Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 31


                               మాటల మూట


    ఒక మంచి శుక్రవారంనాడు (అయ్యో అంతమంచిది) నా భాషను మూటకట్టి, మూపున వేసుకొని, నా విశ్వాసం గల కుక్కను వెంటబెట్టుకొని బయలుదేరగా సూర్యుడు చూస్తున్నాడు. పువ్వులు నవ్వుతున్నాయి.

 

    నేను చేస్తున్న ప్రయాణపు దారిలో ఆగమని ఒక చెయ్యి అరిచింది, ఎవరిదా చెయ్యి అని ప్రశ్నించగా (నేను కాదు.కుక్క) మాయమయింది. నేను ఆగలేదు, అక్కడే ఉన్నచెట్టు అంతసేపూ నేను చూడనిది నాకంటి నాకర్షించింది. దేవేంద్రుడేమో అని భయపడ్డాను. వెయ్యి కళ్ళున్న ఆ చెట్టును చూచి, వాటిలో అన్నిటికన్నా ఒక పెద్ద కన్ను ఆగమని అరిచింది. నా పదాల చప్పుడు భూమిలోని తన వేళ్ళద్వారా పసికట్టిందేమో నేను ఆగలేదు.

 

    నా మూపున భారంగా తోచిన భాష దాహం వేస్తున్నదని అరిచింది. అసలే ఆకలిగా వున్నా నేను సరసుల దారి తప్పిపోయాను. మంట ముళ్ళడొంకలు. నెక్ టై, టైపు రైటరు, హంస ఎందువల్లనో వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి మరుక్షణంలో మాయమైపోయినవి. నాకు వాటి అర్ధంకాని అవసరంగాని అవగాహన కాలేదు.

 

    నా కుక్క అంతలో జాలిగా అరిచింది. ఎవరా వస్తున్నవారు? ఎదురుగుండా గుండెలు బాదుకుంటూ, మూడు చీలికలుగా చీలిన నాలుకను జడిపింపుగా కదిలించుతూ, ఎవరా వస్తున్నారని చూశాను. మరు మరీచిక, మరీ చికాకుపడి, నన్ను నా అవజ్ఞతకు నిందించుకొని, నిలవకుండా నడిచిపోయాను.

 

    నన్ను ఆగమని ఆజ్ఞాపించవద్దని అవ్వని ప్రార్థించాను. అవ్వకి బ్రహ్మచెవుడు. ఆవిడ చుట్టూ ఆవిడ వంటివారే మూగి, ఆధ్యాత్మిక భజన చేస్తున్నాడు. కొన్ని ప్రశ్నార్థకపు గుర్తులూ, ఒక విభూతి పండూ, రెండు మూడు అక్షింతలూ నామీద వేశారు. నాలో ధిక్కారం ఘీంకారం చేసింది. ప్రశ్నార్థకపు గుర్తులకు మాత్రం మూటలో కట్టుకొని, వెళ్ళిపోయాను. విసురుగా.

 

    మూటలో విప్లవం, మాటలు కలుస్తూ, విడిపోతూ నాట్యం చేస్తూ, ప్రాకుతూ మొగ్గలు వేస్తూ, పాడుతూ, అరుస్తూ విప్లవం.

 

    కొమ్ముల బండిరాకాసి నాకేసి చూసినప్పుడే వివరణత తటస్థించింది. గుణితం ద్విగుణితమయింది. ఓ అధ్వానపు అడవీ, అసారకాసరమా(,) ఆగమన్న వాడిని నేను నన్ను ఆగమన్నప్పుడు నేనెలాగ ఆగలేదో ఆలోచించుకొని అన్నానా, లేదులే.

 

    కొన్ని మాటలు లయగా వాటి ధ్వనుల వల్ల ఒక శక్తి రేగింది. కవిత్వం పట్టుకో అన్నారు. చిన్న పిల్లల గొంతుకలోనికి పారిపోయి దాగుంది. వార్తా శీర్షికలూ, సినిమా ప్రకటనలూ నన్ను ఆకర్షించడం మానలేదు. కార్టూన్ చిత్రం కలతపెట్టి కలలు పుట్టిస్తుంది. హల్లుల అడావుడికి అచ్చులు విచ్చుకత్తులు, అచ్చులమాట వచ్చినప్పుడు ఆర్థర్ రాంబో జ్ఞాపకం వస్తాడు. మనలో వర్ణభేదం పోయింది కాదు. సంక్రాంతికి రంగులేదు. నిఘంటువుకి నిప్పుపెట్టె.

 

    తర్వాత కొంతకాలానికి ఒక గడుసు పనిచేశాను. అది నా రహస్యం. ఒక్క నా కుక్కకు మాత్రమే ఎలా తెలిసిపోయిందో తెలిసిపోయింది. నేను చాలా భయపడ్డాను. ముఖం చేతులలో మూసుకున్నప్పుడు చేతులలో ముఖం కనబడింది. నా కన్ను పేరు కామాక్షి.

 

    ఇంతలో విశ్వనాథ సత్యనారాయణ వేషం వేసుకొని, నన్నయభట్టుగారు కనపడ్డారు. నమస్కరించాను. నమ్మలేదు. ఆ మూట విప్పమన్నారు. మీ వేషం విప్పండన్నాను. వీలులేదట. ఈ రీతి మేము హోరాహోరీగా పోరాడుతుండగా, రుక్మిణీనాథశాస్త్రి వేషం వేసుకొని రుక్మిణినాథశాస్త్రి వచ్చాడు. ఆ మూటలో ఏముందో నాకు తెలుసునన్నాడు. రెండే రెండు అక్షరాలు. శ్రీశ్రీ అన్నాడు. నాకాశ్చర్యమయింది. నన్నే నేను మోస్తున్నానంటే నమ్మలేకపోయాను.

 

    (టీక: మన భాషలో అతి వాస్తవిక రచనకు ఇదే మొట్టమొదట ప్రయత్నం. అతి వాస్తవిక రచన అంటే మనస్సంచారంలోని అసంలక్ష్య క్రమాన్ని పైకితేవడం అన్నమాట. రూపం సరిగా ఏర్పడని ఊహలకు రూపం ఇవ్వడం. "మంట, ముళ్ళడొంకలు, నెక్ టై, టైపు రైటరు, హంస ఇవి ఎందువల్లనో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి మరుక్షణం మాయమైనవి" అన్న వాక్యంతో పైన అన్న వాక్యం సమన్వయిస్తుంది. అసార కాసారమా(,) 'కాసారమా' లో సారపోతే, కామా(,) 'ఇది' మనకు కొత్తదికాదు. వసు చరిత్రలో, సారసలోచనలున్నచోట, రసభంగం అంటే సాలోచనలౌతారు అన్నదాని లాంటిది ఇది. ఐతే, నాకన్ను కామాక్షి, కామా చూపులు చూసింది అన్నతో, కొత్తే. పువ్వులు చూస్తున్నాడు చెట్టు అరవడం ఇవన్నీ అతీతమైన ఊహకు నిదర్శనాలు - సంపాదకుడు) *

 

                               * * *

 Previous Page Next Page