టూరిస్ట్ పారడైజ్ హైదరాబాద్
ఆరోజు మా కాలనీ కమిటీ మెంబర్లందరం తెల్లవారుజామునే నిద్రలేచాము.
మా రంగారెడ్డి వాళ్ళ చుట్టాలు కొంతమంది పల్లెటూరు నుంచి తెలుగు రాజధాని నగరం చూడాలన్న కోరికతో పిల్లా పాపలతో వస్తున్నారనీ, వాళ్ళకు నగరంలో చూడాల్సిన ప్రదేశాలన్నీ ఒక లిస్టు తయారుచేసి ఇవ్వాలని చెప్పాడతను.
"దానికి పెద్ద ఆలోచన ఎందుకు? టూరిస్టు డిపార్ట్ మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ట్రిప్స్ వుంటాయి కదా" అడిగాడు శాయిరామ్.
"అవన్నీ చాలా పాతకాలం నాటి ప్రదేశాలు. ప్రజలకు ఆసక్తి కలిగించే లేటెస్ట్ టూరిస్టు స్పాట్స్ ని మనం సజెస్టు చేస్తే బావుంటుంది" అన్నాడు రంగారెడ్డి. అందరం ఆలోచనలో పడ్డాం.
మరికాసేపట్లో వాళ్ళంతా టూరిస్ట్ బస్ లో రానేవచ్చారు. వాళ్ళకి కాలనీ తరపున కాఫీ ఫలహారాలు తోచింది ఇప్పించాం.
"మేము ఏమేం ప్రదేశాలు చూడాలి" అడిగారు వాళ్ళు. నిజానికి హైదరాబాద్ లో చూడాల్సిన ప్రదేశాలేమేం ఉన్నాయో, అసలు ఉన్నాయో లేదో కూడా మాకు తెలీదు.
ఎప్పుడయినా ఒకసారి మానవత్వంలేని రాజకీయనాయకుల్ని చూసి చూసి విసుగుపుట్టినప్పుడు మాత్రం మేము 'జూ'కెళ్ళి కాసేపు జంతువుల మధ్య ఆనందంగా గడపడం ఒక్కటే మాకు తెలుసు."
కాని వాళ్ళు 'జూ' మీద ఆసక్తి చూపించలేదు. 'జూ' అన్ని సిటీల్లోనూ వుంటుంది కదా. మద్రాసులో బోలెడు సార్లు చూశాం. అందుకని అది కాకుండా ఇంకేం వున్నాయో చెప్పండి అన్నారు వాళ్ళు. కొద్దిసేపు మళ్ళీ ఆలోచనలో పడ్డాక శాయిరామ్ బిగ్గరగా ఎగ్జయిట్ మెంట్ తో అరిచాడు. "అరెరె! మనం మర్చేపోయాం. ఈ మధ్య ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఒకటి కొత్తగా డెవలప్ అయింది. హైదరాబాద్ వచ్చిన వారంతా ముందు అక్కడికే వెళుతున్నారు"
"ఏమిటది?" అడిగారు వాళ్ళు.
"ఎన్టీర్ బుద్ధుడు! చాలామంది వెళ్ళి ఆ విగ్రహం మునిగినచోటుని చూసి కొబ్బరికాయలు కొట్టి చెంపలేసుకుని దణ్ణం పెట్టి వెళుతున్నారు."
"అవునవును. అది చూడాలి" అంటూ పిల్లలంతా ఆనందంగా అరిచేసరికి వాళ్ళు లిస్ట్ లో "హుస్సేన్ సాగర్ లో ఎన్టీర్ బుద్ధుడు" అని రాసుకున్నారు.
"ఆ తర్వాత చూడదగ్గ ప్రదేశం ఏమిటి?" అడిగాడొకతను. నాకు ఠక్కున అయిడియా వచ్చింది.
"ఆ కామధేనూ రింగ్ రోడ్ మీరు తప్పక చూడాలి. చాలా ఫేమస్ అది. త్వరలో గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కబోతుందని అంటున్నారు" చెప్పాను వాళ్ళకి.
"ఎందుకంత ఫేమస్ అయిందది."
"కేవలం ఆ ఒక్క రోడ్డుమీదే చాలామంది కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, లేబర్స్ బోలెడు సంపాదించుకుంటూ జీవితమంతా గడిపేస్తున్నారు. ఆ రోడ్ ప్రత్యేకత ఏమిటంటే ఎన్నిసార్లు రోడ్ వేసినా ఏమాత్రం వేయనట్టే వుంటుందది. ఆ రోడ్ మీద గోతులు కూడా ప్రపంచంలోకెల్లా లోతయినవి అని టూరిస్ట్ లు చెబుతుంటారు. ఈ రోడ్ నిజంగా ఒక ఇంజనీరింగ్ ఫీట్ అని అంటున్నారు."
వాళ్ళు వుత్సాహంగా 'కామధేనూ రింగ్ రోడ్' అని రాసుకున్నారు లిస్ట్ లో.
"ఆ తర్వాత మీరు సికింద్రాబాద్ లోని 'సిల్వర్ జూబ్లీ మాన్ హోల్' తప్పనిసరిగా చూడాల్సిందే. రోజూ ఆ డ్రయినేజి గోతిలో ఇద్దరు ముగ్గురయినా పడి హాస్పిటల్ కి వెళుతుంటారు. స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు కొంతమందయితే అందులో పడడంతోనే పైకెళ్ళిపోయారు" చెప్పాడు జనార్ధన్ ఉత్సాహంగా.
"అవును ఈ మధ్య కార్పొరేషన్ వాళ్ళు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ 'మాన్ హోల్' కేవలం ఆ రోడ్డు మీద వెళ్ళేవారికోసమే వుద్దేశించబడిందని. భగ్న ప్రేమికులు, ఇతర చిల్లరగాళ్ళు ఆత్మహత్యలకు దానిని ఉపయోగించడం తమ దృష్టికి వచ్చిందని- అలా చేయడం చట్ట విరుద్ధమని అన్నారు" అన్నాడు గోపాల్రావ్.
వాళ్ళు లిస్టులో 'సిల్వర్ జూబ్లీ మాన్ హోల్' అని రాసుకున్నారు.
"మర్చిపోయాను. ఈ మధ్య జనం టిక్కెట్ కొనుక్కొని మరీ చూస్తున్న 'టూరిస్ట్ స్పాట్' ఇంకోటుంది" అన్నాడు చంద్రకాంత్.
"ఏమిటది?" కుతూహలంగా అడిగారు వాళ్ళు.
"నగర శివార్లలో వున్న ఫ్యాక్టరీ! ఆ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల ఆ పక్కనే ఉన్న కాలనీ వాసులు పడే నరకయాతన ప్రత్యక్షంగా చూడవచ్చు మనం. పిల్లలకు వచ్చే రకరకాల జబ్బులు, పెద్దాళ్ళ మతి స్థిరం తప్పిన ప్రవర్తన భలే సరదాగా ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ రసాయనాల కాలుష్యం ఇంకొంచెం పెంచితే ఆ చుట్టుప్రక్కల వాళ్ళ బాధను చూసి ఎంజాయ్ చేయడానికి విదేశీ యాత్రికులు కూడా రావొచ్చని ప్రభుత్వం ప్లాన్ తయారు చేస్తోంది"
వాళ్ళు వెంటనే 'గవర్నమెంట్ టూరిస్టు ఫ్యాక్టరీ' అని రాసుకున్నారు.
"మీరు చూడాల్సిన ఇంకో అద్భుతం గురించి అందరం మర్చిపోయాం" అన్నాడు రంగారెడ్డి.
"ఏమిటది?" అడిగారు వాళ్ళు.
"తెలుగు ప్రజలందరినీ చిత్రవధ చేస్తోన్న, తెలుగు ప్రజలకు కేంద్రం బహుమతి హైదరాబాద్ దూరదర్శన్. అంత ఎక్కువ కాలం అంత ఎక్కువమంది ప్రజలను హింసించిన ఏకైక ప్రభుత్వ సంస్థగా దానికి విదేశాల్లో కూడా మంచిపేరు వచ్చింది. ఈ ఏడు ఫారిన్ టూరిస్ట్స్ కూడా పెద్ద సంఖ్యలో దానిని చూడ్డానికి వస్తున్నట్టు సమాచారం అందింది.
పిల్లలు, పెద్దలూ అందరూ ఈలలు వేసి చప్పట్లు కొట్టారు. "అవునూ, దూరదర్శన్ చూడాల్సిందే..."
లిస్టులో ఆ పేరు రాసుకున్నారు వాళ్ళు. "కేంద్రం బహుమతి హైదరాబాద్ దూరదర్శన్..."
"ఇవిగాక ఇంకేం చూడాలి?"
"పిల్లలకు ఎడ్వెంచర్ కోసం సిటీలో ఆటోలు ఎక్కించండి. పెద్దాళ్ళకు ఎడ్వెంచర్ కోసం కొంచెం జనసంచారం తక్కువ వున్న ఏ రోడ్డు మీదకెళ్ళినా గాని పట్టపగలు దోపిడీ గాళ్ళు కత్తులు చూపి మిమ్మల్ని దోచేసుకుంటారు. డబ్బు తక్కువ పట్టుకెళ్ళండి. చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది."
"ఇంకా పెద్ద ఎత్తున రిస్క్ ఎడ్వెంచర్ కావాలనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వేలో చాలా ఆకర్షణలున్నాయి."
"హాలిడే స్పెషల్ లో ప్రయాణం చేశారనుకోండి! ఏకంగా పైకెళ్ళిపోవచ్చు. గార్డులు లేకుండా, డ్రైవర్లు లేకుండా నడిపే రైళ్ళున్నాయ్. నిమిషాల్లో మీకు చెమటలు పట్టేస్తాయ్. విద్రోహులతో పడగొట్టించే రైళ్ళున్నాయ్. ఇరవై గంటలు ఆలస్యంగా నడిపించే రైళ్ళున్నాయ్.
మీ ఇష్టం! మీకేది సూటవుతుందనుకుంటే అది! పోనీ అంత రిస్క్ వద్దనుకుంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మీకు మాంచి ఎడ్వెంచర్ ఇస్తుంది. వాళ్ళు వేసిన నిజాం కాలంనాటి వైర్లు హఠాత్తుగా తెగి రోడ్డున పడి మీరు చూస్తుండగానే బోలెడు మందిని చంపేస్తాయ్. ఒకవేళ మీరు హాస్యప్రియులయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ కెళ్ళండి! ఆపరేషన్ చేయాల్సిన కన్నుకి బదులుగా రెండో కంటికి ఆపరేషన్ లు చేసే సీన్లు, చెడిపోయిన మూత్రపిండాలకి బదులుగా మంచి మూత్రపిండం తీసేసే డాక్టర్లు భలే నవ్వొస్తుందిలే! విరగబడి నవ్వాల్సిందే" చెప్పాడు రంగారెడ్డి.
వాళ్ళవన్నీ రాసుకుని ఆనందంగా బయలుదేరారు "హైదరాబాద్ సైట్ సీయింగ్ కి!"
* * *