Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 42


    రవితోపాటు అనిల కూడా మత్స్యావతారాల అసలు రహస్యం అర్థం చేసుకుంది. ఆమెకి కూడా ఆ శిల్పాల రహస్యం అంతకు ముందు తెలీదు.
    త్రిసికి చూపులు అసహనంగా వున్నాయి. తొందరగా బయటపడమని హెచ్చరిస్తున్నాయి అవి. ముగ్గురూ బయటికి వచ్చారు. టౌన్ లోని కంకర రోడ్డు మీదకు వచ్చారు!
    అడవుల మధ్యనుంచి తమకి తెలీకుండా టౌన్ లోకి వచ్చిపడ్డారు. బహుశా జెన్నిఫర్ విష్ణువర్ధన్ లు ముందుగా టౌన్ కి వచ్చి తర్వాత ముందే ఏర్పరచుకున్న సంకేతం ప్రకారం ఈ గుడికి వచ్చి వుంటారు. అంటే షావుకారు శివయ్యతో టెంట్స్ లో వాళ్ళకి లావాదేవీలు వున్నాయి. ఇదివరలో జెన్నిఫర్, అంతకుముందు ప్రకాశం రాత్రివేళ కొండమలుపు దగ్గిర షావుకారు శివయ్యని కలుసుకున్నది. ఈ సంప్రదింపుల కోసమే కావచ్చు.
    త్రిసికి ఇక్కడి రహస్యాలు ఎలా తెలుసుకుంది? ఆమె నిజంగా తమకి సహాయం చేస్తోందా? మరింత ఆపదల్లోకి ఈడ్చుకు పోతుందా? ఏమయినా ఈ పరిస్థితులలో త్రిసికిని నమ్మక చెయ్యగలిగింది లేదు.
    టౌన్ లో కంకరరోడ్డుమీద చకచక నడుస్తోంది. ఆమెతో సమానంగా నడవలేక పోతున్నారు రవి, అనిల. తుపాకులు పట్టుకున్న మనుష్యుల బారినుంచి తప్పించుకుంటూ పరుగులు పెడుతున్నప్పుడు పొందిన శ్రమకి అలసట ఇప్పుడు తెలుస్తోంది.
    అనిలకి చెప్పులు తెగిపోయాయి. అరికాళ్ళు నెత్తురు చిమ్ముతున్నాయి అడుగుతీసి అడుగు వెయ్యటం కష్టంగా ఉంది. రవికి కూడా బూట్స్ చిరిగిపోయాయి. ఆ సందుల్లోంచి సన్నని రాళ్ళు కాళ్ళలో గుచ్చుకుని మంట పెడుతున్నాయి. బూట్స్ విప్పేసి చేతుల్లో పట్టుకున్నాడు. మోచేతులమీద కూడా అక్కడక్కడ చెట్ల కొమ్మలు గీసుకుపోయి నెత్తురు చారలు కనిపిస్తున్నాయి. ఆకలి, అంతకంటే దాహం, అలసట, నిస్సత్తువ.
    ఆగకుండా నడుస్తోంది త్రిసికి. "అబ్బా!" అని బాధపడుతూనే అలసటతో ఒగరుస్తూ ఆమె వెనకాలే నడుస్తోంది అనిల. వాళ్ళిద్దరినీ అనుసరిస్తూనే పరిసరాలు పరిశీలిస్తున్నాడు రవి. ఆ ప్రాంతాలకి అతనెప్పుడూ రాలేదు. టౌన్ కి అతడు రెండుసార్లు వచ్చిందీ డాక్టర్ కోసమే. ఎప్పుడూ సావకాశంగా టౌన్ అంతా చూడలేదు.
    ఈ టౌన్ కూడా ఒకరకంగా పల్లె లాగానే ఉంది. కార్లూ, స్కూటర్లూ మొదలైన వాటి రద్దీ లేదు. రోడ్డు రెండు వైపులా దేవదారు వృక్షాలున్నాయి కాపలా సైనికుల్లా. ఆ చెట్లకి అవతల దట్టమైన అడవి ఒకచోటా, అగాధమైన లోయ మరోచోటా, ఎగుడుదిగుడుగా ఉన్న కొండలు మరోచోటా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాలవాళ్ళు కష్టజీవులు. కొండ అంచులపైనా, లోయల లోపలి చదును ప్రాంతాలలోనూ, ఏదో ఒకపని చేసుకుంటూ జనం కన్పిస్తున్నారు.
    త్రిసికి ఒక పెంకుటింటిముందు ఆగింది. మధ్యతరగతి కుటుంబం. అది చూసీ చూడగానే తెలుస్తుంది. యజ్ఞనారాయణ్, దేవనారాయణ్ కుటుంబాలూ, ఆ తర్వాత షావుకారు శివయ్యా, సహకార సంఘాల సుబ్బయ్యా తప్ప ఆ ప్రాంతంలో ఒక మోస్తరు ధనిక కుటుంబాలు కూడా లేవు. చాలా బీద ప్రాంతం.
    ఇంటిముందు మనుష్యులు నిలబడ్డ అలికిడికి ఆ ఇంటి గృహిణి బయటికి వచ్చింది. త్రిసికిని చూడగానే సంభ్రమంతో చేతులు జోడించి "ఓయ్ దేవుడోయ్! త్రిసికమ్మే! రా తల్లీ! రా! ఈ రోజెంత మంచిరోజు!" అంది.
    ఆ చుట్టుపక్కల అందరూ త్రిసికిని దేవతలా చూస్తారని అనగా విన్నాడు రవి. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు.
    అర్థం చేసుకుని, "ఆది దంపతులల్లే వచ్చారు మీరు రండి" అంది. అనిల ముఖం ఎర్రబడిపోయింది. ఒక ఆడదీ మొగవాడూ కలిసి కనిపిస్తే భార్యాభర్తలనే భావం తప్ప మరో భావం రాదు ఇక్కడి వాళ్ళకి! ఇక్కడివాళ్ళకే కాదు, ఎక్కడి వాళ్ళకైనా అంతే!
    రవి శరీరంలో నెత్తురు వేగంగా ప్రవహించింది. "అసంభవమైన ఊహ?" అని తనను తను తిట్టుకున్నాడు. త్రిసికి ముందు నడవగా ముగ్గురూ లోపల ప్రవేశించారు. వరండాలో ఉన్న కర్ర చెక్కలూ, వడ్రంగి సామానూ చూసి ఇంటి యజమాని వడ్రంగి అని ఊహించాడు రవి. ఇద్దరు ముగ్గురు మొగపిల్లలు ఒట్టి లాగులతో ఇంటిముందు ఆడుతున్నారు. పరికిణీ వోణీ వెసుకున్న ఆడపిల్ల రవిని చూసి లోపలికి తుర్రుమంది.
    మూడు అల్యూమినియం పళ్ళాలలో పుల్ల పొంగరాలు పోసి తీసుకొచ్చింది గృహిణి. త్రిసికి అనిల పాదాలవైపూ రవి పాదాలవైపూ చూసింది.
    "ఆ మందా? ఉంది!" అంటూ లోపలికెళ్ళి సీసాతో తిరిగొచ్చింది గృహిణి. త్రిసికి మౌనభాష ఈ ప్రాంతంలో అందరికీ బాగా అర్థమవుతుంది కాబోలు!
    త్రిసికి ఆ సీసా అందుకుని అందులో ద్రవాన్ని ఒక్కసారి ముక్కు దగ్గిర పెట్టుకుని వాసన చూసి ఆ తర్వాత చేతుల్లో పోసుకుని అనిల పాదాలకి రాసింది. అనిల మొదట బాధతో అరిచింది. త్రిసికి చూపులతోనే ఓదార్చి మరికొంచెం తైలం రాసింది.
    తర్వాత ఆ సీసా రవికిచ్చింది. రవి గ్రహించాడు. అది తమ గాయాలకి మందు బహుశా మూలికలతో తయారుచేసింది. ఈ ప్రాంతమంతటా మూలికల మందులే ఎక్కువగా వాడుతుంటారు. అందుకే పాపం డాక్టర్ కి బొత్తిగా ప్రాక్టీస్ ఉండదు. రవి ఆ తైలాన్ని తన పాదాలకి రాసుకున్నాడు. మొదట మండింది. తర్వాత చాలా ఉపశమనంగా తోచింది.
    ముగ్గురూ పొంగరాలు తిని మంచినీళ్ళు తాగారు. అపురూపమైన పానీయమేదో అందిస్తున్నట్లు చిన్న గ్లాసులతో ఇచ్చింది మంచినీళ్ళు ఆ గృహిణి. ఇంకా దాహం వేస్తున్నా మంచినీళ్ళు అడక్కూడదని అనిలకీ, రవికీ చెప్పకుండానే అర్థమయిపోయింది.
    నమస్కారం చేసిన గృహిణికి చేతి సైగతోనే ఆశీర్వదించి బయలుదేరింది త్రిసికి. ఆమె వెంట అనిల, రవి.
    టౌన్ రోడ్డులోంచి కాలిబాట పాటింది త్రిసికి? కొంత దూరం నడిచారు!
    "అదిగో త్రిసికమ్మ దేవాలయం!" ఉత్సాహంగా చూసింది అనిల.
    కుతూహలంగా చూశాడు రవి. అతడు ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న దేవాలయం కొండమీద ఉంది. ఎక్కటానికి మెట్లు ఉన్నాయి. ఆ గుడికి జనం ఎప్పుడూ వస్తూ పోతూ ఉంటారనటానికి నిదర్శనంగా, ఒక చిన్న పూల దుకాణం ఉంది. అగరొత్తులూ, హారతి కర్పూరం మొదలైన సంభారాలతో.
    త్రిసికి చకచక మెట్లు ఎక్కి పైకి వెళ్తోంది, సొంత ఇంటికి వెళ్తున్నట్లు! అనిల కూడా ఉత్సాహంగా ఆమెని అనుసరిస్తోంది. రవి ఎప్పటిలా చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు.
    పాదాల మంటలు తగ్గిపోయాయి ఇద్దరికీ! కొండ దిగువన లోయ కనిపిస్తోంది. అది మూడు శాఖలుగా చీలి ఉంది. ఈ లోయని బట్టే ఇది త్రిశాఖి దేవాలయం అయి ఉంటుందా? త్రిశాఖి పేరు సహజంగానే 'త్రిసికి'గా మారి ఉంటుందా? ఆలోచిస్తున్నాడు రవి.
    దీనికి కూడా ఏదైనా పూర్వ చరిత్ర ఉందేమో! దేవాలయం చూస్తే తెలుస్తుందేమో! కొండమీద ఉంది దేవాలయం!
    విగ్రహం చాలా ప్రాచీనమైనది. అనేక చోట్ల విరిగి ఉంది. సాధారణంగా విరిగిన విగ్రహానికి పూజలు చెయ్యరు. కానీ ఈ విగ్రహానికి పూజలు జరుగుతున్నాయి. విగ్రహంలో పెద్ద విశేషమేమీ లేదు. తల విరబోసుకుని ఉన్న విగ్రహం. గ్రామ దేవతలందరికి లాగానే ఈ విగ్రహానికీ ముఖం నిండా పసుపూ, కాటుక రేఖలూ, కుంకుమ బొట్టూ ఉన్నాయి. చేతిలో కత్తి వగైరాలకు బదులు కమండలం ఉంది.
    అది రవి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. గ్రామదేవతల విగ్రాహాలకి చేతిలో కమండలం ఉండదు. గుడి గోడలన్నీ పరిశీలనగా చూశాడు. వాటిమీద ఏ శిల్పాలూ లేవు. అవి కొండరాళ్ళతో కట్టిన గోడలు. ఆ కాలం వాళ్ళు ఏ రకం సిమెంటును ఎలాంటి జిగురు పదార్థాలనూ ఉపయోగించేవారో కాని వాటిని పగులగొట్టడం ఎవరితరమూ కాదు.

 Previous Page Next Page