"పులి... పులి... తప్ప... ఇంకో రకంగా నువ్వాలోచించలేవా... నాయుడూ... నీ కుక్క పగలు, నల్లమందులో ఉంటే... నువ్వు రాత్రి నల్లమందులో వుంటావ్... మీ ఇద్దరివల్లా ఏం కాదు- వీళ్ళని జాగ్రత్తగా చూస్తుండు... నే వెళతాను..." చిరాగ్గా అంటూ ఇందుమతివేపు నడిచాడు యువరాజు.
"వీడు... నామీద చిరాకు పడితాడేంటి... అమ్మడూ... కపాలేశ్వర్ ని పులే లాక్కెళ్ళిపోయుంటుంది... నాకు తెలుసు..." తన పులి స్లోగన్ ని మళ్ళీ చెప్పాడు ముత్యాలనాయుడు.
ఆ మాటల్ని వినలేదు వైశాలి. ఇందుమతి వేపు నడుస్తున్న యువరాజు వేపే, ఉక్రోషంగా చూస్తోందామె.
"కపాలేశ్వర్ విషయం తెలిస్తేనేగానీ- మనం ఎక్కడికీ కదల్లేం- మీరేం వర్రీ కాకండి మేడమ్... నేను కపాలేశ్వర్ ని వెతకడానికి వెళుతున్నాను" అంటూ లగేజీలోంచి రైఫిల్ బాక్సు తీసి, అందులోంచి ఆటోమేటిక్ రైఫిల్ ని కేటరిడ్జ్ సరిచూసుకుని, బుల్లెట్స్ ని నింపాడు. ముందుకడుగేసి-
ఇందుమతి పిలుపు విని ఆగిపోయాడు.
"యువరాజూ- నేనూ వస్తాను పద-" అంది ఇందుమతి. టెన్షన్ లో ఏం మాట్లాడలేదు యువరాజు.
* * * *
ఒక చేత్తో కత్తి, భుజమ్మీద రైఫిల్ తో తుప్పల్లోంచి దూసుకుపోతున్నాడు యువరాజు. ఆ వెనుక ఇందుమతి.
మధ్య మధ్యలో 'కపాలేశ్వర్' అని అరుస్తున్నాడు యువరాజు. ఆ అరుపుకి భయపడి, ఎగురుతున్న పక్షుల రెక్కల చప్పుడు తప్ప, మనిషి ప్రతిస్పందన లేదు.
తుప్పల్లోంచి కొండ పైకెక్కాడు. అవి రెండు కొండలు. దగ్గర దగ్గరగా వున్నాయి. దూరంనుంచి చూస్తే ఒకే కొండలా కన్పిస్తాయి. గుబురుగా పొదలు అంతెత్తు లక్కచెట్లు. ఆ లక్కచెట్లలో ఒక చెట్టెక్కి చుట్టూ చూసి మళ్ళీ కేకేసి- కిందకు దిగబోతూ దూరంగా కన్పించిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. గబగబా చెట్టు దిగి, నేలమీద పడున్నదాన్ని తీశాడు.
అది- కపాలేశ్వర్ షర్ట్ పీలిక.
"అంటే... ఈ ప్రాంతంలోనే ఎక్కడో, ఏదో జరిగుండాలి మేడమ్" అంటూ ముందుకెళుతున్న యువరాజు కాలికి ఏదో బండరాయి తగిలి, తూలి పడబోయాడు.
అదే సమయంలో అనుకోకుండా అక్కడకొచ్చిన ఇందుమతి భుజంమీద చెయ్యివేసి నిలదొక్కుకుని-
అంతలోనే- చటుక్కున తన చేతిని తీసేసి "సారీ మేడమ్..." అని ముందు కడుగేశాడు.
అనుకోకుండా తగిలిన పురుష స్పర్శ! యువరాజు ఆ స్పర్శనే మాత్రం పట్టించుకోలేదు.
కానీ ఇందుమతి జీవితంలో మొట్టమొదటి పురుష స్పర్శ అది. బలంగా భుజాన్ని ఒక్క క్షణంకాలం పట్టుకున్న ఆ పురుష స్పర్శ- ఆమెలో అంతులేని సంచలనాన్ని రేపింది.
"మేడమ్..." అంతలోనే తేరుకుని యువరాజువేపు నడిచింది ఆమె. రెండు కొండలమధ్య ఇద్దరు మనుష్యులు పట్టడానికి వీలుగా పెద్ద ఖాళీ రంధ్రం.
ఆ ప్రదేశాన్ని ఎవరో ముళ్ళపొదలతో, ఆకుల్తోనూ కప్పేసారు. ఆ ఆకుల్నీ, ముళ్ళపొదల్ని నెమ్మదిగా పక్కకు తొలగించి లోనకి తలపెట్టి చూశాడు.
లోనంతా చీకటి... ఏం కన్పించడం లేదు.
"కపాలేశ్వర్..." గట్టిగా అరిచాడతను.
కొండలమధ్య రహస్య లోయ... ఆశ్చర్యపోతూ మళ్ళీ అరిచాడు యువరాజు.
అప్పుడు విన్పించింది లోన్నుంచి-
"యువ...రాజూ...నేనే...కపాలేశ్వర్ ని" ఎంతో లోతునుంచి విన్పిస్తున్న శబ్దం అది.
"కపాలేశ్వర్... ఎక్కడున్నావ్?"
"ఇది వందడుగుల లోతున్న లోయ... ఈ లోయలో... బురద నీళ్ళలో పడిపోయాను... పైనుంచి ఏదైనా తాడు వెయ్యి. నెమ్మదిగా నేనెక్కి వస్తాను" లోయలోంచి అరుస్తున్న కపాలేశ్వర్ అరుపు పీలగా వినబడుతోంది. ఒక్కసారి రిలాక్సయ్యారిద్దరూ- కపాలేశ్వర్ ప్రాణాలు వున్నందుకు.
"రోప్స్ ఉన్నాయి కదూ... నేవెళ్ళి తెస్తాను" వెనక్కి పరిగెత్తింది ఇందుమతి.
ఇరవై నిమిషాల తర్వాత ఇందుమతి వచ్చింది.
ముత్యాలనాయుడు చేతిలో పర్వత వాహకులు ఉపయోగించే బలమైన తాళ్ళ చుట్ట వుంది. ఆ తాడుని విప్పి, సమీపంలో వున్న మద్దిచెట్టు మానుకి ఒక పక్క కట్టి, రెండవ భాగాన్ని లోయలోకి జారవిడిచాడు.
ఆ తాడు చివర భాగాన్ని తన నడుంకు కట్టుకున్నాడు కపాలేశ్వర్. యువరాజు, ముత్యాలనాయుడు పైకి లాగడం మొదలుపెట్టారు. పావుగంట గడిచింది.
ఎట్టకేలకు అతికష్టంమీద కపాలేశ్వర్ పైకి వచ్చాడు. అప్పటికే అతను కొనవూపిరితో ఉన్నాడు. వళ్ళంతా చీరుకుపోయింది. చిక్కని బురద, రక్తం, కాళ్ళకి, భుజాలకు, ముఖానికి, బలమైన గాయాలు తగిలాయి. యువరాజు అతన్ని భుజం మీద ఎత్తుకుని, విడిది చేసిన కొండ మీదకు తీసుకెళ్ళాడు. వాగులో పూర్తిగా స్నానం చేయించి, గాయాలకు మందుపూసి, ఓ చెట్టునీడలో పడుకోబెట్టారతన్ని.
రెండు గంటలకు గానీ కపాలేశ్వర్ మాట్లాడలేకపోయాడు.
"అసలేం జరిగింది?" ప్రక్కనే కూర్చున్న ఇందుమతి అడిగింది. ఓరకంట వైశాలి వైపు చూశాడు- ఏం చెప్పాలో తెలీలేదు.
వైశాలి తన రహస్య కలయిక, ఎవరికీ తెలియకూడదని, దూరముగా వెళ్ళిపోయాడు. వైశాలి రాకపోవడంతో, ఆమెను ఎలాగైనా పిలవాలని సమీపంలోని ఎత్తైన చెట్టు ఎక్కడానికి మద్దిచెట్టు ఎక్కబోయాడు...
రెండు కొండల మధ్య, రహస్యంగా లోయ వుందని తెలీని కపాలేశ్వర్ అందులో పడిపోయాడు.
జరిగింది ఇదని, ఎలా చెప్తాడు? వెంటనే ఆబద్ధం ఆడేసాడు. "ఏదో పులి అడుగుల చప్పుడు వినబడితే లేచాను. పొదల్లోంచి పులి పరుగు తీస్తోంది అది ఎటువేపు వెళ్ళిందో చూడ్డానికి కొండెక్కాను. చీకటి... పట్టుతప్పి లోయలోకి జారిపోయాను. లోనంతా బురద. రాత్రంతా నరకయాతన అనుభవించాను. అరిచి, అరిచి సొమ్మసిల్లిపోయాను. తెల్లారాక ఆ రంధ్రంలోంచి సూర్యకాంతి పడటంతో మెలకువొచ్చింది. ఆ లోయలోంచి నేను అరిచే అరుపులు ఎవరికీ వినబడవని నాకు తెలుసు. అక్కడ సమాధి అయిపోతానని అనుకున్నాను యువరాజూ...! నువ్వే నా ప్రాణాల్ని నిలబెట్టావ్. నీ రుణం తీర్చుకోలేను" కృతజ్ఞతగా అన్నాడు కపాలేశ్వర్.
"ఏమై పోయారోనని... ఎంత భయపడ్డామో..." ఇందుమతి ముఖంలో నవ్వు కన్పిస్తోంది.
"అవును కపాలేశ్వర్... ఆ రంధ్రంలోంచి నువ్వు లోనికి పడి పోయానన్నావ్ కదా... మేం చూసేటప్పటికి ఆ రంధ్రంపైన ఆకులు, తుప్పలు కప్పేసి వున్నాయే?" అడిగాడు యువరాజు.
ఇందుమతికి కూడా ఇదే అనుమానం వచ్చింది.
"నిజమే రాజూ... సూర్యోదయమయ్యాక లోనికి సూర్యకాంతి పడింది. ఆ తర్వాత గంటసేపయ్యాక నాకు సూర్యకాంతి కనబడలేదు. వెలుతురు మాయమైంది... నేను కిందనుంచి అరుస్తూనే వున్నాను. ఎవరో ఆకులు! తుప్పలు పైన కప్పేసారు" చెప్పాడు కపాలేశ్వర్.
"ఈజిట్... ట్రూ..." షాక్ తింటూ అంది ఇందుమతి.
"ఎస్... మేడమ్... నేనా లోయలోంచి మరి రాకుండా చేయడానికి ఎవరో ప్రయత్నించారు" అన్నాడు కపాలేశ్వర్ నిట్టూరుస్తూ.
కపాలేశ్వర్ కి శత్రువు? ఎవరా శత్రువు?
ఆడా! మగా!
యువరాజు వైశాలిని అనుమానంగా చూశాడు.
"ఇక్కడ... నీకు శత్రువులేంటి... కపాలేశ్వర్ బాబూ... బాధవల్ల భయపడుంటావ్" అన్నాడు ముత్యాలనాయుడు.
అయిదురోజుల వరకూ మనిషి కాలేకపోయాడు కపాలేశ్వర్. ఆ అయిదు రోజులూ కపాలేశ్వర్ కి అవసరమైన సేవలన్నీ చేశాడు యువరాజు. ఆరో రోజున తెల్లవారుజాము ట్రూప్ మళ్ళీ బయలుదేరింది.
* * * *
కపాలేశ్వర్ గైడెన్స్ వల్ల ప్రయాణం మొత్తం సాఫీగా నడుస్తోంది. కపాలేశ్వర్ అతి కష్టమ్మీదగానీ నడవలేకపోతున్నాడు.
"మీకు నడవడానికి ఏమైనా ఇబ్బందయితే చెప్పండి... నేనే మోస్తాను" అన్నాడు యువరాజు అతని బాధని చూడలేక.
"నో... మిస్టర్... రాజూ... వికెన్ వాక్..." యువరాజుపట్ల అపారమైన గౌరవం కపాలేశ్వర్ కి.
మృత్యువు ఒడిలోంచి బయటికొచ్చిన అనుభవాన్ని అతను మర్చిపోలేక పోతున్నాడు.
"గ్రీన్ షిప్ లో పనిచేస్తున్నప్పుడు, నర్సింగ్ కూడా నేర్పారు. ఒకసారి మా కెప్టెన్ వైఫ్... నీళ్ళలో పడిపోయింది... సాధారణంగా 'ఈత' రాని వాళ్ళను షిప్ ఎక్కనివ్వరు- కానీ మా కెప్టెన్ కి పెళ్ళయి, రెండు నెలలు కూడా కాలేదు- డెక్ మీద షికార్లు కొడుతూ తూలిపోయి, నీళ్ళలో పడిపోయింది.
అప్పుడు నేను హెల్త్ డిపార్టుమెంట్ డ్యూటీలో వున్నాను- ఆ అమ్మాయి పదిరోజులపాటు నా కస్టడీలోనే వుంది. షిప్ దిగి వెళ్ళిపోయేటప్పుడు, ఎంత ఏడ్చిందో- నువ్వు లేకపోతే, నేనిలా ఉండేదాన్ని కాదని... ఏడ్చేసింది-" చెప్పడం ఆపాడు యువరాజు.
"నీకు ఫారిన్ లోనూ- అభిమానులున్నారన్న మాట..." నవ్వుతూ అంది వైశాలి.
"ఎందుకుండరు- మంచివాళ్ళకు... ప్రతిచోటా ఉంటారు..." వంతపాడేడు ముత్యాలనాయుడు.
మూడురోజులు గడిచాయి. రాత్రిపూట మజిలీ, పగటిపూట ప్రయాణం... కపాలేశ్వర్ ఆరోగ్యం కుదుటపడింది.
ఆ రోజు రాత్రి, అందరూ పడుకుంటున్న సమయంలో, కపాలేశ్వర్ ఇందుమతితో చెప్పాడు.
"పరిస్థితులన్నీ అనుకూలిస్తే, మనం రేపు మధ్యాహ్నానికి, కపాలకోన దరిదాపుల్లో వుండొచ్చు-"
"కపానకోన, ట్రైబల్స్ దగ్గర నిధి వుంటుందా...? ఇందూ, వాళ్ళకు నువ్వు కనబడగానే నిధి ఇచ్చేస్తే... వెంటనే మనం వెనక్కి వచ్చేయవచ్చు కదా..."
వైశాలి మాటకు నవ్వింది ఇందుమతి.
"నిధిని చేరుకోవడానికి కపాలకోన ఒక మజిలీ మాత్రమే... ఇంతవరకూ మన ప్రయాణం ఒకెత్తు అయితే... ఇక నుంచీ... మన ప్రయాణం ఇంకొకెత్తు..."
"అంటే...?"
"అంటే ఏంటి- మరింత దట్టమైన భయంకరమైన మనుష్యుల్లోకి, మరింత భయంకరమైన జంతువుల మధ్యకు వెళ్లబోతున్నాం..." చెప్పాడు కపాలేశ్వర్.