Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 40

    "పని లేకపోయినా రావచ్చు కదా! తప్పులేదుకదా?"

    "తప్పు కానంతవరకూ ఏదీ తప్పుకాదు."

    "అంటే?"

    "కాస్త డీప్ గా ఆలోచించండి అదే అర్ధం అవుతుంది."

    "నాదసలే మట్టిబుర్ర దీక్షగారు! సుదీర్ఘంగా అలోచించి సముద్రం అట్టడుగు పొరల్లోకి కూరుకు పోయి వుక్కిరి బిక్కిరి కావటం ఎందుకు చెప్పండి?"

    'పృధ్వీరాజ్ ఏదీ దాచుకోకుండాను ముక్కు సూటిగా మాట్లాడుతాడుగాని వళ్ళొంగని మనిషి. బలంగా ఎత్తుగా వున్న ఈ మనిషి కరాటే నేర్చుకుంటే ఎంత చక్కగ వుంటుంది?'

    "ఏమిటండోయ్! చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకుని ఆలోచనా స్రవంతిలోకి వెళ్ళిపోయారు!" పృధ్వీరాజ్ అడిగాడు.

    దీక్ష ఉలికిపాటుతో తెప్పరిల్లి గబుక్కున "మీరు కరాటే నేర్చుకోకూడదూ!" అంది. అంతలోనే తన తొందరపాటుకి రవంత కలవర పడింది.
    "బాగుంది! నేనేమిటి హిహి.. కరాటే .... ఇప్పుడు..హిహి నేర్చుకోటం..హిహి..!" అన్నాడు పృధ్వీరాజ్ నవ్వుతూ.

    "మీరెందుకు నవ్వుతున్నారో నాకు అర్ధం కావటం లేదు. కరాటే నేర్చుకోటం తప్పుకాదే! పైగా మీ శరీర ఆకృతికి ఈ విద్య బాగా నప్పుతుంది. పైగా మీ వయసు గురించి అలోచిస్తున్నట్టున్నారు. నేర్చుకోవాలి అన్న కోరిక వుండాలి కానీండి నేర్చుకోటం కష్టం కాదు. కాపోతే చిన్నప్పటి నుంచీ నేర్చుకుంటే మాత్రం శరీరం చువ్వలా వంగనూ కలదు, బొంగరంలా తిరగనూ కలదు. ఉక్కులా మారనూ కలదు. ఆపదలో ఆత్మరక్షణకి...."

    పృధ్వీరాజ్ పైకి నవ్వేశాడు.

    "ఎందుకు నవ్వుతారు?' దీక్ష చిరుకోపంతో అడిగింది.

    "నేనేమన్నా ఆడపిల్లనా ఆపద, ఆత్మరక్షణ అంటున్నారు. అందుకు నవ్వు వచ్చింది."

    "ఆపద ఆడపిల్లకే కాదు మగవాడికీ తప్పదు."

    "నిజమే ననుకోండి. నా దగ్గర ఏముందని దోచుకుంటారు! డబ్బా నగలా!"

    "అఫ్ కోర్స్, ఈ నిమిషాన లేకపోవచ్చు. రేపు పెళ్ళాన్ని ..."

    "అయ్యో, నాకింకా పెళ్ళి కాలేదండీ!" గుర్తు చేశాడు పృధ్వీరాజ్.

    "అయిందని నేను మాత్రం అన్నానా! మగాడన్న తర్వాత పెళ్ళంటూ కాకపోతుందా! అప్పుడు మీరు మీ భార్యని వెంట బెట్టుకుని రాత్రిపూట ఏ సందులోంచో వస్తూవుంటే నలుగురు రౌడీలు మీ వెంటబడితే అప్పుడు... అప్పుడు...."

    "కాళ్ళున్నాయి కదండీ!"

    "దేనికి?"

    "పరుగెత్తటానికి. చేతులున్నాయి కదండీ దండం పెట్టటానికి?" అమాయకంగా ముఖం వేసుకుని చెప్పాడు పృధ్వీరాజ్.

    "ఛీ... ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గులేదూ!" దీక్ష ఛీత్కారంగా మాట వదిలింది.

    పృధ్వీరాజ్ ముఖం కందగడ్డ అయింది. కాని పెదవి కదపలేదు. మూతి బిగించుకుని వుండిపోయాడు.

    పిరికితనం అంటే దీక్షకి మహా అసహ్యం. వెన్ను చూపించే మగవాడంటే అసలు భరించలేదు. కొందరు మనుషులని చూడంగానే వాళ్ళతో స్నేహం చేయాలి, మాట్లాడాలి అని వుంటుంది. మరికొందరి ముఖం చూస్తూనే ద్వేషభావం కలుగుతుంది. అదెందు కంటే ఎవరూ చెప్పలేరు.

    దీక్షకి పృధ్వీరాజ్ రూపం అమాయకంగా, మాటలు తొలి చూపులోనే చాలా నచ్చాయి. స్నేహ పాత్రుడు అనిపించాడు, అతని కళ్ళలోని మిలమిలలలో కాంక్ష కామం లాంటివి కానరావు. ఆత్మీయత వుంటుంది. తొలిపరిచయం నుంచే మాటలు చిలిపిగా చనువుగా సాగుతున్నాయి. ఆ చనువుతో తనకున్న సహజమైన ఆవేశంతో దీక్ష నోరు జారింది.

    "క్షమించండి." దీక్ష అంది.

    పృధ్వీరాజ్ మాట్లాడలేదు.

    "క్షమించమని అడిగాను..." గట్టిగా అంది దీక్ష.

    "ఎందుకు క్షమించటం?"

    "నేను నోరు జారినందుకు."

    "ఓ అదా! నేను మిమ్మల్ని అర్ధం చేసుకున్నా కదా!"

    "అర్ధం అంటే?"  

 Previous Page Next Page