ప్రేమ అనే రెండక్షరాల విలువ మూఢుడికి కూడా తెలుసంటారు. భారతి పరిచయం వల్ల మనోహర్ మాత్రం ఎందుకు మారకూడదు! ఆ ఆశతోనే ఆ ఇరువురి మధ్య పరిచయం చేసింది.
భారతి జీవితంలో మనోహర్ ఆటలాడుకోకుండా చూడవల్సిన బాధ్యత తనపైన ఉన్నదన్న విషయం అవంతి మరచిపోలేదు.
ఆర్ట్స్ కాలేజీ దగ్గర వాళ్ళని దింపేసి కారు రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు మనోహర్.
కారు వెళ్లిపోయాక భారతి అడిగింది.
"ఇతను మన యూనివర్శిటీ స్టూడెంట్ జాన్సన్ హత్య కేసులో ముద్దాయి కదూ?"
"అంటారు కానీ అతనికి సంబంధం లేదనేగా? వదిలేశారు అంది అవంతి.
"ఏమో నాకు తెలీదు?" భారతి మాత్రం చాలా తీవ్రంగా అంది.
"సారీ, ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళ కారెక్కమని నన్ను ప్రెస్ చేయకు. మా మమ్మీకి తెలిస్తే నా తోలు తీసేస్తుంది."
అవంతి భారతికేసి జాలిగా చూసింది.
"అమ్మనాన్న మాట వినడం, వాళ్ళంటే భయ భక్తులు కలిగి వుండడం మంచిదే కానీ మనోహర్ మనసు నీకు తెలీదు."
భారతి సూటిగా చూసింది.
"అతనెలాంటి వాడనిగానీ, అతని మనసు ఎలాంటిదని గానీ నేను అడగలేదు."
అని ఆమె అక్కడ్నుంచి విస విస నడిచి వెళ్ళిపోతుంటే అవంతి నవ్వుకుంటూ "లా" కాలేజీవైపు నడిచింది.
భారతికి క్లాసులేదు. బోరుగా వుంది. సాధారణంగా క్లాసు లేకపోతే ఫ్రెండ్స్ తో కలిసి లాండ్ స్పేక్ గార్డెన్ లోకి వెళ్ళి చలాకీగా అల్లరిచేయటం ఆమెకి అలవాటు.
అలాంటి భారతి విర్లిప్తంగా ఎందుకున్నదో స్నేహితురాళ్ళకి అర్థం కాలేదు.
"ఇదెవరో రాజకుమారుడిని చూసి మనసు పారేసుకున్నట్లుంది అందో ఫ్రెండ్.
"ఛీ నోర్ముయ్?" భారతి కోపంగా అంది.
"ఉన్నమాటంటే ఉలుకెక్కువట. నేనన్న రాజకుమారుడొస్తే అసలు మనం దీని కంటికి కూడా ఆనం?" అంది ధనలక్ష్మి.
భారతి కోపంగా చూసింది భారతినలా చూసి నలుగురు స్నేహితురాళ్ళు నవ్వారు.
"ఇది బయటలా పోజు కొడుతోందే గాని యింట్లో పిల్లిపిల్లలా లవ్వులోనో గివ్వులోనో పడినా పాపం అమ్మాయి పని ట్రాజడీ అయిపోతుంది" అంది కిరణ్.
"శుభం పలకమంటే అదేం మాటే!" మరో స్నేహితురాలు వేదవతి మూతి విరుస్తూ అంది.
"తిన్నది అరక్కపోతే చెప్పండి. ఆ రాకుమారుడ్ని మీ దగ్గరకే పంపిస్తాను" అని లేచి విసవిస కేంటీన్ వైపు నడిచింది.
భారతి కాఫీ తాగుతోంది. కానీ ఆలోచనలు కెరటాల్లా లేచి పడుతున్నాయి.
మనోహర్ వెళ్లేముందు తనకేసి చూసిన ఆ చూపు....
ఆ చూపులో ఏదో అర్థం గోచరిస్తోంది. ఏమిటది?
మనసులో ముల్లు దిగినట్టుగా వుంది భారతికి.
ఆడదాన్ని కోరిక తెంచేసే మగాడి చూపంటే అసహ్యం భారతికి. మళ్లీ అతను కనబడితే మాట్లాడకూడదని నిశ్చయించుకొంది.
అలా అనుకొన్నాక గానీ ఆమె మనసు తేలికపడలేదు.
6
సాయంత్రం పంజాగుట్ట దగ్గర బస్సు దిగింది భారతి. అప్పటికే ఆరయిపోయింది. చీకటి తెరలు కమ్ముకొస్తున్నాయి.
సాధారణంగా భారతి కాలేజీకి పాంటు షర్టు వేసుకొని వెళుతుంది. భుజానికి బ్యాగ్ తగిలించుకొని మొహంపైకి పడుతొన్న జుట్టు చేత్తో వెనక్కి తీసుకొంటూ నడుస్తోంది.
ఆమె వెనుకగా ఏడెనిమిదిగజాల దూరంలో బోసుబాబు నడుస్తున్నాడు.
భారతి అతన్ని గమనించలేదు.
భారతి వేసుకొన్న పల్చని సిల్క్ షర్టులోంచి వెనకగా నడుస్తోన్న బోసుబాబుకి రోజ్ కలర్ బ్రాసరీ, ఆ కింద సన్నని నడుమూ, టక్ చేయడం చేత వెనుకగా లయబద్దంగా కదులుతోన్న ఆమె ఎత్తులు..... కనపడి రెండు గుటకలు మింగి కాస్త వేగాన్ని పెంచి ఆమె పక్కగా వచ్చి సన్నగా దగ్గాడు.
భారతి అతన్ని చూసి ఉలిక్కిపడింది. రోడ్డు నిర్మానుష్యంగా వుండటంతో రవంత భయమూ కలిగింది. బోసుబాబు ఏం చేస్తాడో అనికాదు ఏ వెధవ మాటలంటాడో అని కంగారుపడి నడకవేగాన్ని పెంచింది.
అయితే బోసుబాబు ఓ అడుగు ముందుకు వచ్చాడు.
"ఈ వేళ ఆలస్యం అయిందే!" అడిగాడు. నీకెందుకన్నట్టుగా చూసిందే తప్ప సమాధానం చెప్పలేదు భారతి.
బోసుబాబు సిగరెట్ వెలిగించాడు.
"నీ మొహానికి ఈ షోకు కూడానా?" అందామనుకొంది. కానీ ఎంత చెడ్డా వెధవ "మగాడైపోయాడు" అనుకొంది.
మెల్లగా అడిగాడు బోసుబాబు. "అడిగింది చిన్న ప్రశ్న. సమాధానం అంతకంటే చిన్నదే అవుతుంది. పెదవి విప్పి మాట్లాడితే రత్నాలు రాలతాయని భయమా! ఒకవేళ రాలినా నేనేం తీసుకోను ఏరి మీకే ఇచ్చేస్తాను."
ఆ మాటలకి భారతి అనుకోకుండా ఫక్కుమని నవ్వేసింది.
"ధన్యుడ్ని" అన్నాడు బోసుబాబు.
"ఏడిశావ్" అనుకొంది బయటకు ఏమీ అనలేక.
బోసుబాబు కొంచెం పక్కగా నడవడం మొదలుపెట్టాడు. అతనిలో ఇప్పుడు రవంత ధైర్యం కూడా పెరిగింది.