Read more!
Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 1

                                 

   
                  

                                భార్యా గుణవతి శత్రు
                                                 ---యండమూరి వీరేంద్రనాథ్
    
                          

    ఉపోద్ఘాతం  :
    ఇటుకల మధ్య ఏ జంతువో చచ్చిపడినట్టు బట్టీలోంచి చర్మం కాలుతున్న వాసన వస్తూంది. కానీ ప్రక్కనుంచి వీస్తున్న స్వచ్చమైన పూలగాలి ఆ వాసనని దూరంగా పారద్రోలుతోంది. అక్కడి వాతావరణంలోనే ఆ ప్రశాంతత వుంది.
    అంటే అక్కడ శబ్దం అవటంలేదనికాదు. బోన్ క్రషింగ్ మిషన్ (ఎముకల్ని పొడిచేసే మిషన్) దూరంనుంచి చేస్తున్న శబ్దం బిగ్గరగా వినిపిస్తూ వుంది. అయినా అక్కడి వాతావరణం ప్రశాంతంగానే వుంది. శబ్దంతోపాటు నిశ్శబ్దం పెనవేసుకోవటం భయంకరంగా ఉంటుంది. కానీ అలాంటి భయోత్పాతానికి వ్యతిరేకంగా అక్కడి దృశ్యం మనసుకు సేద తీరుస్తోంది.
    పొడవాటి వరండా, వరండాకి ఎడమవైపు విశాలమైన ఖాళీస్థలం.    
    అలలు అలలుగా వచ్చే గాలికి ఆ స్థలంలో గులాబీలు, బంతిపూలు, ముద్దమందారాలు నెమ్మదిగా తలలూపుతున్నాయి. కుడివైపు వరుసగా గదులున్నాయి. మొదటి గదిలో వృద్దులూ, స్త్రీలూ రాట్నం వడుకుతున్నారు.    
    రెండో గది లైబ్రరీ అద్దాల బీరువాలో వేదాంతం నుంచి అన్నమాచార్య కీర్తనల వరకూ పుస్తకాలు అతి జాగ్రత్తగా పేర్చబడి వున్నాయి. బీరువాలపైన గోడలకి దేశ నాయకుల ఫోటోలు వున్నాయి.    
    దాదాపు ఇరవై ఎకరాల స్థలంలో మామూలు ప్రపంచానికి అతీతంగా కట్టబడ్డ కోట అది. దూరంగా ప్రహరీగోడ బురుజులా ఎత్తుగా వుంది. ఆ గోడకి ఆనుకొని వున్న రెల్లుగడ్డి ఒక మనిషిని కప్పేసేటంత ఎత్తుగా పెరిగి వుంది. పదీ పదిహేను అడుగుల దూరంలో తెల్లటి తెరలు కట్టివున్నా కోళ్ళపాక (ఫార్మ్) లోంచి కోక్.... కోక్.... కోక్ అన్న అరుపులు వినిపిస్తున్నాయి. లేడిపిల్ల ఒకటి ఆ గడ్డిలో స్వేచ్చగా ఛెంగుఛెంగున ఎగురుతోంది.    
    వచ్చిన అతిధికి కోటని చూపిస్తున్నాడు బ్రహ్మానందం .... అతడు మోకాళ్ళ వరకూ వేలాడే జుబ్బా వేసుకున్నాడు. పంచె కట్టాడు. చేతికి కడియం వుంది.    
    ఎవరిలోనూ కనబడని ఒక వింత అతడిలో వుంది.    
    .... నవ్వు.    
    ఏ పరిస్థితిల్లోనైనా అతడి మొహంమీద చిరునవ్వు చెరగదు. అది కష్టాన్నీ సుఖాన్నీ ఒకేలా ప్రదర్శిస్తుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా అతనికి కోపం వచ్చినట్లు ఎవరూ చూసి ఎరుగరు. అతడి చెంపలు నవ్వుతూ వుంటాయి.....నుదురు నవ్వుతూ వుంటుంది..... అతడే నవ్వు... నవ్వే అతడు. దీనికితోడు అధికంగా మాట్లాడే గుణం ఒకటి .....    
    "ప్రతి మనిషికీ పనుండాలంటాను. ఆ పనిలో తగ్గ ఫలితం ఉండాలంటాను. మరి మీరేమంటారు?" అని అవతలనుంచి సమాధానం వినకుండా, "ఏ పని చెయ్యలేని వాడంటూ ఎవడూ ఉండడు. మనిషి చెయ్యవలసిందల్లా... తను ఏం చెయ్యగలడో గుర్తించగలగటమే .... దానికి వయస్సుతో సంబంధం లేదు. వృద్దులూ, వితంతువులూ ఇక్కడ రాట్నం వడుకుతారు" అని మొదటి గదిని చూపిస్తూ అన్నాడు. పండు ముసలివాళ్ళు నిస్తేజమైన కళ్ళతో వణుకుతున్న చేతుల్తో ... దృష్టి ఎటూ మరల్చకుండా క్రమశిక్షణతో రాట్నం తిప్పుతున్నారు. ఆ దృశ్యం రాట్నం వడుకుతున్నట్టు లేదు. ఒక సైనికుల కవాతులా వుంది అది.    
    "వృద్దాప్యం అంటే ఎప్పుడూ భజన్లతో బ్రతకటమే అని చాలా మంది అభిప్రాయం. పనికి మించిన దైవం ఇంకొకటి లేదని నా అభిప్రాయం .... ఎలా వుంది నా అభిప్రాయం? అందుకని ఇక్కడ రోజుకి అరగంట మాత్రమే ప్రార్ధనలు జరుగుతాయి. అరె! ... అరెర్రె....మీరు నిరభ్యంతరంగా సిగరెట్ కాల్చుకోవచ్చు. ఆ లైటర్ ని మాటి మాటికీ వెలిగించి సంశయిస్తూ ఆర్పేయనక్కరలేదు. పవిత్రత మనసుకు సంబంధించింది ..... ఏమంటారు?" అంటూ నవ్వేడు.    
    బ్రహ్మానందంతోపాటు వున్న ఆ వ్యక్తి తబ్బిబ్భై మొహమాటంతో నవ్వుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు. విశాలమైన ఆ వరండా ఎంత పొడవుగా వుందంటే అవతలి వైపు చివర దాదాపు చీకట్లో కలిసిపోయింది.
        ఆ తరువాత గదిలో పుస్తకాలు వరుసగా రాక్స్ లో అమర్చబడి ఉన్నాయి. మధ్యలో కుర్చీలూ, బల్లలూ ఉన్నాయి. "ఇది లైబ్రరీ ఇదిగో ఇలా రండి". ఇద్దరూ వరండాలోకి వచ్చారు.    
    అంతలో అతని పెంపుడు లేడి కుంటుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. దాని కాలికి కట్టుకట్టి వుంది. ఆప్యాయంగా వంగి కట్టు సరిచేస్తూ నవ్వేడు. "లేడిలా గెంతకురా! అని చిన్నపిల్లల్ని తిడతాం. లేడి చిన్నపిల్లాడిలా గెంతి కాలు విరగ్గొట్టుకుంది" అన్నాడు. వచ్చిన వ్యక్తి సిగరెట్ ఆరిపోయింది. తిరిగి వెలిగించుకున్నాడు. వృద్ధులకి చేయగల సహాయం గురించి ప్రభుత్వం నుంచి వచ్చాడా వ్యక్తి.    
    "మాకు సాయం అవసరం లేదు సార్! సాయం ఎవరికి? పని చెయ్యలేని వాడికి. ఒకసారి సాయం తీసుకొంటే, రెండోసారి ఇంకా ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. ప్రభుత్వ గ్రాంటుల మీద బ్రతికెయ్యాలనిపిస్తుంది. అరెరె! మీరు మా ఆతిథ్యం స్వీకరించకుండా ఎలా వెళతారు? గ్రాంటు వద్దన్న మాత్రాన మిమ్మల్ని రావద్దని కాదు. మీలాంటివాళ్ళు పదిమంది మా నిలయాన్ని చూడాలి. మరో పదిమందికి చెప్పాలి. అయినా వచ్చిన అతిథిని అలా పంపించి వెయ్యటం మా ధర్మానికే విరుద్దం .... అరె! రాంప్రసాద్, అయ్యాగారికి బెల్లంపానకం పట్రా! ఒరేయ్! ఎక్కడ చచ్చావురా నువ్వు."    
    ఆ రామ్ ప్రసాద్ అనేవాడు ఎక్కడున్నాడో తెలియలేదు. వాడి గురించి పట్టించుకోకుండా బ్రహ్మానందం మాట్లాడసాగాడు. ఆ పక్కనున్న వ్యక్తి వింటున్నాడన్న మాటేగానీ అతడి కళ్ళు అటూ ఇటూ చురుగ్గా తిరుగుతున్నాయి. బ్రహ్మానంద వద్దన్నాసరే- ప్రభుత్వం చేత అతడికి సహాయం ఇప్పించాలని ఆలోచిస్తున్నట్టున్నాడు.    
    ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ తలపెట్టని కార్యక్రమం అది.    
    కొంతమంది అనాధాశ్రమాన్ని స్థాపించి వుండవచ్చు.    
    కొంతమంది వితంతు గృహాల్ని, ఓల్డ్ హెమ్స్ నీ నడిపి వుండొచ్చు.    
    మరికొంతమంది వికలాంగుల సంక్షేమార్ధం హాస్టల్ పెట్టి వుండవచ్చు.

    అలా కాకుండా- అన్ని వర్గాలవారికీ, అన్ని వయసుల వారికీ ఉపాధి కల్పించే ఆలోచన సామాన్యమైనది కాదు. అక్కడ బాలురు చదువుకుంటారు. యువకులు పరిశ్రమ చేస్తారు. వృద్దులు రాట్నం వడుకుతారు.    
    అదీ ఆ కోట!    
    దానికి అధిపతి బ్రహ్మానంద!!

    తన వ్యవహారాల మీద ప్రభుత్వం ఆధిపత్యం అతనికి ఇష్టంలేదు. సహాయం పేరిట ప్రభుత్వం తన విషయాల్లో జోక్యం చేసుకోవడం అసలిష్టంలేదు. ఒకసారి సహాయానికి ఒప్పుకుంటే జరిగేది అదే. అందుకే ప్రభుత్వం తరఫున వచ్చిన రిప్రజెంటేటివ్ కి మర్యాదగా నచ్చచెపుతున్నాడు. మాట్లాడుకుంటూ ఇద్దరూ ఆవరణలో అవతలి ప్రక్కకు వెళ్ళారు.    
    " .... ఆశ్రమానికి దూరంగా ఈ చిన్న ఫ్యాక్టరీ పెట్టించాను. ఉద్యోగం దొరక్క ఓ పదిమంది కుర్రోళ్ళు వుంటే అదిగో ఆ ప్రక్క ఓ బోన్ మిల్ కూడా పెట్టించాను."    
    "మిమ్మల్ని అర్ధం చేసుకోవటం కష్టం" మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. వచ్చిన వ్యక్తి. "అయినా ఇదంతా చూస్తూ వుంటే మిమ్మల్ని అభినందించాలనిపిస్తోంది. చాలామంది తాము నమ్మినదాన్ని ఆచరణలో పెట్టలేరు. ఒకవేపు కోళ్ళు, మరోవేపు లేళ్ళూ, ఒకవైపు రాట్నాలూ ..... మరోవైపు బోన్ మిల్లూ ఇవిగాక భజన మంది...." అతడి మాటలు ఇంకా పూర్తికాలేదు. చెవులు గింగురుమనేలా ఒక చిలుక అతడి ప్రక్కనుంచి అరుచుకుంటూ వెళ్ళి బ్రహ్మానంద భుజాలమీద వాలింది.    
    దాని అరుపు ఎంత గట్టిగా వుందంటే ఆ అరుదుకి వచ్చిన వ్యక్తి నోట్లోంచి సిగరెట్టు కిందపడిపోయింది.    
    బ్రహ్మానంద భుజంమీంచి దాన్ని చేతిలోకి తీసుకొని వేళ్ళతో దువ్వుతూ నవ్వాడు. "నా పెంపుడు చిలుక. పిట్ట కొంచెం కూత ఘనం."    
    ఇద్దరూ నడుచుకుంటూ తిరిగి ఆశ్రమంవైపు వస్తూ వుండగా, "అయితే మీకు ప్రభుత్వం తరఫునుంచి గ్రాంటు ఏమీ అక్కర్లేదంటారు" అవతలివ్యక్తి.    
    "మీ దయవల్ల అవసరం రాదనే అనుకుంటాను" వాళ్ళు వరండాలోకి ఎక్కుతూ వుండగా ఒక యువకుడు వచ్చాడు. చూట్టానికి అతడు చాలా గమ్మత్తుగా వున్నాడు. కళ్ళు జాలిగా వున్నాయి. కానీ బలిష్టంగా నుదురు విశాలంగా తెలివితేటలను ప్రతిబింబిస్తూ వుంది. కానీ మొహంలో బద్దకమూ, చేతకానితనమూ స్పష్టంగా కనబడుతున్నాయి. అతని ప్రతీ కదలికలోనూ పరస్పర విరుద్దంగా కనబడే ఈ విషయాలవల్ల అతన్ని తొందరగా అంచనా వెయ్యటం కష్టం అయితే అతడు అమితమైన తెలివితేటలుండి పైకి సాధారణంగా కనబడే వాడన్నా అయివుండాలి- లేక తన తెలివిహీనతని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిభావంతుడిలా కనబడే ప్రయత్నం చేస్తూనయినా ఉండివుండాలి. అతడి లోతెంతో మనస్తత్వమేమిటో చాలాకాలం నుంచీ అతడికి దగ్గరగా వుంటూ వున్న సన్నిహితులకే తెలియదు.    
    బ్రహ్మానంద అతడిని పరిచయం చేస్తూ - "ఆశ్రమం కార్యక్రమాలన్నీ ఇతడే చూస్తూ వుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నా కుడిభుజం లాంటివాడు. ఇదే బిజినెస్ అయితే పార్టనర్ అని వుండేవాడిని. తొందరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడు. అమ్మాయి ఇక్కడే వుందనుకోండి. ఇంతకీ మా వాడి పేరు చెప్పలేదు కదూ! ఆంజనేయులు."    
    వచ్చిన వ్యక్తిచేయి సాచాడు. ఆంజనేయులు వెంటనే ఆ చేతిని అందుకోలేదు. ఒకసారి బ్రహ్మానంద వేపు చూసి మళ్ళీ ఆ చేతివేపు చూసి అప్పుడు అందుకున్నాడు. అతడి ప్రవర్తన గమ్మత్తుగా వుంది.    
    "ఏమిటి విశేషాలు?" అడిగాడు బ్రహ్మానంద.    
    "వచ్చే గాంధీ జయంతికి ఉపన్యాసం ఇవ్వటం కోసం ఎలాగయినా వప్పించి ఉపప్రధానమంత్రిని పిలిస్తే బాగుంటుందని కోటలో చాలామంది అభిప్రాయపడుతున్నారు. క్రిందటి సంవత్సరం కంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాము. పోతే..." ఆగేడు.    
    "ఫర్లేదు చెప్పు."    
    "కోడిగ్రుడ్డు సైజు చిన్నదిగా వుందని మార్కెట్టు ధరకి దాన్ని తీసుకోవటం కుదరదనీ అంటున్నారు."    
    "అవును నాకీ విషయం సౌదామిని చెప్పింది. రోజుకి వందకన్నా ఎలాగూ ఎక్కువలేవు కాబట్టి వాటిని అమ్మటం ఎందుకు? అనాధ శరణాలయం పిల్లలకి మధ్యాహ్నం భోజనంగా ఇచ్చేద్దాం."    
    "అలాగే" అంటూ ఆంజనేయులు వెళ్ళిపోయాడు.    
    బ్రహ్మానంద అన్నాడు, "ఇతడేగానీ లేకపోతే ఇన్ని విషయాలు నేనొక్కడినీ చూసుకోగలిగి ఉండేవాడిని కాదు."    
    మెట్లమీద నుంచి వరండాలోకి వచ్చారు. నాలుగో గది తలుపుతోసి.    
    "అమ్మా సౌదామినీ!" పిలిచాడు బ్రహ్మానంద.    
    ఆ సమయానికి ఒక అమ్మాయి గూట్లో దీపాన్ని సర్దుతోంది. అతడి పిలుపుకి ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరగటంతో చేతిలోంచి చిమ్మీ దాదాపు జారిపడబోయింది. అంతే ప్రయత్నం మీద ఆమె దాన్ని ఆపుచేయగలిగింది. ఆమె చేతులు కంపించటం స్పష్టంగా తెలుస్తోంది. కళ్ళల్లో భయం ప్రతిబింబిస్తోంది. అది అకస్మాత్తుగా పిలవడంవల్ల వచ్చింది కాదు.    
    "ఈ అమ్మాయి సౌదామిని నా కూతురు."    
    "మీరు... ..... ..... ....."    
    బ్రహ్మానంద నవ్వేడు. "కూతురంటే స్వంత కూతురుకాదు. ఆస్పత్రిలో చిన్నప్పుడు వదిలేస్తేనే తీసుకొచ్చి పెంచాను. ఇక్కడే కాలేజీలో చదువుతూంది. మా ఆంజనేయులకి ఈమె అంటే చాలా యిష్టం. ఆశ్రమం తాలూకు బైట విషయాలు అతడు చూచుకుంటే, లోపలివన్నీ ఈమె చూసుకుంటుంది. పేరుకి నేను అధిపతినే కానీ, చక్కదిద్దేదంతా వాళ్ళే" ఆమెవేపు తిరిగి - "ఈయన మనని చూడటం కోసం ప్రభుత్వం తరఫున వచ్చాడమ్మా" అన్నాడు.    
    ఆమె చేతులు జోడించి నమస్కారం చేసింది.    
    "ఏం చదువుతున్నారు మీరు" అడిగాడు.    
    ఆమె ఏదో చెప్పబోయి బ్రహ్మానందవేపు చూసింది. ఆమె పెదవులు అస్పష్టంగా కదిలి మాట బయటకు వచ్చింది. కానీ అతడికి వినబడలేదు. నుదుటిమీద చెమట పట్టడం మాత్రం స్పష్టంగా కనబడుతూంది.    
    అతడికి ఆమె ఎందుకలా టెన్షన్ తో వుందో అర్ధంకాలేదు. బ్రహ్మానందవేపు చూచినా అర్ధంకాలేదు. బ్రహ్మానందవేపు చూచి, మళ్ళీ ఆమెవేపు తిరిగి- "ఏం మీకు వంట్లో బావోలేదా?" అని అడిగాడు.    
    "... బానేవుందే."    
    అతను మరేదో అడగబోతుంటే గుమ్మం దగ్గర చప్పుడైంది. ఒక కుర్రవాడు 'అంతా సిద్దంచేశా' నన్నట్టు నిలబడి ఉన్నాడు.   
    "రండి" అంటూ బ్రహ్మానంద బైటికి సాగాడు. ఆమెతో బయటి వ్యక్తి ఎక్కువసేపు మాట్లాడటం ఇష్టంలేనట్టు కనబడింది.    
    ఇద్దరూ తిరిగి వరండాలోకి వచ్చారు. సౌదామిని ఉన్న గది తరువాత గది మిగతా గదులకన్నా విశాలంగా ఉంది. కాని చూపరులకు చాలా ఆశ్చర్యం గొలిపేలా, అంత విశాలమైన గదిలోను, మధ్యలో ఒక బల్లా రెండు కుర్చీలూ మాత్రమే ఉన్నాయంతే!    
    కుర్చీ ప్రక్కన కుర్రవాడు పెట్టిన ట్రేలో రెండు అరటిపళ్ళు, బత్తాయితొనలూ, పానకం వున్నాయి.

Next Page