Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 6
ఆకాశదీపం
గదిలో ఎవరూ లేరు,
గదినిండా నిశ్శబ్దం.
సాయంత్రం ఆరున్నర,
గదిలోపల చినుకులవలె చీకట్లు.
ఖండపరశుగళ కపాలగణముల
కనుకొలకులలో ఒకటివలె
చూపులేని చూపులతో తేరి
చూస్తున్నది గది.
గదిలోపల ఏవేవో ఆవిరులు
దూరిన నింగిమీద
తోచిన ఒక చుక్క
మిణుకు చూపులు మెలమెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది.
ఒక దురదృష్టజీవి
ఉదయం ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు.
అతని దీపం ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది.
ప్రమిదలో చమురు త్రాగుతూ
పలు దిక్కులు చూస్తున్నది.
చీకటి బోనులో
సింహములా నిలుచున్నది.
కత్తిగంటు మీద
నెత్తుటి బొట్టులాగున్నది
ప్రమిదలో నిలిచి
పలుదిక్కులు చూస్తున్నది దీపం.
అకస్మాత్తుగా ఆ దీపం
ఆకాశతారను చూసింది
రాకాసి కేకలు వేసింది
(నీకూ నాకూ చెవుల సోకని కేకలు)
ఆకాశతార ఆదరపు చూపులు చాపింది.
అలసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వాన గానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది.
7-3-1934
* * *
Previous Page
Next Page