Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 10


    "మీ షర్టు చాలా బాగుంది. షర్టు జేబుల్లో ఏం దాచారు? పంచదార లడ్డూలా!" అడిగాడు.


    ఆ మాటలకి భారతి చెంపలు ఎర్రబడినాయి. మొహంలోకి రక్తం పొంగింది.


    క్షణంపాటు అనుకోకుండా ఆగిపోయింది భారతి. ఆమె నిలబడిపోవడం చూసి అతనూ ఆగిపోయాడు. చేయి చాచి కొడితే వాడి చెంపలు రెండు అందుబాటులోనే వున్నాయి.


    "కాదు డైనమేట్లు పేలితే చచ్చిపోతావు జాగ్రత్త" అంది.


    బోసుబాబు విస్తుపోయాడు. భారతి విసవిస ముందుకు నడుస్తోంది. తన అంచనా తప్పినందుకు కాక భారతి అన్నమాటలకి అవాక్కయిపోయి నిలబడిపోయాడు బోసుబాబు. కొన్నిక్షణాల తర్వాత తేరుకొని భారతిని ఓ పట్టుపట్టాలని అనుకున్నాడు.


    భారతి అతనికి కనుచూపు మరుగైంది.

            
                                                                        7


    రాయల్ ఛాలెంజి విస్కీని సిప్ చేస్తున్నాడు మనోహర్.


    అతనికెదురుగా కూర్చున్నది అవంతి.


    "నువ్వు భారతిని ఇక్కడికి తీసుకుని రావాలి" అన్నాడు మనోహర్.


    "పరిచయం చేయమన్నావు. చేశాను అంతే! ఇక నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఇక నేను ఇంటర్ ఫియర్ కాను" అంది అవంతి.


    "ఏం.......?"


    "అంతే! నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నిలకడలేని మనిషివి నువ్వు. భారతిని నట్టేట్లో ముంచేసేలా కనిపిస్తున్నావు" అంది.


    "ఎందుకొచ్చిందా అనుమానం?" ఎర్రబడుతోన్న కళ్ళతో అడిగాడు మనోహర్.


    "నేను మగాళ్ళని నమ్మను" అంది స్థిరమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.


    "నేను ఆడవాళ్ళని నమ్మను" విలాసంగా అన్నాడు.


    "కానీ ఆడది నమ్ముతుంది. ప్రాణం ఇస్తుంది. మగాడికే ఆడదాని పైన నమ్మకం లేక ప్రాణం తీస్తాడు. నువ్వు భారతి జీవితంతో ఆటలాడ్డం నాకిష్టంలేదు. నువ్వు భారతిని మరిచిపో" సంకోచించకుండా చెప్పేసింది అవంతి.


    "నువ్వీమాట అంటావని నాకు తెలుసు. నీ యిష్టం ఏమిటో కూడా నాకు బాగా తెలుసు!" వ్యంగ్యంగా అన్నాడు మనోహర్.


    చివ్వున తలెత్తి చూసింది అవంతి. "ఆ డొంక తిరుగుడు వాగుడెందుకు? చెప్పేదేదో సరిగా అర్థం అయ్యేలా చెప్పు"


    "నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నావు!" అన్నాడు.


    అతని మాటలు పూర్తికాలేదు. అవంతి ఫక్కుమని నవ్వింది. విరగబడి నవ్వింది. పడీ పడీ నవ్వింది. ఆ నవ్వులోనే ఆమెకి కళ్ళలో నీరు తిరిగింది. అతన్నో ఫూల్ ని చూసినట్టు చూసింది.


    "వ్వాట్ బాల్స్, నువ్వింత బిగ్ ఫూల్ వని నాకు తెలీదు. ఛీ..... అసలు నీకీ ఆలోచన ఎలా కలిగిందసలు? మనోహర్. నువ్వు ఫూల్ వే కాదు. పెద్ద ఇడియట్ వి కూడా. ఒకవేళ నిన్ను నాకు తాళి కట్టమని అడిగితే కట్టగల ధైర్యం నీకుందా? మాట్లాడవే?"        

                     
    "ఉపన్యాసం ఆపిక." అన్నాడు కోపంగా మనోహర్.


    "ఉన్న మాటంటే వినడం ఉపన్యాసమే అవుతుంది మిస్టర్. కానీ ఒక్క సంగతి గుర్తుపెట్టుకో. ఈనాడు నా చేయికిందది కావచ్చు. అంత మాత్రంచేత చులకన మాత్రం చేయకు. డబ్బు మదంవల్ల నీ దృష్టిలో ఆడది ఓ విలాస వస్తువు కావచ్చు. ఆకరికి కట్టుకొన్న పెళ్ళాం కూడా నీ లాంటి వాడికి అదో షోకేసు బొమ్మ అవుతందే కానీ ఆమె మనసులో భర్తగా మాత్రం స్థానాన్ని పొందలేవు." ఆవేశంగా అన్నది అవంతి.


    "చాలా గొప్ప పాఠాలు చెప్పావు."


    "కరెక్ట్. నువ్వేమన్నా అను నాకు బాధలేదు. నేను ఒక్కమాట చెప్పనా?"


    "ఏమిటి?"


    "నాకు పెళ్ళంటే రోత. మగాళ్ళంటే వళ్ళుమంట. నేను ఆడదాన్ని కావచ్చు, పేదదాన్ని కావచ్చు. కానీ నేను మనిషిని, నేను మనిషిగానే జీవిస్తాను. నేనెవర్ని కేర్ చేయను." అంది అవంతి.


    "ఇప్పుడు నువ్వు మనిషిలానే బతుకుతున్నావనుకొంటున్నావా?"


    మనోహర్ ప్రశ్నకి అవంతి కృంగిపోలేదు.


    "యస్ మిస్టర్....... నేను మనిషిలానే బతుకుతున్నాను. శీలవతిని కాదు కనుక నాది బతుకు కాదనుకుంటున్న నీ 'నీతి' నీకు వర్తించదా? మగాడివైనంతమాత్రంచేత విచ్చలవిడిగా తిరిగే అధికారం నీకున్నదా? అలా తిరిగే నీలాంటి జీవి మనిషవుతాడా? మనిద్దరిదీ ఒకే పుట్టుక, అది మనిషి పుట్టుక. నీవు మగ, నేను ఆడ అంతే. ఇకపోతే శీలం గురించి.


    'బ్లడీ శీలం' ఆ మాటకి నా డిక్షనరీలో అర్థంలేదు. మనిషి ఆకలేస్తే అన్నం తింటాడు. సెక్స్ కూడా ఆకలిలో ఒక భాగం మనసులోని కోరికకి ప్రేరణ సెక్స్. దానికి మరో మనిషి తోడు అవసరం. అయితే ఈ ఆకలి వేసినంత మాత్రంచేత విచ్చలవిడిగా తిరగవలసిన అవసరంలేదు."


    "నీలాంటి దాన్ని వేశ్య అంటారు. సమాజం నీలాంటి వాళ్ళని దూరంగా తరిమి కొడుతుంది. తెలుసా?" మనోహర్ తాపీగా అన్నాడు.


    "కుందేలు పిల్లకి కధలు చెప్పే నక్కలా నీతి కధలు వల్లించకు మనోహర్. కేరెక్టర్ అంటే ఏమిటో తెలీని మగమహారాజువి. నువ్వా శీలం గురించి మాట్లాడుతున్నావు! నువ్వనుకునే ఈ పిచ్చి సమాజం నాలాంటి ఆడపిల్లల్ని తరిమికొడితే ఈ దేశం నీలాంటి పిచ్చికుక్కలకి సహారా ఎడారి అవుతుంది. అయినా ఈ జీవితంనాది. నా ఇష్టం. నేనెవర్ని లక్ష్యపెట్టను."


    ఆమె మాటలు విని మనోహర్ చేతిలోని సిగరెట్ ని విసిరికొట్టాడు.

    
    మనోహర్ నుదుట చిరుచెమటలు పోసినాయి. కర్చీఫ్ తో మొహాన్ని అద్దుకున్నాడు. రాయల్ ఛాలెంజ్ తన ప్రభావాన్ని అతనిపైన చూపడం మొదలుపెట్టింది.

 Previous Page Next Page