'అందరివిషయమూ విడిచిపెట్టు. నీకు వ్యక్తిగతంగా ఏమయినా అపచారం చేశానా?'
ఆమె అప్పటికీ మాట్లాడకుండా ఏదో సంకోచిస్తుంది.
రాజారావు చప్పున ఆమెకు సమీపంగా పోయాడు. అభిముఖంగా నిలబడి 'వదినా!' అన్నాడు రుద్ధకంఠంతో. "మన చిన్నతనాలు నువ్వింత తేలిగ్గా మరచిపోతావనుకోలేదు... నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలో - అప్పటికి నేను బాగా చిన్నపిల్లవాణ్ణి. నీతో ఏదో చిలిపితగాదాలాడి నవ్విస్తూ వుండేవాణ్ణి. నువ్వు నన్ను దగ్గరకు తీసుకుని లాలిస్తూ వుండేదానివి. ఇద్దరం ప్రక్కప్రక్కన పడుకుని అనేక కబుర్లు చెప్పుకుంటూ వుండేవాళ్లం. నన్ను అన్నయ్య చావబాదుతుంటే నువ్వే అడ్డుపడి రక్షిస్తూ వుండేదానివి. 'నేనంటే అభిమానమున్న ప్రాణివి నువ్వు ఒక్కదానివే!' అని గర్విస్తూ వుండేవాడిని నేను. ఈనాటికి ఒక రౌడీనై పోయానా? అసహ్యమయ జీవినైపోయానా? నాతో మాట్లాడితే నీ మర్యాద పోతుందా? నీకేం జరుగుతుంది? నీకేం జరిగింది వదినా?"
ఆమె స్తబ్దురాలై నిలబడి కళ్లప్పగించి చూస్తుంది.
'సరే వదినా! నువ్వెళ్లు. ఈ కారాగారం నాకేమంత సుఖప్రదంగా లేదని చెప్పడానికే నిన్ను పిలిచాను. ఇంతకంటే బొత్తిగా మనిషి కనిపించకపోవడం నయంకదూ? ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూస్తుంటాను.'
అని రాజారావు మెల్లిగా తన గదిలోకి వెళ్లిపోయాడు. చీకట్లో ఇంకా నిలబడి వున్న ఆ స్త్రీ పమిటచెంగుతో కళ్లు తుడుచుకోవడం అతనికి కనబడలేదు.
* * *
మరికొన్ని రోజులు జబ్బుతో మూలుగుతున్నట్లు గడిచాయి. ఇలా ఇక్కడ వుండటం దుస్సహమనిపించింది రాజారావుకి. అవును... తాను ఇక్కడవుండి ఏం చేసేటట్లు? ఓ రోజున ఇహ బెజవాడ వెళ్ళిపోదామని బయల్దేరాడు. ఇంతలో ప్రక్కభాగాలలోంచి ఏదో సందడి వినిపించింది. ఏదో హడావుడిగానే ఉంది మొత్తానికి! తలుపుకు ఆనుకుని చెవి ఒగ్గి శ్రద్ధగా ఆలకించాడు. ఆడవాళ్లు అనుకుంటున్న మాటలు ఒకటిరెండు చెవిన పడినై. అతనికి అర్థమయింది. ఇహ ప్రయాణ ప్రయత్నం మానుకుని హతాశుడై కూర్చుండిపోయాడు.
అతని గుండెల్లో బల్లెం గ్రుచ్చుకున్నట్లనిపించింది. సత్యవతితో మాట్లాడిన ఆ రాత్రి జ్ఞాపకంవచ్చింది. మంజువాణితో సంబంధం ఏర్పడకుండా వుంటే తన మనసు మార్చుకుని అంగీకారం సూచించేవాడేమో? అసలతను విచారించకూడదు కానీ ఆమె తనమీద పగ తీర్చుకుంటున్నట్లుగా అనుభూతి పొందాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది సత్యవతి.
అతనికి భయంవేసింది. తనను ప్రేమించిందా సత్యవతి గాఢంగా? ఒకర్ని ప్రేమించి, మరొకర్ని పెళ్లిచేసుకున్నవాళ్ల జీవితాలు దుర్భరంగా వుండవా? ఒకవేళ క్రమేపీ వాళ్లు ఆ జీవితానికి అలవాటుపడిపోయి పిల్లల్నికంటూ ఆలోచించడం మానేస్తారా?
కొంపతీసి సత్యవతి ఏమీ అఘాయిత్యం చెయ్యదుకదా?
చేస్తే ఆ ఉసురు తనకే తగులుతుంది. నరకమంటే అప్పుడు. ఇహ ఇప్పట్లో అక్కడికి పోలేడు. పోయి ఆ వీధుల్లో తిరగలేడు... అతను స్థబ్ధుడై కూర్చుండిపోయాడు.
పెళ్లి ఇంకో మూడురోజులే వుంది. మరునాడే ఆ ఇంట్లోనివారంతా వెళ్లిపోయారు. తల్లి, అన్నలు, వదినలు అంతా వెళ్లారు. అతన్నెవరూ పిలవలేదు. పిలుస్తారని అతను భావించనూలేదు.
* * *
వారంరోజులు దొర్లాయి. పెళ్లికి వెళ్లినవాళ్ళంతా వెనక్కి వచ్చేశారు ఒక్క రాజారావు తల్లి తప్ప. వచ్చినప్పటినుండీ కొంతసేపు పెళ్లి కబుర్లతో గడిచిపోయింది. పెళ్లికొడుకు నల్లగా, లావుగా వున్నాడట. అయితేనేం? నెలకు మూడొందల యాభై సంపాదిస్తున్నాడు.
ఆ రాత్రి గడిచింది.
ఈ విషయాన్ని మొట్టమొదట అనుమానించింది పెద్ద వదినగారే. అసలే ఆనాడు రాజారావన్నమాటలు మనసులోచేరి గాభరాపెడుతున్నాయి. అప్పట్నుంచే అతను చీటికీమాటికీ గుర్తుకొస్తున్నాడు. పెళ్ళినుండి వచ్చినప్పటి నుండీ అతని జాడలేదు. గదిలో వున్నాడా? ఎక్కడికైనా పోయాడా?
పెళ్లికి కొంతసేపటికి ముందు సత్యవతిని ఒంటరిగా కలుసుకున్నదామె. తన ఒడిలో తలవాల్చి నిశ్శబ్దంగా ఏడవసాగిందా పిల్ల. తానామె ముఖంమీదకు ఒరిగి - చెవిలో 'తప్పు. ఊరుకో! ఈ సమయంలో ఇలా జరిగితే నానా రభసా అవుతుంది' అన్నది.
సత్యవతి ఏడుస్తూ 'వీళ్ళంతా కలిసి నా బ్రతుకుని బండలుచేశారు. నాకు తెలుసక్కయ్యా! బావ అలాంటివాడు కాదు... అవన్నీ ఈ అహంకారులు పుట్టించిన మాటలు' అంది.
'అలానే అనుకుందాం. కానీ నువ్వంటే ఇష్టంలేని వ్యక్తిని పెళ్ళి చేసుకుని నువ్వేం సుఖపడతావు సత్యవతీ?' అన్నది తను.
'ఇష్టం లేకపోవటమేమిటక్కయ్యా? నాకు తెలుసు. బావదంతా అదో ప్రకృతి. నేను గట్టిగా ప్రాధేయపడితే, తన పాదాలచెంత కొంచెం చోటియ్యకపోయినాడా?' అంది పెళ్లికూతురు.
అదంతా గుర్తుకువచ్చి ఆమె కళ్లలో నీళ్లు నిలిచాయి. తెగించి అతని భాగంలోకి అడుగుపెట్టి ఓసారి అతని గదిమీదుగా నడిచివెళ్ళింది. తలుపులు కొంచెంగా తెరిచివున్నాయి. ఆ ఖాళీలోంచి రాజారావు మంచంమీద గోడవైపు తిరిగి పడుకుని వుండటం కనిపించింది.
ఆమె ఇహ ఉండబట్టలేక పనివాణ్ణి పిలిచి అడిగింది రహస్యంగా.
'మీరు వెళ్ళినకాడినుండి ఒళ్ళు తెలియని జ్వరమండీ అయ్యగారికి!' అని చెప్పాడు వాడు.
'మరి నేను రావడంతోనే చెప్పావేమిట్రా మొద్దూ?' అని కేకలేసింది ఆమె.
'నేనేం చెయ్యనమ్మగారూ? ఎవరికీ చెప్పొద్దన్నారు బాబుగారు' అన్నాడు పనివాడు. ఆమె గుండెల్లో ఏదో కెలికినట్లయింది.
ప్రక్కనుంచి పోతున్న చిన్నకోడలు ఆగి 'ఏమిటి? మరిదికి జ్వరమా?' అంది.
పెద్దకోడలు పెదవివిరిచి 'అహంకారులకు నిలయమైన ఈ కొంపలో ఒకరి జోలి మరొకరికికూడానా చెల్లీ?' అంది.
చిన్నకోడలు మ్లానవదనంతో 'ఆపేక్షలుండి ఏంలాభం అక్కా? ఒకప్పుడు ఆలనాపాలనా కనుక్కున్నవాళ్ళంకదా? అన్నీ చూస్తూ నోరు మూసుకుని కూర్చున్నామంటే - మరి ఆడబ్రతుకు!' అంది.
ఆ సాయంత్రం కనుచీకటి పడుతున్న సమయానికి రాజారావు తన గదిలో కళ్ళు మూసుకుని పడుకునివున్నాడు. అలికిడివిని ప్రయత్నంమీద కళ్లువిప్పి చూశాడు.
బెడ్ లైట్ వెలుతురులో ఓ స్త్రీ మూర్తి మంచందగ్గరగా నిలబడి వుండటం కనిపించింది. 'నువ్వా?' అన్నాడు నీరసంగా.