Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 30


    విశ్వనాథంగారు కోపాన్నీ, దుఃఖాన్నీ దిగమ్రింగుకుని అన్నీ భరిస్తూ వూరుకున్నాడు.

 

    అప్పగింతలు జరుగుతున్నాయి.

 

    "పోయిరా మా తల్లి..." అంటూ హృదయ విదారకంగా వాయిస్తున్నారు సన్నాయివాళ్ళు.

 

    విశ్వనాథంగారు, లలితమ్మగారు కూతురి ప్రక్కన కూర్చుని పళ్ళెంలోని పాలలో చేతులు ముంచి అర్థిస్థూ పేరుపేరునా అందరికీ అప్పగించేస్తున్నారు.

 

    ఇద్దరికీ కళ్ళనుండి నీళ్లు ప్రవాహంగా కారుతున్నాయి. ఆశకూడా ఏడుస్తోంది. ఏమిటి ఈ అనుభూతి! ఇన్నాళ్ళు పెంచటం, ప్రేమ పెంచుకోవటం, తీసుకుపోయి ఓ అయ్యచేతిలో పెట్టటం, విషాదం వీడ్కోలు...

    
                                       *  *  *


    రాఘవరావు తండ్రి రామక్రిష్ణయ్య మహా మొండివాడు. "మీరు చెప్పేది రైటే అనుకోండి" అంటూ తన పంతం. మాట చెల్లించుకుంటూ వుంటాడు.

 

    పెళ్ళయి ఓ నెల తిరిగీ తిరక్కముందునుంచీ ఔపోసన కార్యం, ఔపోసన కార్యం అంటూ తగులుకున్నాడు.

 

    "కనీసం ఆరు నెలలయినా వ్యవధి లేనిదే ఏం అవగాహన అవుతారు" అంది తలుపువతలనుంచి లలితమ్మగారు.

 

    "మీరు చెప్పేది రైటే అనుకోండి. అయినా మా యిబ్బందికూడా కాస్త చూడండి మరి. మాకు యింట్లో ఆడదిక్కులేదా? కోడలుపిల్ల యింట్లో తిరుగాడు తుంటే చూడాలని ఎన్నాళ్ళబట్టో ముచ్చట."

 

    "అయినా అది కాస్త బలహీనంగా వుంది. అట్టే ఈడుకూడా లేదు. పరీక్షలకు శ్రద్ధగా చదువుతోంది. పోనీ పరీక్షలయినాకన్నా పెట్టుకుంటే..."

 

    "మీరు చెప్పేది రైటే అనుకోండి" అని సాగదీశాడు రామకృష్ణయ్య. "చిన్నప్పటినుంచీ బాగా విచ్చలవిడిగా తిరిగే స్వభావం మా రాఘవరావుది. ఎప్పుడూ స్నేహితులూ, షికార్లూ, సినిమాలూ. ఏమీ బాధ్యత లేకుండా తిరగటం అబ్బింది. భార్య అంటూ ఇంట్లో వుంటే వేళపట్టున వస్తూ శ్రద్ధగా మసులు కుంటాడని. అహ! అసలు ఆలోచించండి."

 

    సంభాషణ ఇలా సాగి ఆయన మొండిపట్టు ఎంతకూ విడువకపోయేసరికి లలితమ్మగారికి అంగీకరించక తప్పలేదు.


                                      *  *  *


    ఆశ మనసుని రాయి చేసుకుంది. తన చదువు యిహ ఎలానూ సాగదు. విధి ఎదురీది జీవితాన్ని సంఘర్షణ చేసుకునేకంటే సాధ్యమైనంతవరకూ రాజీపడి సుఖపడాలనుకుంది.

 

    ఆమె పెళ్ళిలో రాఘవరావుని చూడలేదు. మనిషి ఫర్వాలేదని అంతా అనుకోవటం విన్నది. ఎందుచేతో అతను చాలా సౌమ్యుడనీ, మృదువయిన వాడనీ ఆమె ఊహించింది.

 

    రాత్రి పదిగంటలు దాటాక ఆమెను సర్వాలంకార శోభితను చేసి గదిలోకి తోశారు. విద్యుత్ వెలుగుల్లో, హాయిని గొలిపే పరిమళాలలో, అలాంటి సుందర వాతావరణంలో ఆశ తలుపు యివతల తలవంచుకుని సిగ్గుపడుతూ నిల్చుంది. ఆమె కాటుక కళ్ళు, పూలజడ, మెరిసే దేహకాంతి ఆ గది సౌందర్యాన్ని విజృంభిత పరుస్తున్నాయి.

 

    రాఘవరావు కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. ఆ సమయంలో ఆశ తల ఎత్తి అతన్ని చూసివుంటే ఆమెకప్పుడే విరక్తి కలిగి వుండేది.

 

    ఆమె అక్కడే భయంతో, గువ్వపిట్టలా వదిగి నిలబడింది.

 

    రాఘవరావు లేచి నిల్చున్నాడు. ఆమెకతని కాళ్ళు కనిపిస్తున్నాయి. గుండె గబగబ కొట్టుకొంది. ఆ కాళ్ళు కదిలి తనవేపు వస్తున్నాయి. ఆమె శరీరాన్ని స్వేదబిందువులు అలుముకొనసాగాయి. కష్టంమీద నిట్టూర్పు అణుచుకొంటోంది.

 

    చాలా భయంగా వుంది. కాళ్ళల్లోంచి వణుకు పుట్టుకు వస్తోంది. అతడామెను సమీపిస్తున్నాడు. తనని పిలుస్తాడేమోననుకుంది. చిలిపి పని ఏమైనా చేస్తాడేమో.

 

    అతను వచ్చి ఆమె కభిముఖంగా నిలబడ్డాడు.

 

    "ఆశా!" అని పిలుస్తాడేమో యిప్పుడు మృదువుగా, అలా పిలుస్తూ తన చెయ్యి పట్టుకుంటాడేమో, లేకపోతే భుజంపైన చేయి వేస్తాడేమో! ఎట్లానబ్బా యిది తట్టుకోవటం? ఎందుకు మౌనంగా నిలబడ్డాడు? ఏమిటి ఆలోచిస్తున్నాడు? పిలవడేం? ఏమీ అడగడేం? తనలాగే అతనికి ఏమీ తెలియట్లేదా?

 

    ఆమె తల మరింత భూమిలోకి దిగిపోతోంది. నిలబడలేకపోతోంది. కళ్ళు గట్టిగా మూసుకోవాలనిపిస్తుంది.

 

    అతనేదో అన్నాడు. ఆమెకి వినబడలేదు.

 

    హటాత్తుగా తన నడుంచుట్టూ రెండుచేతులు పెనవేసుకోవటం ఆమె తెలుసుకున్నది. కళ్ళు తెరిచి ఆ చేతుల్ని చూసింది. అవి తనని బంధించి పారవేయటానికి సమకట్టినట్టుగా తోచాయి. రెండు నాగుబాముల్లా కనిపించాయి. తను విడిగా లేదని గ్రహించింది. అతనిలో ఇమిడిపోతోంది. ఇముడ్చుకున్నాడతను బలవంతంగా! అతని ముఖం తన ముఖానికి రాసుకుంటూ, వేటినో వెతుక్కుంటున్నాయి.

 

    అలా క్రమ్మివేస్తుందేమిటి అతని శరీరం తనని? ఆమెకు చెడ్డ అసహ్యమని పించింది. మనసు ఎదురు తిరిగింది. మీదకి వస్తున్న అతని ముఖాన్ని తన చేత్తో బలంగా వెనక్కి నెట్టి అతని వదనంలోకి నిర్భయంగా సూటిగా, కసిగా చూసింది.

 

    అతని కళ్ళు... విచిత్రంగా, ఎర్రగా, మండే తీవ్రతతో భయంకరంగా కనిపించాయి.

 

    ఆ కంటి జ్వాలని చూసి ఆమె దద్దరిల్లిపోయింది. కెవ్వున కేక వేయాలనిపించింది. అతన్నిహ ఒక్కక్షణం కూడా భరించలేకపోయింది. ఎక్కడలేని బలమూ వచ్చింది. రెండుచేతులూ అతని ఛాతీపై వుంచి ఒక్కతోపు తోసింది.

 

    రాఘవరావు ఆ త్రోపుకు వెనక్కి తూలి క్రిందపడకుండా సంభాళించు కుంటున్నాడు.

 

    ఆశ తృటిలో వెనక్కి గెంతి తలుపు గడియ లాగివేసింది. చటుక్కున తలుపుల్ని తీసుకుని భీతావహంగా బయటికి పరిగెత్తింది.

 

    ఆ సమయానికి లలితమ్మగారు గదిలో ఒక్కతే పడుకుని అప్పుడే కునుకుపట్టగా నిద్రపోతోంది. విశ్వనాథంగారు తనగదిలో ఎక్కడో కూర్చుని కాయితాలు చూసుకుంటున్నారు గావును. యింకా పడుకునేందుకు రాలేదు.

 Previous Page Next Page