మహాకవి ఆశ్చర్యం
సూది కొసవలె సూక్ష్మమైన ఒక లోకం. నా ఆలోచన అయస్కాంతం. అణువులో ఆలాపన, కలంలో కలకలం. అణాలో ఆల్కెమీ. ఆరాధనలో ఆముదం. జింటాన్ నన్ను తింటానంది. రత్నాలు 9. రసాలు 9. ఆకాశనేత్రంలో అష్టాదశ పురాణాలు. ఇంద్రధనుస్సు వాయిస్తూ ఎవరో పాడుతున్నారు. ప్రవాళ ద్వీపంలో మరకత మంజీరం కాబోలును?
ఆంబోతులు
మరచిపోయి చూచినవి, చూచి మరచిపోయినవి, అనుకొని ఆలకించినవి. అనుకొని ఆలకించినవి. ఆలకించినట్టు అనుకున్నవి, ఆకస్మికంగా ఆఘ్రాణించినవి, రుచిచూచి రచించినవి, స్పృశించి అనుభవించినవి, రమ్మంటే రావు, వొద్దన్నా వొస్తాయి, నాటకశాలలో గురకపెడుతూ, జంతుప్రదర్శనశాలలో పియానో వాయిస్తూ, వస్తు విక్రయశాలలో వేణ్ణీళ్ళు తాగుతూ బ్రిడ్జిపక్క పిల్లిమొగ్గలు వేస్తూ, లాడ్జిలో కూరగాయలు కోస్తూ ఎప్పుడో వస్తాయి. ఎలాగో చూస్తాయి.
కెమీరాకన్ను
చంద్రకిరణాలనే శాశ్వతంగా తాగలేము. సందులో ఉంది సాహసం. జడవనివ్వదు. సౌందర్యం. సరదాకొసని కొరడాకొసని సరదాకొసని కొరడా. నా యిష్టం వచ్చినంత రాస్తాను. ఎక్కడ ఆగాలో ఎరుగుదును. అధరం నా ఆదర్శం బింబంలో ప్రతిబింబం.
హం
మో దం
సం
కూర్చొని చేసిన పాపం గుడికట్టినా పోదు. చిన్నప్పటిమాట. ఆడపిల్ల బడిలో అటెండెన్సు రిజిస్టరు తస్కరించిన తర్వాత చేతిలోపని చేతిలోనే అయిపోయింది. "అన్నన్నా ఎంతపని చేశానా" అనుకున్నాను. కొన్ని సంపాదకీయ రచనల కంటె నయమే అనిపిస్తుందిప్పుడు.
కైమా- చే సిరి
పిల్లి తాగుతూన్న పాలలాగు బాధతో పడుక్కున్నాను. కొన్ని రూళ్ళ కర్రలు, వాటికొక దారంకట్టి లాగుతూ పందికొక్కు లాంటి పొడుం డొక్కు వొస్తోంది. సీసాలు తే. పసుపు పచ్చని పత్రికలు పట్టుకొని పెళ్ళికూతురయింది వాస్తవికత.
శారదాబిల్లి
ఛందస్సు (గాయత్రీ సాక్షిగా చెబుతున్నాను) ఎటు తిరిగితే అటే ఒరుగుతుంది. విధానంలో వికారం - మాత్ర మింగడం నాకు చేతకాదు. అల్లిక రంగవల్లిక, అంకెలు మన సంకెళ్ళు. అడగవయ్యా ఆర్ధికశాస్త్ర పండితుణ్ణి. పర్వతం పండి బద్దలవుతోంది. లావా-
దేవీ
శ్రావణ శుద్ధ దశమీ సోమవారం మెడమీద అవతారాలు కప్పుకొని చంద్రుడు తొంగి చూశాడు. బడబాననం వలె భయంకర మనోహరమైన పయోధి. అదృష్టం వలె, అఘం వలె, నౌకాభంగంవలె, నగ్న నక్షత్రం వలె, నలు చదరపు నీలిమందు అందులోనిది తిమింగలం, దానికొక ఔత్ఖానా, దంతాల సందున కార్ఖానా.
ఔరత్ ఖానా
జరత్కారుని చమత్కారంలాగు నన్ను నేను తిరగేసి తొడుక్కున్నాను.
అడుగునుంచి చూస్తే అస్థిపర్వతం,
అగ్నిపంజరం, మీదనుంచి చూస్తే మేగ్నాకేసు, మీరట్ కార్టా.
అర్ధం కాదు ఆలాపన - అయితే - అబద్ధంకాదు ఆశ్చర్యం.
మహారాజశ్రీ
కళ్ళ పిడికిళ్ళలో కర్పూర నీహారం ధరించి, ఉపమానం వంటి ఉల్కా గ్రైవేయంతో కనీనికాధిష్టిత కాళిదాసుడై, ప్రబంధగ్రంధ గంధగజాన్ని అధిరోహించి అకస్మాత్తుగా సాక్షాత్కరించాడు మహాకవి ఆశ్చర్యం.
అతివా (!!!!)
`రానే వచ్చావు ఎలాగూ, కళ్ళతోనయినా ఒకమాట ఆడుదూ - లాల్చీ విప్పేస్తా నన్నాను. బహిరంగ రహస్యాలు బయటపెట్టడానికేమున్నాయి? అందరూ అనుకుంటున్నవే. తలలలో దాచుకుంటారు. కలలలో కరవ్వొస్తాయి. అన్నీ నాకు 64 లాగే కనబడతాయ్. పరధ్యానంగా ఉన్నప్పుడు అర్ధమవుతాయి.
ఆల్కెమీరా
అన్నిటిలో అందం వుంది. అర్ధం వుంది. కావలసినన్ని ఉపమానాలకి అక్కరలేనన్ని ఉపమేయాలు, ఎక్కడో పోలిక దొరుకుతుంది. ఎక్కడో చేతులు కలుస్తాయి. స్నేహం చేపడుతుంది. ఇంద్రనీల మణులను కరిగించి ఎవరో సముద్రాన్ని సృష్టించారన్నావేవే. ఆ మాట రుజువు చెయ్యగలవా? కార్మిక ఘర్మ కఠోరక్షాంరతలో కడలికి రూపం కలిగిందని నేనంటేనా కోపం? అదో దృక్పథం, అదో చిత్తవృత్తి, ఆ స్థితిలో అన్నీ క్షమిస్తావు. అన్నీ రుచిస్తాయి.
దృక్కోణం
స్వప్నాలను కోస్తున్నాడు శస్త్రవైద్యుడు...లలో, మేఘాలలో... యలలో... లోయలలో ఉన్నవి ఉంటాయి. పోయినవి పోతాయి. నీకెందుకు బాధ? బా...ధ బా... అబ్బా....బా...బా, బా, బా, బాం, బాం, బాం,బాం, బాంబు.
- ఆంధ్ర పత్రిక - 29.1.1941