Read more!
Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 1

       

                                      సంధ్యా కళ్యాణం


                                 -పోల్కంపల్లిశాంతాదేవి

    ఎక్కడో తొలికోడి కూయడం, వెంకట నర్సమ్మగారింటిముందు పెళ్ళిసన్నాయి మ్రోగడం ఒకేసారి జరిగాయి!

    సన్నాయినాదానికి నర్సమ్మగారి హృదయంలో ఆనందం వెల్లువలైంది. 'ఎన్నాళ్ళకి ఈ శుభదినం వచ్చింది?
సింహానికి అసలు పిల్లపుడుతుందా, పెళ్ళవుతుందా అని ఒకటే బెంగపడ్డాను! చివరికి ఆ పిల్ల తన కళ్ళముందు పుట్టి పెరిగిన అమ్మాయే అయ్యింది! తన కోడల్ని తనకళ్ళముందే ఉంచుకొని ఎక్కడెక్కడో ప్రయత్నంచేసి ఎన్నెన్నో తిప్పలు పడింది! అస్సలిది కళ్యాణఘడియ అనుకోవాలి! ఆ ఘడియ వచ్చింది! సంధ్యకి ఇంత మంచి బుద్ధిపుట్టింది!' అనుకొంది తేలికైన మనసుతో.

    పాలకొమ్మకి వెళ్ళే వాళ్ళకు పెరుగన్నం పెట్టిపంపే ప్రయత్నంలో పడింది నర్సమ్మగారు.

    ప్రక్కమీదినుండి లేవకున్నా పెళ్ళికూతురు సంధ్య నిద్రపోవడం లేదు! సన్నాయినాదం ఆ పిల్లకు పెళ్ళిపాటలాకాక చావుపాటలా అనిపించింది! తననీ లోకంలోకి తెచ్చిన అమ్మా నాన్నా ఇద్దరూ లేరు! తమ పాత్రలు ముగిసినట్టుగా వెళ్ళిపోయారు! వాళ్ళ జీవితాలకున్న మచ్చ తన జీవితం మీద నీడలా పరుచుకొంది! ఒక్క నర్సమ్మత్తకి తప్ప ఎవరికీ పనికిరాని మనిషైపోయింది!

    "లే, సంధ్యా! నీకు పెళ్ళికూతురి అలంకరణ చేసే బాధ్యత నామీద పెట్టింది నర్సమ్మత్త. లేచి ముఖంకడుక్కుంటే తలంటిపోసి పెళ్ళికూతుర్ని చేస్తాను" అంది శ్యామల. ఆ అమ్మాయి పెళ్ళికొడుకు మేనమామ కూతురు.

    గంట తరువాత, పెళ్ళికూతురికి అలంకరణంతా చేసి, చివరగా బుగ్గన చుక్కపెట్టి, "ఒకసారి అద్దంలో చూచుకో! ఎంత కళ వచ్చేసిందో?" అంది శ్యామల.

    గోడకి తగిలించిఉన్న పెద్దసైజ్ అద్దంలో తనని చూచుకొంది సంధ్య. అసలే అందమైన విగ్రహానికి పెళ్ళి అలంకరణ రెట్టింపు అందాన్ని ఇస్తూంది! నలుగుపెట్టి కడిగిన శరీరం పచ్చగా మెరిసిపోతూంది! శరీరంలో ఇవాళ కొత్త అందాలేవో తొంగిచూస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి!

Next Page