Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 36


    నిట్టూర్చాడు గోపీ.
    "కానీ ఆయనకది రంపపుకోత రాధా"
    "కొన్ని కొన్ని సుఖాలకోసం కొన్ని కష్టాలు అనుభవించక తప్పదు."
    "ఎలా ఒప్పిస్తావో నీ యిష్టం"
    "నా ఇష్టమే అంటే మరేం ఫరవాలేదు. నేను చెప్పినట్లు చేయండి. ముందు ఆయన బాధపడినా తర్వాత మనదారికి రాకమానడు."
    "గోపీ అంగీకరించాడు.
    రాధ బాగా ఆలోచించి ఓ పథకం వేసింది.


                              *    *    *


    రాధ వేయించిన దండోరావిన్న చంద్రయ్య ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి.
    "విశాలా! విశాలా! మీ రమణగాడి పని అయిపోయింది. ఆస్తి అంతా అమ్మేస్తున్నాడు" అన్నాడు.
    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది.
    "ఎందుకో నాకూ తెలియదు. అలా వెళ్ళి విచారించి, వస్తాను" అని వెళ్ళిపోయాడు చంద్రయ్య.
    విశాల మనస్సంతా చేదుగా అయిపోయింది, చంద్రయ్య సంతోషం చూసి ఆమె అసహ్యించుకుంది.
    ఊరు ఊరంతా విస్తుపోయింది.
    పొలంలో ఉన్న రమణయ్యకి విషపుగాలి సోకింది, అతను విస్తుబోయాడు. తమ్ముడూ, మరదలూ ఇంతకు తెగిస్తారని అతననుకోలేదు. శీనయ్య చెప్పిందంతా విని అతనికివాళ్ళ ముఖం చూడాలనిపించలేదు. ఇంతవరకూ వచ్చాక వాళ్ళు తనమాట వింటారనే నమ్మకం పోయింది రమణయ్యకి.
    కానీ మునసబు పిలిస్తే ఊళ్ళోకి రాక తప్పలేదు.
    అతను చెప్పిన ఆలోచనవిని "నాకిష్టం లేదు మామా! నాదేముంది? అంతా వాడి ఆస్తి, అమ్ముకుంటానంటే నేనభ్యంతర పెట్టటానికెవడ్ని" అన్నాడు.
    మునసబు ఎంతగానో చెప్పిచూశాడు.
    కానీ రమణయ్య తలూపలేదు.
    ఇంటికి వచ్చాడు రమణయ్య.
    అన్నగారి ముఖం చూడటానికి చెల్లలేదు గోపీకి, రాధ వంటిల్లు విడిచి రాలేదు.
    "గొపే౧ ఇదంతా నీ ఆస్తి నీ ఇష్టం ఏమయినా చేసుకో! కానీ పిల్లవాడున్నాడు జాగ్రత్త" అన్నాడు రమణయ్య.
    గోపీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి "వద్దు. అంత దయ వద్దన్నయ్యా! నన్ను రెండు చెంపలూ వాయించు, తిట్టు కొట్టు రాధని అదుపులో పెట్టు. రామూని, వాడి ఆస్తిని కాపాడుకో." అనాలనిపించింది. కానీ అనలేకపోయాడు.
    "మోహన్ జీ సేట్ ని పిలిపించు. అతనైతే తగిన ధరయిచ్చి కొంటాడు. కేశవయ్య విన్నా, పుల్లయ్యవిన్నా, సుంకయ్య విన్నా పొలానికి తగిన ధర పలకనివ్వరు" అన్నాడు గోపీతో రమణయ్య.
    "మీరే పిలిపించండి బావగారూ! మాకు ఏమీ తెలియదు. మేం తప్పుచేస్తున్నామో, ఒప్పుచేస్తున్నామో పెద్దవాళ్ళు మీరు ఆశీర్వదిస్తే కానీ మాకు శుభం జరగదు. పైగా మీరు మా వెంట గుంటూరు రావాలి" అంది రాధ. ఆ మాటలు ఎలా అన్నానా అని ఆమె ఆశ్చర్యపోయింది.
    చెమ్మగిల్లిన కళ్ళు ఒత్తుకున్నాడు రమణయ్య.
    సేఠ్ జీ కోసం వెళ్ళిపోయాడతను.  
    "ఇంత మంచితనం ఉండకూడదన్నయ్యా! నీలాంటివాళ్ళు ఈనాటి సొసైటీకి పనికిరారు" అనుకున్నాడు గోపీ, అతడికి మనస్సంతా చేదుగా వుంది. వ్యవహారం యింతవరకూ వచ్చాక వెనుదిరగటం ఇష్టమూలేదు. కాదని మొండిగా వ్యవహరించగలిగే మొరటుదనమూ లేదు అతనిలో.


                                            *    *    *


    ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఇల్లు, పొలం అంతా అమ్మి తెచ్చిన డబ్బంతా ఫణి చక్రవర్తి చేతిలో పోశారిద్దరూ! లక్ష రూపాయలు లెక్కించి ఇస్తుంటే క్షణకాలం పాటు ఇద్దరికీ గుండెలు దడదడలాడాయి, ఏమవుతుందోనని. ఫణి సినిమా ప్రారంభించాడు. గన్ షూర్ డైరెక్టర్ని పట్టేడు. విపరీతమైన పబ్లిసిటీ యిచ్చాడు. నిర్మాతగా అతనిపేరు మార్మోగి పోతోంది.
    రాధ ఉద్యోగానికి రాజీనామా యిచ్చేసింది. గోపీ ఒక సంవత్సరం లీవ్ పెట్టేడు. ఈ ఆరునెలలూ అయిదుగురికీ విశ్రాంతి లేకపోయింది.
    నటీనటులని సెలక్షన్స్ చేసుకోవటంలో చాలా చిక్కు ఏర్పడింది. కొన్ని వేలమందిని చూశారు. కొన్ని వందల ఊళ్ళు తిరిగారు. కొన్ని వేలరూపాయలు ఖర్చయ్యాయి.
    చివరకి చాకులాంటి హీరో దొరికాడు. అతని బి.ఏ తప్ప అతని నటన తప్ప అతనివద్ద చిల్లిగవ్వ లేదు. బాగా డబ్బున్నవాడు దొరుకుతాడేమోననుకున్న వీరికి అది చాలా నిరాశ కలిగించింది. కానీ డైరెక్టరు గారు అతన్ని సెలక్టు చేశాడు.
    "పిక్చర్ చూశాక డిస్ట్రిబ్యూటర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు" అన్నాడు ఆయన, వీళ్ళకి నోరెత్తే అవకాశం లేకపోయింది. హీరోయిన విషయంలో ఇక డబ్బు అడగటానికి ఆస్కారమే లేకపోయింది. అనాధ శరణాలయమలో చదివి రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఆ అమ్మాయి ఏం యివ్వగలదు.  
    విలన్ వేషానికి సెలక్టు అయిన అతనుమాత్రం డబ్బు పెడతానన్నాడు. అయితే పిక్చర్ కనీసం సగమన్నా కానిదే పైసా ఇవ్వనన్నాడు.
    "అదీ కరెక్టే" అన్న డైరెక్టర్ మాటని తీసివేయలేక పోయారు. వాళ్ళ ఆశ అంతా డైరెక్టర్ మీదే ఉంది. అతను పట్టిందల్లా బంగారం అవుతోంది. అతని పిక్చరంటే మినిమం గ్యారంటీ, అతను పెద్ద పెద్ద కంపెనీలకి తప్ప కొత్తవారికి పనిచేయడు, కానీ కొత్తవాళ్ళతో ఎక్స్పెరిమెంట్ అనగానే వీళ్ళకి పనిచేయటానికి అంగీకరించాడు.
    ఆరు నెలలుగా పని ముమ్మరంగా సాగిపోతోంది. లొకేషన్స్ చూడటం అయింది. అందర్నీ సెలక్టు చేయటం జరిగింది, స్క్రిప్ట్ చేర్పులు మార్పులతో పకడ్బందీగా తయారైంది.
    అప్పుడు తెచ్చిపెట్టాడు చిక్కు ఫణి.
    "డబ్బు కావాల"ని అతను అనటం విని విస్తుపోయారిద్దరూ.
    "ఫణీ! ఉన్నదల్లా అమ్మేసి తెచ్చి పెట్టాం . మావద్ద ఇంకేం వుంది?" అన్నాడు గోపీ.
    "మీరెంత పెట్టారో అంతా నేనూ పెట్టానుగా."
    "అవును"
    "మరి యిప్పుడు పని సాగాలంటే కనీసం మరో రెండు లక్షలైనా కావాలంటున్నాడు డైరెక్టర్."
    "ఎక్కడి నుంచి తేవాలి?"
    "అది ఆయనకేం తెలుసు?"
    "ఫణీ! నీ వ్యవహారం నాకు అర్ధం కావటంలేదు, నీ మనసులో ఉద్దేశ్యం చెప్పు."
    "నాకు మనసులో ఒకటి మాటల్లో ఒకటి ఉద్దేశాలు ఉండవు. ఎన్ని చెప్పినా ఎంత ఆలోచించినా సినిమా ఆపటానికి వీల్లేదు. ఇప్పుడు ఆపేస్తే మనకి మంచినీళ్ళు పుట్టవు" అన్నాడు ఫణి.
    "ఈ మాటల ఫుట్ బాల్ అక్కర్లేదు, వివరంగా చెప్పు"
    డబ్బుకావాలి అంతే!" తాపీగా సిగరెట్ వెలిగించి అన్నాడు ఫణి.
    "డబ్బు! డబ్బు! అది ఎలా వస్తుంది"
    నవ్వేడు ఫణి గోపీ ఆరాటాన్ని చూసి.
    "అది తెలిస్తే చిక్కేముంది. వెళ్ళి తెచ్చుకోవటమేగా"
    "నీకు నవ్వులాటగా ఉందా ఫణీ?"
    "నాకు నవ్వుకోవటం హాబీ! ప్రతిదానికీ గాబరాపడి తలక్రిందులు కావటం నాకలవాటు లేదు."
    అంతేనా ఇంకేమయినా అలవాట్లున్నయ్యా?"
    నిశితంగా చూశాడు ఫణి "గోపీ! రెండర్ధాల మాటలు నాకురావు, వస్తే డైలాగులు రాసుకునేవాడిని, గోపీ! మాటలవల్ల పనులు కావు. పైగా మనసులు విరుగుతాయ్."
    గోపీ జవాబు చెప్పలేదు,
    "మనిషి వాటాకి నలభై వేలు తేవాలి, మీరు తేగలిగిన మార్గం ఉంటే చూడండి,
    "ఇక ఒకటే మార్గం బిచ్చమెత్తుకోవటం, ఉన్నదంతా ఊడ్చి తెచ్చాం,"
    "మీ అన్నయ్య....."
    అతనిమాట పూర్తికాకముందే అన్నయ్య! అన్నయ్య! మా అన్నయ్యవద్ద ఇంకేం ఉంది. ఉండటానికి యిల్లూ, తినటానికి తిండే లేకుండా చేసి వచ్చాం. అసలు ఊళ్ళో ఉన్నాడో....ఈ లోకంలోనే ఉన్నాడో...."
    "అయాం సారీ గోపీ! డబ్బులేనిదే పని జరగదు. లేదా యిప్పుడిలాగే వెళ్ళి ఫైనాన్సియర్ చేతుల్లో పడాలి."
    "అంటే?"
    "అంటే ఏముంది సిద్దాన్నాన్ని వాళ్ళచేతుల్లో పెట్టాలి. వాళ్ళు పిక్చర్ పూర్తిచేస్తాను. లీజ్ రైట్స్ వాళ్ళవి. వాళ్ళ అప్పుతీరిన తర్వాత ఏడాదికో రెండేళ్ళకో మూడేళ్ళకో మన డబ్బులు మనకిస్తారు. అప్పుడు సెకండ్ రన్ లో వచ్చిందే మన వాటా"   

 Previous Page Next Page