్వతంత్రురాలనిపించదు. బయట ఉత్సాహంగా కనిపించినా పరీక్షగా చూస్తె ఆమె కళ్ళలో భయం, విషాదం కనిపించక పోవు. అయితే ఆమె ఏమి చేస్తుందన్నది నేను కనుక్కోలేక పోయాను. నిజం చెప్పాలంటే తెలుసుకోవాలని నేనూ సీరియస్ గా ప్రయత్నించలేదు. ఆమె నా డబ్బు సమస్యను తీర్చింది. నన్ను లక్షాధికారిని చేస్తానంటుంది. అమెఎవరైతే నాకేం? ఎవరైతే మాత్రం -- నా కిన్ని సదుపాయాలూ చేకూర్చగలరు?
    వాచీ చూసుకున్నాను. టైము పదకొండున్నర దాటింది. ఇంకా చాలా దూరం నడవాలి. చాలాసేపు నడవాలి.
    అయితే ఆమెను చూడగానే ఉలిక్కిపడ్డాను. ఆమె చిత్ర!
    'అరె, చిత్ర!" అన్నాను ఉలిక్కిపడి.
    ఆమె ఆగింది. నా వంక అదోలా చూసి, "నాతొ నా మీరు మాట్లాడింది?' అంది.
    నన్ను మీరనడం చిత్ర మానేసి చాలా కాలమైంది. అందుకే ఆశ్చర్యంగా , "నన్ను సుందర్రావు పేట కు రమ్మన మని నువ్వే అట్నించోస్తున్నావేమిటి?" అని అడిగాను.
    "ఎవరు మీరు? మీ మాటలు నాకర్ధం కావడం లేదు. అందామె.
    "అయ్యో చిత్రా! మరో గంటలో లక్షాధికారిని కాబోతున్నాను. నేనే గుర్తులేదా?" అన్నాను కాస్త వ్యంగ్యంగా.
    "చూడు మిస్టర్! నీకు మూడు విషయాలు చెప్పదల్చుకున్నాను. మొదటిది , లక్షాదికారుల్నీ, లక్షాధికార్లు కాబోయే వాళ్ళనీ గుర్తుంచుకోవడం కొంతమందికి వృత్తిగా ఉండవచ్చు కానీ నాకు కాదు. రెండవది , నువ్వు నాతొ చనువుగా మాట్లాడడం నాకు నచ్చలేదు. మూడవది, నా పేరు చిత్ర కాదు, నా పేరు తెలుసుకోవాలని నువ్వీ నాటకమాడుతున్నావనే అనుమానంతో నా పేరు చెప్పడం లేదు. వేడుతున్నావు కదా ముందుకి. మరి నా జోలికి రాక ముందుకే వెళ్ళి నీ పని నువ్వు చూసుకో" అని కదిలింది.
    ఏం చేయాలో నాకు తోచలేదు. నోటమ్మట మాట రాక అలాగే నిల్చుండి పోయాను. ఆమె వెళ్ళిపోయింది.
    అప్రయత్నంగా వాచీ చూసుకున్నాను.  టైము సుమారు పన్నెండయ్యింది. సుందర్రావు పేట చేరుకోవడానికి మరి గంట మాత్రమే టైముంది.
    నా నడక వేగం హెచ్చింది. సరిగ్గా అయిదు నిముషాలైనా నడిచానో లేదో ఒక కాళీ రిక్షా ఎదురయింది. "సుందర్రావు పేట వస్తావా?"
    "రెండ్రుపాయలవుతుంది?"
    మాట్లాడకుండా   రిక్షా ఎక్కి కూర్చున్నాను. రిక్షా సుందర్రావు పేట వైపుగా బయల్దేరింది.
    నా బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఒంటి గంటకు సుందర్రావు పేటలో నూట పదమూడో నంబరు యింట్లో ఏం జరగబోతోంది? నేను నిజంగా లక్షాధికారిని అవుతానా? ఇందాకా  కనిపించిన అమ్మాయి నిజంగా చిత్ర కాదా?
    ఎమిటాలోచిస్తున్నానో సరిగ్గా తెలియదు. బుర్ర గజిబిజిగా అయింది. కంగారుగా వుంది. భయంగా ఉంది. సంతోషంగా ఉంది. రకరకాల అనుభూతులతో ఒళ్ళు కాస్త వేడెక్కింది.
    "ఎక్కడ దిగాలంటారు?" అన్నాడు రిక్షా అతను.
    వచ్చేసింది సుందర్రావు పేట. రిక్షా దిగుతూ టైము చూసుకున్నాడు. పన్నెండు ఇరవై అయింది. జేబులోంచి రెండు విడి రూపాయల నోట్లు తీసి రిక్షా అతనికిచ్చాను.
    ఇప్పుడు నూట పదమూడో నెంబరు యిల్లు పట్టుకోవాలి. దగ్గర్లో వున్న యింటి నెంబరు చూశాడు. నాలుగొందల ముప్పై ఏడుంది. అంటే ఈ నూట పదమూడెంత దూరంలో ఉందొ?
    ఎవరికీ అనుమానం రాకుండా ఉండడం కోసం ఒక కిళ్ళీ కొట్లో వాకబు చేశాను. నూట పదమూడో నంబరు కేలా వెళ్ళాలని . నూట పదమూడు కూడా ఆ దగ్గరలోనే ఉండకపోదు.
    కిళ్ళీ కొట్టతని సమాచారం నాకు చాలలేదు. మరిద్దరు మనుషుల్ని వాకబు చేయాల్సోచ్చింది. పేటలో ఇంటి నంబర్లో పద్దతిలో లేవు. నూట పదహారో నంబరు ఇల్లు పట్టుకోడానికి పదిహేను నిముషాలు పట్టింది. కానీ అది నేను రిక్షా దిగిన చోటు కెంతో దూరంలో లేదు.

 Previous Page Next Page