నారాయణమూర్తి గదిలోంచి వచ్చి "ఎవరమ్మా, ఎవరొచ్చారు?" తలుపు తీస్తున్న శారదని చూసి అన్నారు.
"తెలీదు నాన్నా... వుండండి చూస్తాను" అంది. తలుపు తీసేసరికి పాలబ్బాయి! "ఏమిటి, బెల్ ఎందుకు కొట్టావు?" అంది విసుగ్గా.
"అమ్మగారూ... ఇటు చూడండి... మీ గుమ్మంముందు ఎవరో పడివున్నారు... ఇటు చూడండి..." అన్నాడు గాభరాగా.
వంగి చూసిన శారద కెవ్వుకెవ్వుమని కేకపెట్టి ముందుకురికి "నీరదా... నీరదా... డాడీ... నీరద..." అంటూ కింద కూర్చుని బోర్లాపడి వున్న నీరదని వెనక్కి తిప్పింది. అసలు బతికుందా, చచ్చిపోయిన శావాన్ని పడేశారా!
"అయ్యో... అయ్యో... డాడీ రండి త్వరగా" కేకలు పెట్టింది.
ఆయన వచ్చి ఒక్కక్షణం స్థాణువులా నిలబడిపోయారు.
"అమ్మా, నీరదా..." తోటకూరకాడలా ఎటు తిప్పితే అటు వాలిపోయిన ఆమెని చూసి చచ్చిపోయిందనే అనుకున్నారు ఇద్దరూ.
"బాబూ, కాస్త సాయం పడతావా! డాడీ అటు కాళ్ళు పట్టుకోండి కాస్త" శారదే అంది తెలివి తెచ్చుకుని. ముగ్గురూ కలిసి లోపలికి మోసుకొచ్చి డ్రాయింగ్ రూమ్ లో దివానుమీద పడుకోబెట్టారు.
"అమ్మగారూ... ఇంకా ప్రాణం వుందమ్మా... అదిగో చూడండి గుండె కొట్టుకుంటోంది" అన్నాడు పాలవాడు.
శారద గుండెమీద చెయ్యేసి, నాడి పట్టుకుని చూసి "అవును డాడీ, బతికే వుంది..." అంది సంతోషంగా. "వాళ్లు చంపలేదు డాడీ! తెలివి తప్పి పోయిందిలా వుంది."
శావాకారంగా వున్న నీరదని చూసి "అమ్మా! నీరదా" అంటూ ఆమె తలని వొళ్ళో పెట్టుకున్నారు. "కాసిని నీళ్లు తెచ్చి మొహాన చల్లమ్మా, తెలివితప్పింది..." వణుకుతున్న గొంతుతో అన్నారాయన.
గబగబా గ్లాసులో నీళ్ళు తెచ్చి మొహాన చిలకరించినా నీరదలో చలనం లేదు.
జరుగుతున్న గలాభాకి నిద్రలేచి బయటికి వచ్చిన లలితమ్మ నీరదని ఆ స్థితిలో చూసి "నీరదా" అంటూ దగ్గరకి రాబోయి నేలకూలింది.
"అయ్యో, అమ్మా! నీవేంటమ్మా ఇలా... ధైర్యం తెచ్చుకో, నీరదకేం కాలేదు, బతికేవుంది" అంటూ తల్లిని లేవదీయబోయింది. ఆవిడ తెలివితప్పింది.
"డాడీ, అమ్మ చూడండి... ఎలా అయిపోయిందో" అంటూ కాస్త నీళ్ళు మొహాన చిలకరించింది. ఆవిడ కాస్త కదిలి మళ్ళీ మగతలోకి వెళ్ళిపోయింది.
"భగవంతుడా... అమ్మా, నీరదా..." ఎంత కదిపినా నీరదలో చలనం లేదు... ఈ పదిహేనురోజులలో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆమె మొహం. కళ్ళు లోతుకెళ్ళిపోయాయి... మనిషి సగానికి సగం అయిపోయి నల్లగా కమిలినట్టయింది ఒళ్ళంతా. మొహంలో కళాకాంతీ లేదు. బతికున్న మనిషిలాకాక శావాకారంగా వుంది... "శారదా! నీరదకేదో మత్తు ఇంజక్షనిచ్చి తెచ్చిపడేసినట్లున్నారు. ఆస్పత్రికి తీసుకెళదాం పదమ్మా. శారదా, ఇదిగో ఈ కాగితం ఏదో మెడలో కట్టారుచూడు."
శారద మెడలోవేసిన కార్డులాంటిది తీసి చూసింది. 'నీవు మాకు చేసిన డ్యామేజీకి బదులు ఈ డ్యామేజ్. చెల్లుకి చెల్లు. దెబ్బకి దెబ్బ. కూతుర్ని కాపాడుకో చేతనైతే' అని వుంది.
"ఎంత క్రూరులు వెధవలు..." శారద కోపంగా అంది. "ఉండండి నాన్నా, ప్రకాష్ ని రమ్మంటాను."
"వద్దమ్మా, అతను లేచివచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ముందు మనం వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలి...ఇటు మీ అమ్మకీ తెలివిరాలేదు.. బాబూ, ఒక్క నిముషం వుండు నాయనా, కాస్త కారులో పడుకోబెట్టాలి. సాయం పట్టు..." పాలవాడికి చెబుతూ లోపలికెళ్ళి గబగబా బట్టలు మార్చుకున్నారు.
శారద లోపలికెళ్ళి నైట్ గౌన్ మార్చి చీర కట్టుకుని తల సరిచేసుకుని, నోరు కడుక్కుని వచ్చింది. ముగ్గురూ కలిసి కారులో కూర్చోబెట్టారు. శారద ఇద్దరినీ చెరోపక్క కూర్చోపెట్టుకుని వెనకసీటులో కూర్చుంది. అరకిలోమీటరు దూరంలో వున్న ఓ పెద్ద నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళేసరికి పూర్తిగా తెల్లవారింది. కారులో కూర్చునే ప్రకాష్ కి, శ్రీనివాస్ కి సెల్ నించి ఫోనుచేసి జరిగింది చెప్పి వెంటనే ఫలానా నర్సింగ్ హోమ్ కి రమ్మని చెప్పింది శారద.
నర్సింగ్ హోమ్ లో ఎవరో డ్యూటీ డాక్టర్ తప్ప పెద్ద డాక్టరు ఎవరూ లేరు. స్ట్రెచర్ లో ఇద్దరినీ మోసుకెళ్ళారు నర్సులు, వార్డ్ బాయిస్ కలిసి. డ్యూటీ డాక్టరు పరీక్ష చేసి, "ఈమె చాలా మత్తులోవుంది... ఏదో చాలా స్ట్రాంగ్ ఇంజక్షనిచ్చినట్టున్నారు" అన్నాడు నీరదని పరీక్షించి. "ఈమె ఎన్నాళ్ళబట్టి ఇలా వుంది? చాలా వీక్ గా కొట్టుకుంటోంది నాడి..." అంటూ వివరాలు అడిగాడు. నారాయణమూర్తి జరిగింది చెప్పాడు.
"ఓ గాడ్, ఈ అమ్మాయేనా కిడ్నాప్ కి గురైంది! గత పదిహేనురోజులుగా అక్కడుందీ అంటే శారీరకంగా, మానసికంగా చాలా దెబ్బతిని వుండాలి. ఆహారంకూడా ఏం తీసుకున్నట్టు కనపడలేదు..." పరీక్షిస్తూ ఆక్సిజన్ పెట్టించాడు. తనకున్న పరిజ్ఞానంతో ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే పెద్ద డాక్టరుకి ఫోనుచేసి పేషెంట్ వివరాలు చెప్పాడు. ఫోనులో ఆయన చెప్పింది విని ఏదో ఇంజక్షన్ చేశాడు.
"సార్ వస్తున్నారు పదినిముషాలలో... ఆయన చూస్తేగాని తెలియదు ఏం జరిగిందో" అన్నాడు. అలితమ్మ దగ్గిరకెడితే ఆవిడకీ ఇంకా తెలివిరాలేదు.
"ఈమెకేమైంది?"
"మా అమ్మగారావిడ... మా చెల్లెల్ని ఆ విధంగా చూసి షాక్ అయింది. తెలివి తప్పిపోయింది. ఆవిడ ఈ సంఘటన తరువాత బాగా దిగజారి ఆరోగ్యం పాడైంది" విపులీకరించినది శారద.
"ఆవిడకి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగినట్లుంది" అంటూ బ్లడ్ ప్రెషర్ చూస్తే విపరీతంగా రెండొందలు బై నూటిరవై వుంది. "ఓగాడ్... చాలా హై వుందీవిడకి..." అంటూ ఆమెకీ ఓ ఇంజక్షనిచ్చాడు.
అరగంటలో ప్రకాష్, శ్రీనివాస్ వచ్చేసరికి అప్పుడే డాక్టర్ వచ్చాడు.
శ్రీనివాస్ నీరదని చూస్తూనే "అక్కా... నీరదేనా... తను నీరదేనా, మన నీరదేనా" దిగ్బ్రాంతితో అన్నాడు.
"అవును శ్రీనివాస్... మనిషి ప్రాణాలతో వుందంతే. దాన్నేం చేశారో తెలియదు... చంపకుండా జీవచ్ఛవాన్నిచేసి వదిలిపెట్టారు" కళ్ళు తుడుచుకుంటూ అంది.
ప్రకాష్ కూడా విచిలితుడై కన్నీళ్ళు పెట్టుకుంటూ కుర్చీలో కూలబడ్డ మామగారి భుజంమీద చెయ్యేశాడు ఓదార్పుగా...