'నీ కంతగా నచ్చకపోతే ఇంటికి పంపవలిసింది, వరదం! ఆ పెట్టెలో, ఆ జంబుఖానాలో ఎన్ని జ్ఞాపకాలు, యెవరి ఆశీస్సులు ఉన్నాయో నీకు తెలియదు. తెలిస్తే అలా చేసేవాడివికాదు' అంటుంది.
పది నిముషాలు ఈవిధంగా తర్కవితర్కాలు జరిగేక వాటిని ఎక్కడో అక్కడ దాచివుంచి మనిషి కనిపించినపుడు ఊరుకి పంపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేడు రాజు.
అతడు తన ఆలోచనల్లో ఉండగానే రాజమ్మ గదిలోకి వచ్చింది. "నీ బట్టలు ఆ స్టీలు బీరువాలో పెట్టుకో. పడుకొనేందుకు మంచం, పక్కా వుంది కాబట్టి ఆ పక్కచుట్ట, కాళీపెట్టె రామయ్య చేతికి ఇస్తే సామాన్ల గదిలో పెడతాడు" అంది.
తన సమస్య నివారణోపాయం చూపించ ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది రాజమ్మ వరదరాజు కళ్ళకి. ఒకటొకటిగా తన పెట్టెలోంచి వరదరాజు సామాన్లు తీస్తుంటే రాజమ్మ వింతపోయి చూస్తూ "ఇవన్నీ దేనికి?" అంది.
"హాస్టల్లో వుంటే ఇవన్నీ అవసరమే కదండీ!" అన్నాడు రాజు, మిగిలిన వస్తువుల్ని కూడా బయటికి తీస్తూ.
"నువ్వు హాస్టల్లో వుంటే వాటి అవసరం వుందేమో కాని ఇక్కడ మా ఇంట్లో వాటి ఉపయోగం వుండదు. ఆ జర్మన్ సిలవరు చెంబు, అరచేయి కైవారంలో ఉన్న ఆ అద్దం, ఆ కొమ్ము దువ్వెన, ఆ పళ్ళు దోముపుల్లలకట్ట.... వాటన్నిటినీ ఆ పెట్టెలోనే ఉండనీ" అంది.
అనవసరమైన వస్తువుల్ని, బట్టల్ని ఈ విధంగా పెట్టెలోకి చేర్చుతూంటే చివరకి రెండు జతల బట్టలు మాత్రమే స్టీలు బీరువాలోకి ఎక్కే అదృష్టానికి నోచుకొన్నాయి.
* * *
వచ్చిన వారంరోజులకి వదినకి ఉత్తరం వ్రాసేడు. "ఈ ఇంటివాళ్ళు చాలా మంచివాళ్ళు వదినా! నన్ను ఒక చుట్టంలా చూసి మర్యాదలు చేస్తున్నారంటే నమ్ము. ఏదో ఒక కారణం చూపుతూ ఈ వారంలో నాలుగు రోజులపాటు నన్ను హోటలుకి భోజనానికే పోనీయలేదు. ఈ ఇంటావిడ రాజమ్మ.
"వాళ్ల అమ్మాయి అనూరాధను గురించి నీతో చెప్పేను కదూ! ఎంత మంచిపిల్లను కొన్నావు? కొంచెం కూడా గర్వమన్న మాట లేదు. రాజూ....రాజూ....అంటూ నాతో ఎంతో సరదాగా చనువుగా మాట్లాడుతుంది.
"ఇంక రాఘవయ్యగారు ఇంటి పెద్ద, ఆయన అదో తమాషా అయిన మనిషి. మొన్న నేను యెంత వద్దన్నా వినకుండా నన్ను బజారుకి తీసుకుపోయి....నిజం వదినా, నేను వద్దని వారిస్తూనే వున్నాను, ఆయన నామాట వినలేదు.
"బజార్లో రంగు రంగుల బుష్ షర్టులు, రెడీమేడ్ పాంట్లూ చూస్తూంటే ముచ్చట వేస్తున్నది. కొనుక్కొని నేను వేసుకొంటే నలుగురూ నవ్వుతారు. నా ముచ్చట తీర్చుకొనేందుకు నీకు కొంటున్నాను అంటూ రెండు జతల బట్టలు కొన్నారు. పాంట్లు కొంచెం ఇరుకుగా కాళ్ళదగ్గిర పట్టినట్లు ఉన్నాయి. బుష్ షర్టు చేతులు మరీ పొట్టిగా ఉన్నాయి. అయినా వాళ్ళు కొన్న బట్టలు చూడు ....కుదరలేదంటే బాగుండదు. అలాగే వేసుకొంటున్నాను.
"నిన్న కాలేజీకి పోయినప్పుడు పరీక్షగా చూస్తే చాలామంది పిల్లలు ఇటువంటి ఇరుకుపాంట్లే వేసుకొంటున్నారు. తమాషాగా వుంది కదూ?"
"పూర్ణ ఏమంటున్నది? అన్నయ్యకి పొలంలో పనులెలాఉన్నాయి? మన ఎర్రావు ఇంకా ఈనలేదా? అక్కడి సంగతులతో ఉత్తరం వ్రాయి. కాని వదినా, మన ఊరివాళ్ళు వస్తే ఆవరణలో ఉన్న కుక్కని చూసి భయపడి పారిపోతారు. వాళ్లు పిలిచినా తోటంతా దాటి వాళ్ళ పిలుపు మేడమీది నా గదిలోకి వినిపించదు. అందుచేత కాస్త ఆలస్యమైనా ఫరవాలేదు. ఉత్తరాలు పోస్టులోనే వేస్తూండు."
ఉత్తరం అంతా మరొకసారి చదువుకొని సరిగా వ్రాసేనన్న తృప్తి కలిగేక పోస్టులో వేసేడు వరదరాజు.
"మీనాక్షమ్మగారూ!" అన్న పోస్టుమాన్ కేక విన్న మీనాక్షి తన చేతుల్ని పైటకొంగుకు తుడుచుకొంటూ వీధిగుమ్మంలో వచ్చింది. పోస్టుమాన్ చేతిలో పెట్టిన ఉత్తరంమీద తన పేరు చూసుకొని ఆశ్చర్యపోయింది మీనాక్షి. అదివరలో అప్పుడప్పుడు తమ్ముడి దగ్గిరనించి మీనాక్షికి ఉత్తరాలు వస్తుండేవి. తల్లిపోయిన సమయంలో అక్క ఆర్ధికంగా ఆదుకోలేదన్న కారణంగా అలిగి ఆ మీదట ముభావంగా వుండడం మొదలుపెట్టేడు. మరదలు కాపరానికి వచ్చేవరకూ తన ఇంట వచ్చి వుండమని మీనాక్షి యెంత కోరినా అతడు రాలేదు. ఏం తిన్నాడో, ఏం మానాడో అని బాధపడుతూండేది. ఎంతో తెలివైన వాడనుకొన్న పెద్దతమ్ముడు ఏ రోగం రొచ్చూ లేకుండా కారుకింద పడి కళ్ళు మూసేడు. అటు చదువుకి, ఇటు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అల్లరిచిల్లరగా తిరుగుతున్న ఈ తమ్ముణ్ణి గురించి మీనాక్షి యెంత బాధపడినా ఫలితం లేకపోయింది. మరదలు వచ్చేక జరిగిన సంఘటనలతో వారి సంగతి మరిచి పోయేందుకు నిశ్చయించుకొంది మీనాక్షి.
మరి ఇప్పుడు ఉత్తరం యెవరు వ్రాసేరు? జాగ్రత్తగా కవరుచించి, కాగితం పైకి లాగింది. 'ఎవరో అనుకొన్నాను. వరదుడా వ్రాసింది' అంటూ ప్రక్కనున్న అరుగుమీద కూర్చుని చదువుకో సాగింది.
పొలంనించి తిరిగి వచ్చిన శివయ్య "ఎక్కడ నుంచి ఉత్తరం?" అన్నాడు గుమ్మం దాటుతూ.
"వరదుడు వ్రాసేడు" ఉత్తరంలోకి చూస్తూనే జవాబు చెప్పింది మీనాక్షి.
ఆమె ఉత్తరం చదవడం పూర్తిచేసి చూచేసరికి శివయ్య వాకిట్లో ఉన్న నీళ్ళతో కాళ్ళూ చేతులూ కడుక్కొని, నులకమంచంమీద పోగులాడుతున్న బొంతలో నిద్రపోతున్న కూతుర్ని చూస్తూ "ఈవేళప్పుడు పడుకొందేం?" అంటూ ప్రశ్నించేడు.