Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 75


    
    "ఆదిత్యా!" అరిచింది ఉక్రోషంగా. "ఏది ఏమయినా కానీ నేను పోటీకి సిద్దపడింది ఒకే ఒక్క కారణంతో అందుకే బ్రతుకురేస్ లో నేనో, ప్రబంధో ఎవరో ఒక్కరే మిగలాలని తెల్సుకుని రంగంలోకి దిగాను. నేను నిజాయితీగా ప్రశ్నల్ని అడిగుండొచ్చు. ప్రబంధ ఓ వ్యూహం ప్రకారం నన్ను ఓడించి వుండొచ్చు. కాని యుద్దమన్నాక వ్యూహం తప్పదు. ఇక్కడ కౌంట్ కావాల్సింది గెలుపే తప్ప వ్యూహ రచన గురించి ఆర్గ్యుమెంటు కాదు సో..." క్షణం ఆగింది. "పోటీలో నీతో కలిసి నేను కూర్చోవడంలేదు. ఇది నా నిర్ణయం. నువ్వు ప్రబంధతో కలుస్తున్నావా లేదా నాకు అనవసరం. నేను మాత్రం పార్టిసిపేట్ చేయడం లేదు. అంతే! ఇక దీని గురించి చర్చించను. ఎస్."
    
    ఉక్రోషంగా బయటకు నడిచాడు ఆదిత్య సహజంగా సాత్వికుడైన ఆదిత్య మనసు ఈ సంఘటనతో ఎంత గాయపడిందీ అంటే తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు.
    
    ప్రణయ ఎందుకింతలా ఆలోచిస్తోంది?
    
    ఆ సాయంకాలం సూరితో తన అంతర్మథనం గురించి చెప్పేదాకా స్థిమితంగా వుండలేకపోయాడు.
    
    చీకటిలో సముద్రపు ఒడ్డున ఆదిత్యతోబాటు కూర్చున్న సూరి పాదాలను తాకుతున్న కెరటాల్ని చూస్తూ అన్నాడు. "ప్రేమన్నది ఎంత తెలివయిన అమ్మాయినయినా ఎలా సంకోచింపచేస్తుందో తెలియచెప్పే ఉదాహరణ ఇది ఆదిత్యా! బహుశా నేనూ ఇది ఎస్టిమేట చేయలేక నిన్ను మిస్ లీడ్ చేశానేమో! అసలు ప్రబంధతో నువ్వింతదూరం రావాల్సింది కాదు. కనీసం నువ్వు ప్రణయనింతగా ఇష్టపడుతున్నావని తెలిసివున్నా కొంతకాలం ఆగమని నిన్ను వారించేవాడిని కాదు!"
    
    ప్రబంధతో వెంటనే తన మనసులోని ఆలోచనల్ని వ్యక్తం చేసి ఆమెను బాధపెట్టొద్దని చెప్పిన సూరి తన తప్పిదమేమిటో తెలుసుకున్నాడు. "సో... ప్రణయనే నువ్వు పూర్తిగా కోరుకుంటున్నావు కదూ?"
    
    "కాని ప్రణయ నాకేమీకానట్టు ప్రవర్తిస్తోంది"
    
    "ఇది తాత్కాలికమే అనుకుంటాను ఆదిత్యా! ఎందుకంటే ప్రణయ నీతో కలిసి పార్టిసిపేట్ చేయనందే తప్ప, నీతో కలిసి బ్రతకటానికి అయిష్టతని వ్యక్తం చేయలేదుగా?"
    
    విస్మయంగా చూశాడు ఆదిత్య ఎందుకో ఈ ఓదార్పు కాస్త ప్రశాంతిని కలిగించింది.
    
    ప్రేమ విషయంలో సూరికి అంతగా అవగాహన లేకపోయినా చాలా కరెక్ట్ గానే వూహించాడు.
    
    "నా అంచనా తప్పు కాకపోతే ప్రణయ తన మనసులోని ఆలోచనల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసి, నీకు తానేమిటీ అన్నది మరీ విపులంగా తెలియచెప్పింది. బాల్ ని నీ కోర్టులోకి నెట్టింది. అంటే ఛాయిస్ నీకే వదిలిపెట్టింది"
    
    "ఇప్పుడు నేనేం చేయాలి?"
    
    "నువ్వు ఇద్దరిలో ఎవరికి చెందినవాడివో ఖచ్చితంగా తెలియచెప్పాలి అంటే నీకు ఇద్దరిలో ప్రణయమీదే ఆసక్తి వుందన్న వాస్తవాన్ని ప్రబంధకి అర్ధమయ్యేట్టు చేయాలి"
    
    "ప్రబంధకి సూటిగా చెప్పేస్తాను."
        
    "అదికాదు చేయాల్సింది..." క్షణం ఆగి అన్నాడు సూరి. "రేపు ప్రబంధతో కలిసి నువ్వు పోటీకి సిద్దంగాలేనట్టు ఎంట్రీలో సంతకం చేయకుండా తిరస్కరించాలి. అది చాలు ప్రబంధకి అర్ధమైపోతుంది. ఒకరకంగా ప్రణయని అది ఓదార్చుతుంది కూడా."
    
    ఈ ఆలోచన నచ్చింది ఆదిత్యకి.
    
    పుస్తక పరిజ్ఞానంలో ఆదిత్యంతగా మేధ లేకపోయినా, సరిగ్గా ప్రణయకూడా ఇలాంటి ఫలితాన్నే ఆశిస్తుందని సూరి వూహించడం అతడి ప్రపంచ జ్ఞానానికి అందమయిన ఉదాహరణే కాని, ఈ నిర్ణయం ఆ తర్వాత ఎన్ని సమస్యలకి కారణమయ్యేదీ సూరి కూడా వూహించలేకపోయాడు.
    
    "భారతీయుడయిన కె.సి. రాయ్ కి రాష్ట్ర ప్రభుత్వం నాన్ రెసిడెంట్ ఇండియన్ గా రెండు వందల ఎకరాల్ని ఎలా ధారాదత్తం చేసింది?"
    
    ప్రముఖ దినపత్రిక ఒకటి ఈ వార్తను ప్రముఖంగా ప్రకటించింది.
    
    ఆ వార్త రాజకీయ వర్గాన్ని కొద్దిగా ఉద్రేకపరిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వాసుదేవరావుని అమితంగా ఆందోళనపరిచింది.
    
    అదొక్కటే కాదు ఇంకా....
    
    "ఒక మందుల కంపెనీ స్థాపించాలని అర్జీపెట్టుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త రాయ్ ఎకరం ఒక్కింటికీ వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లించి ప్రభుత్వ భూమిని అంత చవగ్గా ఎలా సాధించగలిగాడు?"
    
    విషయాన్ని చిలవలు పలవలుగా రాయటమే గాక రాష్ట్రంలోని ఓ ప్రముఖ వ్యక్తి (అధికారంలో వున్న రాజకీయ నాయకుడు) అధికమొత్తంలో ముడుపులు స్వీకరించినట్లు భోగట్టా అంటూ విశ్లేషించి మరీ తూర్పారబెట్టడం జరిగింది.
    
    నిజానికి ఆ పత్రిక్కి విషయాన్ని చేరేసింది హోంమినిస్టర్ పద్మనాభం. రాతపూర్వకంగా పారిశ్రామికవేత్త కె.పి. రాయ్ కి ప్రభుత్వం డాక్యుమెంట్స్ అందించాక ఈ వివరాల్ని రహస్యంగా తెలియచేశాడు.
    
    ఇది కేంద్రంలోని అదిష్టానవర్గాన్ని కదిలించడమే కాక, ముఖ్యమంత్రి వాసుదేవరావుని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టింది.
    
    ఓ పక్క కెపి రాయ్ కొడుకుతో కూతురు పెళ్ళి సెటిల్ అవుతుండగా, ఈ వార్త బయటికి పొక్కడంతో ఇప్పుడేం చేయాలో తెలియని సందిగ్ధంలో కూరుకుపోయాడు ముఖ్యమంత్రి.
    
    ఒకవేళ దర్యాప్తు ప్రారంభమైతే కె.పి. రాయ్ సంబంధానికి అంగీకరించడు. నెలల తరబడి శ్రమించిసాధించింది బూడిదలో పోసినట్టయి పోయింది.
    
    అలా అని వెనకడుగు వేయడం వాసుదేవరావుకి ఆమోదం కాదు. మొత్తం బయటపడకముందే నిశ్చితార్ధం కాదు, ప్రబంధ పెళ్ళే జరిపించితీరాలి.
    
    రాజకీయాల్లో స్కాండల్స్, దర్యాప్తులు మామూలే వాటిని ఎదుర్కోగల అనుభవం, చేవ అతడికున్నాయి.
    
    అయితే సరిగ్గా ఇదే సమయంలో పద్మనాభం ఇలాంటి దుమారాన్ని లేపటానికి కారణం మరొకటి సౌదామినిద్వారా ప్రబంధ విషయం ఎప్పటికప్పుడు అతను తెలుసుకుంటూనే వున్నాడు. కాబట్టే రోహిత్ ని ఇన్వాల్వ్ చేశాడు కూడా.

 Previous Page Next Page