Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 7

 

    గబగబా యింట్లోకి వెళ్లి మరుక్షణంలో కాఫీ కప్పుని అందుకుని తీసుకుని వచ్చి యిస్తూ అనురాగం వుట్టిపడే కంఠంతో అంది "తీసుకోండి"
    నిష్టురంగా "ఇంత ప్రేమతో నేను వస్తే నాకు యిచ్చేది ఒట్టి కాఫీయేనా" అన్నాడు మాధవ్.
    "ఇంకేం యివను. నేనేం సంపాదిస్తున్నానా మీలాగా టెర్లిన్ చీరలు జార్జేట్ రవికలు స్వీట్ పాకెట్స్ అందివటానికి."
    "పోనీ ఏమి యివగలవో చెప్పు చూద్దాం"
    "ఏమి యివగలను? మీరూ నాకు ప్రతినెలా మొదటి తారిఖు మీ యింట్లో వంటా అది చేసి యిస్తున్నందుకు జీతంలాగా వందో యాబయ్యో యిస్తోంటే మనసు పుట్టినపుడల్లా మీకు ఓ టెర్లిన్ పాంట్ శ్లాక్ యిచ్చేదాన్ని పోనీ యిస్తుంటారా మీరు?"
    నవ్వి అన్నాడు 'వందా యాబై ఏం ఖర్మా మొత్తం జీతం నీ చేతికే యిస్తున్నానుగా చాలదా?" తనూ నవ్వింది.
    పాకెట్ తీసుకుని విప్పి చీరని నిలువుగా విడదిసింది.
    అక్కడక్కడా జారిపూలు అబ్బ! ఎంత అందంగా వుంది పోగుతున్న సంతోషంతో మాధవ దగ్గరగా వచ్చి అంది.
    "ఎంతా బావుందండి చీర! థాంక్స్"
    "ఇవదలచుకొవాలే గానీ డబ్బక్కర్లేకుండా ఎన్నో మధురమైనవి వున్నాయ్- వాటి విషయం ఏమి అనికోకుండా ఒట్టి థాంక్స్ మాత్రమేనా?
    దగ్గరగా తీసుకున్నాడు మాధవ్.
    అతని కౌగిట్లో ఒదిగిపోతూ అంది "ఇంకేం యివాలో దొరవారికి?
    గడ్డం పైకెత్తి మెల్లగా లలితంగా ముద్దిడుకుని "దొరసాని వారు యిది యివలేరా?" అన్నాడు.
    తప్పించుకుని పెదాలు తుడుచుకుని అంది "దేనికైనా వేళాపాళా వుండొద్దా ఏమిటి!"
    "మనకేమిటి, వేళాపాళా తెలియని పిల్లలం"
    "పాపం! బుచ్చి పాపాయి. ఇంకా పిల్లలమేనా? త్వరలో మనకే....." పూర్తిచేయటానికి సిగ్గుపడి అతని ఎదలో తలదాచుకుంది.
    "ఏమిటి! నిజంగా!"
    అతని ముఖంలో సూటిగా చూసి అతని సంతోషాన్ని గమనించి అంది "ఏమిటా పిచ్చి సంతోషం?"
    ఆమెని దగ్గరగా లాక్కుని కపోలాలు చుంబించి అన్నాడు "కాక! ఈ సంతోషసమయంలో నీవు ఏదైనా అడుగు యిచ్చేస్తాను. సంతోషమా! సంతోషమా! నా మనసు ఎంత పరవళ్ళు తొక్కుతోందో తెలుసా? శ్రీదూ! యీ చీర నీ పుట్టిన రోజు పండుగకి కానుక. ఈ విషయానికి ఇంకేదయినా సరే కోరుకో!"
    ఆలోచనలో పడింది.
    "ఏం కోరాలి?"
    మళ్ళీ రెట్టించి అన్నాడు- "దీనికింత ఆలోచన ఎందుకు శ్రీదు- కోరేసెయ్. బాబు నామకరణంనాటికీ ఏ ధర్మవరం చీరో- కంచి పట్టుచీరో- అది యిది కాకపోతే ఎక్కడికైనా జాలి ట్రిప్పో- లేకపోతే తిరుపతి యాత్రో- లేకపోతే ఓ రింగో- ఏదయినా సరే నీ యిష్టం"
    ఆలోచించసాగింది, "అడిగింది యివగలరా?"
    మళ్ళీ అన్నాడు "ఆలోచన ఎందుకు శ్రీ? అడిగేసేయ్ నీ యిష్టం ఏదైనా సరే"
    శంకిస్తున్న సరంతో అంది నిజంగా ఏదైనా యిస్తారా?"
    "సందేహిస్తున్నావా?"
    "లేదులెండి. కైకేయి వరాలంటారేమోనని"
    నవ్వి అన్నాడు "నాకు రాముడు-నీకు భరతుడు ప్రత్యేకంగా వున్న రోజున అంటాన్లె"
    తనూ నవ్వింది సిగ్గుగా.
    "చివరికి ఒప్పుకోకపోతే" సందేహం వెలిబుచ్చింది.
    ఆమె చేయి అందుకుని అన్నాడు "ప్రామిస్ చేయమంటావా?"
    చేతిలో చేయి అలాగే వుంచి ప్రేమగా నొక్కి అంది "ఉహూ- ఆ మాట చాలు. మాట మీద నిలబడితే సరి"
    "అలాగే" చిరునవ్వు నవ్వి అన్నాడు.
    తనూ నవ్వి ప్రేమగా అతని వక్షం పై వాలిపోతూ అంది.
    "మీరు కాఫీ మానేయండి, సిగరెట్ కాల్చటం మానండి. ఈ రెండు వరాలు చాలు. ఇవి చాలు. ఇదే నా కోర్కె."
    నివ్వెరపోయాడు.
    ఏమిటి కోర్కె?
    "శ్రీదూ!' బాధగా పిలిచాడు.
    రంగులు మారుతోన్నఅతని ముఖం చూస్తూ అంది నిష్టురంగా "ఏం? కోర్కె చెల్లించలేరా? కష్టమా? కోరరాని కోర్కేనా?"
    ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు "ఇదేం కోరిక శ్రీదూ? నగలో, నాణ్యాలో, చీరలో ఏవోఏవో కోరమంటే -అవేమి అక్కర్లేదన్నట్టు యిదేమిటి పిచ్చిగా?"
    "అంటే యీ నా కోర్కెవ్యర్ధమేనా?"
    "అందుకే కాబోలు కైకేయివరలన్నావు. ఏమయినా కానీ మాట యిచ్చాక యిక అది అంతే. ఈ రోజు నుంచే కాఫీ మానేస్తున్నాను. నీ యిష్టమే కానీ, అలాగే యీ క్షణం నుంచి సిగరెట్ మానేస్తున్నాను. ఇదీ ఒకందుకు మంచిదే" సిగరెట్ పెట్టి బయటికి విసిరేస్తూ అన్నాడు.
    దగ్గరగా వెళ్ళి అతన్ని అల్లుకునిపోతూ ప్రేమగా "మీరెంత మంచివారండి" అంది.
    భారంగా నిట్టూర్చి అన్నాడతను" అవును శ్రీదూ! నీ మాట నిజం. నేను చాలా మం.చి.వా.డి.-ని"
    నామకరణానికి అత్తవారి వూరు వెళ్ళాడు మాధవ్. ముద్దు లొల్కుతున్న కొడుకుని చూసి మురిసిపోయాడు సంభ్రమంతో తన నాన్నగారి పేరు పెట్టుకుని ముద్దుగా పీల్చుకుని మురిపెంతీర్చుకోవాలనుకున్నాడు.

 Previous Page Next Page