దేవాలయంలోకి వెళ్ళగానే దానికి ఆనుకుని ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి కమండలంతో నీళ్ళు తెచ్చింది త్రిసికి. ఆ నీటికి ఉన్న శక్తి తెలుసు గనుక అనిల, రవి ఎంతో ఇష్టంగా తాగారు ఆ నీటిని. వాళ్ళ దాహం తీరటమే కాక, ఎప్పటిలాగే కొత్త శక్తి వచ్చినట్లనిపించింది.
ఆలయ పరిసరాల్ని గమనిస్తున్న రవికి ఒక స్థంభం మీద చెక్కిన పాతకాలపు శాసనం కనిపించింది. అది చూడగానే నిధిని తెలుసుకున్న దానికంటే ఎక్కువ సంతోషం కలిగింది అతనికి.
సగం అరిగిపోయిన ఆ అక్షరాలను అతి జాగ్రత్తగా కూడబలుక్కుంటూ ఆ శాసనం చదవటానికి ప్రయత్నించాడు. అక్కడక్కడ కొన్నికొన్ని అక్షరాలు అర్థం కాకపోయినా, మొత్తం మీద సారాంశం గ్రహించగలిగాడు.
పరంతపుడు అనే బ్రాహ్మణుడికి నదీ తీరాన ఉన్న ఆ ప్రాంతం చంద్రగ్రహణ సమయాన దానం చేస్తూ ఎవరో రాజు వ్రాయించిన శాసనమది. 'గండర గండ' అనే బిరుదునామం తప్ప రాజుగారి అసలు పేరు పూర్తిగా అరిగిపోయింది.
"నదీ తీరాన" అనే మాటలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు రవి. ఆ ప్రాంతాలలో నది ఎక్కడ? చటుక్కున స్ఫురించింది. ప్రస్తుతం లోయలాగా కనిపిస్తున్నది ఒకప్పుడు నది కావచ్చును. ఈ ప్రాంతంలో మూడు పాయలుగా చీలటం వల్ల ఇక్కడ దానిని "త్రిశాఖి" అని పిలిచేవారేమో. సజీవమైన ప్రకృతిని దేవతా భావంతో ఆరాధించటం హైందవుల ఆచారం. జీవ నదులైన గంగ, గోదావరి, కృష్ణ మొదలైన నదులను దేవతా భావంతో ఆరాధించినట్లే త్రిశాఖిని కూడా ఆరాధించి ఉంటారు. ఈ గుడి అలా వెలసినదే కావచ్చును. అందుకే త్రిసికమ్మ చేతిలో కమండలం.
"త్రిసికీ! ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఏదైనా జీవనది ఉండేదా? కొన్ని వేల సంవత్సరాల కాల పరిణామంలో కొన్ని కొన్ని నదుల ప్రవాహమార్గాలు మారిపోవటం కూడా జరుగుతుంది. అలా ఈ నదీ ప్రవాహ మార్గం కూడా మారిపోయి ఉంటుందా?"
త్రిసికి ఎప్పటిలాగే సమాధానం చెప్పలేదు. కానీ ఆమె కళ్ళలో మెరుపు కనిపించింది. అప్పుడప్పుడు రవి పట్ల ప్రశంసతో కనిపించే మెరుపు.
ఒక స్థంభాన్ని ఆనుకుని కూర్చుంది త్రిసికి. మౌనభాష ఇప్పుడు రవికి కూడా అర్థమవుతోంది. అక్కడ కూర్చుని ముందు ఏం చేయాలో చక్కగా ఆలోచించుకోమని ఆమె భావం. అనిల కూడా కూర్చోవటంతో రవి తప్పనిసరిగా కూర్చున్నాడు.
"ఇదివరకు అనుకున్నట్లే మీరా ఇంటికి కొంచెం దూరంలో ఏ దుబ్బు చాటునో ఉండి గాలిలోకి రివాల్వర్ పేల్చండిక రెండు మూడుసార్లు. ఇంటికి కాపలా ఉన్నవాళ్ళు తప్పకుండా అటు వస్తారు.
ఆ సమయంలో నేను ఇంటి తలుపుల మీదా, కిటికీల మీదా పెట్రోలు పోసి అంటిస్తాను. అప్పుడు ఇంట్లో వున్న వాళ్ళందరూ బయటికి రాకతప్పదు. ఎందరున్నారో తెలుస్తుంది. ఆ ఇంట్లో ఏదో కుంభకోణం జరుగుతోందని మనం అనుకుంటున్నాం. అది నిజమైతే, తమకు అంత విలువైన ఇంటిని కాపాడుకోవటం కోసం తప్పకుండా వాళ్ళు నీటి కోసం వెళ్ళక తప్పదు. అప్పుడు మనం వీలు చూసుకుని ఇంట్లోకి వెళదాం"
"మంటలు లోపల మాత్రం వ్యాపించవా?" అడిగింది అనిల.
"ఇంట్లో కర్రతో చేసిన అలమరలు వగైరా లున్నాయా?"
"లేవు, అన్నీ రాతిగోడలు. అయినా కరంటు తీగలు ఎలా అమర్చారో ఆ విషయం నాకు తెలీదు."
"కొంత రిస్క్ ఎలాగూ తప్పదు. మన టార్చ్ ఉంటుంది గదా చూసుకోవచ్చు మీకు భయంగా ఉంటే మానేద్దాం"
"వద్దు వద్దు. నాకేం భయం లేదు. ఇక్కడి రహస్యాలు తెలుసుకుని తీరాలి"
మొండి తెగువతో అంది అనిల.
త్రిసికి లేచింది. అడవి దారిలోంచి నడక సాగించింది అంటే, తమ ప్లాన్ కి ఒప్పుకుందని అర్థం దూరాన కొండమీద ఉన్న ఇల్లు ఎంత దూరం నుంచి అయినా కనిపిస్తోంది. త్రిసికి ఒకచోట ఆగిపోయింది. కొండ రాతి మాటున దాక్కున్నారు. ఇంకా దగ్గిరగా వెళ్ళలేరు. కాపలా వాళ్ళు ఉంటారని తెలుసు.
కొద్దిసేపటిలోనే ఒకవైపు నుంచి రివాల్వర్ మోగింది. రవి ఆశించినట్లే కాపలా ఉన్నవాళ్ళు అటు పరుగెత్తారు. అంతలో మరోవైపు నుంచి రివాల్వర్ మోగింది. మరో కొద్దిసేపట్లోనే ఇంకోవైపు నుంచి కాపలా ఉన్న వాళ్ళందరూ తుపాకులతో అన్ని దిక్కులకీ చెదిరిపోయారు.
రవి చాలా సంతోషించాడు. త్రిసికి అనుకున్న దానికంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. ఇంక ఆలస్యం చెయ్యకుండా రవి ఇంటివైపు పరుగుతీసి తలుపుల మీద, ద్వార బంధాల మీదా కిటికీల మీదా పెట్రోలు గుమ్మరించాడు. ఒక పొడుగాటి తాడు పెట్రోలులో ముంచి ఒక కొస అతి జాగ్రత్తగా ద్వార బంధం మీద ఉంచి, మరో కొస కొంత దూరానికి తీసుకెళ్ళాడు. అక్కడ దానికి అగ్గిపుల్ల ముట్టించి, పరుగున వెళ్ళి కొండ రాతి మాటున ఆరాటంగా ఎదురుచూస్తున్న అనిలని చేరుకున్నాడు.
ఊపిరి బిగబట్టి చూడసాగారు. ఇద్దరూ కొన్ని సెకన్లలోనే భగ్గున పైకి లేచాయి అగ్ని జ్వాలలు.
రవి ఊహించినట్లుగానే ఆ యింటి తలుపులు తెరుచుకున్నాయి. ముగ్గురు మనుష్యులు తుపాకులతో బయటికొచ్చాడు. ఆ యింట్లో వున్నది ముగ్గురేనన్నమాట! వాళ్ళు గ్రామంలోకి వెళ్ళలేదు, టౌన్ వైపూ వెళ్ళలేదు.
కుడివైపు తిరిగి అటు అగాధంలా తోచే లోయవైపు వెళ్ళసాగారు. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నది రవికి అర్థం కాలేదు. ఆ యింట్లో మనుష్యులు లేరని మాత్రం రూఢి అయింది. ఇంక ఆలస్యం చెయ్యదలచుకోలేదు రవి.
"మీరు నన్ను క్షమించాలి!" అన్నాడు అనిల నుద్దేశించి.
ఆమె విస్తుపోయి చూస్తూ వుండగానే, ఒక్క అండర్ వేర్ తప్ప మిగిలిన బట్టలు విప్పేశాడు. సీసాలో వున్న మంటలు సోకకుండా వుండే తైలం దట్టంగా ఒంటినిండా ముఖానికి రాసుకున్నాడు.
"నేను లోపలికి వెళ్ళి మండుతున్న తలుపులు విసిరేసి, పరిస్థితి గమనించి మీకు సైగ చేస్తాను, మీరు వద్దురుగాని" అన్నాడు అనిలతో.
అనిల సమాధానం చెప్పకుండా అతనివంక రెప్పార్పకుండా భయంతో చూడసాగింది.
"అలా చూస్తారేమిటి?"
"మీరు ఎలా ఉన్నారో తెలుసా?నల్లగా, భయంకరంగా..."
తను ఎలా ఉన్నాడో చూసుకునేటంత సమయం లేదని రవికి తెలుసు.
"వెళ్తాను!"
"నేనూ వస్తాను"
నవ్వాడు రవి.
"మీరు రావాలంటే మీరుకూడా నాలా తయారవ్వాలి. ఒంటిమీద బట్టలుండకూడదు. నాకు అభ్యంతరం లేదు."
ఆ సమయంలో కూడా అతడిలో సహజమైన చిలిపితనం తొంగి చూసింది. ముఖం ఎర్రబడగా చటుక్కున తల దించుకుంది అనిల.
పెన్ టార్చ్, రివాల్వర్ అండర్ వేర్ లో బిగించుకుని తైలం వున్న సీసా చేత్తో పట్టుకుని "భయపడకండి!" అని అనిలని హెచ్చరించి, మంటల్లోంచి లోపలికి దూసుకు రవి.
అనిల వర్ణించినట్లే తలుపులూ, కిటికీలూ తప్ప లోపల ఎక్కడా కర్రతో చేసిన బీరువాలు గానీ, అలమారాలు గానీ లేవు. మంటలు లోపలికి వ్యాపించటం లేదు.
అసలే కొండ ప్రాంతం! మంటలతో వేడిగాలి ముఖానికి కొడుతూంది. పొగతో ఊపిరాడకుండా దగ్గు వస్తోంది. పాతకాలపు తలుపులు వాటిని బాగు చేయించిన వాళ్ళెవరూ లేరు. మంటలకి ఫెళఫెళమని విరుగుతున్నాయి. రవి సాహసించి కాలితో తన్నేసరికి పూర్తిగా విరిగిపోయాయి.
కాలుతున్న ఆ తలుపులు తన చేతులతో దూరంగా విసిరేశాడు. చేతులు కొద్దిగా కాలాయి. తైలం వల్ల కొద్దిసేపు మాత్రమే మంటలు సోకకుండా ఉంటాయి. కిటికీ తలుపులు మండుతున్నాయి. అవి విరిగితే బహుశా లోపలే పడిపోవచ్చు. తన మీద పడకుండా తప్పించుకోవచ్చు. కొండ రాతిమీద నిలబడి చూస్తోంది అనిల. రమ్మన్నట్లు చేత్తో సైగచేశాడు. దానికోసమే ఎదురుచూస్తోంది కనుక వెంటనే వచ్చేసింది.
"త్వరగా మనం ఈ యింట్లో ఏముందో చూసేసి వాళ్ళు వచ్చేలోగా బయటపడాలి!" అన్నాడు రవి.