Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 35


                                                 తప్పులెన్నువారు....
    ఈమధ్య నేను వారంరోజులు 'సిక్' అయిపోయాను. ఎందుకంటే హర్షద్ మెహతా దెబ్బకు మా అంకుల్ చావుదెబ్బ తిన్నాడు ఆర్థికంగా! అంటే ఇక నుంచి ఆయన అప్పుడప్పుడూ మా పిల్లలకు పంపే ఖరీదయిన బహుమతులు వుండవన్న మాట.
    నేను ఆ షాక్ తట్టుకోలేక మంచం పట్టానన్న సంగతి మా కాలనీలో అందరికీ తెలిసిపోయింది. దాంతో నన్ను పలుకరించి సానుభూతి చూపేవాళ్ళతో మా ఇల్లు తిరుణాల్లా మారిపోయింది. అయితే ఈ వారంరోజుల్లోనూ మా మిడిల్ క్లాస్ కుటుంబాల మానసిక ప్రవృత్తిని చాలా దగ్గరనుంచి పరిశీలించి తెలుసుకునే అవకాశం కలిగింది నాకు.
    మనదేశంలో మనవాళ్ళందరూ మానసికానందం పొందేది కేవలము ఎదుటివాళ్ళను తప్పుపట్టడం ద్వారానే!
    ఎందుకంటే మొదటిరోజు మా పక్కింటి పార్వతీదేవిగారి తల్లి ఓ ఇన్ లాండ్ కవర్ తీసుకుని నా దగ్గరకొచ్చింది.
    "కొంచెం బాంబేలో వున్న మా పెద్దబ్బాయికి ఓ ఉత్తరం ముక్క రాసిపెట్టు బాబూ!" అందామె. నాకూ ఎలాగూ టైమ్ పాస్ అవడంలేదు కాబట్టి ఉత్సాహంగా కలం అందుకున్నాను.
    "ప్రియమయిన పెద్దబ్బాయి శంకరానికి! నేను కులాసాగానే వున్నాను. మీ చెల్లెలు పార్వతీ, మీ బావగారూ, పిల్లలూ అంతా బాగానే వున్నారు. నువ్వూ, కోడలూ, పిల్లలూ బాగున్నారని తలుస్తాను.
    నేను నిన్ను తలుచుకోనిరోజు లేదు - ఆపాడు దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారోనని! నీకు నా విషయం ఏమాత్రం గుర్తుకు రాదని తెలిసినా నేనూ నీలాగా వుండలేను కదా! కన్నకడుపు తీపి అంతే!
    నన్ను రమ్మని ఉత్తరాలు రాస్తున్నావు. నాకూ రావాలనే వుంది! నిన్నూ, పిల్లలనూ చూడాలని వుంది. కానీ ఆ ఉత్తరం నువ్వు మనస్పూర్తిగానే రాశావో లేదో నాకు తెలీదు.
    వచ్చి నీదగ్గరే వుండిపొమ్మని అంటున్నావు! ఆ మాట నువ్వంటున్నావు! మరి కోడలు కూడా అంత ప్రేమగానూ వుండాలి కదా! నువ్వంటే తల్లిని మర్చిపోయావ్ గానీ కోడల్ని చూడు- ఆమె తల్లిని మర్చిపోయిందేమో! ఇద్దరూ ఒకళ్ళను చూడకుండా ఒకళ్ళు వుండలేరు.
    నీ పిల్లలు ముగ్గురూ బాగున్నారనే తలుస్తాను. వాళ్ళు నన్నే కలవరిస్తున్నారని రాశావ్! కాని ఇక్కడ పార్వతి పిల్లలు కూడా ప్రతిక్షణం "అమ్మమ్మా" అంటూ నన్ను వదలరు. అంత ప్రేమ నేనంటే! పిల్లలంటే  అలా వుండాలి - నీ పిల్లలకు నేనంటే ఇష్టమేనేమో గానీ ఎప్పుడూ వాళ్ళ అమ్మమ్మనే తలుస్తారు! నానమ్మ అంటే విషం అయిపోతుంది వాళ్ళకు!"
    ఇంతవరకూ రాశాక ఇంక నేను వుండబట్టలేక ఉత్తరం రాయడం ఆపి కల్పించుకున్నాను. "కాని మీ అమ్మాయి పిల్లలు 'అమ్మమ్మా' అంటూ మిమ్మల్నెలా వదలలేకపోతున్నారో మీ కోడలి పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మను అంతగా ఇష్టపడడంలో తప్పేముంది?" అనడిగానామెని. ఆ ప్రశ్నతో ఆమెకు కోపం వచ్చింది.
    "నీకు తెలీదు నాయనా మా విషయాలు! కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందనీ - మా కోడలు పెద్దాడిని పూర్తిగా కంట్రోల్ చేసేసింది! గీసిన గీటు దాటడు వాడు!"
    "అందులో తప్పేముందండీ? భార్యా భార్తలన్నాక ఒకరి మాట ఒకరు వినాలి కదా?"
    ఆమె మండిపడుతూ చూసింది నా వైపు.
    "పెళ్ళాల మాటవినే మగాడెవడూ బాగుపడడు నాయనా! నువ్వు చరిత్రలో ఎక్కడయినా చూడు! ఆ కుటుంబం బాగుపడదు. ఇది మా కోడలి మీద కోపంతో చెప్పడం లేదు- అది మంచిపిల్లే- అయినా-"
    "మరి మీ అమ్మాయి పార్వతీదేవి చెప్పినట్లు మీ అల్లుడు వింటాడనీ, అతనెంతో మంచివాడనీ మీరు అంటూ వుంటారు కదా?"
    ముసలామెకు కోపం ఎక్కువయిపోయింది.
    ఛటుక్కున నా చేతిలోనుంచి కవర్ లాక్కుని వెళ్ళిపోయింది విసవిసా.
    మరికాసేపటి తర్వాత మా ఆవిడ ఓ కవర్ తీసుకొచ్చి నాకందించింది.
    "మా అన్నయ్యకు ఉత్తరం రాశాను - అడ్రస్ రాయండి కొంచెం" అంది.
    నేను కవర్ మీద అడ్రస్ రాసి కుతూహలంకొద్దీ లోపలి ఉత్తరం తీసి చదివాను.
    ప్రియమైన హరి అన్నయ్యకి,
    ఇక్కడ అంతా క్షేమం. మీరంతా కూడా క్షేమమని తలుస్తాను. మమ్మల్నందరినీ సెలవులకు బెంగుళూరు రమ్మని రాశారు. చాలా సంతోషం!
    కాని నీవు పెద్ద ఆఫీసరువి! మరి నీకు అక్కడికొచ్చినా మాతో మాట్లాడేంత తీరికుంటుందో వుండదో! కిందటిసారి వచ్చినప్పుడు అసలు మాతో మాట్లాడ్డానికే తీరికలేదు నీకు!
    పాపం వదినక్కూడా బొత్తిగా తీరికుండదు. ఎప్పుడూ పెద్ద పెద్ద ఆఫీసర్ల భార్యలు రావడం, తాను వాళ్ళింటికెళ్ళడం, పార్టీలకెళ్ళడం - ఇంక వీటన్నిటితో మాతో గడపడానికి ఏం కుదురుతుంది?
    నేనేం ఆమెను తప్పుబట్టడంలేదు. ఎవరి బిజీ వాళ్ళది. ఎవరి గొప్ప వాళ్ళది- మేము మీతో సరితూగలేకపోవచ్చు గాని మాకూ ఇక్కడ క్షణం తీరికుండదు. ఆయన ఇప్పుడు మా కాలనీ కమిటీకి వైస్ ప్రెసిడెంటయ్యారు. కనుక ఆయనకు ఏమాత్రం ఖాళీ వుండదు.
    అందుకని మేము బెంగుళూరు రావడం కుదరదు. అంతవరకూ చదివేసరికి నాకు ఒళ్ళు మండిపోయింది. "ఏమిటిది...ఇలాగేనా ఉత్తరం రాయడం?" అడిగానామెని.
    "మీకు తెలీదులెండి! మీరూరుకోండి! ఎంతకాలం ఒకరి మాటలు, చేష్టలు పడతాం?"
    "కానీ మీ అన్నయ్య ఎంత జెంటిల్మనే! నిజంగానే అప్పుడు అతను అనుకోకుండా వాళ్ళ జి.యమ్. వచ్చాడని చాలా బిజీ అయిపోయాడు. మనం ప్రత్యక్షంగా చూస్తూనే వున్నాం కదా. అక్కడ?"

 Previous Page Next Page