Previous Page Next Page 
మోహిత పేజి 2


  

   పాతికేళ్ళ వయసులో ఏ మగాడయినా ఇలాగే ఆలోచిస్తాడా?

 

    నిజంగా తనకు ఒక పల్లెటూరి అమ్మాయి ఇష్టం. ఆత్మసంస్కారం గల అమ్మాయి కావాలి. ఆమె నవ్వు బావుండాలి. ఆమె పెదవులు బావుండాలి. ఎడమబుగ్గమీద వంపు,  నడుం దగ్గర మడత, విశాలమైన కటిభాగం వుండాలి. ముఖ్యంగా మనుషుల్ని ప్రేమించగలిగే మంచిమనసు వుండాలి.

 

    తన మనసులోని భావాలు గుర్తుకురాగానే, పల్లెటూర్లో వుంటున్న మేనమామ కూతురు ఇందుమతి గుర్తుకొచ్చింది.

 

    'చాలా రోజులైంది ఇందుమతిని చూసి, ఒకసారి కంచికచర్ల వెళ్ళాలి' అనుకున్నాడు మైత్రేయ.

 

    రాత్రి పదిగంటలు దాటింది.

 

    ఆలోచనలవల్ల ఏ,సి. చల్లదనం వెచ్చగా వుంది.

 

    బెడ్ మీద పడుకుని, బెడ్ షీట్ కప్పుకుని, మ్యాగజైన్ విప్పాడు...... సెంటర్ స్ప్రెడ్ లో అన్నీ  యువతుల ఫోటోలే. కొన్ని ఫుల్ సైజు ఫోటోలు..... కొన్ని పాస్ పోర్ట్ సైజు  ఫోటోలు.

 

    అందమయిన అమ్మాయిల ఫోటోలవేపు చూస్తూ. బయోడేటాల్ని చదువుతున్నాడు మైత్రేయ.

 

    కుడిపక్క పేజీలో, పైభాగంలో వున్న ఫోటోదగ్గర అతని చూపులు ఆగిపోయాయి. ఆ ఫోటో అమ్మాయిది..... ఆ ముఖం నిండుగా, ఆహ్లాదకరంగా వుంది. చక్కటి కళ్ళు, చిన్న పెదవులు, సూదిముక్కు, నునుపైన బుగ్గలు, ముక్కుకు ఎర్రటి ముక్కుపుటక.

 

    ఫోటో కిందవున్న పేరు చూశాడు.

 

    మోహిత.....

 

    ఆ పేరు మైత్రేయని బాగా ఆకర్షించింది. అరుదైన, అందమయిన పేరు, వయసు ఇరవై నాలుగు. భర్త కాంట్రాక్టర్. పిల్లలు లేరు. వెంటనే అడ్రస్ వేపు చూశాడు అతను. అడ్రస్ లేదు. ఫోన్ నెంబరూ లేదు. కాంటాక్ట్ చేయాలంటే ఎలా....? అతని చూపులు కిందనున్న అక్షరాలవేపు పరుగెత్తాయి.

 

    వారం రోజులపాటు నాతో ఊటీలో వుండాలి. నా ఇష్టాల్ని పంచుకోవాలి. తన మాటలతోను, చేతలతోను ముప్ఫైఏళ్ళలోపు యువకుల్తో స్నేహం నాకిష్టం. పెళ్ళయిన మగాళ్ళు అక్కరలేదు. నన్ను సంప్రదించాలంటే వాళ్ళు మే నెల  నాల్గవ తేది ఆదివారంనాడు మైసూర్ లో సాయంత్రం ఆరు, ఏడు గంటలమధ్య కామత్ రెస్టారెంట్లో కల్సుకోండి......

 

    స్పెషల్ నోట్: మిమ్మల్ని నేను గుర్తుపట్టడానికి వీలుగా ఈ 'బొంబైట్' మ్యాగజైన్ ని మీచేతిలో నాకు కన్పించేటట్టుగా పట్టుకోండి.

 

    వివరాల్ని రెండు మూడుసార్లు చదివి, ఫోటోవేపు చూస్తూ అలా వుండిపోయాడు మైత్రేయ.

 

    ఫోటోలో కానీ, ప్రకటనలోని వివరాల్లోగానీ ఎక్కడా అసభ్యత లేకపోవడం అతనికి నచ్చింది.

 

    కొంతమంది ఆడపిల్లలకు ఇలాంటి మ్యాగజైన్స్ లో ప్రకటనలిచ్చి, మగవాళ్ళని "బ్లఫ్' చేయటం సరదా! నిజంగా మోహిత వస్తుందా......? తను వెళ్ళి ఫుల్ అయిపోతాడా.....? తనలాగే ఆమెను కల్సుకోడానికి చాలామంది కుర్రాళ్ళు వస్తే.....? ఇంతకీ తను ఆమెకు నచ్చుతాడా.....? తనతో మోహిత స్నేహం చేస్తుందా.....? ఆమెతో స్నేహం ద్వారా తనేం ఆశిస్తున్నాడు.....? ఒంటరితనానికి సమాధానమా? హార్మోన్ల  ఆకలి తీర్చుకోవటమా?

 

    మైత్రేయ మనసులో రకరకాల ఆలోచనలు.....

 

    వారంరోజులపాటు ముదుమలైలో వుండాలి..... అంతేగదా? సరదాగా ఓ గర్ల్ ఫ్రెండ్ తో కాలక్షేపం, వన్ రేర్ ఎక్స్ పీరియన్స్, మేబీ థ్రిల్లింగ్ ఎక్జయిటింగ్... ఆదివారంనాడు తను మోహితను కల్సుకుంటాడు. అని మనసులోనే నిశ్చయించుకుని 'బొంబైట్' మ్యాగజైన్ ను గుండెలమీద పెట్టుకుని, కళ్ళు మూసుకున్నాడు మైత్రేయ.

 

    ఏ.సీ. చల్లదనం ఎక్కువైంది. ఆ చల్లదనపు మత్తు హాయిగా వుంది మైత్రేయకి.

 

    మగతగా నిద్ర ముంచుకొస్తుంది.

 

    ఆ నిద్రలో...

 

    ఏదో దేవాలయ ప్రాంగణంలోని స్తంభంమీద శిల్పంలాంటి అమ్మాయి నగ్నంగా.... ఆ అమ్మాయి మోహితలాగే  వుంది. తన పోడుగాటి చేతుల్లో గట్టిగా కౌగిలిలో బంధిస్తోంది. ఆ ఇరుకు సొగసుల మధ్య ఇరుక్కుపోవడం ఎంత బావుందో....? పారవశ్యపు నింగి, తన్మయత నేలమధ్య వేలాడుతూ ఊపిరి పీల్చుకోవడానికి తపన పడే తియ్యని బాధ.

 

    ప్రపంచంలో తపనంతా తియ్యని బాధ కోసమేకదా.....? సెక్స్ వేరు, తియ్యని బాధవేరు.

 

    ఆ విషయం మనసెరిగిన ఆడా, మగ వ్యక్తులకే తెలుస్తుంది..... అవయవల అనుభవం, సంగమం, సెక్స్...

 

    ఆత్మను ప్రేమిస్తే బాధ..... ఆత్మల ఐక్యత, శాశ్వతమయిన ఆధ్యాత్మికమైన ప్రణయానికి నిదర్శనం.

 

    రాధాకృష్ణులు - గోపికలు, కృష్ణుల ప్రణయ యమునా తరంగాల ఆధ్యాత్మిక ప్రణయానికి, శాశ్వత ఆత్మానందానికి సంకేతాలు.

 

    ముప్ఫైఏళ్ళ మాధురీదీక్షిత్ ఆత్మను ప్రేమించాడు కాబట్టే, డెబ్భై నాలుగేళ్ళ ఎమ్.ఎఫ్.హుస్సేన్ కి ఆ బాధేమో....!

 

    మనసు గాయపడటం ఎంత బావుంటుంది.....? బాణం తగిలిన పక్షి గిలగిల్లాడడం మనకు కన్పిస్తుంది. గాయపడ్డ మనసు కార్చిన  కన్నీరు  కన్పించదు. కన్నీటి శబ్దం విన్పించదు.

 

    కన్నీరు గొప్పదా.....? ప్రేమ గొప్పదా.....? రెండూ కన్పించవు. విన్పించవు.

 

    పూర్తిగా నిద్రలోకి జారిపోయాడు మైత్రేయ.

 


                                              *    *    *

 

    ఆదివారం సాయంత్రం...

 

    సరిగ్గా సమయం ఆరుగంటలైంది.

 

    లలితమహల్ ప్యాలెస్ రోడ్డులో వున్న కామత్ హొటల్ కాలేజీ యువతీయువకులతోనూ, దంపతులతోనూ సందడిగా వుంది.

 

    అస్తమిస్తున్న సూర్యుడి లేత ఎండలో ఎర్రమట్టి దిబ్బలు బంగారు వర్ణాన్ని అద్దుతున్న పుప్పొడిలా మెరుస్తున్నాయి.

 

    దూరంగా లలితమహల్ ప్యాలెస్...

 

    నిరంతరం నిట్టూర్పులతో నలిగిపోయే ప్రౌఢ వనితలా వుంది. గతకాలపు  వడయార్ రాజుల సిరిసంపదలకు, భోగలాలసలకు చిహ్నంలా ఆకాశం నుంచి అప్పుడే నేలమీదకు వాలిన పుష్పక విమానంలా వుంది.

 

    సరిగ్గా ఆరూ పదిహేను నిముషాలకు ఆటో దిగాడు మైత్రేయ. నలువైపులా కలయచూశాడు.

 

    ఇరవై అడుగుల దూరంలో వున్న కామత్ రెస్టారెంట్ వేపు నడిచాడు. రెస్టారెంట్లో డజనుమంది ఆడా, మగా, అమ్మాయిలు, అబ్బాయిలు జోక్స్ వేసుకుంటూ "సితా" కోకచిలుకల్లా నవ్వుకుంటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లాడుకుంటున్నారు.

 

    బేరర్ కి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసి, చేతివాచీ వేపు చూసుకున్నాడు మైత్రేయ. ఆరు ఇరవై నిమిషాలు.

 

    మోహిత వచ్చిందా.....? ఎక్కడినుంచైనా తనని రహస్యంగా అబ్జర్వ్  చేస్తోందా.....? చేతిలోని "బొంబైట్" మ్యాగజైన్ ని విప్పి, మోహిత ఫోటోవేపు చూస్తూ, బేరర్ తెచ్చిన కూల్ డ్రింక్ తాగుతూ సిగరెట్ వెలిగించాడు. నిజంగా మోహిత వస్తుందా.....?

 

    అసహనంగా రెండు నిముషాలు కళ్ళు మూసుకున్నాడు మైత్రేయ.

 

    ముదుమలై అడవుల్లో జలపాతం..... ఒక అమ్మాయి స్నానం చేస్తోంది. నగ్నం.... అంత నగ్నం..... ఆమె వంటిమీద  తారాడుతున్న ఎన్నెన్నో రంగుల కిరణాల జలపాతపు వెల్తురు..... గోధుమరంగు కొండలలో ఢీకొనడానికి సిద్ధంగా వున్న గుండెలు..... చక్కని శిల్పి చెక్కిన చిక్కని లావణ్యపు వయసు.

 

    తడి తడి పెదిమలతో చక్కగా ముద్దుపెట్టుకుందామె.

 

    తనను గుండెలకు హత్తుకుంటోంది...... తన నడుము దగ్గర చెయ్యివేసి, ప్రేమగా, ఆరాధనగా తనలో లీనం చేసుకుంటోంది. లేత నిట్టూర్పులలో తీపి నిశ్వాస..... గొంతులో తడారిపోతున్న దృశ్యం.

 

    .... కళ్ళు తెరిచాడు..... దృశ్యం మాయమైపోయింది.

 

    ఒక్కసారిగా గుండె భారంగా తయారైపోయింది.

 

    కూల్ డ్రింక్ పూర్తిచేసి. బయటకి వచ్చి మట్టిదిబ్బలమీద కూర్చున్నాడు.

 

    ఆరూ నలభై అయిదు నిమిషాలు.

 

    నెమ్మదిగా వెలుగు, లేత చీకట్లోకి జారిపోతున్న దృశ్యం....

 

    ఏడూ పది నిముషాలైంది.

 

    చాముండీ హీల్స్ మీంచి గాలిలో కలిసి ప్రవహిస్తున్న మత్తులాంటి మసక చీకటి.....

 

    రెస్టారెంట్ లోకి, బయటకి అసహనంగా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మైత్రేయ.

 

    ఏదో తెలియని టెన్షన్.

 

    మ్యాగజైన్ లో ప్రకటనలకు, టీనేజ్ కుర్రాడిలా తను మోసపోయాడా? గిల్లీగా వుందతనికి.

 

    ఏడూ నలభై నిముషాలు, చీకటి దట్టంగా అలుముకుంది. రకరకాల ఆలోచనల వల్ల మానసికంగా అలసిపోయాడు మైత్రేయ.

 

    తను దెబ్బ తినేశాడా....?

 

    లలితామహల్ ప్యాలెస్ నియాన్ లైట్లు పసుపువర్ణంలో సూర్యకాంతి పువ్వుల్లా మెరుస్తున్నాయి.

 

    నెమ్మదిగా చిన్న చిన్న మట్టిదెబ్బలమీద నుంచి అడుగులేసుకుంటూ సిద్ధార్థలే  అవుట్ కి వెళ్లే జంక్షన్ దగ్గరికి వచ్చాడు. అప్పటికి మైత్రేయలో ఆశ చావలేదు.

 

    మరో ఇరవై నిముషాల సేపు పేవ్ మెంట్ మీద నిలబడి ప్రతి యువతినీ  పరీక్షగా చూశాడు.

 

    ఎక్కడా మోహితా కన్పించలేదు.

 

    పది అడుగుల దూరంలో వున్న ఆటోస్టాండ్ వేపు నడిచి ఆటోలో కూర్చున్నాడు.

 

    ఆటో స్టార్టయింది.

 

    సరిగ్గా అప్పుడు విన్పించింది ఆ పిలుపు.

 

    "హలో..... హలో..... సార్....." ఆ పిలుపు విన్పించినవేపు వెంటనే తలతిప్పి చూశాడు.

 

    రెస్టారెంట్ బేరర్ పరుగు పరుగున మైత్రేయ దగ్గరకొచ్చాడు. "సర్...... మీకీ క్యాసెట్ ని ఓ మేడమ్ ఇమ్మన్నారు...." అంటూ తన చేతిలో వున్న ఆడియో క్యాసెట్ ను అతనికిచ్చాడు.

 

    "మేడమ్....? ఏ మేడమ్.... ఎక్కడ వుందావిడ....?" కంగారుగా అడిగాడు మైత్రేయ.

 

    "అయిదు నిముషాలక్రితం, బ్లూకలర్ మారుతీ కారులో వచ్చింది సార్ ఆవిడ..... అప్పుడు మీరు రోడ్డుమీద నుంచున్నారు. మిమ్మల్ని చూపించి మీకీ క్యాసెట్ ఇమ్మని చెప్పి, నా చేతిలో యాభై రూపాయలు పెట్టి, వెంటనే వెళ్లిపోయింది సార్ ఆవిడ...."

 

    "ఇంతసేపూ మోహిత కార్లో కూర్చుని తనని అబ్జర్వ్ చేసిందా? తను కార్లవేపు ఎందుకు చూడలేదు? ఆ ఆలోచన తనకెందుకు రాలేదు?

 

    ఆటో ముందుకు కదిలింది.

 

    ఇరవై నిముషాల తర్వాత మైసూర్ లక్ష్మీప్యాలెస్ దగ్గరలో వున్న హొటల్ సిద్ధార్థ ముందు ఆగింది. ఆటో ఫేర్ చెల్లించి, హోటల్లోకి నడిచాడు మైత్రేయ.

 

    ఆ సమయంలో అతను తలతిప్పి రోడ్డువేపు చూసుంటే దగ్గరనుంచి ఆటో వర్ణక ఫాలో అతి, రోడ్డుకి ఎడమవేపున ఆగిన బ్లూ కలర్ మారుతీ కారు, డ్రైవింగ్ సీట్లోంచి మైత్రేయనే గమనిస్తున్న మోహిత కన్పించిది.

 Previous Page Next Page