Previous Page Next Page 
జనవరి 5 పేజి 41

 

        ఇక మూడో అంశం: మైనార్టీ వర్గాలు, మత కలహాలు, దేశాన్ని ముక్క ముక్కలుగా చెయ్యడానికి విదేశీ శక్తులు చేసే కుట్రలు ఆ కుట్రలనిక్కడ 'ఎప్లయ్' చేసే బడా పారిశ్రామిక వేత్తలు, వారిచ్చే డబ్బుకోసం అడుగు దాటని మన రాజకీయ నాయకులు..... ఏ జాతివాడైనా, ఏ మతం వాడైనా, ఏ విశ్వాసాన్ని నమ్మిన వాడైనా అందరూ ఒక్కటే......మనం రూపకల్పన చెయ్యబోయే 'న్యూ ఇండియా'లో 'మనిషి' కే అగ్రస్థానం అవును.....
   
    మనిషి.....
   
    అక్కడ కులమతాలుండవు..... మత విద్వేషాలుండవు..... అన్ని మతాలవారికి ఒకటే చట్టం...... అందరికీ ఒకటే న్యాయం అమలు జరిగి తీరాలి.
   
    ఇక నాలుగో అంశం: విద్య, కళ, సాంస్కృతిక రంగాల్లో, నెలకొంటున్న అస్తవ్యస్థ వైఖరి..... విద్యను, విజ్ఞానాన్ని, మనిషికి వికాసాన్నీ, వివేకాన్నీ ఇవ్వాల్సిన విశ్వ విద్యాలయాలు పురుగులు పట్టి, రాజకీయ బురదను పులుముకుని కులాల ముసుగులో నర్తిస్తున్నాయి. ఒక 'శాంతినికేతన్' లా విద్యావ్యవస్థ మానవ జీవిత సర్వతోముఖ వికాసానికి పునాదులు వెయ్యాలి. ఇవాళ బలమైన మీడియం సినిమా..... దూరదర్శన్...... ఈ రెండూ ఈ రెండూ హింసకూ, విలువల రాహిత్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి...... పాలుతాగే పిల్లవాడిని సయితం ఇవాళ 'సెక్స్' వయొలెన్స్ ఉత్తేజితుడ్ని చేస్తున్నాయి..... నిరంతర భయం.....నిరంతర అభద్రత.... నిరంతర రాక్షసత్వం వీటి మధ్య పుట్టిన నేటి పిల్లవాడు రేపటికి ఎలా పెరుగుతాడో ఒక్కసారి వూహించండి...... వాటిలో మనం కనీస మానవతను చూడగలమా? ఈ తరాన్ని ఇలా నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? ఈ కల్మష మూలాలు చెరిగిపోవాలి.
   
    అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం ఒకటుంది.
   
    అది జనాభా పెరుగుదల-దాన్ని ఎలా అరికట్టాలి? కులమతాలకు అతీతంగా నిర్దాక్షిణ్యంగా ఆ పథకాన్ని అమలు జరిపితీరాలి.
   
    ఏ మతం వారైనా సరే...... ముందు వాళ్ళు భారతీయులు. ఆ పైనే ఏదైనా? ఏ మతం వారైనా భరతమాత ముందు తల వంచవలసిందే- ఒకరు లేక ఇద్దరితో ఆపరేషన్ చేయించుకు తీరాల్సిందే. మతం పేరు చెప్పి తప్పించుకునే వీలుండరాదు.
   
    ఇక ప్రభుత్వోద్యోగులు : నిమ్మకు నీరెత్తినట్లు ఫైళ్ళను నత్తనడక నడిపిస్తుంటారు- ప్రజల సమస్యల్ని, సంక్షేమాన్ని గాలికొదిలేసే వారు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా శిక్షించి తీరాలి.
   
    బ్యూరోక్రాట్ : వాళ్ళేదో ఐ.ఏ.ఎస్. అయిపోగానే దైవాంశ సంభూతుల్లా ఫీలవుతారు-ఆఫ్ట్రాల్ దే ఆర్ బిగ్ సర్వెంట్స్ టు ది పబ్లిక్ అని వారికి తెలిసొచ్చేలా చేయాలి. అధికారం వాళ్ళ గుత్తాధికారంలా ఫీలవుతారు-
   
    ప్రభుత్వరంగ సంస్థలు : దాదాపు అన్నీ నష్టాలతోటే నడుస్తున్నాయి ఎందుకని...? వాటిని నడిపే సిబ్బందికి అమరిన మితిమీరిన బాధ్యతాభావం నష్టాలొస్తున్నప్పుడు ప్రైవేట్ పరం చేయాలి. అందుకు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారంటే ఏమిటర్ధం....? ప్రైవేట్ యాజమాన్యం బద్దకాన్ని, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని క్షమించాదనేగా? వాళ్ళ వుద్యోగాలకు భద్రత అడగవచ్చు-అంతేకాని నష్టాలొస్తున్నా, ప్రజాధనాన్ని పబ్లిక్ రంగసంస్థలపై ఖర్చుపెట్టమనే హక్కు వారికెక్కడిది? ఎవరబ్బ సొమ్మది?
   
    బ్యాంకులు : లోన్స్ ఇచ్చేందుకు పర్సంటేజీలు... బ్యాంకుల కొచ్చిన కస్టమర్స్ ని ట్రీట్ చేయటం తెలీని అహంబావులు....ఏదైనా పరిశ్రమ పెట్టాలని ఎవరైనా అప్పు కోసం వస్తే వాళ్ళను దొంగల్లా చూస్తారు. బ్యాంకు ఎంప్లాయిస్ ఎంతమంది డి డి బుక్స్ కాజేసి బ్యాంకుల సొమ్ము దోచుకోవటం లేదు? రాని బాకీల క్రింద ఎందరి బాకాల్ని మాఫీ చేయటం లేదు....?
   
    రాజకీయాలు : అసలు భారతదేశం నుంచి రాజకీయాల్ని, రాజకీయ నాయకుల్ని బహిష్కరిస్తేనే దేశం బాగుపడుతుంది.       
   
    ఒకడి పదవి నిలబడటం కోసం మరొకడు రాజీనామా-వాడికి రాజీనామా చేస్తుండగానే పదవిలోకి జొరబడటం- ధరలు తగ్గవు- సౌకర్యాలుండవు.....వాళ్ళు మాత్రం సంపదని పోగేసుకుంటూనే వుంటారు.
   
    మున్సిపాలిటీలు : ఇళ్ళ పన్నుపెంచుతారు-ఠంచనుగా వసూళ్ళు చేస్తారు. ఆ డబ్బుతో రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ లాంటి సౌకర్యాలు కల్పించాలిగదా? లేదు. మరా డబ్బంతా ఏమవుతోంది? ఎవరన్నా వార్ని నిలదీసి తన్నరేం?
   
    విద్యాసంస్థలపై రౌడీల, రాజకీయ నాయకుల నీడలు....ప్రభుత్వ సంస్థలపై పెత్తందార్ల పైరవీలు.
   
    ఒక ఇంట్లో పదిమంది వుంటే ఒకరు పనిచేస్తే-తొమ్మిది మంది సోమరిగా వుండటం....
   
    ప్రభుత్వ సంస్థలు సకాలానికి తెరవరు. తెరిచినా పని చేయవు.....ప్రజలు తమ పనుల కోసం వెళితే విసురుకోటాలు-కసురుకోటాలు-వాళ్ళే ప్రజల్ని బ్రతికిస్తున్నట్లు.
   
    పారిశ్రామిక వస్తువుల ధరల్ని పారిశ్రామికవేత్తకి నిర్ణయించుకొనే టప్పుడు- వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని ప్రభుత్వం నిర్ణయించటమేమిటి?
   
    పరిసరాలు పచ్చగా వుండాలని ప్రభుత్వం ప్రజల్ని బ్రతిమిలాడాలి? ఆ మాత్రం బాధ్యతని వాళ్ళు తీసుకోలేరా?
   
    అబద్దాలు... మోసాలు.... స్వార్ధం..... నయవంచన..... ఆత్మవంచన. కుటిలత్వం.....కుచ్చితం....కుట్రలు..... కుతంత్రాలు..... కుళ్ళు.....నైతిక విలువల పతనం....విచ్చలవిదితనం....పర్ వర్షన్ పరాకాష్టకు చేరుకున్నాయి. భారత దేశంలో పాపం త్వరగా పండుతోంది.....బ్రద్దలయ్యే సమయం ఆసన్నమౌతోంది. అందుకే ఆ సమయానికి మనం కొత్త తరాన్ని సృష్టించాలి. ఆ తరంలోని వారికి కులాలు- మతాలు-తెలీకూడదు. కులాన్ని.....మతాన్ని జ్ఞప్తికి తెచ్చే పేర్లుండరాదు. శ్రమ..... శ్రమ..... శ్రమ..... మరో ప్రత్యామ్నాయమే లేదు. వుండకూడదు. వాళ్ళందరూ మన దేశాన్ని జపాన్ సరసన నిలపాలి. నిలిపి తీరాలి.
   
    రేపటి తరానికి ఒక కొత్త మానవుడ్ని తయారుచేసి ఇవ్వడమే 'న్యూ ఇండియా' ధ్యేయం.
   
    మనం తాయారు చేస్తున్నది 'మానవ రోబట్' మానవతా విలువల 'మానవ రోబట్' సంక్షిప్తంగా ఇదీ నా ప్రణాళిక. ఆచరణ మీది ఎక్కడ ప్రారంభిస్తారు? ఎలా ప్రారంభిస్తారన్నది మీ యిష్టం. ఈ 'FUTURE PEOPLE' గురించి ఈ 'NEW INDIA' గురించి ఒకరోజు ఈ దేశం ఆలోచించాలి.
   
    ఎనభై కోట్ల భారతీయులూ ఒకరోజు పూర్తిగా ఆలోచించాలి.....మీరేం చేస్తారో మీ యిష్టం..." ఆర్యభట్టు ముఖం వికసించిన విద్యుత్తేజంలా వుంది.
   
    "మీకు ఇరవై నాలుగ్గంటలు టైమిస్తున్నాను. మీ ప్లాన్ నాకు కావాలి ఓ.కె...." మరొక్క మాట మాట్లాడకుండా ఆయన లోపలికెళ్ళిపోయాడు. గంభీరంగా.
   
                                        *    *    *    *    *
   
    ఎ.పి గెస్ట్ హౌస్ గదిలో వాళ్ళు నలుగురు....అందరూ సీరియస్ గా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.
   
    క్రాంతి మాత్రం ఓ అట్టముక్కతో ఏదో చేస్తోంది. అభిరామ్ ఏదో మాగజైన్ ని చేతిలో పట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నాడు. మేఖల ఏవో కాగితాలు తీసుకొని ఏదో 'నోట్స్' రాసుకుంటోంది. విమల్ సిగరెట్ పొగని రింగులు రింగులుగా వదిలే ప్రయత్నంలో వున్నాడు.
   
    మేఖల లేచి గబగబా విమల్ దగ్గరికొచ్చి అతని చేతిలోని సిగరెట్ ను లాక్కుని కిటికీలోంచి బయటకు విసిరేసింది.
   
    "నాకు సిగరెట్ పడదు" విసురుగా అంది విమల్ ముఖం వేపు చూస్తూ.
   
    "నా చేతిలో ఉన్న సిగరెట్ ని పారేశావ్. రోడ్డు మీదకెళ్ళి కనిపించిన ప్రతివాడి చేతిలో సిగరెట్ పారెయ్యగలవా?"
   
    "పారేస్తే"
   
    "చాచి దవడ మీద కొడతారు"
   
    "ఎందుక్కొడతారు?"
   
    "బెట్....వాళ్ళ చేత తిట్లు తినకుండా వస్తే....నీకేం కావలిస్తే అదిస్తాను" ఉడికిస్తున్నట్టుగా అన్నాడు విమల్.
   
    "అయితే పద....మన ముందున్న ఛాలెంజ్ కన్నా.....ఇదేం గొప్ప విషయం కాదు."
   
    మేఖల గురించి పూర్తిగా తెలీదు విమల్ కి.
   
    అభిరామ్ వాళ్ళ మాటలు వింటూ ఆలోచనలోపడ్డాడు.
   
    తాము చేపట్టబోయే బృహత్తర కార్యానికి ఇది నాంది....ఆర్యభట్టు అప్పగించిన పనిని తను సాధించగలడు. ఆ నమ్మకం తనకుంది. తనతో బాటు నడిచే వీళ్ళ ముగ్గురు....ఇందులో వీళ్ళ ముగ్గురికీ ఒక్కొక్కరికి ఒక్కో 'టెస్ట్' పెట్టాలి. వాళ్ళను 'గైడ్' చేసే 'ఛీఫ్' గా అది తన బాధ్యత, కర్తవ్యం కూడా.
   
    "మేఖల ఈ ఛాలెంజ్ లో గెలిస్తే నువ్వేం చేస్తావో చెప్పు" విమల్ వేపు చూస్తూ అన్నాడు అభిరామ్.
   
    "చెప్పానుగా.....మేఖల ఏం చెప్తే అది చేస్తాను...." దృఢంగా అన్నాడు విమల్.
   
    "ఓకే! పదండి.....మేం కూడా వస్తాం. ఈ ఎక్స్పర్ మెంట్ సక్సస్ అయితే...." ఆ మాట పూర్తి చెయ్యలేదు అభిరామ్.

 Previous Page Next Page