Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 39

    అనగనగా ఓ అమ్మాయి కథ దీక్ష చెపితే ఆ అమ్మాయి ఎవరని వాళ్ళెవరూ గట్టిగా అడగలేదు. కాస్త మార్పులు చేర్పులు చేసి దీక్ష కొంతవరకు తన కథనే చెప్పింది. ఇంపైన కంఠము, సొంపైన అందము దీక్షకి వున్నాయి. ఓ పక్క మొండి ధైర్యం మరోపక్క చాకచక్యం. దీనికి తోడు చేతిలో ఓ విద్య, కొండంత ఆత్మబలము వున్నాయి. చేతిలో పదివేల రూపాయలు.

    కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి. దీక్షకి కూర్చుని తినక తప్పటంలేదు. పాంప్లెట్లు అచ్చు వేయించడానికి ఇంట్లోకి కావాల్సిన సామానులకి ఈ ప్రదర్శనకి ఎనిమిదివేల ఆరొందలు అక్షరాలా ఖర్చు అయాయి. మిగిలిన పద్ధానుగు వందలతో ఎన్ని రోజులు, పోనీ ఎన్ని నెలలు గడుస్తుంది? ఆ కాస్త డబ్బు అయిపోతే ఏం చేయాలి?

    ఆలోచిస్తే నెత్తిన పెద్ద బండరాయి పెట్టినట్లు వుంటుంది. కళ్ళముందు అంతా శూన్యమే. దీక్ష కూర్చుని లెక్కలు వేసింది. కరాటే ప్రదర్శనకి పిలచిన వాళ్ళలో కొందరు స్నేహితులు, మరికొందరు వూరికే పరిచయస్తులు. రమ్మనగానే అందరూ హెల్ప్ చేయటానికి వచ్చారు. మంచి బుద్ధితో కదలి వచ్చారు. ఏమీ ఆశించలేదు.

    దీక్ష వాళ్ళకి రానూపోనూ ప్రయాణ ఛార్జీలు యిచ్చింది. చిన్న చిన్న గిఫ్ట్ లు వెళ్ళేటప్పుడు యిచ్చింది. వాళ్ళ భోజన ఖర్చు. ఇవేమి వాళ్ళు వద్దన్నారు. నా దగ్గర డబ్బువుంది అని బలవంతాన  తనే ఖర్చు పెట్టింది. "పిలవంగానే వచ్చారు. అదేనాకు పెద్దసాయము. అంతులేని ఆనందము." అంది దీక్ష మనస్పూర్తిగా.

    దీక్ష అన్నీ లెక్కలు వేసి ఆ పుస్తకం పక్కనపెట్టి రేపటి రోజు గురించి ఆలోచనలో పడింది. ఏమి చేయాలి, ఏం జరగబోతున్నది, అసలు ఏమన్నా జరుగుతుందా! దీక్ష ఆలోచనలు అయోమయంగా సాగుతున్నాయి. కళ్ళముందు శూన్యం.

    చేసిందంతా వృధాయేనా!

    ఇంకా ఏం చేయాలి!

    ఇహ ముందు ఏం చేయాలి!

    దీక్ష మోకాళ్ళ చుట్టూ రెండు చేతులూ బంధంవేసి మోకాలి మీద గడ్డం ఆనించి దీర్ఘాలోచన చేస్తున్న వేళ ....

    "దీక్ష గారూ!" అన్న పిలుపు వాకిట్లోంచి వినవచ్చింది.

    దీక్ష వినిపించుకోలేదు.

    వచ్చింది పృధ్వీరాజ్.

    ఇంట్లోంచి ఏ అలికిడీ కాకపోవటంతో పృధ్వీరాజ్ బైట నుంచే పిలిచాడు. దీక్ష పలక్కపోవటంతో సరాసరి లోపలకి వచ్చాడు. దీర్ఘాలోచన చేస్తూ కూర్చున్న దీక్షని చూశాడు. అక్కడే ఆగిపొయ్యాడు. అలాచూస్తూ వుండిపొయ్యాడు.

    దీర్ఘ నిట్టూర్పు విడిచి ఆలోచనా స్రవంతిలోంచి బైటపడుతూ తల ఎత్తిచూసింది దీక్ష.

    క్షణకాలం ఇరువురూ కంగారు పడి తేరుకున్నారు.

    "మీరు.... !" అన్నాడు పృధ్వీరాజ్.

    "మీరు.... !" అంది దీక్ష.

    ఇరువురు ఏకకాలంలో మీరు అనేసి ఆగిపొయ్యారు.

    దీక్ష చటుక్కున లేచి నుంచుంది.

    "మిమ్మల్ని మూడుసార్లు పిలిచాను. మీరు వినిపించుకో లేదు." నా తప్పేమీ లేదు అన్నట్లు చెప్పాడు పృధ్వీరాజ్.

    "నేనే, ఏదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు. సారీ!" అంది దీక్ష.

    "ఊరికే, ఇటుపక్కకి వస్తూ వచ్చాను." సంజాయిషీ ఇస్తునట్లు పలికాడు పృధ్వీరాజ్.

    "ఫరవాలేదు! మీ రెందుకు వచ్చారని నేను అడగలేదు కదా! రండి." అంది దీక్ష కుర్చీ జరిపి ఆహ్వానిస్తూ.

    అక్కడ రెండో కుర్చీ లేకపోవటం పృధ్వీరాజ్ గమనించాడు. "అక్కరలేదు. చాపమీద కూర్చుంటాను." అన్నాడు.

    "నాకు తెలుసు మీరెందుకు చాపమీద కూర్చుంటానన్నారో!" దీక్ష నవ్వుతూ అంది.

    "చాలా చిన్న విషయం మీరు గ్రహించకుండా ఎలా వుంటారు?" అంటూ పృధ్వీరాజ్ చాపమీద కూర్చున్నాడు.

    మంచినీళ్ళు కావాలా!"

    "ఉహూ."

    "చెప్పండి." అంది దీక్ష చాపకి అటు చివరగా కూర్చుంటూ.

    "ఏం చెప్పాలి?" పృద్విరాజూకి అర్ధంకాక అడిగాడు.

    "మీరెందుకు వచ్చారో!"

    "ఓ... అర్ధమైంది, పని ఏమీ లేకపోతే రాకూడదా?"

    "అలా అన్నానా! ఏదైనా పని లేకుండా రారు కదా అన్న ఉద్దేశ్యంతో అడిగాను."  

 Previous Page Next Page