ఇప్పుడతనిలో ఆమెతో ఆమె పేరు చెప్పించగలిగానన్న అహం పిసరంత కూడా లేదు.
అందమైన ఊహల సినేరియోలో, అహానికి, అసత్యానికి, అభిజాత్యానికి, ఆత్మవంచనకూ అవకాశమెందుకుంటుంది?
"ఏయ్...ఏమైపోయావ్...? ఏం చేస్తున్నావ్? పేరు చెప్పగానే మౌనంలో మునిగిపోయావేమిటి? నచ్చలేదా...నా పేరు?" నచ్చకపోతే పేరే కాదు- ప్రపంచాన్నే నీకు నచ్చేలా మార్చేస్తానన్నంత ఆరాధన, ఆరాటం ఆమె కంఠంలో తొంగిచూశాయి.
"మాట్లాడు...ఆపకు ప్లీజ్" అర్థిస్తున్నట్టుగా అన్నాడు శ్రీధర్.
"ఏయ్...ఏమైంది నీకు? పేరు వింటేనే ఇలా అయిపోయావ్. నన్ను ప్రత్యక్షంగా చూస్తే ఇంకేమయిపోతావో! మాట్లాడుతూ పోతే... వింటానికి నా కంఠంలో ఏముంది?"
"నీ కంఠంలో ఒక లతా మంగేష్కర్, ఒక సుశీల, ఒక జానకి, ఒక అలీషా చినాయ్, ఒక కవితా కృష్ణమూర్తి, ఒక సునీతారావులు దాగున్నారు. ఆపకు...ప్లీజ్..." అతని కంఠంలో పలికే ఎమోషన్స్ లో ఎంతో నిజాయితీ, నిబద్ధత దాగున్నాయి. అతని గుండె లోతుల్లో రేగే ఎమోషన్స్ ని స్పష్టంగా, నిర్దుష్టంగా పలకడానికి అతని చేతన స్థితి ఏ మాత్రం సిగ్గుపడలేదు.
ఎందుకో పూజ అనే అపరిచితురాలు వెంటనే ఏం మాట్లాడలేక పోయింది.
శ్రీధర్ ఆమె కంఠం కోసం అలా-అలా ఆర్తిగా ఎదురుచూస్తుండగానే ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది.
ఆ శబ్దం శ్రీధర్ కి వినిపించింది. కాని ఆ నిజాన్ని మాత్రం వెంటనే జీర్ణించుకోలేకపోయాడు.
డిస్కనెక్ట్ అయిన ఫోన్ ని సయితం అలా ఎంత సేపు పట్టుకుని చెవిదగ్గర వుంచుకున్నాడో అతనికే తెలీని అచేతన స్థితిలో కూరుకుపోయాడు.
* * * *
సరిగ్గా రాత్రి 9-30కి డోర్ బెల్ మోగితే అప్పుడు వులిక్కిపడి ఊహా ప్రపంచంలోంచి జారిపడి తెలుపుకేసి చూశాడు శ్రీధర్.
బెల్ ఇంకా మోగుతూనే వుంది.
వెంటనే లేచెళ్ళి తలుపు తీశాడు.
ఎదురుగా యోగి...యోగీశ్వరుడిలా....చిద్విలాసంగా నవ్వుతూ.
అప్పటివరకు తిరిగి పూజఫోన్ చేస్తే బావుండనుకున్నాడు శ్రీధర్.
ఇక ఆ రాత్రికి చేయకుండా వుంటేనే బాగుండనుకున్నాడు. అలా అనుకోవడానికి ప్రేమ గురించి ఒక్కోసారి ఫైలాసఫికల్ గా, ఒక్కోసారి చిన్నతనం చేసి మాట్లాడే యోగే కారణం.
"ఏంటి? అపర్ణ ఫోన్ చేసిందా?" అడిగాడు యోగి చొరవగా లోపలకొచ్చి సోఫాలో కూలబడిపోతూ.
"ఆ-ఆ-చేసింది" తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అన్నాడు శ్రీధర్. అది తొలి అబద్ధం.
"చాలాసేపే మాట్లాడిందా?"
"కొద్దిసేపే..." ట్రాన్స్ లోంచి బయటకు రానివాడిలా అన్నాడు శ్రీధర్. అది రెండో అబద్ధం.
"ఏం...ఏదోలా వున్నావ్?" శ్రీధర్ కేసి విస్మయంగా చూస్తూ అడిగాడు యోగి.
"ఏం...ఏంలేదు" ఇంకా శ్రీధర్ లోని వుద్విగ్నత తగ్గలేదు.
"అందుకే చెప్పాను బ్రదర్! ప్రేమను ప్రేమిస్తే బాధ మిగులుతుంది. కామిస్తే సుఖం గుర్తుండిపోతుందని. వింటావా నువ్వు. నిర్మలని పోగొట్టుకుని నేను చాలా నేర్చుకున్నాను. స్టేజీలపై ప్రదర్శనలిచ్చే వాళ్ళకి కావలసింది ప్రేమ కాదు-చప్పట్లు, ప్రశంసలు, ఆటోగ్రాఫ్ ల కోసం ఎగబడే అభిమానులు. ప్రేమ ఒక మైకం...మత్తు...వంద పెగ్గుల మత్తు... ప్రేమ విలువ తెలిసినవాళ్ళని ప్రేమించాలి. అదీ ప్రేమించక తప్పని స్థితి ఎదురయితే... అపర్ణ లాంటి మెటీరియలిస్ట్ ని కాదు...ప్రేమ మత్తులో పడిపోయి, ప్రేయసి కోసం పాలరాతి మందిరం నిర్మించిన షాజహాన్ ఏమై పోయాడు?" అంటూ ఆగి, సోఫాలోంచి కొద్దిగా పైకిలేచి, జేబులో విస్కీ బాటిల్ పైకి తీసి టీపాయ్ మీదుంచి-
"కొడుకు చేతిలోనే జైలుపాలయ్యాడు."
"ఎందుకలా? తండ్రి ప్రేమిస్తే కొడుకు అరెస్ట్ చేయడమేమిటి?" ఇండియన్ హిస్టరీతో బొత్తిగా పరిచయం లేని శ్రీధర్ ఆశ్చర్యపోతూ అడిగాడు.
"అది చెప్పాలంటే...అబ్బో...బోలెడు చెప్పాలి...ముందు కిచెన్ లోకెళ్ళి నాలుగు ఆమ్లెట్లు వేసుకురా. ఈలోపు నేను పెగ్స్ కలిపి రడీగా వుంచుతాను" అంటూనే ఫ్రిజ్ దగ్గరికెళ్ళి ఐస్ క్యూబ్స్ తీసుకుని, ఆ పక్కనే వున్న బీరువాలోంచి రెండు గ్లాసులు, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి టీపాయ్ సర్దేసి, హేపీగా జేబులోంచి సిగరెట్ పెట్టె, వాటర్ బాటిల్స్ తీసుకొచ్చి టీపాయ్ సర్దేసి, హేపీగా జేబులోంచి సిగరెట్ పెట్టె, అగ్గిపెట్టె తీసి సిగరెట్ కాల్చి పొగ వదులుతూ- తను శ్రీధర్ ఫ్లాట్ కొస్తుండగా ఎదురయి గుండె జారిపోయేలా చూసిన జయారెడ్డి గురించే ఆలోచించసాగాడు.
కిచెన్ లో ఆనియన్స్ కోస్తున్న శ్రీధర్ ఆలోచనలన్నీ అపరిచితురాలైన పూజమీదే వున్నాయి.
యోగి చేతిలోని సిగరెట్ చివరకొస్తుండగా...అప్పుడు మోగింది ఫోన్.
ఆ శబ్దం శ్రీధర్ కి వినిపించే అవకాశం లేదు.
వెంటనే యోగి ఎత్తాడు ఆ ఫోన్ ని.
"హలో...ఎవరండీ...ఎవరు కావాలి?" అడిగాడు యోగి.
"నేను...అపర్ణని. నీ గొంతేమిటి అలా వుంది? న్యూజెర్సీ నుంచి ఫోన్ చేస్తున్నాను. సాయంత్రం ఆరునుంచి ట్రైచేస్తే యిప్పటికి దొరికింది నీ లైన్. ఏమిటి నీ ఫోన్ అంతసేపు ఎంగేజ్ లో వుంది..." పెద్దగా అరుస్తున్నట్టుగా అన్న అపర్ణ మాటలు వింటూనే ఆశ్చర్యపోయాడు యోగి.
"ఉండండి...శ్రీధర్ ని పిలుస్తాను. నా పేరు యోగి, శ్రీధర్ ఫ్రెండ్ ని. ఫోనెత్తింది నేను. శ్రీధర్ కాదు" అని చెప్పడం పూర్తవుతుండగానే లైన్ డిస్కనెక్ట్ అయింది.