Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 5


                                                             గంటలు

పట్టణాలలో, పల్లెటూళ్ళలో
బట్టబయలునా, పర్వతగుహలా,
ఎడారులందూ, సముద్రమందూ,
అడవుల వెంటా, అగడ్తలంటా,
ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ
గంటలు! గంటలు! గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
గణగణ గణగణ గణగణ గంటలు!
గంటలు! గంటలు!
భయంకరముగా, పరిహాసముగా,
ఉద్రేకముతో, ఉల్లాసముతో,
సక్రోధముగా, జాలిజాలిగా,
అనురాగముతో, ఆర్భాటముతో,
ఒక మారిచటా, ఒక మారచటా
గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
సింహములాగూ, సివంగిలాగూ,
ఫిరంగిలాగూ, కురంగిలాగూ,
శంఖములాగూ, సర్పములాగూ,
సృగాలమట్లూ, బిడాలమట్లూ,
పండితులట్లూ, బాలకులట్లూ,    
గొణగొణ గొణగొణ
గొణగొణ గొణగొణ
గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
కర్మాగారము, కళాయతనమూ,
కార్యాలయమూ, కారాగృహముల,
దేవునిగుడిలో, బడిలో, మడిలో
ప్రాణము మ్రోగే ప్రతిస్థలములో,
నీ హృదయములో, నా హృదయములో
గంటలు! గంటలు!
గంటలు! గంటలు!
ఉత్తరమందూ, దక్షిణమందూ,
ఉదయమునందూ, ప్రదోషమందూ,
వెన్నెలలోనూ, చీకటిలోనూ,
మండు టెండలో, జడిలో, చలిలో,
ఇపుడూ, అపుడూ, ఎపుడూ మ్రోగెడు
గంటలు! గంటలు! గంటలు! గంటలు!
గంటలు! గంటలు! గంటలు! గంటలు!
గణగణ గణగణ గంటలు! గంటలు!
గణగణ గంటలు!
గంటలు! గంటలు!     
                    (E.A.Poe వ్రాసిన The Bell కనువాదం కాదు)

                                                                             18-2-1934

                                                       *  *  *

 Previous Page Next Page