సైరన్ మోగగానే ఉత్తరుడు, తిలక్ లేచి బయటకొచ్చారు. వాళ్ళకోసమే తోటలో యెదురు చూస్తున్న బుద్ధుడు "గుడ్ మార్నింగ్ బాసూ" అన్నాడు.
ముగ్గుర్నీ ఒకే బ్యారెక్కులో వుంచడం డేంజరనిపించి తలో బ్యారెక్కులో వేశారు. అఘాయిత్యం జరిగాక జైలర్ తో కొట్లాడి తన బ్యారెక్కుకు ఉత్తరుడ్ని మాత్రం మార్చుకున్నాడు తిలక్.
"నమస్తే బుద్ధా"
ముఖమంతా పీల్చుకుపోయిన ఉత్తరుడ్ని చూసి "ఏంరా ఉత్తరా! అలా వున్నావ్! రాత్రంతా నిద్రలేదా? నువు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. బాసు వారించాడుగానీ లేకుంటే ఈపాటికి ఆ నైఫ్ గాడి పని పట్టేద్దును" అని ఆప్యాయంగా భుజంమీద చేయివేశాడు బుద్ధుడు.
"దాదా గ్రూప్ ను ఎలా మట్టి కరిపించాలో నాకు తెలుసు. ఈ రోజు సాయంకాలం నైఫ్ గాడ్ని ఏం చేయబోతున్నానో మీరే చూడండి" అని తిలక్ వాళ్ళతోపాటు నడవడం మొదలుపెట్టాడు.
"అది సరే బాసూ! మరి లాలసనుంచి కబురేమైనా అందిందా? మన రెండో ప్రయత్నం యెప్పుడు ప్రారంభమౌతుంది? ఈసారి మనం సక్సెస్ అవుతామని చెబుతున్నట్లు పదే పదే నాకుడికన్ను అదురుతూ వుంది" బుద్ధుడు తిలక్ పక్కగా నడుస్తూ మెల్లగా చెప్పాడు.
"కబురేం లేదు. మన ముగ్గురిమీద మరీ నిఘా యెక్కువ కావడంతో ఆమెకు వీలై వుండదు. అన్నీ అరేంజ్ చేసిందీ, లేనిదీ కూడా తెలియడం లేదు. ఈ ప్లాన్ లో మనం లోపల చేయాల్సింది ఏమీ లేదు కదా. అంతా ఆమె చేయాలి. మన ముహూర్తం యెప్పుడో ఆమె నిర్ణయించాలి. శ్రీపతి మన విషయంలో స్ట్రిక్ట్ గా వుంటున్నాడు. మనకోసం యెవరొచ్చినా అనుమతించవద్దన్నాడు. లెటర్స్ అన్నీ సెన్సార్ అవుతాయి కాబట్టి లాలస మనకు ఉత్తరాలు రాసే వీలు కూడా లేదు. ఇలాంటి సమయంలో లాలస కబురు పంపిస్తుందో లేదో నాకైతే అంతుబట్టడం లేదు" తిలక్ నిరుత్సాహంగా చెప్పాడు.
ముగ్గురూ వెళ్ళి ముఖాలు కడుక్కున్నారు.
టిఫిన్ ముగించుకుని బుద్ధుడు, ఉత్తరుడు తోటలో కూర్చున్నారు. ఆ టైమ్ లో రీడింగ్ రూమ్ కెళ్ళి పేపర్లు చదవడం తిలక్ కి అలవాటు. అతను వచ్చేటప్పటికి అరగంట అవుతుంది గనుక వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు.
తిలక్ వెళ్ళేసరికి రీడింగ్ రూమ్ లో యెవరూ లేరు. బాగా లీడింగ్ లో వున్న ఓ దినపత్రికను ముందేసుకుని చదవడం ప్రారంభించాడు.
ఓ మంత్రి ప్రకటన చదువుతున్న అతను ఓ దగ్గర ఆగిపోయాడు. 'రె' అన్న అక్షరం మీద యెవరో రౌండుగా పెన్సిల్ తో కనపడీ కనపడకుండా గీతగీసి వున్నారు.
అంత ఉదయంపూట జనరల్ గా ఏ ఖైదీ రీడింగ్ రూమ్ లోకి రారు. ఎప్పుడో బోర్ కొట్టినపుడు అలా వచ్చి పేపర్లు తిరగేసి వెళ్తుంటారు... సో... యెవరో బయటనుంచే ఆ అక్షరం మీద గీత గీసి వుండవచ్చని అనుకున్నాడు. అలా అలా ఆలోచిస్తుంటే అతనికి కొత్త అనుమానం వచ్చింది.
చకచకా పేజీలు తిప్పాడు. మరికొన్ని అక్షరాలు చుట్టూ కూడా అలానే రౌండ్లు చుట్టున్నాయి. అతని అనుమానం మరింత బలపడింది.
ఇక ఒక్కక్షణం ఆగలేకపోయాడు.
కిచెన్ గదిలోకి వెళ్ళి అక్షరాలన్నింటినీ కిందరాశాడు.
లా... రె... గా... ప... ల... ది... పు... ట... గం... డి... వుం... కు... డం... రే... డీ...స... ల...
ఇదేదో మంత్రంలా వున్నట్టు తోచింది. అటూ ఇటూ తిప్పి చదివాడు గానీ ఏమీ అర్థంగాలేదు. అక్షరాలు ఆర్డర్లో లేవని, వాటిని గుది గుచ్చితే తప్ప బోధపడదని అనిపించింది.
ఏ అక్షరాలను ఏ అక్షరాలను కలిపితే ఏ పదాలు వస్తాయా ఆలోచించాడు. పదినిముషాలు గడిచాయిగానీ ఏ పదమూ రాయలేకపోయాడు. ఇక ఇలా లాభం లేదనుకున్నాడు. మొదట లా అక్షరం వుంది కాబట్టి మిగిలిన రెండు అక్షరాల కోసం వెదికాడు. ల... స... దొరికాయి. మొత్తం పదం రాశాడు... "లాలస" యెగిరి గంతెయ్యాలన్నంత ఎగ్జయిట్ మెంట్ కు గురయ్యాడు. కొలంబస్ ఆమెరికాను కనిపెట్టినప్పుడు కూడా తనంత ఆనందపడి వుండడనిపించింది.
మిగిలిన అక్షరాలతో కూడా పదాలు రాయడం మొదలు పెట్టాడు. మొత్తం ఈ క్రింద పదాలు తయారయ్యాయి.
లాలస... పదిగంటలకు రెడీగా రేపు వుండండి.
ఈ పదాలు ఆర్డర్ ను మరికొంత మార్చాడు.
"రేపు పదిగంటలకు రెడీగా వుండండి... లాలస.
ఒక్కసారిగా ఊపిరి సలుపుకోనివ్వని ఉద్వేగం గుండెల్ని ఊపేసింది. మొత్తం అక్షరాలను అంతా తుడిచేసి అక్కడినుంచి లేచాడు. సుడిగాలిలా బయటకు వచ్చాడు.
బుద్ధుడు, ఉత్తరుడు వున్న చోటుకి వెళ్ళి "రేపే మనం పారిపోతున్నాం" అని వాళ్ళిద్దరివేపు చూసి నవ్వాడు.
"నిజమా?" బుద్ధుడు శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు ఆశ్చర్యంతో.
ఉత్తరుడు కూడా అంతే విస్మయంతో "రీడింగ్ రూమ్ లో లాలస ప్రత్యక్షమైందా?" అని అడిగాడు.
మొత్తం జరిగిందంతా చెప్పి "పదిగంటలకు మన సాహసయాత్ర ప్రారంభమవుతుంది. మన ప్లాన్ అంతా గుర్తుంది కదా! ఎక్కడా మనం పొరబడకూడదు. ప్రతిక్షణం అలర్ట్ గా వుండాలి" అని పూర్తి చేశాడు తిలక్.
"ఒకే బాసూ" బుద్ధుడు అప్పటికే స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నాడు. ఈసారైనా సక్సెస్ అవుతామానన్న శంక ఉత్తరుడ్ని పీక్కుతింటోంది. తనకు తనే ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఇక మనం ఎక్కువసేపు మాట్లాడడం ప్రమాదం. రండి - పనిలో ఒంగుదాం" దారి తీశాడు తిలక్.
ముగ్గురూ క్రాప్ట్స్ రూమ్ లో కెళ్ళి పారలు తెచ్చుకుని తోటలో కాలువలు తీస్తున్నారు.
జామచెట్టు నీడ కింద కూర్చున్న దాదా చుట్టూ నైఫ్, బాంబు, గన్ నిలబడి మాట్లాడుతున్నారు.
దాదా ఎప్పుడూ పని చేయడు. మిగిలిన ముగ్గురూ ఎప్పుడో మధ్యాహ్నం పూట కాసేపు పని చేస్తారు. దాదాను పనిచేయమని చెప్పే గుండె ధైర్యం వార్డర్లలో ఒక్కరికీ లేదు.
తిలక్ అటు చూశాడు.
నైఫ్ అతడిని చూసి దాదాతో ఏదో అన్నాడు. నలుగురూ పగలబడి నవ్వారు. ఇదంతా గమనించిన తిలక్ కు రక్తం పొంగింది.
"బాస్టర్డ్! కొన్ని గంటలు ఆగు. నీకు తగినశాస్తే చేస్తాను" నైఫ్ ని ఉద్దేశించి మనసులోనే అనుకున్నాడు.
రేపు తాము పారిపోతున్నాం కనుక సాయంకాలమే నైఫ్ కి గుణపాఠం నేర్పాలనుకుని నిర్ణయించుకున్నాడు.