Previous Page Next Page 
వారధి పేజి 38


    "మంచిది, నాయనా! ఆరోగ్యం జాగ్రత్తగా  చూసుకొంటూ  బుద్ధిగా చదువుకో." అంతకన్న అధికంగా  తను చెప్పవలసిన  అవసరం దాటిపోయిందనుకొంది  మీనాక్షి.

    అన్నకు నమస్కరించి  పూర్ణని ఎత్తుకొని ముద్దులాడి  బండిలో కూర్చున్నాడు వరదరాజు.

    "చిన్నాన్నా, నేనూ పట్నం వస్తాను. నేనూ  నీతో వస్తాను."

    వరదరాజు  ఎప్పుడు వచ్చి వెళ్ళినా  పూర్ణ  తననికూడా  పట్నం  తీసుకువెళ్ళమని ఏడుస్తూనే వుంటుంది.

    "ఈసారి వచ్చినప్పుడు  తప్పక  తీసుకు  వెళతానమ్మా!" పూర్ణమో ఒకసారి చేతుల్లోకి  తీసుకొని  ఓదార్చి  వదినకి అందించేడు  వరదరాజు.

    బండి పట్నం దిక్కుగా  పోతూ వుంటే వరదరాజుకి  వెనుతిరిగి  గ్రామం వైపు చూడాలన్న  బుద్ధి కలగలేదు. 'ఏటికి ఆవలిగట్టున, బజారు వీథికి అటుగా, చక్కని  పూలమొక్కల మధ్య లేత నీలం రంగులో ధాటీగా  నిలిచివున్న మేడ, అందులో  తనకోసం  నిర్దేశింపబడిన  గది ....ఆ గదిలో  తనూ....' అలా సాగిపోయేయి రాజు ఆలోచనలు.

    వాళ్ళు ఎంతగా  ఆహ్వానించినా  సామానులు  పట్టుకొని  తిన్నగా  వెళ్ళబుద్ధికాలేదు  రాజుకి. ఒక చిన్న హోటలు గదిలో తన వస్తువులు పెట్టుకొని భోజనం వగైరాలు  కానిచ్చి సాయంకాలం  నాలుగు గంటల  సమయంలో  రాఘవయ్యగారి ఇంటికి  వెళ్లేడు.

    "నీ మాటే  అనుకొంటున్నాము....రా" అంటూ  ఆహ్వానించేడు  రాఘవయ్య.

    "సామానులు  ఏవీ?" చేతులు ఊపుకొంటూ  వచ్చిన  రాజుని  ప్రశ్నించింది  రాజమ్మ.

    "వెనక నుంచి  ఎడ్లబళ్ళ  మీద వస్తున్నాయి  లాగుంది" అంది అనూరాధ.

    "లేదండీ. నేను ఈ ఉదయమే  వచ్చేను. సామాన్లు  గదిలో వున్నాయి."

    అది హోటలు గదో, హాస్టలు గదో  తెలియనీకుండా  తమాషాగా తప్పుకొన్నాడు  రాజు.

    వరదరాజు  హాస్టల్లో  చేరేడనుకొన్నాడు  రాఘవయ్య. 'డబ్బుకి, భోగలాలసతకు  దాసులు  కానివారు  ఈ కాలంలో కూడా  కొంద రున్నారు' అనుకొన్నాడు  ఆశ్చర్యంగా.

    "ఏం, మీ అన్నయ్యా, వదినా  మా ఇంట  వుండ వీలులేదన్నారా?" రాజమ్మ ప్రశ్నించింది.

    "వాళ్లలా  అనలేదండీ. నీ ఇష్టం  అన్నారు."

    "మరి, నీకు ఇష్టం  లేదా?"

    "ముందుగా  మీతో ఒకసారి  చెప్పి సామానులు  తెచ్చుకుందామని  హోటలు గదిలో  పెట్టి వచ్చేను" అన్నాడు రాజు.

    "నువ్వేదో అమాయికుడివి  అనుకొంటున్నాను. గడుసువాడివే!" పకపక నవ్వేడు రాఘవయ్య.

    "ఆనాటి ఆహ్వానం  ఇంకా నిలిచివుందో, లేదో  తేల్చుకోందే  ఎలా వస్తాడు! ....నడుచుకోవలసిన  విధంగానే  నడుచుకొన్నావు." రాజమ్మ  ఆమోదముద్ర  వేసింది.

    అయ్యగారి ఆజ్ఞ  అందుకొంటూనే కారు  డ్రయివరు  వెంకటనాయుడు కారు తెచ్చి  పోర్టికోలో  పెట్టేడు.

    "సరే....నువ్వు వెళ్ళి  నీ సామానులు  తెచ్చుకురా. మేడమీద  గది నీకోసం  సిద్ధంగా  ఉంది." చేతిలోకి పైపు  తీసుకొంటూ  అన్నాడు రాఘవయ్య.

    వరదరాజుకి  ఆ కారులోని  మెత్తని  కుషన్లమీద  ఎలా కూర్చోవాలో తెలియదు. కారు మలుపు తిరుగుతున్నా, బ్రేకుపడినా  ముందుకీ వెనక్కీ తూలిపోతూ, తన కంగారు డ్రయివరు ఎదటఉన్న  అద్దంలో  చూస్తున్నాడేమో అని గాభరాపడుతూ  మెల్లిగా  హోటలు గది చేరేడు.

    చవకరకం హోటలులో  ఒక చిన్న  గదిలో  సామాన్లు పెట్టుకొని  వెళ్ళిన కుర్రాడు సరికొత్త  కారులోంచి  దిగడం  చూసి హోటలు ప్రొప్రయిటరు ఆశ్చర్యపోయేడు. 'ఈ కుర్రాడు ఏ నక్కతోక  తొక్కి వచ్చేడు? ఇంతలో  ఇంత గొప్ప  బంధువుల్ని  ఎలా కలుసుకొన్నాడు?' అనుకొన్నాడు.

    హోటలు  గదికి  అద్దె చెల్లించి  తన పెట్టె, పక్కచుట్ట కారులో  పెట్టుకొని  గంటలోపునే  తనకోసం  కేటాయించిన  గదిలో  ప్రవేశించేడు  వరదరాజు.

    పల్చని  కిటికీతెరలలో  నించి  సన్నని  సంధ్యకాంతి కొబ్బరి ఆకుల సందుల్లోంచి  గదిలోని  పాలపిట్టరంగు గోడలపై  పడి  ఇటు అటు చెదురుతున్నది. తెరిచిఉన్న  కిటికీలోంచి  తేలిపోతూ  వస్తున్న  గాలి  విరబూచిన  గులాబుల  పరిమళాన్ని  గదినిండా  నింపుతున్నది.

    గదిమధ్యలో  మెత్తని పక్క, మంచం, ఒకవైపుగా  బట్టల బీరువా, ఇంకొకవైపు  రైటింగు  టేబులు, కుర్చీ, దానికి అందుబాటులోనే  పుస్తకాల  షెల్ఫు!

    తన పాత జంబుఖానా  చుట్ట, వార్నీసు ఊడిపోయిన  సొట్టల ట్రంకు పెట్టె  ఎక్కడ పెట్టనా అని క్షణకాలం  తత్తరపాటుతో  ఇటు అటు చూసేడు వరదరాజు.

    రాఘవయ్యగారి ఇంట్లో  వుండాలనుకొని వస్తున్నప్పుడు  పెట్టె, పక్క చుట్ట కొత్తవి కొనుక్కోవలసింది. వీటిని  కారులో  పెడుతూంటే  ఆ డ్రయివరు చూసి నవ్వుకొని  వుంటాడు. ఇంకా ఈ గదిలో  ఎవరు కాలు పెడతారో, వారంతా  వీటి రూపురేఖల్ని  చూసి  నవ్వుకోక  మానరు. వీటిని  తీసుకురాకపోయినా  బాగుండిపోను, పోనీ, ఏ నవుకరుకయినా  ఇచ్చివేద్దామనుకొంటే  ఆ పెట్టె  వదినకి ఆమె పుట్టినింటివారు  సారెగా  పెట్టిందిట. ఆ జంబుఖానా  అమ్మకి గుర్తుగా  ఇంట్లో  వుంటున్నది. వాటి రెండింటినీ  ఎవరికో  దానంచేసి, తిరిగి  తను  వదిన  ముఖం చూడలేడు.
 

 Previous Page Next Page