Previous Page Next Page 
ఉషోదయం పేజి 31

    "సుప్రియా! నిన్న ప్రకాష్ తో హోటల్ కి డిన్నరుకి వెళ్ళావా" ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్ గా ఫోనులో అడిగేసింది సునీత.
    సుప్రియ గతుక్కుమంది. అపుడే ఈ వార్త ఆమెకెలా తెలిసింది... "ఎవరు చెప్పారు?" అంది.
    "ఎవరు చెబితేనేం వెళ్ళావుగదా" అంది.
    "అవును పాపం! ప్రకాష్ శారద లేదుగదా లోన్లీగా ఫీలవుతున్నారు. బోరు కొడ్తోంది వెడదాం అంటే సరే అన్నాను. ఎంతైనా ఆయన నా బాస్ కదా" ధైర్యంగా అంది.
    "సుప్రియా! నేను నీకేం చెప్పాను? మగవాళ్ళకి దూరంగా బుద్ధిగా నీపని చూసుకో అని చెప్పానా... అందులో ప్రకాష్ ఎవరే, మన శారద భర్త. అదన్నా గుర్తుందా నీకు?"
    చిన్నపిల్లని మందలించినట్లు మందలిస్తోందేమిటి అని కాస్త పౌరుషం వచ్చింది. "అవును. శారద భర్త గనకే అడిగితే కాదనలేకపోయాను" అంది గడుసుగా.
    "ప్లీజ్ సుప్రియా! ఇలాంటి డిన్నర్లు, లంచ్ లకి దూరంగా వుండు. ఇలాగే ఆరంభమవుతాయి ప్రేమలు. నీకు కావలిస్తే, ఒంటరితనం బాధిస్తుంటే ఇంకొకరితోనన్నా పెట్టుకో... ప్రకాష్ తో కాదు. దానికి అన్యాయం జరిగితే నేను సహించలేను. తెల్సిందా, మైండిట్... నీవసలు మారవే... నీవు మారావని భ్రమించడం నా తప్పు. నీ వేషాలు ప్రకాష్ దగ్గిర మాత్రం వేస్తే ఊరుకోను..." కోపంగా అంది.
    "అబ్బ... ఏమిటే బాబూ! ఓసారి డిన్నరుకి వెడితే ఇంత సూక్తిముక్తావళి చదువుతున్నావు... నేనేదో మరీ బరితెగించిన తిరుగుబోతునన్నట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేస్తున్నావు" సుప్రియ కాస్త గట్టిగానే అంది.
    "చూడు సుప్రియా, ఊరికే డిన్నరుకి వెళితే తప్పు పట్టేంత కుసంస్కారురాలిని కాను. చేతిలో చెయ్యేసి, కళ్ళలో కళ్ళు పెట్టేరకం పరిచయాలు ఎటెళ్తాయో తెలుసు నాకు."
    సుప్రియ గతుక్కుమంది. ఇంత విపులంగా ఎవరు చూశారు తమని... తను ఎవరినీ చూడలేదే తెలిసినవారిని...
    "ఏం మాట్లాడవు... నేనింకా శారదకీ విషయం చెప్పలేదు... దాన్ని బాధపెట్టటం ఎందుకని. సుప్రియా, ఇదే మొదటిది, ఆఖరిసారి అవ్వాలి అతనితో వెళ్ళడం... ఇంకెవరితో నన్నా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు" ఫోను ఠకీమని పెట్టేసింది. శారదకీ విషయం చెప్పాలా, వద్దా అన్నది ఆమె ఎటూ నిర్ణయించుకోలేకపోతోంది.
    అసలే నీరద విషయంలో అందరూ ఎంతో మనస్తాపంతో వున్నప్పుడు అది ఈ విషయం విని తట్టుకోగలదా! వాళ్ళిద్దరి మధ్యా సంబంధం అంతంత మాత్రంగా సాగుతోంది. దీంతో మరీ బెడిసికొట్టచ్చు... అలా అని దాస్తే ప్రకాష్ మరీ ముందుకెళ్ళచ్చు... చేతులు కాలాక తన సంగతిలా అవచ్చు... అసలిలాంటి విషయాలు అందరికంటే భార్యలకి ఆఖర్న తెలుస్తాయి. తెలిసినా నిజంగా ఏ భార్యా అయినా ఏం చెయ్యగలదు! దారితప్పిన భర్తని ఎలా కంట్రోల్లో పెట్టగలదు! అరిచి, తిట్టి, ఏడిస్తే మగవాడు లొంగిరాకపోగా ఇంకా దూరం జరుగుతాడు. చూద్దాం... సుప్రియకి వార్నింగ్ ఇచ్చింది... దానికి మనసులో నిజంగా చెడు ఆలోచన లేకపోతే ఇంతటితో ఆపచ్చు... మరోసారి ఇలాంటిదేదన్నా తెలిస్తే చెప్పచ్చు శారదకి, అని నిర్ణయం తీసుకుంది.
                                          * * *
    అసెంబ్లీ ఆ రోజునించి ఆరంభమైంది. మొదటిరోజే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వ ఉదాసీన వైఖరిని దుయ్యబట్టి, డిపాజిటర్లకి న్యాయం జరిగేట్టు చూడాలని, నీరదని కిడ్నాప్ చేసినవారిని కఠినంగా శిక్షించాలని చాలా గొడవ చేశాయి.
    స్పీకరు చర్చకి అనుమతించకపోవడంతో వాకౌట్ చేసి అలజడి సృష్టించాయి.
    ముఖ్యమంత్రి డీఫాల్టర్స్ నించి డబ్బు వసూలు చేసేందుకు వేసిన కమిటీకి త్వరితగతిని నాలుగురోజులలో కమిటీ నిర్ణయం ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చినట్టు మర్నాడు అసెంబ్లీలో చెప్పి ప్రతిపక్షాన్ని కాస్త శాంతింపచేశారు.
    నీరద విషయంలో సంబంధం వుందన్న అనుమానంతో డీఫాల్టర్స్ అందరికీ అరెస్ట్ వారెంట్లు జారీచేసి విచారణ జరపమని ఆదేశాలు చేసినట్టు తెలియచేశారు. మొత్తం రెండొందల ఎనభైకోట్ల అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన పదమూడుమంది డీఫాల్టర్స్ ని అరెస్ట్ చేశారు. బెయిల్ దొరక్కుండా మూడురోజులు సెల్లో కూర్చోవలసి రావడంతో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గానే వుందన్నది అందరికీ అర్థం అయింది. అందరితో మాట్లాడి కమిటీ తమ నిర్ణయం ప్రకటించింది. పదిహేను రోజులలో, తీసుకున్న అప్పులో నలభైశాతం ఇవ్వాలి... మరో నలభై శాతం మూడోనెలలో, ఆరోనెలలో మిగతా ఇరవైశాతం చెల్లింపులు చెయ్యాలని, అలా చెయ్యని పక్షంలో వాళ్ల స్థిరాస్తులు వేలం వేసి ఆ డబ్బు డిపాజిటర్లకి అందచెయ్యాలన్న తమ తీర్పు వెలిబుచ్చింది.
    ఇటు కమిటీ తీర్పు, జైలులో పడివుండడంతో అప్పు ఏదో దారిని చెల్లగొట్టక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు.
    మూడోరోజున అనుమానితులందరిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదుల తరపు లాయర్లు బెయిల్ పిటీషన్లు కోర్టులో సబ్మిట్ చేశారు.
    ఆ రోజంతా వాదోపవాదాలు విన్న జడ్జి... కమిటీ ఇచ్చిన తీర్పులో తామూ ఏకీభవిస్తున్నట్టు, అలా అప్పులు తీర్చేవరకు బెయిల్ మీద విడిచిపెడుతున్నట్టు... తీర్చని పరిస్థితి వస్తే బెయిల్ రద్దు చేస్తామని, మానవతావాద దృక్పథంతో నీరదని విడిచిపెట్టాలని తీర్పు ఇచ్చారు.
    చాలా సంచలనాత్మకంగా ఒక్కరోజుకో కోర్టు పదమూడుమంది కేసులని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే తీర్పు చెప్పడం అటు కమిటీ కూడా బాధితులకి న్యాయం జరిగేట్టు తీర్పునివ్వడం డిపాజిటర్లకి, బ్యాంక్ స్టాఫ్ కి చాలా ఆనందాన్నిచ్చింది... ప్రముఖంగా పత్రికలు, మీడియా ఈ వార్తలు ప్రసారం చేశాయి. ఇంకా నీరద సంగతి తేలవలసి వుంది.నారాయణమూర్తిగారి తరపున ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. కిడ్నాప్ కేసు ఇంకో రెండురోజులలో హియరింగ్ కి రానుంది.
                                              * * *
    ఆ రోజు ఉదయం ఐదున్నరకి పాలవాడు పాలప్యాకెట్లు గుమ్మం ముందు పెట్టడానికి వచ్చేసరికి గుమ్మంముందు ఎవరో పడివుండడం కనిపించింది. ఆశ్చర్యపోతూ దగ్గిరకెళ్ళి చూసేసరికి ఎవరో ఆడమనిషి.. కుప్పలా మెట్లమీద పడివున్న ఆమెని చూసి భయపడిపోయి గబగబా కాలింగ్ బెల్ ఆపకుండా నొక్కాడు.                             

 Previous Page Next Page