యోగి ఆలోచిస్తూ ఫోన్ పెట్టేశాడు.
అపర్ణ ఫోన్ చేసిందా అనడిగితే చేసిందని చెప్పాడు- చాలాసేపే మాట్లాడిందా అంటే కొద్దిసేపే అని అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు శ్రీధర్ కంఠంలో దాచుకునే ప్రయత్నానికి లోనయిన తడబాటు స్పష్టపడింది.
అంటే అపర్ణ ఫోన్ చేయలేదు.
శ్రీధర్ సినిమా మధ్యలో వచ్చింది కూడా అపర్ణ ఫోన్ కోసం కాదు.
మరెవరి ఫోన్ కోసం వచ్చాడు?
అపర్ణ మాటల్నిబట్టి శ్రీధర్ ఫోన్ చాలాసేపు ఎంగేజ్ లో వుండి వుంటుంది.
అంటే శ్రీధర్ ఎవరితోటో చాలాసేపు మాట్లాడాడు. అది కప్పిపుచ్చుకోవడానికి అబద్ధమాడాడు.
'వార్నీ! శ్రీధర్! నువ్వు సామాన్యుడివి కావు' అనుకుంటూ లేచి కిచెన్ కేసి నడిచాడు యోగి.
శ్రీధర్ ఆమ్లెట్లు వేసే ప్రయత్నంలో తలమునకలై వున్నాడు.
"అబద్ధాలు చెప్పడం ఎప్పటినుంచి నేర్చుకున్నావ్?" నవ్వుతూ ద్వార బంధానికి జేరగిలబడుతూ అన్నాడు యోగి.
"అబద్ధమా?"
"అవును...ఇప్పుడే అపర్ణ అమెరికానుంచి ఫోన్ చేసింది."
"వ్వాట్?!" అంటూ చేస్తున్న పని ఆపి వేగంగా వెనుదిరిగాడు శ్రీధర్.
"ఎస్! కంగారుపడకు, లైన్ డిస్కనెక్ట్ అయింది. ఇంతకీ తన ఆచూకీ చెప్పకుండా, ఆనవాళ్ళు తెలుపకుండా, చిక్కకుండా తప్పించుకుంటున్న ఆ టెలిఫోన్ సుందరి ఎవరు? టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా అంటూ నువ్వు కమల్ హాసన్ లా పాడితే ఆవిడ మనీషాకొయిరాల లాగా ప్రత్యక్షమవుతుందేమో?"
"ఏమిటి అయ్యేది? అలా అయినా ఇక్కడ కాదు, మెల్ బోర్న్ అవుతుంది" అన్నాడు శ్రీధర్ అసంతృప్తిగా.
"బాధపడకు సోదరా! నేను మరీ అంత తెలివితక్కువవాడినేంకాదు. ఆఫీస్ విషయాల్లో పూర్ అయినా, ఈ విషయాల్లో మంచి ఇంటెలిజెంట్ నే. నువ్వు ఆమ్లెట్స్ తీసుకునిరా, ఒక పెగ్ లోన పడితే ఆచూకీ, అడ్డదారి అన్నీ అవే కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి" అంటూ యోగి వెనక్కి వచ్చేశాడు.
మరో నిమిషంలో శ్రీధర్ ఆమ్లెట్స్ తీసుకుని డ్రాయింగ్ రూమ్ లో కొచ్చి యోగికి ఎదురుగా కూర్చుని, ఆమ్లెట్స్ ప్లేట్ ని టీపాయ్ మీదుంచాడు.
రెండు నిమిషాల్లో పెగ్స్ కలిపి, ఒకటి శ్రీధర్ కి అందించి ఛీర్స్ చెప్పి అమృతం తాగుతున్నంత ఆనందంగా ఒక సిప్ చేసి, గ్లాస్ ని టీపాయ్ మీదుంచి, సిగరెట్ వెలిగించి-
"ఇప్పుడు చెప్పు జరిగింది జరిగినట్టు చెప్పు. ఆమె వివరాలు యిట్టే తెలుసుకుంటాను" అన్నాడు యోగి చిద్విలాసంగా గుండెలనిండా పొగ పీల్చి వదులుతూ.
అప్పుడప్పుడు మందు తీసుకునే అలవాటున్నా అప్పుడెందుకో శ్రీధర్ కి తీసుకోవాలని లేదు. దానికేం పెడర్ధాలు తీస్తాడోనని, యోగికి భయపడి ఒక సిప్ చేసి, మొట్టమొదటిసారిగా రావున్నాడా అంటూ మొదలయిన దగ్గర్నుంచి తన పేరు చెప్పేవరకు పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీధర్.
యోగి ఆలోచనల్లో పడిపోయాడు.
"మొదటిసారి సంభాషణలో నీకు విసుగేసి నుదురు కొట్టుకుంటే... ఎందుకయ్యా అందమైన నుదురుని అలా కొట్టేసుకుంటావ్ అని అంది. ఆ తరువాత నువ్వు బుద్ధిగా, ఒద్దికగా కూర్చుంటే, తుళ్ళిపడవలసిన యవ్వనంలో అలా యిలా కూర్చోవడం నాకు మహా చెడ్డ చిరాకు అని అంది.
ఒకటి: నుదురు కొట్టుకోవడం- చెప్పింది.
రెండు: బుద్ధిగా కూర్చోవడం- చెప్పింది.
మూడు: నువ్వు లేనప్పుడు నీ ఫోన్ నెంబరు కోసం ఒకమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఐర్నేస్ల్కివాలలా వుంది. తెలుగు బాగా వచ్చినట్టు లేదు అని జయారెడ్డి నీతో అంది.
నాలుగు: హాట్ కేరియర్ నీ డోర్ ముందు రాత్రి రెండుగంటలకు వుండడం, దాన్ని తనే వుంచానని అపరిచితురాలు అంది.
ఐదు: ఆమె ఆలోచనలతో బుర్ర హీటెక్కిపోయి, దాహమనిపించి పక్కనేవున్న వాటర్ బాటిల్ అందుకుని తాగితే, నీళ్ళు తాగావా? పాపం జీవుడికి గుండె హీటెక్కినట్టుంది అని అంది.
ఆరు: పాతాళభైరవి వీడియో కేసెట్ పంపినప్పుడు- ఎవరో కుర్రాడు వచ్చి నీ ఫ్లాట్ డోరు లాక్ చేశాడు. సరీగ్గా అదే టైముకు తలుపు చప్పుడైంది కదూ? అంటూ అడిగింది.
ఏడు: ఆ కుర్రాడ్ని పట్టుకోడానికి నువ్వు పరిగెడుతుంటే, పరుగెత్తే ఆపిల్లాడిది పి.టి.ఉష అంశ అని అంది...ఎలా అనగలిగింది...ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టు? ఆమె.
ఎనిమిది: నీ బాడీ గురించి ఆమె కరెక్టుగా చెప్పగానే, నువ్వు నీ బాత్ రూమ్ కెళ్ళి దానికేమన్నా హోల్స్ వున్నాయేమోనని పరీక్షించావు. అదీ ఆ అమ్మాయికి తెలిసిపోయింది.
తొమ్మిది: ఫిబ్రవరి 14 గురించి తెలుసుకోవడానికి నీ అల్మరాలో వున్న పుస్తకాల్ని నువ్వు రిఫర్ చేశావు. అదీ ఆమెకు తెలిసిపోయింది. పాపం, నువ్వు నీ పర్సనల్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చిందర వందర చేసినా ఫలితం లేక నేనిచ్చిన గడువులోపల మరెక్కడికో పరుగెత్తుకుంటూ వెళ్ళి వచ్చుంటావ్...అవునా అంటూ ప్రశ్నించింది.
పది" ఆమ్లెట్లు వేసుకోవడం, ఆడబొద్దింకలతో సహవాసం చేయడం అనికూడా అంది.
ఇవన్నీ చూసినట్టుగానే వుంది. ఇన్ని ఖచ్చితంగా చెప్పినమ్మాయి నిజానికి 7:30కి నువ్వు నీ ఫ్లాట్ లో వుంటే 7:35 వరకు కూడా ఫ్లాట్ కి చేరుకోలేదని అంది. ఇదొక్కటే సరిగ్గా ఎందుకు చెప్పలేక పోయింది?" యోగి సీరియస్ గా ఆలోచనల్లో పడిపోయాడు.
యోగి రీజనింగ్ శ్రీధర్ కి బాగా నచ్చింది. అతను సరైన దారిలో ఆలోచిస్తున్నాడనిపించింది.
యోగి మందు సిప్ చేయడం, సిగరెట్ వెలిగించడం, ఆలోచించడం ఆ కార్యక్రమం అలా ఓ అరగంట నడిచింది.
అప్పుడే....
సరిగ్గా అప్పుడే ఫోన్ రింగయింది. రింగవుతూనే వుంది. శ్రీధర్ ఫోన్ ఎత్తబోతుంటే వద్దని ఆపాడు యోగి.