తనను ఒక సుకుమార పెనవేసుకున్నట్లు లలితమ్మగారికి స్ఫురించి, కొద్దిగా మెలకువ వచ్చి తనని గట్టిగా కౌగిలించేసుకుని వున్న కూతుర్ని చూసింది. తెల్లవారు జాము అయిందేమో అనుకుంటూ ప్రేమ పొంగుతుండగా ఆప్యాయంగా ఆమె వీపు నిమిరింది. మెల్లిగా ఆమెచెయ్యి జడమీదకు నడిచింది. తను వేసిన పూలజడ చెక్కు చెదరనట్లుగా తోచింది. ఏడుపులాంటి ధ్వని వస్తున్నట్లు అనుమానం కలిగి ఆమెచెంపను స్పర్శించింది. శుభ్రంగా తడిసిపోయింది.
"తల్లీ!" అని అరిచింది లలితమ్మగారు భయాశ్చర్యాలతో.
ఆశ ఇహ అణుచుకోలేక వెక్కివెక్కి ఏడ్చివేస్తూ "నీకాళ్ళు పట్టుకుంటాను. నన్ను పంపించవద్దమ్మా అక్కడికి" అని తల్లిని మరింత గట్టిగా కౌగిలించేసుకొంది.
లలితమ్మగారి హృదయం వెయ్యిముక్కలైంది. "ఏం జరిగిందమ్మా తల్లీ!" అంది కంగారుగా కూతుర్ని గట్టిగా పట్టుకుని.
"నాకు తెలీదమ్మా! నాకు భయంగా వుంది. నేనక్కడికి పోనమ్మా! యిక్కడే పడుకుంటాను."
ఆశ శరీరం గజగజ వణికిపోతోంది. లలితమ్మగారికి అర్థంకాలేదు. "అలాగేనమ్మా! అక్కడకు పోవద్దు, నీకు వచ్చిన భయమేమీ లేదు" అని ధైర్యంచెబుతూ మృదువుగా ఆమెపట్టు విడిపించుకొని లేచి పెద్దలైటు వేసింది.
అప్పటికే ఆశ కళ్ళు జ్యోతుల్లాగా తయారయినాయ్. వాటినుంచి నీళ్ళు ఎడతెగకుండా వర్షిస్తున్నాయి. ఆవిడ మళ్ళీ వచ్చి కూతురుప్రక్కనే కూర్చుని భుజంమీద చెయ్యివేసి "ఏం జరిగిందో చెప్పమ్మా!" అనడిగింది బుజ్జగిస్తూ.
ఆశ యింకా ఏడుపు మానలేదు. భోరున విలపిస్తూ "ఏమీ చెప్పలేకపోతున్నానమ్మా! నాకు చాలా అస్థిమితంగా వుంది. యిక్కడే నీదగ్గరే పడుకుంటానమ్మా యీ రాత్రికి నన్ను ముక్కలు ముక్కలుగా నరకనన్నా నరుకు కాని ఆ గదిలోకి మాత్రం పంపవద్దమ్మా" అని తల్లిని ప్రాధేయపడసాగింది.
లలితమ్మగారి గుండె తరుక్కుపోయింది. ఆమె గడియారంవంక చూసింది ఎక్కువ టైంకూడా కాలేదు. "కొట్టాడా?" అనడిగింది బాధగా.
కూతురు తల అడ్డంగా త్రిప్పుతూ "లేదమ్మా! కాని..." అంటూ గుమ్మంవైపు చూసి భయభీతురాలై అలాగే గుడ్లప్పగించి వుండిపోయింది.
గుమ్మంలో ఆనాటి మొనగాడు రాఘవరావు చేతులు కట్టుకుని వక్రచాలనం చేస్తూ నిలబడ్డాడు.
ఆశ తల్లిని గట్టిగా కరుచుకుపోయింది.
"ఉండమ్మా" అని లలితమ్మగారు ఆమెను సున్నితంగా విడిపించుకుని లేచి నిలబడి "చూడండి. అసలేం జరిగిందో నాకు తెలీదు. కాని పిల్ల ఎందుచేతనో హడలిపోయింది. దానికి చాలా చిన్నతనం. ఒకవేళ పెంకెతనం చేస్తే చేసి వుండొచ్చు. నయాన చెబితే అదే అర్థం చేసుకుంటుంది. అది ఒకటే భయపడిపోతోంది. మీరు గదిలో వుండండి. నేను దానికి నచ్చచెప్పి పంపిస్తానుగా" అంది సానునయంగా.
అల్లుడు వికటాట్టహాసం ఒకటి ప్రదర్శించాడు. తన భంగిమను ఇంకాస్త ప్రజ్ఞావంతం చేసుకున్నాడు. "అంత శ్రమ మీకు దేనికండీ అత్తగారూ? అనవసరంగా మీకు నిద్రాభంగమూ, యిబ్బందీ, ఆ తతంగమంతా నేను చూసుకుంటానుగా. మీరు నాకు నీతిబోధలు చేయవలసిన అవసరమూ రాదు. రా ఆశా! అనవసరంగా వ్యవహారాన్ని రచ్చకీడ్వటం నాకు ఇష్టంలేదు" అన్నాడు భార్యవైపు ప్రతాపంగా చూస్తూ.
ఆశ యిందాకే లేచి నిలబడి తల్లివెనక నక్కింది. అతనికేమీ జవాబు చెప్పలేదు.
"రభస జరగటం నాకు ఇష్టంలేదు ఆశా! ఎందుకొచ్చిన శ్రమ! గప్ చుప్ గా వచ్చెయ్యి. ఎవరికీ ఏ యిబ్బందీ వుండదు" అన్నాడు రాఘవరావు మళ్ళీ అదే ధోరణిలో.
ఆశ యీసారి ధైర్యంచేసి "నేనురాను" అంది చిన్నగా.
అతను ఏమీ ఆశ్చర్యం కనపరచలేదు. "ఓహో అలాగా!" అన్నాడు. "ఎందుకని రావు?" అని అడగలేదు. "రాకపోతే బలవంతంగా ఎత్తుకు వెడతాను" అన్నాడు.
లలితమ్మగారు 'ఛీ! ఎంత అసహ్యం!' అనుకుంది మనసులో. 'మీరు గదిలోకి వెళ్ళండి. ఎలాగైనా నేను పంపిస్తానుగా" అంది ఈ పరిస్థితి మార్చుదామని ప్రయత్నిస్తూ.
అతను అక్కడ్నుంచి ఓ అడుగుకూడా కదలకుండా "నోనో! నేను యిక్కడనే నిలబడతాను. ఆ చెప్పేదేదో నా ఎదుటే చెప్పి మీరు పంపించండి" అని నిలుచున్నాడు.
ఆ స్థితిలో ఏమి చెయ్యడానికి లలితమ్మగారికి తోచలేదు. ఒకవైపు కూతురు స్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మరోవైపు అతను వీరుడిలా నిలబడి దుర్భాషలాడుతూ అసహ్యం కలుగజేస్తున్నాడు. తన కూతురుకు చీపురుపుల్ల ఎత్తు గౌరవంకూడ ఇవ్వడంలేదు. అందుకని చేసేదిలేక "నువ్వెళ్ళు తల్లీ ఆశా!" అంది కూతురువైపు తిరిగి.
"నేను ఆ నరకంలోకి వెళ్ళలేనమ్మా" అని ఏడ్చింది కూతురు.
"తప్పదమ్మా. మన కుటుంబం పరువు ప్రతిష్టలు దృష్టిలో వుంచుకుని అయినా నువ్వు అల్లరి చెయ్యకూడదు. ఆలస్యం చేయకూడదు తల్లీ మనం సామాన్యంగా వుంటే ఎలాంటి పరిస్థితుల్నయినా ఎదుర్కొనవచ్చు" అని లలితమ్మగారు కూతురికి నచ్చచెప్పబోయింది.
గత్యంతరంలేక ఆశ తల్లిమాట కూడా కాదని 'నేను వెళ్ళను' అంది మొండిగా.
లలితమ్మగారు గుండె బండ చేసుకుంది. "వెళ్ళకపోతే బలవంతంగా తోస్తాను. ఏమిటా మొండితనం?" అంటూ కళ్ళెర్రజేసింది.
ఆశ నిస్త్రాణగా అలానే స్థాణువులా నిలబడింది.
రాఘవరావు అమాంతంగా ముందుకువచ్చి "నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను తప్పించుకోలేవు ఆశా! నీ తల్లో జేజెమ్మని కూడా తీసుకుపోగలను" అంటూ అత్తగార్ని దాటి వెళ్ళి ఆమెచెయ్యి దొరకపుచ్చుకుని బరబర లాక్కుపోసాగాడు.
"విడు విడు" అని ఆశ పెనుగులాడుతోంది.
"విడుస్తానా యింకా! యివాళ నీ భరతం పడతాను చూడు" అంటూ ఆమె చెయ్యి విడిచిపెట్టి యీసారి జడపట్టుకుని యీడ్వసాగాడు.