బొమ్మ బొరుసు వేస్తే ముందు అవకాశం ప్రణయకే దక్కింది.
ఆదిత్య టైమ్ చూసుకున్నాడు.
ఆరుగంటల పదిహేను నిముషాలు. అంటే ఆరు నలభై అయిదు నిముషాల దాకా మొదటి పోటీ కొనసాగుతుంది.
"మిస్ ప్రబంధా! మన జాతీయ పతాకాన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు?"
"పింగళి వెంకయ్య."
"రైట్! భారతదేశంలోని పధ్నాలుగు వాణిజ్య బ్యాంకులు ఇందిరా గాంధీ నాయకత్వం కింద ఒకే రోజున జాతీయం అయ్యాయి. ఆ రోజు ఏది?"
"జూలై 19, 1969."
"సోవియట్ రష్యాలోని ప్రముఖ వార్తాపత్రిక "ప్రావ్దా.....ప్రావ్దా అంటే అర్ధం?"
"నిజం."
"మనదేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు?"
"సుచేతా కృపలానీ."
"ఆంద్రరాష్ట్రం మొదటి గవర్నర్ ఎవరు?"
"సి.ఎం. త్రివేది."
"గోల్కొండ పత్రిక స్థాపించిన వ్యక్తి ఎవరు?"
"సురవరం ప్రతాపరెడ్డి."
ప్రణయ క్షణం ఆగింది. ప్రబంధ తను అనుకున్నంత బలహీనురాలు కాదు.
"ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి భారతీయ మహిళ ఎవరు?"
"కుమారి ఆరతీ గుప్తా."
"అతి ప్రాచీనమైన బెనారస్ యూనివర్శిటీ స్థాపించిందెవరు?"
"మదన్ మోహన్ మాలవ్యా."
"ఏయే దేశాల్ని కలిపి గ్రేట్ బ్రిటన్ గా మనం వ్యవహరిస్తాం?"
"ఇంగ్లండ్, వేల్స్, స్కాట్ లాండ్ దేశాల్ని."
"ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రప్రథమ మహిళ ఎవరు?"
"జపాను దేశానికి చెందిన శ్రీమతి జుంకోటాబై."
"కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ, విద్యార్ధి సంఘానికి ఉపాధ్యక్షుడైన తొలి భారతీయుడు తెలుగువాడు.... అతడే ఆ తరువాత ఆంధ్రా విశ్వవిద్యాలయానికి స్థాపక ఉపాధ్యక్షుడూ అయ్యాడు. ఎవరాయన?"
"సర్. కె. ఆర్. రెడ్డి పూర్తి పేరు కట్టమంచి రామలింగారెడ్డి."
"పార్లమెంటుకి తెలుగులో మరో అర్ధం ఏమిటి?"
అర్ధంకానట్టు ఆగిపోయింది ప్రబంధ.
నిముషం గడిచిపోవడంతో చెప్పింది ప్రణయ- "పార్లమెంటు అనే పదానికి అర్ధం గుడ్లగూబల గుంపు."
"రైట్." అంటూ సమర్ధించాడు ఆదిత్య.
"ఆగస్టు పదిహేనవ తేదీని స్వతంత్ర దినంగా జరుపుకుంటాం. 16వ తేదీన మన దేశానికి చెందిన ప్రముఖ తత్వవేత్త, కవి, విప్లవవీరుడు జన్మించాడు. కాకపోతే సంవత్సరం 1872 ఆ వ్యక్తి ఎవరు?"
చెప్పలేకపోయింది ప్రబంధ.
"అరబింద్ హోష్" అంది ప్రణయ.
"మతోన్మాది కావటం మాత్రమే కాక నైజాం రాష్ట్రంలోని రజాకార్లకి నాయకత్వం వహించాడో క్రిమినల్ లాయర్. అతని పేరు?"
టక్కున చెప్పింది ప్రబంధ- "భాసిం రజ్వీ."
"బైబిలు గ్రంథాన్ని మొదలు తెలుగులోకి అనువదించిన క్రిస్టియన్ ఫాదర్ ఎవరు?"
"హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నెలకొల్పిన కట్టడం ఏది?"
"చార్మినార్."
"బ్రిటన్ చైనాల మధ్య ఒప్పందం ప్రకారం హాంకాంగ్ ను చైనాకి అప్పచెప్పేది ఏ సంవత్సరంలో?"
"1997వ సంవత్సరంలో."
"ఢిల్లీ భారతదేశానికి రాజధాని అయింది ఏ సంవత్సరంలో?"
"క్రీస్తుశకం 1911లో."
"పచ్చిగుడ్డు లేక ఉడకబెట్టినగుడ్డు వీటిలో ఏది త్వరగా జీర్ణమవుతుంది?"
"పచ్చిగుడ్డు."
"తోక తెగిపోయినా మళ్ళీ పెరిగే ప్రాణి?"
"బల్లి."
"కంటికి సంబంధించిన కాటరాక్ట్ ఆపరేషన్ లో ఓ భారతీయ వైద్యుడు సృష్టించిన రికార్డ్ ఏమిటి?"
సాలోచనగా వుండిపోయింది ప్రబంధ. నిముషం పూర్తయిందని ఆదిత్య గుర్తుచేయగానే ప్రణయ జవాబు చెప్పింది. "ఒక్కరోజులో 833 కంటి శుక్లాల ఆపరేషన్ చేసి డాక్టర్ ఎం.సి. మోడీ ప్రపంచ రికార్డు సృష్టించాడు."
"వంద సంవత్సరాలకు ఓసారి పూలు పూసే మొక్క పేరేంటి?"
"సెంచరీ ప్లాంట్."
"కొందరు స్త్రీలకి గర్భధారణ శక్తి వుండదు. ఏ విటమిన్ లోపిస్తే ఇలా జరుగుతుంది?"