తన కొరకు మాత్రమే వండుకొనుట పిశాచ చర్య! ఎవడూ సమాజము నుండి వేరు కారాదు.
యజ్ఞమునుండి వర్షము, వర్షము నుండి అన్నము. అన్నము నుండి ప్రజ సంభవించుచున్నారు. అందుకే "అన్నం బ్రహే మతివ్య జానాత్' అంటుంది వేదము. కావున అన్నమే బ్రహ్మమగుచున్నది.
వేదమున యజ్ఞమునకు బ్రహ్మ అను నామము గూడాకలదు. నేటి హైటెక్ ఉత్పత్తి విధానములో గూడా వర్షమువల్ల అన్నము. అన్నము వలన ఉత్పత్తి అనునదిఏ సత్యము.
వర్షము -మనవాధీనముగాదు దైవాధీనము
ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహ యః
అఘాయ రింద్రియారామః మోఘం పార్ధ! స జీవతి 16
ఈ సృష్టి అనాదిది. సనాతనము సృష్టి చక్రము నాటినుండి నిరంతరముగా ప్రవర్తించుచున్నది. ఇందులో భాగస్వామి కాని వాడు, సుఖలోలుడు, పాపి అగుచున్నాడు. వాని జీవితము వ్యర్ధమగుచున్నది.
యస్త్వాత్మరేతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే 17
ఎవనికి ఆత్మానందము కలుగునో వాడు ఆత్మతృప్తుడు అగుచున్నాడు. అట్టివాని ఆత్మకు సంతుష్టి కలుగుచున్నది. అట్టివానికి కర్తవ్యము ఉండదు.
నైవ తస్య కృతేనార్ధః నాకృతే నేహ కశ్చన
నా చాస్య సర్వభూతేషు కశ్చిదర్దవ్యపాశ్రయః 18
అటువంటి ఆత్మపరునకు కర్మ చేసినను, చేయకున్నను ప్రయోజనము లేదు. అతనికి సమస్త ప్రానులతో స్వార్ధ సంబంధము ఉండదు.
తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష 19
కావున ఆసక్తి రహితుడవై నిరంతరము కర్మలను ఆచరించుము. అనాసక్తుడై కర్మలనాచరించువాడు పరమగతిని పొందుచున్నాడు.
కర్మణైవ హాయ్ సంసిద్దిమ్ అస్థితా జనకాదయః
లోకసంగ్రహ మేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి 20
జనకాదులు కర్మవలననే పరమసిద్ధిని పొందినారు. కావున నీవును లోక కళ్యాణము కొరకు కర్మను ఆచరించుము.
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే 21
ఉత్తముడైన పురుషుడు ఏది ఆచరిస్తాడో ఇతరులు దానినే ఆచరింతురు. అతడు దేనిని ప్రమాణముగా చేయునో లోకము దానినే చేయును.
దీపిక:
1. మన శాస్త్రములన్నియు అక్షరీకృతములు. అనేకమంది మునులు, ఋషులు తపస్సుచేసి, వానిని అక్షర రూపమున స్థిర పరచినారు. వాటినే వేదములు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు, రామాయణ, భారత, భాగవతాదులు, కాళిదాసు శకుంతలాదులు, సమస్త ఖండమునకు ప్రమాణములై యున్నవి.
అట్లుండగా ఒక వ్యక్తి ప్రమాణమే జనులు ఆచరించుదురనుట ఎంతవరకు సమంజసము. గ్రామమున కొక శ్రేష్టుడుండి తన ఆచరణములను, ప్రమాణములుగా చేసినచో విరుద్ధములు ఏర్పడునుగదా!
శ్రేష్ఠుడు ఎవడు? ఈ విషయమును ఎవరు నిర్ణయింతురు? అట్లు అయిన అయోమయము సంభవించును. కావున శాస్త్రమును ఆచరించుటయే మేలు.
2. రెండవ అధ్యాయమునందలి 42-43-44 శ్లోకాలలో వేదమును నిరసించినారు. దీనిని మంచిదికాదు అని దీపికలో నేను చెప్పియున్నాను.
ఇప్పుడు సమస్తము వేదమునుండియే చెప్పబడుచున్నది. ఇదియే భగవానుని తప్పగునా? ఇది సమయ సందర్భమును బట్టి చెప్పబడినది. ఇప్పుడు సందర్భము మారినది. దీని విషయమున భారతములో ఒక వృత్తాంతమున్నది. అది యుద్దములో జరిగిన సంఘటన అది ఇట్లున్నది....
ధర్మరాజు యుద్దరంగమున తన పక్షపు రాజుల ఉత్సాహము చూసినాడు. సంతోషించినాడు. కౌరవపక్షము చూచినాడు. అచటమ మానుష ఏర్పడి ఉన్నది. ధృష్టద్యుమ్నుని చూచినాడు.
"ధృష్టద్యుమ్నా! మన విజయము నీ అధీనమయి ఉన్నది. కౌరవ పక్షము వ్యూహమునకు ప్రతివ్యూహము రచించుము" అన్నాడు.
ధృష్టద్యుమ్నుడు అచలవ్యూహమును ఏర్పరచినాడు. వ్యూహము ముందు శిఖండి నిలచినాడు. వ్యూహాగరమున అర్జునుడు నిలచినాడు. అర్జునుడు వ్యూహరక్షకుడిగా నిలిచినాడు. దిశలు కాంతివంతములయినవి. కురుక్షేత్రము రణమునకు సిద్దమయినది. భూమి పొట్టపగిలి వచ్చినట్లున్నది సేన. భూమండల మందలి రాజులందరూ కూడినారు. ఉభయ పక్ష సైన్యములు బారులు తీరి నిలిచినవి. టెక్కెములతో రథములు తేజరిల్లినవి. అశ్వములు, గజములు నిలిచినవి. సకలము సిద్దముగా నున్నది. రణరంగము కాలుదువ్వుచున్నది. అట్టితరి ఒక వింత జరిగినది. అందరినీ ఆశ్చర్యపరచినది. చకితులను చేసినది.
ధర్మరాజు తన రథమున నిలిచినాడు. కౌరవసేనను తేరిపార చూచినాడు. తాళపతాకమును చూచినాడు. భీష్ముని చూచినాడు. ద్రోణుని చూచినాడు. కృపాచార్యుని చూచినాడు. ఆయుధము తీసినాడు. రథమున ఉంచినాడు. కవచము విప్పినాడు. రథమున ఉంచినాడు. రథము దిగినాడు. కురుక్షేత్రము సాంతము ఊపిరి బిగపట్టినది. రెప్పవాల్చలేదు. ధర్మజుని మీదినుంచి దృష్టి మరల్చలేదు. ధర్మజుడు రథము దిగినాడు. మౌనము వహించి నాడు. చేతులు జోడించినాడు.
ఆకాశమున దేవతలు భూమిమీది మానవులు ధర్మరాజు అంతర్యమును పలు విధముల ఊహించినారు.
ధర్మరాజు సాగినాడు. కౌరవసేన వైపు నడిచినాడు. పాండవాదులు చూచినారు. అర్ధము కాలేదు. శ్రీకృష్ణుడు, భీమార్జున, నకుల, సహదేవులు రథములు దిగినారు. పాదచారులయినారు.
ధర్మరాజును అనుసరించినారు. ధర్మరాజు తనతో యుద్దమునకు సిద్దమయిన కౌరవ సేనలోనికి చేతులు జోడించి మౌనంగా ప్రవేశించినాడు. సాగినాడు. భీష్మపితామహుని రథము దగ్గరికి వచ్చినాడు. నిలిచినాడు. "తత్పాదంబులకు బ్రణామంబు చేసి సవినయంబుగా నతని కిట్లనియె:
అనఘ నీకెదిర్చి యని సేయువాడనై
ము న్ననుజ్ఞ గొనగ నిన్నుగాన
నెమ్మివచ్చినాడ నీ చేత దీవన
వడసి చనిన నేను బగఱ గెలుతు.
భీష్ముడు ధర్మజుని చూచినాడు. వచ్చినవాడు తన మనమడు. తాను పెంచి పోషించినవాడు రణరంగమున బహిరంగముగా వచ్చినాడు. వచ్చిన వాడు తాను తాతనని వచ్చినాడు. తాను ఎదురు పక్షమున ఉన్నాడు. అయినను వచ్చినాడు. తన మీద గౌరవమున వచ్చినాడు. అనుబంధమున వచ్చినాడు. అనురాగమున వచ్చినాడు.
భీష్ముని మనసు కరిగినది!
కనులు చెమ్మగిల్లినవి.
భీష్ముడు ధర్మజుని మాట విన్నాడు. వచ్చినవాడు మనుమడు. శత్రుపక్షమున ఉన్న తనను వేడుకొనుచున్నాడు. తన అనుజ్ఞ కోరవచ్చినాడు! తన దీవెనలకు వచ్చినాడు!
ఈ వినయమును ఎవడు గెలువగలడు? అనుకున్నాడు అన్నాడు:
"కుమారా! నీ వినయము అనన్యమైనది. నీవే వచ్చినావు. నేను ప్రసన్నుడనయినాను. ఇట్లు నీవు రాకున్న శపించి ఉందును. నీవు పగవారిని గెలువ గలవు. నేను నీ పక్షమున నిలిచిపోరలేను. ఆ కోరిక తప్ప వరము కోరుము ఇచ్చెదను".
"పితామహా! నేను పగవారిని గెలువగలనని దీవించినావు. అదియే నాకు పదివేలు. నిన్ను యుద్దమున గెలుచు ఉపాయము చెప్పుము అదియే నేను కోరువరము" అని మనుమడు తాతను అడిగినాడు.
పితామహుడు చిరునవ్వు నవ్వినాడు. "నాయనా! దేవతలయినను నాతో యుద్దము చేసి గెలువలేరు" అన్నాడు.
"పితామహా! అది నాకు తెలియును. అందుకే నిన్ను అర్ధించుచున్నాను. నిన్ను గెలుచు ఉపాయము బోధింపుము" అని ధర్మజుడు చేతులు దోసిలిగా చేసి ప్రార్ధించినాడు.
భీష్మపితామహుడు ధర్మజుని మాటలు విన్నాడు. నవ్వినాడు. అన్నాడు: