నా కోసం అమ్మతో అబద్ధాలాడి, నా మొగుడితో మాటలుపడి, అతడిని నోరెత్తనివ్వకుండా అతి నేర్పుగా, మెత్తగా అతన్ని బెదిరించి... ఇదంతా నా కోసమేనా?
"చెప్పు, ఏమిటాలోచిస్తున్నావు? భయంగా వుందా? అతను నిన్నేం చేయలేడు. నీకూ, నీ బావగారికి వున్న ఎఫైర్ గురించి అతనికి ఏ సాక్ష్యమూ లేదు. నువ్వు దాని గురించి భయపడుతుంటే మాత్రం అనవసరం" అంది.
"భయపడటంలేదు వదినా! ఆలోచిస్తున్నాను" అన్నాను.
"దేని గురించి?" అనడిగింది.
"నీవు ఏ వ్యక్తిత్వంతో అందరి అభిమానాన్ని పొందుతావో ఇంతకాలం అర్థంకాలేదు. ఇప్పుడర్థమైంది".
వదిన నవ్వేస్తూ, "థాంక్యూ!" అని లేచి నిలబడి, "ఇంకొక్కవిషయం" అంది.
ఏమిటన్నట్టుగా చూశాను.
"ఈ విషయాలేవీ మీ అన్నయ్యకు కూడా తెలియనవసరం లేదు".
చల్లగాలి రివ్వున వీస్తూ ఆప్యాయంగా నన్ను తాకింది.
23
డైవర్స్ సెటిలవ్వడానికి ఎక్కువకాలం పట్టలేదు. నాకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి బాధా లేదు కానీ, నా తల్లిదండ్రులు ఆ వయస్సులో పడుతున్న మానసిక వ్యధ దుఃఖంగా వుంది.
అన్నయ్య కూడా చాలా బాధపడినట్టున్నాడు. కానీ తన అండ నాకు ఎప్పుడూ వుంటుందనే ధైర్యం కలిగించాడు.
నేను కాలేజీకి వెళ్తూనే వున్నాను. నేను బయటికి ధైర్యంగా కనపడడం వల్లనేమో నా తల్లిదండ్రులు తమ దిగులును దిగమింగుకోగలుగుతున్నారు. నేను చేసిన పని బాగా ఆలోచించి, గత్యంతరంలేని పక్షంలోనే చేసుంటానని వాళ్ళు సమాధాన పడుతున్నారు.
నేను నా భవిష్యత్ ప్రణాళిక అంటూ యింకా ఏదీ వేసుకోలేదు. కానీ నా గతంలోని చేదునంతా మరిచిపోవాలంటే ఏదో గొప్ప మార్పు కావాలి. అప్పటికి కానీ నాకు మునుపటి నమ్మకం రాదనిపించింది. (విడాకులు పొందిన స్త్రీ వెనుక శాడిస్టు సమాజం ఏ విధంగా మాట్లాడుకుంటుందో వివరించడం ఇక్కడ నా ఉద్దేశం కాదు.)
నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నాకు ఆర్థికంగా చాలా బాగుందికానీ, ఏ విధమైన తృప్తినీ కలిగించడం లేదు. ముఖ్యంగా నా పిహెచ్.డి. అయిపోయాక...
నేను ఆలోచనలో వుండగా ఒకసారి అన్నయ్య అన్నాడు- పోస్ట్ డాక్టరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం క్రింద ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళకూడదు? అని. ఆ క్షణంలో నాకా ఆలోచన రుచించలేదు. అంతదూరం నా కూతురిని తీసుకుని ఏం వెళ్ళను అని. తర్వాత్తర్వాత నాకా ఆలోచన బాగుందనిపించింది.
అమ్మా వాళ్ళకి చెప్తే బాధలో వున్నారు- మరింత దిగులు పడతారని ముందే చెప్పలేదు. అన్ని యూనివర్శిటీలకి అప్లై చేశాను. జీతంపై నన్ను ఏ యూనివర్శిటీ ఆహ్వానిస్తే, దానికి వెళ్దామని నా ఆలోచన. అన్నయ్య ఉద్దేశం ప్రకారం జెనిటిక్ ఇంజనీరింగ్ కి మంచి భవిష్యత్తు వుంది. నాకు దాదాపు అన్ని యూనివర్శిటీలలోనూ మంచి గుర్తింపు వుండొచ్చని అంచనా.
అన్నయ్య అంచనా తప్పలేదు. పదిహేను రోజులు తిరక్కుండానే నాకు మూడు యూనివర్శిటీల నుంచి ఆహ్వానం అందింది.
నేను ఇంగ్లండ్ వెళ్ళే విషయం నిశ్చయమైపోవడంతో అమ్మా, నాన్నలకు చెప్పక తప్పలేదు. విన్న వెంటనే అమ్మ ఏడుపు మొదలు పెట్టింది.
"నువ్వు సంసారం సుఖంగా చేసుకుంటున్నంతకాలం ఏం అడగలేదు. నువ్వు గొడవలు పడుతున్నావని తెలిసినప్పుడూ అడగలేదు. ఆఖరికి నువ్వు విడాకులు తీసుకున్నప్పుడూ నీ నిర్ణయాన్ని గౌరవించాం. డాక్టరేట్ కూతురు కొండంత అన్నా వదినల అండతో ఆ మాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుందా అనే నమ్మకంతో ఇన్నాళ్ళూ మేమేమీ అనలేదు. ఆ పసిదాన్ని తీసుకుని దేశం కాని దేశం ఒంటరిగా పోతానంటున్నావు. మేమందరం చచ్చామనుకుంటున్నావా, లేక నీకున్న అపారమైన తెలివితేటలకి ఈ దేశంలో గుర్తింపు దొరక్క అలా విదేశాలట్టుకు తిరుగుదామనుకుంటున్నావా?" అమ్మ వెక్కిళ్లు పడుతూ అడిగింది.
నాకు ఎక్కడో చివుక్కుమంది. ఆఖరికి అమ్మకూడా నన్ను తెలివితేటల విషయంలో ఎగతాళి చేస్తోంది. ఎందుకు వీళ్ళందరికీ నేనలా అహంభావిలా కనిపిస్తాను?
"అమ్మా!" అన్నాడు అన్నయ్య వారింపుగా.
అన్నయ్య అమ్మకు నచ్చచెప్తున్నాడు- "చూడమ్మా! ఇప్పటికే అది జీవితంలో చాలా డెబ్బతింది. అంత బాధల్లోనూ డాక్టరేట్ తెచ్చుకుంది. నువ్వో రకంగా నీ కూతుర్ని చూసి గర్వపడాలి. నిజంగానే దాని తెలివితేటలకి ఇక్కడ సరైన ఆదరణ లేదు. నీవు వెక్కిరించావు చూడు ఇదేం డాక్టరేట్ అని? అక్కడ దీన్నే నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. పైగా అది కొంతకాలం ఈ మనుష్యులకీ, వాతావరణానికి దూరంగా వుంటే మంచిది. దాన్ని సూటిపోటీ మాటలనే వాళ్లు వుండని ప్రదేశం ఇండియాలో ఎక్కడా లేదు. అందుకే అది విదేశాల కెళ్ళడం అవసరం. అది తిరిగి రావాలనుకుంటే వస్తుంది. లేదంటే మీరే అక్కడికి వెళ్ళండి. అది రెండు మూడేళ్ళలో తిరిగి వచ్చినా, అప్పటికి జనం దీని గతం మర్చిపోతారు. ఇప్పుడున్నంత బాధ అప్పుడనిపించదు!" నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు.
అన్నయ్య అంత మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు. నచ్చచెప్పాల్సిన ఒక్కమాట ఎక్కువా, తక్కువా కాకుండా ఎంత మంచిగా చెప్పాడు వాడు!
అమ్మ కన్విన్స్ అయింది. కానీ చివరివరకూ కన్నీళ్ళు పెట్టుకుంటూనే వుంది. నాన్న నిశ్శబ్దంగా అమ్మని ఓదారుస్తున్నట్లు వుండిపోయారు.
నాకూ నా పాప విషయంలో భయంగానే వుంది. కానీ కష్టం నష్టం అన్నీ నేను దానితో కలిసే పంచుకోవాలని నిశ్చయించుకున్నాను. దాన్నిక్కడ వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు.
వీసా రావడం జరిగిపోయాక నా భయం మరింత ఎక్కువయింది. ఒకసారి అన్నయ్యతో నా భయం గురించి చెప్పాను.
అప్పుడు అన్నయ్య స్వయంగా నాకు విదేశీ కాన్సులేట్ ని చూపించాడు. సంవత్సరానికి ఎంతమంది విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా, ఒంటరిగా ఎవరి సాయంపట్ల ఆశా లేకుండ చదువుకోడానికి అక్కడికి వెళ్తారో.
నాకు కనీసం నా కూతురుంది తోడుగా! మరుసటిరోజు ప్రయాణం అనగా తెలిసింది నాకు.... నా భర్తకి పెళ్ళి కుదిరిందని. వదిన నవ్వుతూ చెప్పింది.
నేనేదో ఆలోచిస్తుంటే అడిగింది సందిగ్ధంగా- "ఏమిటీ ఆలోచిస్తున్నావ్?" అని.
"మొగుడికి మరో పెళ్ళి - ఈ టైటిల్ ఏదైనా తెలుగు సినిమాకి ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నాను" అన్నాను నవ్వు దాచుకుంటూ.
"ఆడాళ్ళు పడీపడీ చూస్తారు" అంది వదినకూడా నవ్వుతూ.
ఆ రోజు సాయంత్రం నా బావగారు మా ఇంటికి వచ్చారు. అతని రాకని ఊహించని మేము తబ్బిబ్బయ్యాము.
"వెళ్తున్నావట. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్టాఫ్ లక్!" అన్నాడతను కుర్చీలో కూర్చుంటూ.
అతన్ని చూస్తూనే అమ్మ లోపలి కెళ్ళిపోయింది. అన్నయ్య బయటి కెళ్ళిపోయాడు. వదిన కాఫీ కలపడానికి వంటింట్లోకి వెళ్ళింది. నాన్న ఇంట్లో లేరు.
"థాంక్యూ!" అన్నాను నేను తేరుకుని చిరునవ్వుతో.
"మళ్ళీ తిరిగి వచ్చే ఆలోచన ఏమైనా వుందా?" అనడిగాడతను.
"చూడాలి, ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు" అన్నాను.
"పాపని అక్కడే చదివిస్తావా?" అనడిగాడు.
"అంతేకదా మరి!" అన్నాను.
వదిన కాఫీ ఇస్తూ, "ఏమిటండీ విశేషాలు?" అని అడిగింది.
"ఏముంటాయి... ఆఁ ఒక న్యూస్.... 'మా యింటికి మరో కొత్త బలిపశువు రాబోతోంది!" అన్నాడతను.
నాకూ, వదినకీ మొహంలో చిరునవ్వు ఒక్కసారిగా ఎగిరి పోయింది. అతనేదో క్యాజువల్ గా మాట్లాడతాడనుకుంటే ఇలాంటి ప్రేలాపనకి దిగుతాడనుకోలేదు. మేమిద్దరం ముభావంగా మారిపోయాం.
వాతావరణంలో వచ్చిన మార్పుని అతడు అర్థం చేసుకున్నట్లున్నాడు. మరోసారి కంగ్రాట్స్ చెప్పేసి లేచి నుంచున్నాడు.
గేటు దగ్గరికి వచ్చాక అన్నాడతను. "మళ్ళీ నిన్ను చూడగలనో లేదో, థాంక్స్ ఫర్ యువర్ నైస్ అండ్ మెమొరబుల్ అసోసియేషన్!"
నేనేం మాట్లాడలేదు. లోపలికి వస్తూండగా వదిన కసిగా అంది- "బలిపశువుట. ట్రాప్ చేయడానికి నీకు మరో కొత్త జీవిదొరికిందా? అని అడుగుదామనుకున్నాను. వెధవ్వాగుడు కాకపోతే... ఇంతకీ ఎందుకు వచ్చినట్లో?"
"పోన్లే వదినా! తను మనవైపే వున్నాడని చెప్పడానికి అతడు చేస్తున్న ప్రయత్నం అది. అందరితో 'మంచి' అనిపించుకోవాలన్న ఆ మాత్రం స్వార్థం ప్రతి మనిషిలోనూ వుంటుంది" అన్నాను నిర్లిప్తంగా.
వదిన నావైపు ఆశ్చర్యంగా చూసింది.
"అవునొదినా! ఒకప్పుడు ఇలాంటి ప్రవర్తననే 'మంచితనం' అనుకునే మూర్ఖత్వంలో వుండేదాన్ని. చెల్లెలి పెళ్ళికి నయాపైసా ఖర్చు చేయనన్న మా బావగారి మనస్తత్వం ఎంతో గొప్ప ప్రాక్టికల్ థింకింగ్ అనుకున్నాను. స్త్రీ ఒకసారి ఇష్టపడితే, మగవాడి ప్రతి అవసరమూ గొప్పగానే కనబడుతుందని చెప్పడానికి నా గతమే ఉదాహరణ! ఆ రోజుల్లో నా నిస్సహాయతా, ఆధారపడే గుణమూ నన్ను ఆలోచనారహితురాల్ని చేశాయి!" అన్నాను.
ఆ రోజు నిద్రపోతూ అనుకున్నాను. ఇది నా ఇల్లు. వీళ్ళంతా నా వాళ్ళు. వీళ్ళందరూ నా కన్నీళ్ళకు స్పందిస్తారు. నా కష్టంలో తోడుగా నిలుస్తారు. నా పెదవులమీద చిరునవ్వుల పూవులు పూయించాలని ప్రయత్నిస్తారు. అలా అనుకున్నాక నాకు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం కలిగింది.
ఎయిర్ పోర్ట్ లో అమ్మ తట్టుకోలేక పెద్దగా ఏడ్చేసింది. నాన్న కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అన్నయ్యా, వదినా వాళ్ళని ఓదారుస్తున్నారు. అమ్మకి నా కూతురిని గురించిన బెంగ వదలడంలేదు. నేనూ తనకి నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. ఏ మాత్రం ఇబ్బందిగా తోచినా తప్పకుండా వెంటనే వచ్చేస్తానని ప్రామిస్ చేశాను.
విమానం గాలిలోకి ఎగురుతుండగా కళ్ళకు నీటిపొర అడ్డు పడుతుంటే నా వాళ్ళని కళ్ళారా చూసుకున్నాను.
* * *
అదీ నా కథ!
పాతిక సంవత్సరాల క్రితం కథ!
ఇంగ్లండ్ వచ్చేశాక నా గతం గురించి దాదాపు మర్చిపోయాను. మరే పురుషుడూ నా జీవితంలో ప్రవేశించలేదు. చదువు, ఉద్యోగం- రెండే ఆప్తమిత్రులయ్యాయి. జీవితం సజావుగా సాగిపోయింది.
పాతిక సంవత్సరాల తర్వాత- ఇదిగో ఇప్పుడు నా గతం- తిరిగి నా కూతురి రూపంలో నన్ను ప్రశ్నించింది.
క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలైంది.
స్త్రీ హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమం ప్రారంభమై రెండొందల సంవత్సరాలు దాటింది! ముప్పై సంవత్సరాలక్రితం పి.వి. నరసింహారావు పార్లమెంట్ లో పాతిక మంది స్త్రీ ఎం.పి.లుంటే, ఇప్పుడు ముప్పై మంది వున్నారు. అదీ ప్రగతి! స్త్రీల హక్కులంటే, ఒళ్లు కొవ్వెక్కిపరాయి మగాడితో పక్కపంచుకోవడం కాదని వాదించే నా కూతురిలాంటి స్త్రీవాద సంఘ కార్యదర్శికి నేనిప్పుడు ఏం సమాధానం చెప్పను?
కొంగుసాచి నా కూతురి నుంచి సానుభూతి కోరనా?
మనిషి బలహీనతని అర్థం చేసుకోమని ప్రార్థించనా?
లేక-
ఏ పరిస్థితుల్లో నేనలా చేయవలసి వచ్చిందో వివరించి వాదించనా?
* * *